చెల్లని సోము సస్పెన్షన్!

570

మళ్లీ పార్టీలోకి లంకా దినకర్
ఫలించిన అగ్రనేతల ఆగ్రహం
వెలగపూడి స్థలం ఇవ్వరా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడిగా సోము వీర్రాజు వేసిన ముగ్గురు నాయకుల్లో ఒకరి సస్పెన్షన్ చెల్లలేదు. మిగిలిన ఇద్దరిలో ఒకరు ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై నేరుగా మీడియా సమక్షంలో కారాలు మిరియాలు నూరుతుండగా, మిగిలిన మరొక నాయకుడు అఖిల భారత హిందూమహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన లంకా దినకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ, సోము వీర్రాజు సంధించిన అస్త్రం వెనక్కి వచ్చింది. ఆయనపై వేసిన సస్పెన్షన్‌ను తొలగిస్తూ, మళ్లీ వీర్రాజు లేఖ రాయవలసి రావడం విశేషం. కన్నా హయాంలో పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మీపతిరాజాను సస్పెండ్ చేయగా, దానిని సోము వీర్రాజు తొలగించారు. ఇప్పుడు సోము తాము సస్పెండ్ చేసిన దినకర్‌ను తానే తొలగించాల్సి వచ్చింది.

బీజేపీలో వివిధ అంశాలపై అవగాహన ఉన్న అతి కొద్దిమందిలో ఒకరయిన.. ఆ పార్టీ మాజీ అధికార ప్రతినిధి లంకా దినకర్‌పై వేసిన సస్పెన్షన్‌ను,  పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎత్తివేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఏబీఎన్ చానెల్‌లో  పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారన్న సాకుతో,  దినకర్‌పై వీర్రాజు షోకాజ్ నోటీసు ఇవ్వకుండానే సస్పెన్షన్ వేశారు. అయితే తానేమీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని దినకర్ వివరణ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది.

అంతకుముందు.. ఏపీ బలిజనాడు కన్వీనర్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓ.వి.రమణ.. పార్టీకి వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతిలో వ్యాసాలు రాసినందుకు, ఆ తర్వాత కృష్ణా జిల్లాలో పార్టీ కార్యాలయానికి సొంత భూమిని విరాళంగా ఇచ్చిన వెలగపూడి గోపాలకృష్ణను సోము సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఓ.వి.రమణ, బీజేపీ నాయకత్వంపై శరపరంపరగా విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా, వెలగపూడిని బీజేపీ నుంచి సస్పెండ్ చేసిన వెంటనే,  అఖిల భారత హిందూ మహాసభ ఆయనను ఏపీ అధ్యక్షుడిగా నియమించింది.

నిజానికి కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే.. ఓ.వి.రమణ, లంకా దినకర్‌తోపాటు, కొన్నేళ్ల పాటు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల పార్టీ సమన్వయకర్తగా పనిచేసిన పురిఘళ్ల రఘురాంను సస్పెండ్ చేయాలని, బీజేపీ ఇన్చార్జి సునీల్ దియోథర్ శతవిధాలా ప్రయత్నించారు. ఒత్తిడి చేశారు. కానీ, వారు చేసిన వ్యాఖ్యలు తెప్పించుకున్న కన్నా, సదరు నాయకులు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిందేమీ లేదని స్పష్టం చేయడంతో సునీల్ దియోథర్..  సోము అధ్యక్షుడయిన తర్వాత, క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌తో సస్పెండ్ వేటు వేయించడం పార్టీలో చర్చనీయాంశమయింది.

అమరావతి రాజధానిపై సునీల్ దియోధర్, కన్నా, సుజనా చౌదరి, సోము చేసిన ప్రకటనలే ఓ.వి.రమణ వ్యాసం రూపంలో రాశారు. కానీ, దానిపై సోము ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనపై వేటు వేయటం రాయలసీమ బలిజల అసంతృప్తికి దారితీసింది. కాపు కోటాలో అధ్యక్ష పదవి పొందిన సోము, అదే బలిజ నేతపై తొలి వేటు వేయడమే వారి అసంతృప్తికి కారణం. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కన్నాపై విజయసాయిరెడ్డి ఆరోపణలు చేసిన సందర్భంలో, విజయసాయిని విమర్శిస్తూ రమణ ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాశారు. ఆ తర్వాతనే ఆయనను సస్పెండ్ చేయడంతో, కుమ్మక్కు రాజకీయాలు నడిచాయన్న ప్రచారం నడిచింది.

ఇక పార్టీ గళాన్ని బలంగా వినిపించి, అటు వైసీపీ-ఇటు టీడీపీకి తన వాదనతో సమాధానం చెప్పే లంకా దినకర్‌ను సస్పెండ్ చేయడాన్ని సీనియర్లు సహించలేకపోయారు. జాతీయ మీడియాలో సైతం పార్టీ గళాన్ని బలంగా వినిపించిన దినకర్.. ఢిల్లీలో ఉండే తెలుగు బీజేపీ నేతలకు పోటీగా తయారయ్యారు. టీడీపీలో ఉన్నప్పుడు కూడా జాతీయ మీడియాలో దినకర్ ఒక్కరే మాట్లాడేవారు.  ప్రధానంగా..కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, లంకా దినకర్ సస్పెన్షన్ వ్యవహారాన్ని  కోర్ కమిటీలో నిలదీశారు. కోర్‌కమిటీలో ఉన్న తమతో చర్చించకుండా దినకర్‌ను ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. దానితో.. కోర్ కమిటీలో ఎంపీలుంటే, తమ నిర్ణయాలు ప్రశ్నిస్తారన్న ముందు చూపుతో, సునీల్ దియోధర్ కోర్ కమిటీలో ఎంపీలను తప్పించారన్న ప్రచారం జరిగింది.

దానిస్థానంలో కీలక నిర్ణయాలు తీసుకునే  మినీ కోర్ కమిటీ ఒకటి ఏర్పాటుచేసి, అందులో ఎంపీలను మినహాయించారు. ఇక 19 మంది ఉన్న కోర్‌కమిటీలో మాత్రం ఎంపీలకు స్థానం కల్పించారు. ఇది పార్టీలో వివాదానికి దారితీసింది. ఇప్పటికీ విధాన నిర్ణయాలు తీసుకునే మినీ కోర్‌కమిటీలో ఎంపీలకు స్ధానం లేకపోవడం గమనార్ఱం. పార్టీలో ఇలా కోర్‌కమిటీ,మినీ కోర్ కమిటీని ఏ రాష్ట్రంలోనూ  ఏర్పాటుచేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తమతో చర్చించకుండా దినకర్‌ను ఏకపక్షంగా సస్పెండ్ చేయడాన్ని,ఎంపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రధానంగా సుజనాచౌదరి దీనిని సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఆ అంశాన్ని వారు పార్టీ జాతీయ అధ్యక్షుడు నద్దా, హోంమంత్రి అమిత్‌షా, జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి సంతోష్‌జీ వరకూ తీసుకువెళ్లారు. కేంద్ర మాజీ మంత్రి పురందీశ్వరి కూడా దానిపై పార్టీ జాతీయ అధ్యక్షుడు నద్దాకు లేఖ రాసినట్లు సమాచారం. ఇంతమంది ఈ అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో, కేంద్ర పార్టీ నాయకత్వం రంగంలోకి దిగడం అనివార్యమయింది. ఫలితంగా దినకర్‌ను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని ఆదేశించడంతో, ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయడం వీర్రాజుకు అనివార్యమయింది. ఫలితంగా..దినకర్ సస్పెన్షన్ వ్యవహారంలో,  ఎంపీలది పైచేయి అయింది.

కానీ, పార్టీకి తన సొంత స్థలాన్ని విరాళంగా ఇచ్చిన వెలగపూడి గోపాలకృష్ణను సస్పెండ్ చేసిన సోము.. ఆయన పార్టీ కోసం ఇచ్చిన స్థలాన్ని మాత్రం ఇవ్వకుండా అట్టిపెట్టుకోవడం, ఎలాంటి నైతిక ధర్మమమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాయకుడు పనికిరానప్పుడు, ఆయన ఇచ్చిన స్థలం మాత్రం ఎలా పనికివస్తుందని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.