వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు

448

గుడ్లవల్లేరులో 1,063 ఇళ్ళపట్టాలను పంపిణీ చేశాం  
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ  : రాష్ట్రంలోని వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం జగన్మోహనరెడ్డి చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు . శుక్రవారం స్థానిక రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడ్లవల్లేరు మండల వైఎస్సార్సీపీ నాయకులు శీరం వెంకట సుబ్బారావు , శాయన హరిప్రసాద్ , కోటప్రోలు బాబూరావు , కొమ్మనబోయిన రవిశంకర్ , రంగబాబు , జీ వెంకటేశ్వరరావు , అల్లూరి ఆదియ్యనాయుడు తదితరులు కలిశారు . ఈ సందర్భంగా శీరం మాట్లాడుతూ గుడ్లవల్లేరులో ఇంకో 300 మంది పేదలకు ఇళ్ళపట్టాలను పంపిణీ చేయాలని కోరారు . గ్రామంలో ఆరెకరాల ప్రభుత్వ భూమి చెరువుగా ఉందని , దీన్ని మట్టితో ఫిల్లింగ్ చేసి ఇళ్ళస్థలాలుగా కేటాయించాలని కోరారు . అలాగే సమీపంలో ఉన్న మరో నాలుగు ఎకరాల ప్రైవేట్ భూమిని కొనుగోలు చేయించాలని విజ్ఞప్తి చేశారు .

దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ 25 వ తేదీన గుడ్లవల్లేరు గ్రామంలో గుడ్లవల్లేరు , కవుతరం మొదటి వార్డు , కూరాడ లాకు దిగువ ప్రాంతానికి చెందిన 1,063 మంది పేదలకు ఇళ్ళపట్టాలను అందజేశామన్నారు . ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని , కోడ్ ముగిసిన తర్వాత ఇళ్ళస్థలాల సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు . ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి అర్హుడని తేలితే 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టాను అందించాలని సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశించారన్నారు . ఇళ్ళస్థలాల పట్టాల కేటాయింపు , పంపిణీ నిరంతర ప్రక్రియ అని , దరఖాస్తు చేసుకున్న 12 రోజుల్లో వాలంటీర్ , సచివాలయ సిబ్బంది భౌతికంగా వెరిఫికేషన్ పూర్తి చేస్తారన్నారు.

సోషల్ ఆడిట్ ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తారన్నారు . వైఎస్సార్ జగనన్న కాలనీల్లో కల్పిస్తున్న సదుపాయాలు , వాటి నిర్మాణ రీతులు తదితరాలపై సీఎం జగన్మోహనరెడ్డి అధికారులతో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారని చెప్పారు . ఈ కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు సీఎం జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారన్నారు . వైఎస్సార్ జగనన్న కాలనీల్లో జనాభా ఆధారంగా గన్‌వాడీ కేంద్రాలు , వైఎస్సార్ క్లినిక్లు , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు , పాఠశాలలు , బస్ స్టాప్లు తదితర నిర్మాణాలపై అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు . రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల 06 వేల 673 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించి ఇళ్ళపట్టాలను పంపిణీ చేయడం జరుగుతోందని మంత్రి కొడాలి నాని తెలిపారు