‘అవిశ్వాసం’తో ఉద్యోగ నేతల..ఉక్కిరిబిక్కిరి!

650

ఏపీ-తెలంగాణలో ఉద్యోగుల నమ్మకం కోల్పోతున్న నేతలు
ఉద్యోగ నేతలపై ‘సర్కారీ విధేయ ముద్ర’
నాటి పోరాట స్ఫూర్తి నేడేదీ?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాల్సిన ఉద్యోగ సంఘ నేతలు,  ఇప్పుడు ఉద్యోగుల విశ్వాసానికి దూరమవుతున్నారు. తమ చర్యలతో విశ్వసనీయత కోల్పోతున్నారు. ఉద్యోగులను కూడగట్టుకుని ఉద్యమించాల్సిన నేతలు,  ఇప్పుడు సర్కారీ విధేయులుగా మారారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. పదవులు అడ్డుపెట్టుకుని, సొంత లాభం చూసుకుని, తమ సమస్యలను గాలికొదిలి సర్కారీ పెద్దలతో చెట్టపట్టాల్ వేసుకుంటున్న తమ నేతలపై ఉద్యోగులు ఉడికిపోతున్నారు. ఒకప్పుడు ఉద్యోగ సంఘ నేతలంటే ఉలిక్కిపడి, వారికి ఎదురొచ్చే పాలకులు, ఇప్పుడు వారిని లెక్కచేయడం మాని, చాంబర్లలోకి ప్రవేశమే నిషేధించారు. ఈ దుస్థితికి  తమ పోరాటాలతో సర్కారు మెడ వంచాల్సిన నేతలు,పాలకుల ముందు మెడలు వంచే పరాధీనతే కారణమన్నది ఉద్యోగుల ఆగ్రహం.ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్జీఓ, ఉద్యోగ సంఘాల నేతలపై ఉద్యోగుల అభిప్రాయమిది. ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తమ నేతలకు ముఖ్యమంత్రులు ఎన్నిసార్లు అపాయింట్‌మెంట్ ఇచ్చారో పరిశీలిస్తే, పాలకులు ఉద్యోగ నేతలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్ధమవుతోందని ఉద్యోగులు ఎద్దేవా చేస్తున్నారు.

ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సిన ఉద్యోగ సంఘ నేతలు, ప్రభుత్వ పెద్దలతో సాన్నిహిత్యం కోసం పాకులాడుతున్న వైనంపై.. ఏపీ-తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు అసంతృప్తితో ఉడికిపోతున్నారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై పోరాడి, వాటిని సాథించాల్సిన తమ నేతలు, సీఎంఓ- క్యాంపు ఆఫీసులలో తిష్టవేసి పాలకులను మెప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు విమర్శలకు గురవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఉద్యోగ నేతల్లో కులపిచ్చి ముదురుపాకాన పడటం వల్ల, తామంతా ఫలానా పార్టీకి అనుకూలమన్న భావన, ప్రజల్లో నెలకొనే ప్రమాదం ఏర్పడిందని ఏపీ ఉద్యోగులు వాపోతున్నారు. సర్కారు సమస్యల్లో చిక్కుకున్నప్పుడల్లా,  ఉద్యోగ నేతలు ఆపద్బాంధువుల అవ తారమెత్తడాన్ని ఉద్యోగులు ఆక్షేపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయిన నాటి నుంచి మొదలయిన ఈ సంస్కృతి, జగన్-కేసీఆర్ హయాం వరకూ విజయవంతంగా కొనసాగుతోందని ఉద్యోగులు విశ్లేషిస్తున్నారు.

పూర్ణచంద్రరావు, పివి రమణయ్య, విఠల్, కె.లక్ష్మయ్య వంటి ఎన్జీఓ, ఉద్యోగ సంఘ నేతల హయాంలో పాలకులు,  ఉద్యోగులకు భయపిన నాటి ఘటనలను ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. పీఆర్‌సి, వేతనాల, ఐఆర్ వంటి సమస్యల పరిష్కారం కోసం ఎన్టఆర్ హయాంలో, 40 రోజులకు పైగా ఉద్యోగులు సమ్మె కట్టిన నాటి నేతల పోరాట పటిమను గుర్తు చేస్తున్నారు. అసలు రాష్ట్ర చరిత్రలో కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో 56 రోజులు సమ్మె చేస్తే, ప్రభుత్వం దిగివచ్చి 6 రూపాయల వేతనం పెంచిందని గుర్తుచేస్తున్నారు. ఎన్టీఆర్ హయాం వరకూ ఉమ్మడి రాష్ట్రంలో, ఉద్యోగ సంఘ నేతలు పాలకలకు ముచ్చెమటలు పోయించారని చెబుతున్నారు. చివరకు ఎన్టీఆర్ చాంబర్‌లో దూసుకువెళ్లి, బయట ఉన్న పూలకుండీలు కూడా పగలకొట్టగా, ఆగ్రహించిన ఎన్టీఆర్ సచివాలయంలోనే ఉద్యోగులకు వ్యతిరేకంగా ధర్నా చేసిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. ఉద్యోగ నేతలపై నాడున్న గౌరవం, విశ్వాసం ఇప్పుడు లేకుండా పోయిందన్న వ్యాఖ్యలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి.

అయితే, చంద్రబాబు సీఎం అయిన తర్వాత,  ఉద్యోగ సంఘ నేతల పాత్ర పూర్తిగా మారిపోవడం మొదలయిందని ఉద్యోగులు వివరిస్తున్నారు. ఉద్యోగ నేతగా ఉన్న పివి రమణయ్యను టీడీపీలోకి తీసుకుని, ఆయనకు పదవి ఇచ్చారు. ఆ తర్వాత మరికొందరు జిల్లా స్థాయి నేతలు కూడా టీడీపీలో చేరారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో, సమైక్యాంధ్ర ఉద్యమం సాకుతో కొందరు నేతలు భారీ పైరవీలకు తెరలేపారని, వారిలో ఇద్దరు నేతలు నాటి సీఎం ద్వారా భారీ లబ్థి పొందారన్న ఆరోపణలు ఉండేవి. అదే సమయంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ నేత శ్రీనివాసగౌడ్, స్వామిగౌడ్, దేవీప్రసాద్, విఠల్ వంటి ఉద్యోగ నేతలకు కేసీఆర్.. తెలంగాణ వచ్చిన తర్వాత  ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులిచ్చారు. అదే ఆశతో చాలామంది ఉద్యోగ నేతలు,  కేసీఆర్ సర్కారుకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.

విభజిత ఏపీలో ఎన్జీఓ నేత అశోక్‌బాబుకు చంద్రబాబు ఎమ్పెల్సీ ఇచ్చారు. బాబు హయాంలో ఉద్యోగ సంఘ నేతలు సీఎంఓ, సీఎం క్యాంపు ఆఫీసులలో తరచూ దర్శనమిచ్చేవారు. విపక్షాలు ఎవరినయినా అధికారులను విమర్శిస్తే, వెంటనే ఉద్యోగ- పోలీసు సంఘ నేతలు మీడియాముందుకొచ్చి విపక్షాలపై ఎదురుదాడి చేసే సంస్కృతి బాబు జమానాలోనే ఆరంభమయింది. గతంలో వైసీపీ నేతలు ఐపిఎస్ అధికారులను విమర్శిస్తే, వెంటనే పోలీసుల అధికారుల సంఘం రంగంలోకి దిగి, వైసీపీపై ఎదురుదాడి చేసింది. ఎన్జీఓ, ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలదీ అదే దారి. ఇక ప్రత్యేక హోదా కోసం ఉద్యోగ నేతలు, టీడీపీ సర్కారు ఆందోళనలతో కలసి ఢిల్లీలో దీక్షతోపాటు.. విజయవాడలో మళ్లీ హూదా కోసం నవనిర్మాణ దీక్షలో పాల్గొని విమర్శల పాలయ్యారు.

ఇప్పుడు ఏపీలో అధికారం మారినా,  మళ్లీ అదే సంస్కృతి కొనసాగుతోంది. మాజీ ఉద్యోగ నేతలకు జగన్ కూడా పదవులిస్తున్నారు.  ఉద్యోగ నేతలు వైసీపీ సర్కారుకు భక్తుల్లా వ్యవహరిస్తున్నారన్న విమర్శ, తాజా ఎస్‌ఈసీ పరిణమాల్లో మరింత పదునెక్కింది. స్థానిక సంస్థల ఎన్నికలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న సర్కారుకు, ఉద్యోగ సంఘ నేతలు వత్తాసు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దానితో దిద్దుబాటుకు దిగిన అమరావతి ఉద్యోగ జాక్, సచివాలయ ఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. అటు విపక్షాలు సైతం,  ఉద్యోగ నేతలు వైసీపీ సర్కారుకు ఊడిగం చేయడం మానుకోవాలన్న వ్యాఖ్యలు చేయడం ద్వారా, వారిని ఆత్మరక్షణలోకి నెట్టారు.  జీపీఎఫ్ నిధులు ఇవ్వకపోవడంతోపాటు, ఇంకా పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యల పరిష్కారం కోసం పోరాడని నేతలు, పాలకుల మెహర్బానీ కోసం పాకులాడుతున్నారన్న విమర్శలు ఉద్యోగుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

అటు తెలంగాణలో అయితే ఉద్యోగ నేతల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పీఆర్‌సీ ఫిట్‌మెంట్ తాము 45 శాతం కోరుతుంటే 33 నెలల వరకూ దానిని నాన్చి, చివరకు 7.5 శాతమే ఇస్తామనడంపై ఉద్యోగులు ఉడికిపోతున్నారు. పక్కనే ఉన్న పేద రాష్ట్రయిన ఏపీలో ఇప్పటికే 27 శాతం ఇస్తుండగా, ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పించడంలో తమ నేతలు విఫలమయ్యారని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగ నేతలు సర్కారు వద్ద సాగిలబడుతున్నందుకే ఈ పరిస్థితి వచ్చిందని, భవిష్యత్తులో పదవుల కోసమే తమ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

‘ఉద్యోగులు ఇలాంటి విషాద పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు. కేసీఆర్ ఎన్నికల ముందు ఉద్యోగులకు తియ్యనిమాటలు చెప్పి మోసం చేశారు. ఉద్యోగ నేతలు ఆయనను ఎదిరించే పరిస్థితిలో లేకపోవడం దారుణం. తెలంగాణ వస్తే కేంద్రంతో పాటు సమానంగా జీతాలిస్తామన్న కేసీఆర్ హామీని నేతలు ఎందుకు నిలదీయడం లేదో అర్ధం కావడం లేదు. నేతలు గట్టిగా ఉంటేనే ఉద్యోగులకు సౌకర్యాలు అందుతాయన్నది నా అనుభవమ’ని ఉమ్మడి రాష్ట్రంలో రెవిన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన, ప్రస్తుత ఆలిండియా పెన్షనర్స్ జాక్ అధ్యక్షుడు కొలిశెట్టి లక్ష్మయ్య వ్యాఖ్యానించారు.