ప్రశ్న ప్రతిధ్వనించాలి

220

మూఢత్వానికి తల ఒగ్గితే
మనిషితనం మటుమాయం
మౌఢ్యం నెత్తికెక్కిన మనిషి
క్రూర మృగంతో సమానం

ఎన్ని చదువులు చదివినా…
ఎంత సంపద పోగేసినా…
మస్తిష్కానికి తుప్పు పట్టిన తరువాత…
వివేకానికి విలువేముంటుంది…?

పండితుడైనా… పామరుడైనా…
పరిణితి పాతాళానికి
పడి పోయినప్పుడు…
అంధత్వం అలుముకోక ఆగదు
వ్యక్తుల్ని ఆడిపోసుకోవడం కాదు…
వ్యవస్థ మక్కలిరగదన్నాలి ముందు

రాజ్యమే రాజ్యాంగ విధులకు
పంగనామాలు పెడుతున్నప్పుడు
ప్రచార ప్రసార మాద్యమాలన్నీ
మౌఢ్యం గొంతులతో
గోల గోల చేస్తున్నప్పుడు
చాందస భావాలకు చావెక్కడిది…?
మూఢ నమ్మకాలు ముగిసేదెప్పుడు…?

అమాత్యులు మొదలుకొని
వంది మాగద దండ నాయకులంతా…
అంధ విశ్వాసాలకు
బ్రాండ్ అంబాసిడర్లుగా
బోర విరుచుకుంటూ
తిరుగుతున్నప్ఫుడు
వ్యవస్థకు గుడ్డి దీపం వెలుగులో
దేవులాట… తప్పదు కదా…!

దోపిడీ వ్యవస్థలో…
భక్తి కూడా సరుకైన వేళ
ముక్తి… మోక్షం…మస్తు మత్తును
పంచడం మామూలే అవుతుంది
పైసాయే పరమాత్మ అంటూ
వొక్కాణింపులు అందుకే కదా…!

జనం మూఢత్వం జడిలో
తడుస్తున్నప్పుడు దోపిడీ దందాలు
జబర్దస్తుగా సాగిపోతుంటాయి
వర్గ సమాజానికి ఇంతకు మించిన
కానుక ఏముంటుంది… ?
దీన్నే కదా…!
సంపన్నుల స్వర్గం అనేది

వ్యవస్థ తనకు తానుగా
పతనం అంచుకు పయనించదు
చక్రం తిప్పేవాడి తీరును బట్టి
ప్రయాణం సాగుతుంది

వివేచన కలిగి ఓటు వేయనప్పుడు
అవస్థలు ఇలానే వుంటాయి
ధిక్కార స్వరాలు వినిపించకపోతే…
ప్రశ్నల పరంపర ప్రతిధ్వనించకపోతే..
వ్యవస్థ చచ్చుబడే తీరుతుంది.
ప్రశ్నను పరవళ్ళు తొక్కించడమే
ప్రగతి ప్రేమికుల కర్తవ్యం.

వి.రాజగోపాల్ , విజయనగరం
26-1-2021 , 9490098036