దేశంలోనే తొలిసారిగా ఇంటి వద్దకే నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని అందిస్తున్నాం

103

పేదప్రజల కోసమే ప్రభుత్వ పాలనీల్లో మార్పులు
అర్ధం చేసుకోవాలని డీలర్లను కోరిన మంత్రి కొడాలి నాని

గుడివాడ  : దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా ఇంటి వద్దకే నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని అందించడం జరుగుతుందని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు . శుక్రవారం స్థానిక రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడివాడ పట్టణ చౌకధరల దుకాణదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెదమల్లు వీరవెంకట సత్యనారాయణ , ప్రధాన కార్యదర్శి ముప్పిడి రామ్మోహన్ , కోశాధికారి షేక్ అబ్దుల్ కలాం , ముఖ్య సలహా సంఘం సభ్యుడు తిరువీధి శ్రీరాములు తదితరులు కలిశారు .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 40 ఏళ్ళుగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బియ్యాన్ని సరఫరా చేసే గన్నీ బ్యాగ్ లను డీలర్లకే వదిలివేసేవారని చెప్పారు . దీనివల్ల బియ్యం తూకంలో వచ్చే తరుగుదలను కొంత వరకు గన్నీబ్యాగ్ లను విక్రయించడం ద్వారా వచ్చే రాబడితో సరిదిద్దుకునే పరిస్థితి ఉండేదన్నారు . ఇటీవల పౌరసరఫరాలశాఖ కమిషనర్ ద్వారా కొత్తగా జీవోను విడుదల చేశారని , రేషన్ డీలర్లు గన్నీ బ్యాగ్ లను గోడౌన్లకు తిరిగి ఇవ్వాలని ఆదేశించారన్నారు . ఈ జీవో అమలైతే గన్నీ బ్యాగ్ ల వల్ల వచ్చే స్వల్ప రాబడిని కూడా కోల్పోవాల్సి వస్తుందన్నారు . దీనిపై పౌరసరఫరాలశాఖ కమిషనర్ తో మాట్లాడి గన్నీ బ్యాగ్ లను రేషన్ డీలర్లకే వదిలివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు .

రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు సరుకులను సరఫరాల చేయడం వల్ల వచ్చే కమీషన్ షాపుల అద్దె , విద్యుత్ బిల్లులకు సరిపోతుందని చెప్పారు . అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్మోహనరెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో రోజువారీ కూలీలు,రోగులు,వృద్ధులు ప్రజాపంపిణీ వ్యవస్థ వల్ల పడుతున్న ఇబ్బందులను దగ్గర నుండి చూశారన్నారు . అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకువస్తానని హామీ ఇచ్చారన్నారు . దీనిలో భాగంగానే ఇంటి వద్దకే రేషను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు . ఇప్పటికే 9,260 డోర్ డెలివరీ మొబైల్ వాహనాలను రూ . 539 కోట్ల వ్యయంతో కొనుగోలు చేయడం జరిగిందన్నారు . వీటిని నిరుద్యోగ యువకులకు కేటాయించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చారని తెలిపారు .

రాష్ట్రంలో గతంలో ఉన్న ప్రజాపంపిణీ వ్యవస్థకు , ఇప్పటి ప్రభుత్వంలోని పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందన్నారు . పేదప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాలసీల్లో మార్పులు వస్తుంటాయన్నారు.ఈ మార్పులను రేషన్ డీలర్లు అర్ధం చేసుకోవాలని కోరారు . గతంలో రంగుమారిన , నూకలశాతం ఎక్కువ ఉన్న బియ్యాన్ని సరఫరా చేయడం వల్ల లబ్ధిదారులు వాటిని తినడానికి ఇష్టపడేవారు కాదన్నారు.దీనివల్ల నిత్యావసరాలు బ్లాక్ మార్కెట్ కు తరలిపోయేవని చెప్పారు . మిల్లింగ్ సమయంలోనే సూకల శాతాన్ని బాగా తగ్గించి కార్డుదారులకు నాణ్యతతో కూడిన బియ్యాన్ని అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు . నిత్యావసరాల కలీకి ఎటువంటి ఆస్కారం ఉండదన్నారు . ఎలక్ట్రానిక్ తూకం ద్వారా ఖచ్చితత్వంతో సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి కొడాలి నాని చెప్పారు.