నియంతలా నిమ్మగడ్డ – సజ్జల రామకృష్ణారెడ్డి

255

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ దురుద్దేశపూరితంగా ఆరోపణలు చేస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అంతకుముందు నుంచి రాష్ట్ర ప్రభుత్వం పట్ల, అధికారుల పట్ల, ప్రభుత్వంలో బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారి పట్ల వ్యతిరేక ధోరణితో నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. నిమ్మగడ్డ ముందే ఒక నిర్ణయానికి వచ్చి దురుద్దేశపూరితంగా ఆరోణపలు చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తూ వచ్చారు. దీనికి పరాకాష్టగా వారం రోజులుగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరు, చేష్టలు కనిపిస్తున్నారని  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.

సజ్జల  ఇంకా ఏమన్నారంటే..
నియంతృత్వ పోకడలతో నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. ఆయన వాడుతున్న భాష, సీనియర్‌ అధికారులపై ఆయన ఇస్తున్న ఉత్తర్వులు పరిధి దాటి ప్రవర్తించటమే. ఎన్నికల విధులను నిమ్మగడ్డ బాధ్యతగా నిర్వహించాలి. తన పరిధికి లోబడి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ నిర్ణయాలు తీసుకోవటం జన్మతహా వచ్చిన హక్కుగా భావిస్తూ ఒక రాజరికంలో రాజులా, పాలెగాళ్లుగా తీర్పులు ఇస్తూ వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరం, ఆక్షేయపణీయం.  నిమ్మగడ్డ తీరు సహించటానికి వీల్లేని విషయం. ఏ ఎన్నికల కమిషన్‌ అయినా ఒక రిఫరీ లాంటి వ్యవస్థ. చిన్నస్థాయి సహకార ఎన్నికల్లో, చట్టాలకు లోబడి జరిపే చిన్న ఎన్నికలైనా ఆ కొద్దికాలానికి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తారని ఒక వ్యక్తికి (రిటర్నింగ్‌ అధికారికి) అధికారం అప్పజెబుతారు.

ప్రజాస్వామ్యంలో స్థానిక ఎన్నికల అధికారాలతో ఒక వ్యవస్థ ఏర్పాటైంది. ఆ స్థానంలో ఉన్నవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. వ్యక్తిగత అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోరు. అవతల పక్షాలు ఆవేశాలకు లోనైనా ఆ వ్యవస్థ మాత్రం సంయమనం పాటిస్తూ ఎన్నికల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా ఎవ్వరూ ప్రశ్నించరు. శేషన్‌ ఓ ట్రెండ్ సెట్టర్‌లా వచ్చినప్పుడు రాజకీయ నాయకులు తట్టుకోలేకపోయినా, భరించలేకపోయినా ఆయన ఓ పరిధికిలోబడి వ్యవహరించారు. ఎస్‌ఈసీ స్థానంలో ఉన్నవ్యక్తి కూడా పరిధిలోబడి వ్యవహరించాలి.

నోరు పారేసుకొని.. వ్యక్తిగతంగా సోషల్ మీడియా అభిప్రాయాలు క్రోడీకరించి ఇది నా హక్కు అన్నట్లు నిమ్మగడ్డలా ఎవ్వరూ చేయలేదు. గోపాలకృష్ణ దివ్వేది గారు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రతినిధిగా రాష్ట్రంలో పనిచేశారు. గతంలో చంద్రబాబు సీఎం హోదాలో నేరుగా ద్వివేది రూమ్‌లోకి వెళ్లి ఆయన్ను ఎవరి ఏజెంట్‌గా పనిచేయాలని అనుకుంటున్నారని హూంకరించారు. ఆ వీడియో చూస్తే చంద్రబాబు చేసిందంతా ద్వివేది భరించారు తప్ప నిమ్మగడ్డలా నా భద్రతకు, ప్రాణాలకు ముప్పు వచ్చిందని, నా రూమ్ లోకి వచ్చి నన్ను బెదిరిస్తారా అని అనలేదు. నిజానికి ఆనాడు చంద్రబాబుపై ద్వివేది గారు అటెంప్ట్‌ టు మర్డర్ కేసు పెట్టాలి. చంద్రబాబే నేరుగా ద్వివేది రూమ్‌లోకి వెళ్లారు. బహుశా అది ద్వివేది విజ్ఞత, సంస్కారం కావొచ్చు.

ఎన్నికల సంఘం ప్రధాన విధి ఎన్నికలు కాబట్టి.. దాన్ని పక్కదారి పట్టించే అంశాలు ఏవీ తీసుకోకూడదు. విషయం ఏమిటో చూడాలనే సంస్కారం, విజ్ఞత, మెచ్యూరిటీ ఎన్నికల సంఘం స్థాయిలో ఉండేవారికి ఉంటుందని ఎవ్వరైనా ఊహిస్తారు. కానీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఐఏఎస్‌ ఎలా అయ్యారో తెలీదు. అంతకాలం సర్వీసులో ఎలా ఉన్నారో తెలీదు. మార్చి 15, 2019న బట్టలు విప్పేసిన (నిమ్మగడ్డ) ఆయన అక్కడ నుంచి ప్రతిరోజు తనమీద తనకు కంట్రోల్‌ లేని వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. నేను ఎస్‌ఈసీని అనటం లేదు.. నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ అనే వ్యక్తిని అంటున్నానని సజ్జల స్పష్టం చేశారు.

ఇంతవరకు వైయస్‌ఆర్‌సీపీ నుంచి నోరుతూలి ఏ ఒక్కమాట నాయకులు కానీ, పార్టీ కానీ మాట్లాడలేదు. ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఎప్పుడూ వైయస్‌ఆర్‌సీపీ నాయకులుగా వెళ్లి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు చేసుకున్నాం తప్పితే ఏనాడూ మాట తూలింది లేదు. గతంలోనూ ఎన్నికల సందర్భంలో టీడీపీ వారు తిట్టారేమో కానీ వైయస్‌ఆర్‌సీపీ తిట్టలేదు.

ఇప్పుడు మళ్లీ తెలుగు డ్రామాల పార్టీ లేనిపోని మెకానిజం పెట్టారు. ప్రపంచంలో లేనిపోని కంప్లైంట్స్ అన్నీవేసి ఎడాపెడా వాయించినా వైయస్‌ఆర్‌సీపీ నిబ్బరంగా తట్టుకున్నాం తప్ప ఈరోజు కూడా గీత దాటడం లేదు. కానీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎప్పుడో గీత, హద్దులు దాటేశారు. సాటి ఐఏఎస్‌ అధికారులను దూషించటం ద్వారా సంస్కారహీనుడు అని నిమ్మగడ్డ రుజువు చేసుకున్నారు.

మార్చి 15, 2020న ఎన్నికల వాయిదాకు నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా హింస కానీ, ఎందుకు వాయిదా వేస్తున్నారన్న కారణాలను కూడా నిమ్మగడ్డ చూపలేదు. కేవలం కోవిడ్‌ను కారణంగా చూపి ఆరు వారాలు వాయిదా వేస్తున్నాం అన్నారు. ఆ తర్వాత ఎన్నికలు జరుపుతాం. అంతవరకు ఫండ్స్‌కు ఏమీ ఇబ్బంది లేకుండా చూస్తామని వాయిదా వేసిప్పుడే నిమ్మగడ్డ వికృతానందం బయటపడింది. తనకు పరిధి ఉంది కదా అని ఆరువారాల పాటు కోడ్ ఉందని చెప్పటం ద్వారా అభివృద్ధికి ఎలా అడ్డుపడుతున్నారో అర్థమైంది.

అందరు గమనిస్తే మార్చి 15న లేని కారణాలను చూపుతూ మార్చి 18న కేంద్ర హోం శాఖకు నిమ్మగడ్డ లేఖ రాశారు. ఇలాంటి లేఖను దేశచరిత్రలో ఎవ్వరూ రాసి ఉండరు. కోర్టుల దగ్గరకు వెళ్లినా వారి దృష్టిలో నిమ్మగడ్డపై ఇంతలోతుగా వెళ్లి చూస్తున్నారో లేదో తెలియటం లేదు. అంత అవకాశం కూడా అక్కడ రాకపోవచ్చు. ఎవ్వరు చూసినా నిమ్మగడ్డది లోపల అజెండా కాదు.. ఓపెన్ అజెండా పెట్టుకొని చంద్రబాబు తరుపున ఏజెంట్‌గా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని పచ్చిగా అందరికీ అర్థమౌతోంది.

మార్చి 15న ఏకపక్షంగా ఎన్నికల వాయిదా నిర్ణయం ద్వారా నిమ్మగడ్డ షాక్‌ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల వాయిదాకు గండికొట్టిన వ్యక్తే నిమ్మగడ్డే. మార్చి 18న రాసిన లేఖలో నిమ్మగడ్డ తన వికృతరూపాన్ని చూపారు. అధికారపక్షాన్ని గూండాలని, అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఫ్యాక్షనిస్టులు అని వారి నుంచి తన ప్రాణాలకు తన కుటుంబానికి భద్రత లేదని నిమ్మగడ్డ అన్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో హింస విపరీతంగా జరిగిందని, అంతకుముందు లేనన్ని ఏకగ్రీవాలు జరిగాయని నిమ్మగడ్డ లెక్కలు పెట్టారు. మరి, అంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు హింస తగ్గిందన్న విషయాన్ని నిమ్మగడ్డ చెప్పరు. ఆ సంఘటనలు తీసుకోరు. ఎందుకు అంటే.. అది వైయస్‌ఆర్‌సీపీ రూలింగ్‌లో ప్రశాంతంగా జరుగుతున్నాయనే సంకేతాన్ని ఇస్తుంది కాబట్టి.

2018లో జరగాల్సిన పంచాయితీ ఎన్నికలు 2021 వరకు ఎందుకు జరగలేదంటే దానికి బాధ్యులు ఎవరు? నిమ్మగడ్డ రమేశ్‌ కుమారా లేక చంద్రబాబా.. వీళ్ళల్లో ఎవర్ని ప్రధాన నేరస్తులుగా నిలబెట్టాలి. నిమ్మగడ్డ ఎస్‌ఈసీగా వచ్చిన తర్వాత ఎప్పుడూ ఎన్నికలు జరపాలని ప్రయత్నమూ చేయలేదు. ఈరోజున హడావుడి పడినట్లు.. ప్రపంచం తలకిందలు అయిపోతుందన్నట్లు పంచాయితీ వ్యవస్థ ఏమైపోతుందని అటు కోర్టులకు వెళ్లి లంచ్‌ మోహన్‌లు అంటూ ఏవీ ఆనాడు వేయలేదు. ఆరోజున అలా ఎందుకు చేయలేదో నిమ్మగడ్డ వివరణ ఇవ్వాలి.

అందర్నీ డిస్మిస్ చేయండని అంటున్నారు. ఈరోజు మరీ విచిత్రంగా ప్రవీణ్‌ ప్రకాష్‌ను కూడా బదిలీ చేయమన్నారు. ఎన్నికల విధానం జరిగేటప్పుడు ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోవచ్చు. దానికి నోటీసులు ఇవ్వటం వంటివి చేస్తారు. ప్రవీణ్‌ ప్రకాష్‌ బదిలీకి చూపిన కారణం మొన్న వీడియో కాన్ఫరెన్స్‌ జరగకపోవటానికి ఆయనే కారణమని తన రహస్య దర్యాప్తులో తేలిందన్నారు. ఆ హక్కు ఎస్‌ఈసీకి లేదన్న సంగతి నిమ్మగడ్డకు తెలీదా. మీ సొంత నిర్ణయాలకు…  సొంత ఏజెంట్లు పెట్టుకొని .. సొంత మనుషులతో విచారణ జరిపించి ఓ నిర్ణయానికి వచ్చే హక్కు ఎస్‌ఈసీకి లేదన్న సంగతి నిమ్మగడ్డకు తెలీదా. అలా అయితే ఇంట్లో వాళ్లను పెట్టుకొని నడుపుకోవచ్చు. టీడీపీ వాళ్లతో దుకాణం పెట్టి ఎన్నికలు చేసుకోవచ్చు. రాజ్యాంగం, చట్టం దీనికి ఒప్పుకోదు. ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వటం వల్ల ఎవరు పరువు తీసుకుంటున్నారు.

ఒక రాజకీయ పార్టీలో, గవర్నమెంట్‌లో ఉన్నవారు.. ఏమీ మాట్లాడకూడదా? టీడీపీ వారు రోజూ తిడుతూ ఉంటే మేం ఖాళీగా కూర్చొని ఉండాలా? నేను సలహాదారుడు కాకముందు నుంచే పార్టీ ప్రధాన కార్యదర్శి. పార్టీ అధ్యక్షుడు పొలిటికల్ సెక్రటరీగా పదేళ్ల నుంచి సీనియర్‌ పొజిషన్‌లో ఉన్నాను. నేను ప్రభుత్వంలో సలహాదారుడుగా ఉంటే ఇక్కడ మాట్లాడకూడదనే రూల్ ఎక్కడ నుంచి వచ్చిందో అర్థం కావటం లేదు. మా మీద నిమ్మగడ్డ రాజకీయ విమర్శలు చేయాలంటే టీడీపీ ఆఫీసులో కూర్చొని  తిట్టమనండి. ఎస్‌ఈసీగా ఉండి ఒక రాజకీయ పార్టీలో ఎవరు ఎక్కడ కూర్చొని మాట్లాడాలో, నిర్ణయించే అధికారం నిమ్మగడ్డకు లేదు. ఎస్‌ఈసీగా ఎన్నికలకు సంబంధించి ఎస్పీలను, కలెక్టర్లను ట్రాన్స్‌ఫర్ చేయమన్నారు. పంచాయితీరాజ్‌ సెక్రటరీని మార్చమన్నారు. మళ్లీ నాలుక కర్చుకొని అబ్బే.. వద్దువద్దు అన్నారు.

చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో అంటూ.. ఇవాళ ఈనాడులో కథనం వచ్చింది. అందులో 100 గజాలతో రూ.3లక్షలతో ఇళ్లు నిర్మిస్తామని, 50% ఆస్తి పన్ను తగ్గిస్తామన్నారు. అరే.. దీనిద్వారా చంద్రబాబు పరువుపోతుందని లేకుండా విజృంభించి ఈనాడులో కథనం రాశారు. రామోజీరావు ఈ విషయం చూసినట్లైతే దీన్ని పెట్టించేవారు కాదేమో. ఒక పంచాయితీ ఇంటి స్థలాలు కేటాయించి ఇళ్లు కట్టించగలదా? పంచాయితీ ఆస్తిపన్ను తగ్గించటం చేయగలదా? పంచాయితీ అధికారాల ప్రకారం రోడ్లు శుభ్రంగా ఉంచగలదు. నీరు సక్రమంగా ఉండేలా చేయగలదు. దీనిద్వారా అంతర్జాతీయ మేధావిని అనే చంద్రబాబు పంచాయితీ స్థాయికి వెళ్లి మేనిఫెస్టో వేసి మరోసారి తాను 200% మోసగాడినని నిరూపించుకున్నారు. సందుదొరికితే ప్రజల్ని ఎలా మోసం చేయాలని ఆలోచించే వ్యక్తి అనాలా? లేదా? దీన్ని మతిస్థిమితం లేకపోవటం అనాలా..

ఈ అవలక్షణాలు నిమ్మగడ్డ పనితీరులో, మాటల్లో, ఆయన చర్యల్లో కనపడుతున్నాయి. దీనికి ప్రధాన సూత్రధారి వెనుక ఉండి నడిపిస్తున్న చంద్రబాబే కారణం. చంద్రబాబు, నిమ్మగడ్డకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలే కారణం. ఈ ఎన్నికలు హింసాయుతంగా టర్న్‌ చేయాలనే ఉద్దేశం మీకు ఉంది. ఆ నెపాన్ని వైయస్‌ఆర్‌సీపీపై నెట్టాలనే దురాలోచన ఉందని గట్టిగా భావిస్తున్నాం. దీనిపై ప్రజలంతా ఎక్కడికక్కడ అలర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం  అని సజ్జల పిలుపునిచ్చారు.