న్యూయార్క్ టైమ్స్‌కు నరేంద్రుడంటే…ఎంత భయమో?

871

 ( మార్తి సుబ్రహ్మణ్యం)

న్యూయార్క్ టైమ్స్… అమెరికా అంటే ఆ పత్రికు వల్లమాలిన ప్రేమ. దాని దేశభక్తి ముందు మన జాతీయ-జాతి మీడియా కూడా తలదించుకోవలసిందే.ప్రపంచపెద్దన్నగా అమెరికా పెత్తనం విజయవంతంగా కొనసాగాలని పరితపించే పత్రిక అది. ‘అంకుల్‌శాం’ ముందు ఎవరైనా తోకజాడించినా, దానిని అధిగమించే  దేశాలన్నా  ఆ పత్రికు మహా చిరాకు. అప్పుడది వ్యాసాలు,సంపాదకీయాల పేరుతో ‘అంకుల్‌శాం’ను అప్రమత్తం చేస్తుంటుంది. ఇదిగో.. ఇప్పుడు కూడా అదే పనిచేసింది. భారత్ అమెరికాను మించిపోతోందని, నరేంద్రమోదీ అన్ని దేశాలతో పులిహోర కలిపేస్తూ, ప్రపంచపెద్దన్న పాత్ర తగ్గిస్తున్నారంటూ, తాజాగా టన్నుల కొద్దీ కన్నీరు కారుస్తూ ఓ సంపాదకీయాన్ని దేశం మీదకు వదిలింది. అది ఇప్పుడు సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకూ న్యూయార్క్ టైమ్స్ బాధేమిటంటే.. అమెరికా పెత్తనానికి ఇండియా చిల్లులు పెడుతోందట. అదీ సంగతి! సోషల్‌మీడియాలో చర్చ అవుతున్న, న్యూయార్స్ టైమ్స్ ఎడిటర్ జోసఫ్ హోప్ రాసిన సంపాదకీయంలో ఉన్న సరుకేమిటో ఓసారి చూద్దాం.జోసఫ్ హోప్ రాసిన సంపాదకీయం యధాతథంగా…

న్యూయార్క్ టైమ్స్ చీఫ్ ఎడిటర్ జోసెఫ్ హోప్ రాసిన సంపాదకీయం…

భారత దేశాన్ని ఒక ఉన్నతమైన, ఉత్తమమైన దేశంగా చెయ్యడమే నరేంద్ర మోడీ ఆశయం.  ఆయన్ని ఆపకపోతే భవిష్యత్తులో భారత దేశం ఒక శక్తివంతమైన దేశంగా అవతరిస్తుంది.అమెరికా, బ్రిటన్,రష్యాలను మించి పోతుంది.నరేంద్ర మోడీ ఒక ప్రత్యేక లక్ష్యం వైపుగా పయనిస్తున్నాడు.  ఆయన ఏం చెయ్యబోతున్నాడో ఎవ్వరికీ తెలియదు.

ఆ చిరునవ్వు వెనుక ఒక భయంకరమైన దేశ భక్తుడున్నాడు.  ప్రపంచంలోని అన్ని దేశాలను తన దేశ ప్రయోజనాలకోసం వాడుకుంటాడు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ లకు అమెరికాతో సంబంధాలు తెగ్గొట్టాడు.వియత్నాంకు చేరువై సూపర్ పవర్ గా ఎదగాలన్న చైనా కలలను భగ్నం చేశాడు.
దక్షిణ చైనా సముద్రంలో చమురు నిక్షేపాలను తోడుకునే విషయంలో వియత్నాంకు చైనాకు మధ్య చాలా కాలంగా ఉన్న గొడవలో వియత్నాంను బలపరిచాడు.  ఫలితంగా వియత్నాం తన మొత్తం చమురును భారత దేశానికి ఎగుమతి చేస్తోంది.

ఇరాన్ లోని చాబహార్ పోర్టుని తన స్వాధీనంలోకి తీసుకుని ఇరాన్ గుండా ఆఫ్ఘనిస్తాన్, ఇతర ఐరోపా దేశాలకు భారత దేశ ఎగుమతులకు దారి చేశాడు.ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గరగా మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి.ఆర్టికల్ 370, 35A రద్దయ్యాయి.  ఏదో ఒక రోజు పాక్ ఆక్రమిత కాశ్మీరును  పూర్తిగా వశపరుచుకుంటాడు.రాబోయే రోజుల్లో పాకిస్థాన్ ను నాలుగు ముక్కలయ్యేలా చేస్తాడు. పాకిస్థాన్ కు అపర మిత్రుడైన సౌదీ అరేబియా ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఆసియా ఖండంలో ప్రపంచ దేశాలకు ఆయన తన సత్తా చాటాడు. ఆసియాలో తన ఆధిపత్యాన్ని నిరూపించాడు. వీసా అనుమతి లేకుండా తమ దేశంలో అడుగు పెట్టిన పాకిస్తాన్ విదేశీ మంత్రికి UAE జరిమానా విధించి వెనక్కి పంపేలా చేశాడు. రష్యా, జపాన్ లను అతి సున్నితంగా తన గుప్పిట్లో ఉంచుకున్నాడు. చైనా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంచాడు.  ఈ వ్యక్తి భారత రాజకీయాలను మరో స్థాయికి తీసుకెళ్లాడు.

ఇతర దేశాలు తమకు చాలా మంది శత్రువులు ఉన్నట్లు భావిస్తూ ఉంటాయి.  కానీ ఇండియాకు పాకిస్థాన్ తప్ప మరో శత్రువు లేడు.  భారత్ మిగతా అన్ని దేశాలతోనూ సఖ్యతగా ఉంటుంది. నరేంద్ర మోడీ యుద్ధం చేయకుండానే పాకిస్థాన్ ను సర్వ నాశనం చేశాడు.  అది కూడా ఇతర ముస్లిం దేశాల మద్దతుతో.  ఒకవేళ పాకిస్థాన్ ఇండియా మీద యుద్ధం చేసినా పెద్దగా నష్టమేమీ లేదు.  ఇతర దేశాలతో సంప్రదింపులలో ఆయన నిజాయితీ కొట్టొచ్చినట్లు కనపడుతుంది.

నరేంద్ర మోడీ ప్రపంచంలోని ఉత్తమ నాయకుల్లో ఒకరు. త్వరిత గతిన సాగుతున్న భారత దేశ అభివృద్ధి ఇతర దేశాలకు ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది.ఇంతవరకూ ఎవ్వరినీ నేను ఇంతగా మెచ్చుకోలేదు.

– జోసెఫ్ హోప్

ఇదీ న్యూయార్క్ టైమ్స్ దృష్టిలో మన దేశ దౌత్య ఘనత!  మరి మన జాతీయ- జాతి మీడియా ఎప్పుడయినా, మన దేశ గొప్పతనం గురించి సింగిల్‌కాలమ్ సంపాదకీయాలు రాశాయా? నరేంద్రమోదీ గురించి రాయాల్సిన పనిలేదు. దేశం గురించి ఎప్పుడయినా రాశాయా? మొన్నటికి మొన్న ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరిన ఖలిస్తాన్ జెండాలపై నిప్పులు కక్కిన కలాలు, గళాలు ఎన్ని? టీఆర్‌పీ రేటింగ్ కోసం ఆ ఘటనకు ఉప్పు-కారం అద్దిన మీడియా సంఖ్య ఎంత? టీఆర్‌పీ రేటింగ్ కోసం రంధ్రాన్వేషణ పేరుతో జేబులు నింపేసుకునే వ్యాపారతత్వమే కదా?.. తలచుకుంటే తల సగం వరకూ కిందకు వంగడం లేదూ?