దెబ్బకు దెబ్బ తీస్తున్న ‘నిమ్మగడ్డ’

0
561

సర్కారు ఎత్తును చిత్తు చేసిన ఎస్‌ఈసీ
ఇద్దరు ఐఏఎస్‌లపై క్రమశిక్షణ చర్యలు
మరో ఇద్దరు పెద్దతలలపైనా వేటు తప్పదా?
నరసింహన్ నేర్పిన పాఠాలతోనే ప్రత్యర్ధులకు ‘గుణపాఠాలు’
                            ( మార్తి సుబ్రహ్మణ్యం)

ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన నర్శింహన్ వద్ద నేర్చుకున్న రాజకీయ పాఠాలను ఇప్పుడు ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తనను అవమానించిన వారిపై బదిలీ వేటుతో సంధించడం ద్వారా, ఏపీ ఎన్నికల సెన్‌‘శేషన్’గా మారారు. ఆయన పదవీకాలం మార్చితో ముగుస్తున్నప్పటికీ, ఈ రెండు నెలలకాలంలో ఎన్నికల సంఘం అధికారాలేమిటో, తనను అవమానించిన జగన్ సర్కారుకు రుచిచూపించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటివరకూ నిమిత్తమాత్రంగా పనిచేసిన రాష్ట ఎన్నికల కమిషన్ సత్తా ఏమిటన్నది తనను అవమానించిన వారికి తెలిసేలా చేయడం ద్వారా, అందరి దృష్టినీ తన వైపు మళ్లించడంలో విజయం సాధించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ..  గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్‌పై తొలి బదిలీ వేటు వేయడం ద్వారా.. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే అధికారులకు హెచ్చరిక సంకేతం పంపారు. ఈ విషయంలో ఆయన సర్కారు ఎత్తుకు పై ఎత్తు వేయడం అధికార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

నిజానికి నిమ్మగడ్డ దూకుడుకు భయపడిన సర్కారు ముందుచూపుతో, ద్వివేదీ-గిరిజాశంకర్‌ను బదిలీ చేయాలని నిర్ణయించింది. అయితే, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బదిలీ సాధ్యం కాదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. ఆ వెంటనే శరవేగంగా అడుగులు వేసిన నిమ్మగడ్డ.. ఆ ఇద్దరు అధికారులు ఎన్నికల జాబితా రూపకల్పన అంశంలో బాధ్యతారాహిత్యానికి పాల్పడినందున, వారిద్దరినీ అభిశంసిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ప్రభుత్వం ఎత్తును చిత్తు చేశారు. దానితోపాటు, వారి నిబంధనల ఉల్లంఘనను సర్వీసు రికార్డులలో నమోదుచేయాలని ఆదేశించారు. ఇది క్రమశిక్షణ చర్యల కిందే వస్తుందని ఐఏఎస్ అధికారులు చెబుతున్నారు. ‘వారిద్దరినీ  బదిలీ చేస్తే అది సాధారణ బదిలీ కిందకే వచ్చేది. మళ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం పోస్టింగు ఇచ్చేది. కానీ నిమ్మగడ్డ,  ప్రభుత్వానికి అలాంటి అవకాశం ఇవ్వకుండా, ఇద్దరు అధికారులను అభిశంసించడంతోపాటు, నిబంధనలు ఉల్లంఘించిన విషయాన్ని వారి సర్వీసు రికార్డులో కూడా నమోదుచేయాలనడం చూస్తే నిమ్మగడ్డ, ఈ విషయంలో ఎంత సాంకేతికంగా వ్యవహరించారో అర్ధమవుతుంది. ఒకరకంగా ఇది ప్రభుత్వాలు చెప్పిందల్లా చేసే అధికారులకు ఒక హెచ్చరిక. ఎన్నికలు ప్రారంభమయ్యేలోపు, ఇంకెంతమందిపై వేటు పడుతుందోనన్న ఆందోళన అందరిలో ఉంద’ని ఓ ఐఏఎస్ అధికారి వెల్లడించారు.

కాగా వేటు పడిన ఈ ఇద్దరు అధికారులు  నిమ్మగడ్డ  పిలిచిన సమావేశానికి హాజరుకాకుండా, డుమ్మా కొట్టడం గమనార్హం. 2021 జాబితాను పంపడంలో ద్వివేదీ-గిరిజాశంకర్ నిర్లక్ష్యం ప్రదర్శించారన్న ఆగ్రహంతో ఉన్న నిమ్మగడ్డ, వారిద్దరి స్థానంలో ముగ్గురు అధికారుల పేర్లు పంపాలని సీఎస్‌ను ఆదేశించారు. ఇప్పటికే తొమ్మిదిమంది ఐఏఎస్, ఐపిఎస్, డీఎస్పీలను బదిలీ చేయాలని నిమ్మగడ్డ తాజాగా లేఖ రాయడం కూడా ప్రభుత్వ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.

ఇక ఆ ఇద్దరిపైనా వేటు తప్పదా?

కాగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుపడుతున్న ప్రభుత్వానికి, బదిలీ అయిన ఈ ఇద్దరు సహకరిస్తున్నట్లుగానే.. మరో ఇద్దరు కీలక అధికారులు కూడా సహకరిస్తున్నారని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఎన్నికల ప్రారంభానికి ముందే ఆ ఇద్దరిని కూడా బదిలీ చేసే ప్రమాదం లేకపోలేదన్న చర్చ అటు వైసీపీ వర్గాల్లో కూడా ప్రారంభమయింది. అంటే ఎన్నికలు ముగిసే వరకూ బాధ్యతల నుంచి తప్పించినా ఆశ్చర్యపోవలసి పనిలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ‘ బాబు హయాంలో సీఈఓగా ఉన్న ద్వివేదీగారు రెండు పెద్ద తలలపై వేటు వేసినట్లుగానే నిమ్మగడ్డ కూడా,  రేపో మాపో అలాంటి రెండు పెద్ద తలలపై వేటు వేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ద్వివేదీ,గిరిజాశంకర్ పై బదిలీ వేటు వార్త విన్న తర్వాత, మరో ఇద్దరిని కాకపోయినా కనీసం ఒక పెద్ద తలను ఖాయంగా బదిలీ చేస్తారని ఊహిస్తున్నాం’ అని వైసీపీ ప్రముఖుడొకరు వ్యాఖ్యానించారు. రేపు ప్రతిపక్షాలు ఫలానా అధికారిపై తమకు నమ్మకం లేదని ఫిర్యాదు చేస్తే, దాని ఆధారంగా సదరు అధికారిపై బదిలీ వేటు వేసినా ఆశ్చర్యం లేదన్నారు.  సదరు వైసీపీ నేత ఆందోళన చూస్తే,  భవిష్యత్తులో మరిన్ని బదిలీలు ఉంటాయని స్పష్టమవుతోంది.

కాగా కీలక స్థానాల్లో ఉన్న ఆ ఇద్దరు జగన్ సర్కారుకు సహకరిస్తూ, విధేయత ప్రదర్శిస్తున్నారన్న అనుమానం నిమ్మగడ్డలో లేకపోలేదని అధికార వర్గాలు చెబుతున్నారు. వీటికిమించి.. తాను హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో కొందరు వ్యక్తులను కలిసిన సీసీ పుటేజీని సంపాదించి, దానిని సోషల్‌మీడియాలో ప్రచారం చేయడాన్ని కూడా నిమ్మగడ్డ మర్చిపోలేకపోతున్నారంటున్నారు. తనపై నిఘా ఉంచిన సదరు కీలక వ్యక్తులకు సమాధానం చెప్పే అవకాశం వచ్చినందున, దానిని నిమ్మగడ్డ ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోబోరన్న వ్యాఖ్యలు అధికార వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో తాను ఐపిఎస్, ఐఏఎస్, డీఎస్పీలను బదిలీ చేయాలని ఆదేశించినా, సర్కారు పట్టించుకోలేదు. తాజాగా మరోసారి ఆయన ఆ ఆదేశాలను గుర్తు చేస్తూ లేఖ రాయడం బట్టి.. నిమ్మగడ్డ తన నిర్ణయాలను ధిక్కరించి, అవమానించిన వారికి ఏవిధంగా చట్టపరంగానే సమాధానం చెబుతున్నారో స్పష్టమవుతోంది.

ద్వివేదీ మార్గంలోనే నిమ్మగడ్డ..

కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు, సీఈఓగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేదీ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పునేఠాతోపాటు, ఇంటలిజన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేసి, ఈసీ ఆదేశాలతో సీఎస్  స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యంను నియమించారు. అదే సమయంలో వైసీపీ ఫిర్యాదు మేరకు, కొందరు ఎస్పీలను కూడా విధుల నుంచి తప్పించారు. ఆ సమయంలో సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు ద్వివేదీ చాంబర్ వద్ద ధర్నా కూడా నిర్వహించారు. అయితే ఇప్పుడు విచిత్రంగా అంతటి అధికారాలు అనుభవించిన  అదే గోపాలకృష్ణను,  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేష్ బదిలీ చేయడం ద్వారా, ఎన్నికల కమిషన్ అధికారాలను అదే ద్వివేదీకి చూపించినట్టయింది. నాడు ద్వివేదీ మార్గంలోనే నేడు నిమ్మగడ్డ వెళుతున్నట్లు కనిపిస్తోంది.  మొత్తంగా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, గతంలో తనను అవమానించిన కొందరు అధికారులకు నిమ్మగడ్డ ‘సాంకేతిక మార్గం’లోనే గుణపాఠం చెప్పడం, అధికార-రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది.

నరసింహన్ స్కూల్ అనుభవాలే పాఠాలుగా..

ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన నరసింహన్ వద్ద కార్యదర్శిగా వ్యవహరించిన నిమ్మగడ్డ రమేష్, ఈ విద్యలు- వ్యూహాలన్నీ ఆయన వద్దే నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర విభజన-ఓటుకు నోటు వంటి పెద్ద సంఘటనలలో నరసింహన్ నేర్పుగా వ్యవహరించారు. కేసీఆర్‌తో లౌక్యంగా పనిచేశారు. ఇప్పుడు నిమ్మగడ్డ వేస్తున్న పాలనాపరమైన ఈ ఎత్తుగడలన్నీ కూడా, ఆయన వద్ద నేర్చుకున్నట్లు.. తాజాగా ఆయన వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయన నేర్పిన పాఠాలతో, నిమ్మగడ్డ కొందరు అధికారులకు ‘గుణపాఠాలు’ నేర్పుతున్నారు. ఫలితంగా.. దశాబ్దాల క్రితం భారత ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన శేషన్‌ను మర్చిపోయిన జనానికి, ఇప్పుడు నిమ్మగడ్డ తన నిర్ణయాలతో మరోసారి శేషన్‌ను గుర్తుకు తెస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఎల్వీ-నిమ్మగడ్డ మధ్య తేడా అదే..

తనను తొలగించిన ప్రభుత్వంపై యుద్ధం చేసిన నిమ్మగడ్డ, తిరిగి తన స్థానం చేజిక్కించుకుంటే… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి  అర్ధంతరంగా తనను  తొలగించినా, ప్రభుత్వంపై పోరాడకుండా ఎల్వీ సుబ్రమణ్యం నాడు మౌనంగా నిష్క్రమించారని కొందరు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఒక ఐఏఎస్ అధికారి ఇద్దరి మధ్య ఉన్న పోలికను విశ్లేషిస్తూ,  ‘ఇప్పుడు నిమ్మగడ్డకు బహిరంగంగా ఎవరూ మద్దతునివ్వలేదు. తెరవెనుక ఆయనకు చాలా శక్తులు పనిచేసి ఉండవచ్చు. కానీ అప్పుడు ఎల్వీ గారికి లోపల-బయట ఎవరూ మద్దతునివ్వలేదు. ఆయన కూడా ఎవరి సాయం కోరలేదు.  ఆయనకు కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువనుకుంటా. దానికితోడు ఆయన సామాజికవర్గం కూడా బలహీనమైనది. కానీ నిమ్మగడ్డది అలా ఎల్వీ మాదిరిగా మౌనంగా నిష్క్రమించే తత్వం కాదు.పైగా ఆయనకు బలమైన సామాజికవర్గం- దానికి సంబంధించిన మీడియా సహకారం ఉంది. కానీ ఎల్వీ గారు ఆరోజు పోరాడి ఉంటే, ఇప్పుడు నిమ్మగడ్డ పోరాటాన్ని ఎవరూ గుర్తించేవారు కాదు. ఏదేమైనా పోరాడే వారినే ప్రపంచం గుర్తిస్తుంద’ని సదరు అధికారి ఎల్వీ-నిమ్మగడ్డ మధ్య తేడాను వివరించారు.

మరికొందరు మాత్రం నిమ్మగడ్డను ప్రభుత్వం అసలు ఆపదవి నుంచే తొలగించిందని, ఎల్వీ పరిస్థితి అలా కాదని విశ్లేషిస్తున్నారు. సీఎస్ నియామకం పూర్తిగా సీఎం విచక్షణాధికారం కాబట్టి, న్యాయపోరాటం చేసినా ఫలితం ఉండదని, అదే డీజీపీని మారిన నిబంధన ప్రకారం రెండేళ్ల వరకూ తొలగించలేరని గుర్తు చేస్తున్నారు.