శశికళ విడుదల…

250

తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆప్తురాలు వీకే శశికళ జైలు నుంచి విడుదలయ్యారు. 4 ఏళ్ల తర్వాత ఆమె జైలు నుంచి శశికళ బయటికి వచ్చారు. శశికళ కరోనా బారినపడడంతో బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విడుదల ప్రక్రియను ఆస్పత్రిలోనే పూర్తి చేసారు జైలు అధికారులు. శశికళకు జనవరి 20న ఆర్టీపీసీఆర్ పరీక్షలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.  ఈ క్రమంలోనే ఆమె విక్టోరియా ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ జైలు నుంచి విడుదల అయినప్పటికీ.. ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జి అవుతారన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆమెకు కరోనా లక్షణాలేవీ లేవని డాకర్టు తెలిపారు. ఐనప్పటికీ కోవిడ్ ప్రొటోకాల్స్ ప్రకారం మరో 10 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు భావిస్తే వెళ్లిపోవచ్చు. శశికళ జైలు నుంచి విడుదల కాగానే భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఆమె అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు.

66 కోట్ల అక్రమాస్తుల కేసులో శశికళ దోషిగా తేలడంతో జైలుపాలయ్యారు. ఆ కేసులో నాలుగేళ్ల జైలు శిక్షపడింది. 2017 ఫిబ్రవరి నుంచి బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవించారు. ఇదే కేసులో శశికళ బంధువులు జే ఇళవరసి, బీ ఎన్ సుధాకర్‌కు కూడా శిక్షపడింది. ఐతే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్న సమయంలోనే శశికళ జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో.. అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.