ఏపీ ఉద్యోగ సంఘాల్లో చీలిక చిచ్చు

618

వెంకట్రామా.. ఏమిటీ డ్రామా?
ఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డిపై ఉద్యోగుల జేఏసీ  తిరుగుబాటు
ఇప్పటికే ఆయనపై డీజీపీకి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఫిర్యాదు
చిక్కుల్లో సచివాలయ ఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డి
ఏకమైన 94 ఉద్యోగ సంఘాలు
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య-సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై, హటాత్తుగా ఉద్యోగ సంఘాల నుంచి తొలి తిరుగుబాటు మొదలవడం ఆసక్తికరంగా మారింది. 94 ఉద్యోగ సంఘాలతో కూడిన అమరావతి ఉద్యోగుల జేఏసీ బుధవారం భేటీ అయి, వెంకట్రామిరెడ్డి వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను మీడియా సమక్షంలో ఏకరవు పెట్టడంతో, ఉద్యోగుల సంఘాల చీలిక స్పష్టంగా కనిపించింది.  వెంకట్రామిరెడ్డి  సచివాలయంలో కూర్చుని, తమ ప్రమోషన్ అవకాశాలు దెబ్బతీస్తున్నారంటూ.. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం బహిరంగంగా ధ్వజమెత్తడం ద్వారా, తిరుగుబాటు బావుటా ఎగురవేయడం సంచలం సృష్టించింది. దీనికి సంబంధించి, ఉద్యోగుల సంఘం నేతలు, వెంకట్రామిరెడ్డిని ఉద్దేశించి చేసిన హెచ్చరికల వీడియో, సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

బుధవారం జేఏసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు.. వెంకట్రామిరెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు. ఆయనకు ఉద్యోగులతో సత్సంబంధాలు లేవని, ఆయన తీరు వల్ల ప్రజల్లో ఉద్యోగులపై చులకన భావం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సచివాలయ సంఘ అధ్యక్షుడికి ఏపీ ఉద్యోగులకూ సంబంధం ఏమిటి? ఆయన తీరుతో పాలకవర్గం  కూడా విసిగిపోయింది. సచివాలయం నుంచి వెళ్లకపోతే అరెస్టు చేయిస్తామన్నాడు.  అక్కడికి ఇతర సంఘాల నేతలను రానీయడం లేదు. వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తా’మని వెల్లడించారు. ఉద్యోగుల జీవితాలతో వెంకట్రామిరెడ్డి ఆడుకుంటున్నారని, ఉద్యోగులకు ప్రమోషన్లు, బెనిఫిట్లు రాకుండా అడ్డుకుంటున్నారని విరుచుకుపడ్డారు. తాజాగా వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని ఖండించారు. తాము ఎన్నికలకు వ్యతిరేకం కాదని, ఉద్యోగుల ఆరోగ్యంపై హామీ కోరామే తప్ప, ఎన్నికలను వ్యతిరేకించలేదన్నారు.

మరొక నేత ఈశ్వర్ అయితే,  వెంకట్రామిరెడ్డి తీరును బట్టబయలు చేశారు. ‘మేం ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రాలిచ్చేందుకు వెళ్లినప్పుడు సెక్షన్ ఆఫీసర్లు, డిప్యూటీ సెక్రటరీలను కలుస్తుంటాం. కానీ ఇప్పుడు వాళ్లు మాతో కూడా మాట్లాడేందుకు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది.  వాళ్లను ఆయన ఆవిధంగా బెదిరిస్తున్నారు. వాళ్లు అన్నా..  మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపోండి. ఫలానా వ్యక్తి చూస్తే మీతో మాట్లాడుతున్నందుకు మమ్మల్ని ఈ సీట్లో నుంచి లేపేస్తారు’’ అని భయపడే పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు.

కాగా మున్సిపల్ శాఖలో ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్లను  వెంకట్రామిరెడ్డి అడ్డుకుంటున్న వైనంపై ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిజానికి ఎప్పుడో నియమితులయిన జూనియర్ అసిస్టెంట్ల కు, 2014లో ప్రమోషన్లు ఇచ్చారు. ఇప్పుడు  డిగ్రీ అనేది అర్హతగా వచ్చింది. దానికి ముందు వారికి అర్హత ఇంటర్‌మీడియటే. అయితే అప్పుడు అపాయింట్ అయిన వారికి కూడా ఇప్పుడు డిగ్రీ అర్హత కావాలని, 17మందికి రివర్షన్ ఇప్పించేందుకు వెంకట్రామిరెడ్డి చేస్తున్న ప్రయత్నాలపై అమరావతి ఉద్యోగుల జేఏసీ మీడియా సాక్షిగా విరుచుకుపడింది.దీనిపై మీడియా సమక్షంలో ధ్వజమెత్తిన జాక్ నేత ఈశ్వర్  ‘ ఈ ప్రబుద్ధుడు చేస్తున్న పనుల వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారు. నేను 29 ఏళ్ల నుంచి యూనియన్‌లో ఉన్నా. దీనివల్ల నా లాంటి వాళ్లుకూడా నష్టపోతున్నారు.  ఉద్యోగుల సంఘం నేత ఉద్యోగుల బాగు కోసం పనిచేస్తాడా? లేక కీడు కోసం పనిచేస్తాడా? మేం గవర్నరమెంటు పక్షాన మాట్లాడటం లేదు, ఉద్యోగుల పక్షాన మాట్లాడుతున్నాం. ఉద్యోగుల భద్రత గురించి అడిగే హక్కు మాకుంది. ప్రభుత్వం-ఉద్యోగులు వేర్వేరు కాద’ని సదరు నేత, వెంకట్రామిరెడ్డిపై  మీడియా సమావేశంలో విరుచుకుపడటం విశేషం.

అమరావతి ఉద్యోగుల జేఏసీ కార్యనిర్వహక కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ,  తాము ఏపీ జేఏసీ పక్షాన సుప్రీంకోర్టులో కేసు వేయడం గానీ, ఇంప్లీడ్ అవడం గానీ చేయలేదు. అది వేరే సంఘాలు చేశారు తప్ప,  ఏపీ జేఏసీ సంఘాలు చేయలేదు. మాకు ఏపీ రెవిన్యూ సంఘంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. ఎదుటివాడిని చంపాలన్న ఈ వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఉద్యోగులకు న్యాయం జరగదు. కరోనా సమయంలో రెండు నెలల జీతాల్లో కోతపెడితే, కోర్టు వడ్డీ ఇమ్మంంది.  ఈ వెంకట్రామిరెడ్డి అసలు మేము వడ్డీ అడగలేదని ఉద్యోగులను నష్టపరిచే పద్ధతిలో మాట్లాడాడు. అతనివల్లనే ఈ సమస్యలు. మేం ఎన్నికల్లో పాల్గొనబోమని ఎప్పుడూ చెప్పలేదు. కొన్ని తొత్తు సంఘాలు, ప్రభుత్వం వద్ద అధికారం సంపాదిద్దామన్న సంఘాలు మాట్లాడుతున్నాయి తప్ప, మా 94 సంఘాల్లో ఎవరూ మాట్లాడటం లేద’ని వెంకట్రామిరెడ్డిపై విరుచుకుపడ్డారు.

కాగా, వెంకట్రామిరెడ్డి ఇటీవల,  తమకు చంపే హక్కు కూడా రాజ్యాంగం ఇచ్చిందంటూ చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. దానిపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్, డీజీపీకి ఫిర్యాదు చేశారు. వెంకట్రామిరెడ్డి వల్ల ప్రాణహాని ఉందని, ఆయనపై నిఘా వేయాలని ఫిర్యాదు చేసిన వైనం చర్చనీయాంశమయింది. రెండురోజుల క్రితం టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ సుధాకర్‌రెడ్డి చేసిన ఆరోపణ, దానికి సంబంధించిన ఆధారాలు విడుదల చేయటం ద్వారా, వెంకట్రామిరెడ్డిని ఇరుకునపెట్టారు.

‘వెంకట్రామిరెడ్డి భార్య శ్వేతా వెంకట్రామిరెడ్డి వైసీపీ కార్యకర్త. ఆమె 2012 నుంచి ముషీరాబాద్ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. 2014లో వెంకట్రామిరెడ్డికి వైసీపీ టికెట్ ఇచ్చారు. అయితే ప్రభుత్వ ఉద్యోగి కావడంతో నామినేషన్ వేసేందుకు కుదరలేదు. అయినా శ్వేత వైసీపీ కోసం ప్రచారం చేశారు. 2016లో ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి వస్తున్నప్పుడు, వెంకట్రామిరెడ్డి వారిని రెచ్చగొట్టి అమరావతి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశార’ని సుధాకర్‌రెడ్డి ఆరోపించారు.

2014 ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా వెంకట్రామిరెడ్డి సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారన్న విషయాన్ని, సుధాకర్‌రెడ్డి తాజాగా వెలుగులోకి తెచ్చారు. బాబు అధికారంలోకి రావడంతో 2013 డిసెంబర్ నుంచి 2015 వరకూ పెట్టిన పోస్టులన్నీ డిలీట్ చేశారంటూ, వాటికి సంబంధించిన క్లిప్పింగులు విడుదల చేశారు. అందులో అడికిమెట్‌లో వైఎస్ విగ్రహానికి నిప్పుపెట్టినందుకు నిరసనగా వెంకట్రామిరెడ్డి భార్య శ్వేత, వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న ఫొటో కూడా జతపరిచారు.  జగన్‌తో దిగిన సెల్ఫీ, వైసీపీ ఫ్లెక్సీలను పోలీసులు తొలగించడాన్ని ప్రశ్నిస్తూ,  ఆమె పోలీసుమ ముందు ఉన్న ఫొటోలను టీడీపీ నేత డాక్టర్ సుధాకర్‌రెడ్డి మీడియాకు విడుదల చేసి, ఉద్యోగుల ముందు వెంకట్రామిరెడ్డిని ముద్దాయిగా నిలిపే ప్రయత్నం చేశారు. తాజా పరిణామాలు పరిశీలిస్తే… 18 నెలల నుంచి ఉద్యోగ సంఘాలను తమ గుప్పిట పెట్టుకున్న ప్రభుత్వానికి ఏపీ ఉద్యోగుల జేఏసీ తిరుగుబాటు షాక్ కలిగించిందనే చెప్పాలి.