టిడిపి నాయకులతో నారా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

189

పాల్గొన్న పంచాయితీ ఎన్నికల తొలిదశ ప్రాంతాల టిడిపి నేతలు

తొలిదశ పంచాయితీ ఎన్నికల నామినేషన్లు తొలిరోజు శుక్రవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆయా ప్రాంతాల టిడిపి నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘మీ గ్రామానికి మీరే కర్త, కర్మ, క్రియ అన్నీ మీరే..మీ గ్రామాన్ని మీరే బాగుచేసుకోవాలి. గ్రామాభివృద్ది ప్రతి ఒక్కరి విద్యుక్త కర్తవ్యం.

పంచాయితీ ఎన్నికలు గేమ్ ఛేంజర్ ఎలక్షన్స్..వైసిపి అరాచకాలకు బుద్దిచెప్పే ఎన్నికలు..హత్యలు, అత్యాచారాలు, హింసా విధ్వంసాలు, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు, బిసి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటిలపై వైసిపి దమనకాండకు అడ్డుకట్ట వేసే ఎన్నికలు..

తొలిరోజున నామినేషన్లు వేసిన టిడిపి అభ్యర్ధులు అందరికీ అభినందనలు. పోటీ చేయాలనే దృఢ సంకల్పంతో అభ్యర్ధులంతా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది.

రాబోయే రోజుల్లో 5ఏళ్లలో  రూ80వేల కోట్లతో గ్రామాల్లో అభివృద్ది పనులు జరిగే అవకాశం ఉంది. ప్రతి ఊళ్లో కోట్లాది రూపాయలతో అభివృద్ది చేసుకోవచ్చు. టిడిపి హయాంలో అభివృద్ది ఎలా చేసుకోవచ్చో మనం చేసి చూపించాం. కేంద్రం నుంచి, ఆర్ధిక సంఘం నుంచి, నరేగా ద్వారా వచ్చే నిధులను సద్వినియోగం చేయడంలోనే గ్రామాభివృద్ది ఆధారపడి ఉంది.

సర్పంచి సమర్ధుడైతే ప్రతి ఊరు బాగు పడుతుంది. ఈ పంచాయితీ ఎన్నికల్లో సమర్ధులను ఎన్నుకోవడం ద్వారా ఊరిబాగుకు బాటలు వేయాలి.

అనేక సమస్యలకు పరిష్కారమార్గం స్థానిక స్వపరిపాలన. అందులోనూ కీలకం పంచాయితీ ఎన్నికలు.  ఉదాసీనంగా ఉంటే మీ ఊరిని మీరు పాడు చేసుకున్నట్లే..గతంలో టిడిపి చేసిన అభివృద్దిని నీరుగార్చడమే..

గ్రామాల్లో బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కవచంగా మీరంతా ఉండాలి. గ్రామాలను కాపాడుకోవాలి, బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు అండగా ఉండాలి. యువత, మహిళలను ప్రోత్సహించాలి. బడుగు బలహీన వర్గాల్లో నాయకత్వం పెంచుకోడానికి ఇదొక అవకాశం.

గత మార్చి ఎన్నికల్లో నామినేషన్ పేపర్లు లాక్కుని చించేసి, అభ్యర్ధులను బెదిరించి, తప్పుడు కేసులు పెట్టి, అక్రమ నిర్బంధాలు చేసి, 19% జడ్ పిటిసిలు, 23%ఎంపిటిసిల్లో బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడ్డారు. వైసిపి నాయకుల హింసా, విధ్వంసాలను గ్రామీణ ప్రజలెవరూ మరిచిపోరు. విధ్వంసకాండకు పాల్పడిన వైసిపికి ఓటమితోనే గుణపాఠం చెప్పాలి..

టిడిపి చేసిన అభివృద్ది పనులన్నీ మీ కళ్లముందే ఉన్నాయి. సిమెంట్ రోడ్లు, ఎల్ఈడి వీధి దీపాలు, చెత్త నుంచి ఎరువు తయారీ కేంద్రాలు, పంటకుంటలు, ఇంటింటికీ మరుగుదొడ్లు, పంచాయితీ భవనాలు, అంగన్ వాడి భవనాలు,…టిడిపి అభివృద్ది పనులన్నీ మీ ఎదురుగానే ఉన్నాయి. ‘‘పల్లె ప్రగతి-పంచ సూత్రాలు, పల్లెలు మళ్లీ వెలగాలి’’ కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేయాలి.

టిడిపి ఏం  చేసింది, వైసిపి ఏం చేసిందో ప్రతిఊళ్లో డిబేట్ చేయాలి.

గత 20నెలల్లో వైసిపి మీ ఊళ్లో ఏ ఒక్క పని అయినా చేసిందా..? తట్టమట్టి పోసిందా, బొచ్చె సిమెంట్ వేసిందా..? రోడ్లపై కనీసం గుంతలు పూడ్చిందా, కనీసం తాగడానికి మంచినీళ్లు అయినా సక్రమంగా ఇచ్చారా..? టిడిపి చేసిన అభివృద్ది పనులు నిలిపేసిన, సంక్షేమ పథకాలు రద్దు చేసిన వైసిపికి బుద్దిచెప్పే ఎన్నికలు ఇవి..

నరేగా డబ్బులు ఇవ్వలేదు, మైక్రో ఇరిగేషన్ డబ్బులు ఇవ్వలేదు, ఆదరణ పరికరాలు ఇవ్వలేదు. అమ్మవడికి ఇచ్చింది నాన్న బుడ్డి ద్వారా లాగేసుకున్నారు. ఇచ్చింది గోరంత, లాక్కుంది కొండంత. కుటుంబానికి ఇచ్చిన దానికన్నా, ఆ కుటుంబం వేసిన ఒక్కో కుటుంబంపై వేసిన పన్నుల భారాలు, అప్పుల భారం 20నెలల్లో సరాసరి రూ 2లక్షలు.

పేదల స్కీములన్నీ స్కామ్ లే. ఒక్క ఇళ్ల స్థలాల్లోనే రూ6,500కోట్ల అవినీతి. భూములు, ఖనిజ సంపద దోచేశారు. ఇసుకలో, సిమెంట్ లో, మద్యంలో జె ట్యాక్స్ ల పేరుతో పేదల జేబులు గుల్ల చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారు, పేదల పొట్టకొట్టారు.

వైసిపి తప్పులకు గుణపాఠం చెప్పే అవకాశం ఈ ఎన్నికలు.

మంచి, చెడు విశ్లేషించి, మంచి వైపు మొగ్గుచూపే అవకాశం ఇది..

మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అనుమతించే ప్రసక్తే లేదు. 0.25% అప్పు కోసం రైతులు, పేదలపై వేలకోట్ల భారాలు మోపడం జగన్ రెడ్డి ద్రోహం. ఉచిత విద్యుత్ రైతులు పోరాడి సాధించుకున్న హక్కు. ప్రతి రైతుకు ఎన్టీఆర్ కల్పించిన హక్కు. మోటార్లకు మీటర్లు పెట్టడం ఉచిత విద్యుత్ కు ఎగనామం పెట్టడమే… రైతులు, రైతుకూలీలే ఈ ఎన్నికల్లో వైసిపికి గుణపాఠం చెప్పాలి. ఇసుక, సిమెంట్ ధరల పెంపుతో జీవనోపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులంతా వైసిపికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి.

ప్రత్యేక హోదా, పోలవరం, అమరావతి, వెనుకబడిన జిల్లాలకు నిధులు, కేంద్రం నుంచి రాబట్టడంలో ఘోరంగా విఫలం అయ్యారు. 28మంది ఎంపిలు ఉన్నా రాష్ట్రానికి ఒరిగింది శూన్యం. జగన్ రెడ్డి కేసుల మాఫీకోసమే వైసిపి మందబలం తప్ప ఏపికి చేసిందేమీ లేదు. టిడిపి 5ఏళ్లలో అటు కేంద్రం నుంచి నిధులు రాబట్టి, ఇటు అంతర్గత వనరుల సద్వినియోగంతో గ్రామీణాభివృద్ది ద్వారా రాష్ట్రాభివృద్దికి పాటుబడ్డాం.

పంచాయితీ ఎన్నికల్లో ప్రలోభాలను తిప్పికొట్టండి. బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి. డబ్బు, మద్యం ఎక్కడ పంచినా అడ్డుకోండి. కండబలం, ధనబలం కన్నా ప్రజాబలమే గొప్పదని రుజువు చేయండి.

వీరవాసరంలో బెదిరింపులను ఎలా రికార్డింగ్ చేశారో చూడండి. అదే స్ఫూర్తితో ఎక్కడ బెదిరింపులకు పాల్పడినా రికార్డింగ్ చేయండి, ఎన్నికల అధికారులతోపాటు పార్టీ కార్యాలయానికి పంపండి. నాతో సహా టిడిపి బృందం 24గంటలు అందుబాటులో ఉంటాం. 24గంటలు కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది. టిడిపి లీగల్ సెల్ న్యాయవాదులంతా మీకు అందుబాటులో ఉంటారు. మీకు కావాల్సిన సలహాలు, సూచనలను అందజేస్తారు.

కాల్ సెంటర్ నెంబర్ 7306299999కు ఫిర్యాదు చేయాలి. వైసిపి నాయకుల దాడులు, దౌర్జన్యాలు విధ్వంసాలపై ఫొటోలు, వీడియో సాక్ష్యాధారాలను వాట్సాప్ నెంబర్ 7557557744కు పంపాలి.

ఎన్నికల అధికారుల దగ్గర అక్నాలడ్జ్ మెంట్ తో సహా 7 మార్చి 2020వరకు అప్ డేట్ అయిన మార్పుచేర్పులతో సహా ఓటర్ లిస్ట్ లను అభ్యర్ధులంతా తీసుకోవాలని’’ చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ఈ టెలికాన్ఫరెన్స్ లో ఆలపాటి రాజేంద్రప్రసాద్, జ్యోతుల నెహ్రూ, టిడి జనార్దన్,అబ్దుల్ అజీజ్, హరీష్ మాధుర్, చింతకాయల విజయ్, వెంకటపతి రాజు తదితరులు మాట్లాడారు.