చంద్రబాబు,ఎస్ఈసీ కలిసి పనిచేసినా తెలుగుదేశం పార్టీని బ్రతికించలేరు

0
242

– అంబటి రాంబాబు 

ఈరోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, నిన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లు సుదీర్ఘమైన మీడియా సమావేశాలు నిర్వహించారు. ఇద్దరూ సుదీర్ఘమైన ఉపన్యాసాలు చేశారు. రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి కాకపోయినా, చంద్రబాబు ఒక  రాజకీయ నాయకుడు,  అధికారం లేకపోయినా ఆయన పదే పదే మీడియా సమావేశాలు పెట్టడం, సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇవ్వడం, ప్రజల్ని విసిగించడం ఆయనకు అలవాటుగా మారింది.  చంద్రబాబు మీడియా సమావేశాల్లో.. అధికారం పోయిందనే బాధ, అసహనం, మళ్ళీ ఇక అధికారం రాదన్న ఫ్రస్ట్రేషన్ ఆయన చూపిస్తున్నారు. ఆయనకు అనుకూలమైన టీవీ ఛానల్స్ కూడా ఆ సోది చూపించలేక సగంలోనే తీసివేశాయని వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు  విరుచుకుపడ్డారు.

రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తున్న ఒక వ్యక్తి మీడియా సమావేశాలు పదే పదే నిర్వహించవల్సిన అవసరం ఉంటుందా..? ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేటప్పుడో, వాటి విధి విధానాలు వివరించేటప్పుడో క్లుప్తంగా మీడియా సమావేశాలు పెట్టడం ఆనవాయితీ. కానీ చంద్రబాబు నాయుడు మాదిరిలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదే పదే మీడియా ముందుకు వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు.  రాజ్యాంగ ప్రకారం ఆయనకు చాలా అధికారాలు వస్తాయి. అయితే వాటిని కాగితం మీద, పెన్ను ద్వారా ఉపయోగిస్తారు. ఒకవైపు అవి చేస్తూనే.. మరోవైపు ఆయన పదే పదే  మీడియా ముందుకు వచ్చి రాజకీయాలు మాట్లాడుతూ,  ప్రజలను, అధికారులను భయభ్రాంతులకు గురి చేయడం రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న పెద్దలకు సమంజసమా.. ? అని ప్రశ్నించారు.

అందుకే ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగ  స్ఫూర్తితో పనిచేయడం లేదు. చంద్రబాబు స్ఫూర్తితో పనిచేస్తున్నారు అని అంటున్నాం. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీకి ప్రాణం పోయాలని చూస్తున్నారు. వాస్తవానికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. పంచాయితీ ఎన్నికల్లోనో, స్థానిక ఎన్నికల్లోనో గెలవటానికి చంద్రబాబు, ఎస్ఈసీ ఇద్దరూ కలిసి పనిచేసినా ఆ పార్టీని బ్రతికించలేరు, కనుచూపు మేరలో అది సాధ్యం అయ్యే పని కూడా కాదు  అని అన్నారు.

మాట్లాడితే ఎస్ఈసీ సుప్రీంకోర్టు ఆదేశాలు అని మాట్లాడుతున్నాడు.  సుప్రీంకోర్టు తీర్పుల్ని గౌరవించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఆసరగా తీసుకొని ఎస్ఈసీ లేని అధికారాలను చలాయించాలనుకోవడం, కర్ర పెత్తనం చేయాలని చూడటం కరెక్టు కాదు. ప్రజాస్వామ్యంలో మితిమీరి ప్రవర్తిస్తే.. ఎవరైనా లక్ష్మణ రేఖ దాటితే అటువంటి వారికి అంతిమంగా ప్రజలే బుద్ధి చెబుతారు  అన్నారు.

రాష్ట్రంలో, దేశంలో ఏకగ్రీవ ఎన్నికలు కొత్తగా జరుగుతున్నట్టు, ఏకగ్రీవమైన గ్రామ పంచాయితీలకు ప్రోత్సాహకాలు కొత్తగా ఈ ప్రభుత్వమే ఇస్తున్నట్టు కొన్ని రాజకీయ పక్షాలు మాట్లాడటం దురదృష్టకరం. ఏకగ్రీవాలు జరగకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉందా.. ? ఉంటే చూపించండి అని ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తున్న ఈ ప్రతిపక్షాలను అడుగుతున్నాను. గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరగటం అన్నది సర్వ సాధారణం. కొన్ని సందర్భాల్లో ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు ఉత్పన్నం కాకుండా, పదవీ కాలాన్ని సగం సగం అంటూ పంచుకోవడం కూడా గతంలో చూశాం. ఏకగ్రీవాలను కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో వారే సమాధానం చెప్పాలి  అన్నారు.

పంచాయితీ ఎన్నికలకు చంద్రబాబు ఈరోజు మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్న వారందరికీ ఇదో విచిత్రంగా ఉంది. ఈ మేనిఫెస్టోలో ఒకవైపు చంద్రబాబు, మరోవైపు తన కొడుకు లోకేష్ ఫోటోలు కూడా వేశారు. ఇవన్నీ చూస్తుంటే.. పిచ్చి ముదిరింది, రోకలి చుట్టమన్నట్టు ఉంది.. చంద్రబాబు వ్యవహారం.  గ్రామ పంచాయితీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం ఏమిటి..? ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాదా.. ?  పల్లెల్లో  జరిగే ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయం ఉండకూడదని, పార్టీలకు అతీతంగా పంచాయితీ ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిస్తే.. చంద్రబాబు పంచాయితీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేస్తారా.. ? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం కాదా…? ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబుపై ఏం చర్యలు తీసుకుంటారు.. ? మీకు  చంద్రబాబు సన్నిహితుడైనా సరే,  ఆయనపై ఏం యాక్షన్ తీసుకుంటారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు చేసిన ఈ దుర్మార్గం మీద చట్టపరంగా చర్య తీసుకునే ఉద్దేశం నిమ్మగడ్డకు ఉందా? లేదా?.  ఉంటే, టీడీపీ గుర్తింపు రద్దు చేస్తారా? లేక కోర్టులో కేసులు వేసి లంచ్‌ మోషన్లు, హౌజ్‌ మోషన్లు వేస్తారా?  అన్నారు.

నిష్పక్షపాతంగా, రాజ్యాంగ స్ఫూర్తితో  పనిచేస్తున్నానని చాగంటి, ఉషశ్రీ, గరికపాటిని మించిపోయి నీతి ప్రవచనాలు చేస్తున్న ఎస్ఈసీ, గుర్తుల్లేని పంచాయితీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన మతి పోయిన మాజీ ముఖ్యమంత్రిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో తక్షణం సమాధానం చెప్పాలి. వాస్తవానికి చంద్రబాబు మీడియా సమావేశం పెట్టిన వెంటనే ఈపాటికే ఎస్ఈసీ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుపై ఫలానా చర్యలు తీసుకుంటున్నానని చెప్పి ఉండాల్సింది, కానీ అలా జరగలేదు  అన్నారు.

పార్టీ రహిత ఎన్నికల్లో పార్టీలను జొప్పించాలని చంద్రబాబు చూస్తున్నాడు ఎంపీటీసీ, జెడ్ పీటీ ఎన్నికల్లో ఏదో అరాచకం జరిగినట్టు, బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయన్నట్టుగా చంద్రబాబు కొన్ని వీడియోలు చూపించి అన్ని ఏకగ్రీవాలు అయ్యాయి, ఇన్ని అయ్యాయంటూ లెక్కలు చెప్పారు. ఆ  లెక్కలు ఎక్కడ నుంచి వచ్చాయో ఆరా తీస్తే.. ఇదే ఎస్ఈసీ గతంలో కేంద్ర హోం సెక్రటరీకి రాసిన లేఖలోని లెక్కలవి. వాటిని ఎస్ఈసీ అయినా చంద్రబాబుకు చెప్పి ఉండాలి, లేకపోతే చంద్రబాబు చెప్పినవే ఎస్ఈసీ తన లేఖలో రాసి ఉండాలి  అన్నారు.

14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 40 ఏళ్ళ అనుభవం ఉంది, అందరి కంటే సీనియర్ ని అని చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా చౌకబారుగా, దిగజారుడుగా ఉన్నాయి.  పీకావా.. పోటుగాడివా.. అని చంద్రబాబు మాట్లాడటం ఏంటి..? మేం అనలేమా..? కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు తెలిసో, తెలియకో ఇలాంటి మాటలు మాట్లాడితే..  బూతులు మాట్లాడుతున్నారని అందరం విమర్శిస్తాం.. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇలా మాట్లాడి.. ప్రజల్లో మరింత అభాసుపాలవుతున్నారు. అలా అంటే ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పెద్ద పోటుగాడా..? అమరావతి రాజధానిలో మంగళగిరిలో తన కొడుకును నిలబెట్టి ఓడించుకున్న చంద్రబాబు పోటు గాడా..?  అన్నారు.

చంద్రబాబు పార్టీ రహిత ఎన్నికలను పార్టీ ల పరిధిలోకి తీసుకొచ్చే విధంగా విష ప్రచారం చేస్తున్నారు. దీనిమీద నిమ్మగడ్డ ఈ పాటికే ప్రెస్ మీట్ పెట్టాలి. అలా కాదు, కంప్లైట్ ఇస్తేనే యాక్షన్ తీసుకుంటారా..? ఇది ఎస్ఈసీకి శీల పరీక్ష. ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు మీద యాక్షన్ తీసుకుంటాను. టీడీపీ గుర్తును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తానని ఎస్ఈసీని చెప్పమనండి.

నిజానికి చందుబాబు ఆత్మ నిమ్మగడ్డలో చంద్రముఖిలా ప్రవేశించి కలెక్టర్ల నుంచి, ఎస్పీల వరకు, జిల్లా అధికారలు వరకు, చివరకు పంచాయతీరాజ్‌ కమిషనర్, ముఖ్య కార్యదర్శి వరకు అందరి మొహాల్లో మొహం పెట్టి లక లక అంటున్నాడు. మరి ఇటువంటి నిమ్మగడ్డలో చంద్రబాబు ఆత్మ కాకపోతే తక్షణం చంద్రబాబు చేసిన చెత్త పనులపై రాజ్యాంగపరంగా దండెత్తాలి కదా? పంచాయతీ ఎన్నికల్లో పార్టీ రాజకీయం ఎక్కడి నుంచి వచ్చిందిని, మేనిఫెస్టో ఎలా విడుదల చేశారని ఇప్పటికే ప్రెస్‌ మీట్‌ పెట్టాలి కదా? కేసు పెట్టాలని పోలీసులను ఆదేశించాలి కదా? అటువంటి పనులు చేయడం లేదంటేనే నిమ్మగడ్డలో ఉన్న చంద్రముఖి అసలు రూపం అందరికీ కనిపిస్తోంది  అన్నారు.

ఆన్ లైన్ నామినేషన్లు అని కొందరు అడుగుతున్నారు. అసలు అడిగేవాళ్ళకు బుర్ర ఉందా.. ఎన్నికల్లో వేలు ముద్ర వేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది వాళ్ళ హక్కులకు భంగం కాదా.. ఆన్ లైన్ లో నామినేషన్లు కు అవకాశం ఉంటే మాకేం అభ్యంతరం లేదు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా నామినేషన్లు ఆన్ లైన్ లో పెట్టమని బీజేపీ వాళ్ళు సలహా ఇవ్వండి. ఇది పార్టీ ఆఫీసుల్లో ఫర్నీచర్ కొనటం లాంటి చిన్న విషయం కాదు. దీనిపై పెద్ద చర్చ జరగాలి  అంబటి రాంబాబు   అన్నారు.