జూలై, అగష్టు, సెప్టెంబర్ నెలల్లో జన్మించిన వారి లక్షణాలు

0
54

జూలై నెలలో జన్మించిన వారి లక్షణాలు:
జూలై నెలలో జన్మించిన వారు పొడవరులు, గర్విష్టులు. సున్నితమైన మనస్తత్వం కలిగి సహజంగా ప్రతి విషయంలోను ఆవేశం పొందుతుంటారు. అయితే వీరిది క్షణిక ఆవేశము. కాని నిజమాలోచించి అటు పక్కకు తిరుగుదురు. హృదయము చాలా మంచిది. దయ, కారుణ్యము, ప్రేమ, వాత్సల్యము వీరికి సహజ గుణములు. ఒకరు చెప్పినట్లు నడుచుకొనుట వీరికి గిట్టదు. స్వతంత్ర భావములు మెండు. పొగడ్తలకు పొంగిపోదురు. ఇతరుల మనోగత విషయములను తెలిసికొనగల నేర్పరులై సమస్త కార్యములందు కార్యసాధకులు కాగలరు.

ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని అధికకాలం నిరీక్షింతురు. కుటుంబంనందు ప్రీతి, మిత్ర వాత్సల్యం, దైవభక్తి కలిగి మాతృసేవా తత్పరులగుదురు. ప్రకృతి సౌందర్యములందు ప్రీతి కలిగి ఉంటారు. వీరికి జీవితంలో ఒడిదుడుకులు తప్పవు. ఉత్తమ వంశములందు జన్మించి విద్యా, వినయ, ధన సంపదలు గల వారయ్యెదరు.

వీరికి ఆలోచనలు ఎగుడు దిగుడుగా సాగి ఆ తర్వాత అదృష్టవంతులు అవుతారు. ధనార్జన యందు, కుటుంబ విషయములందు తీరిక లేనివారై ఉంటారు. కుటుంబ సమస్యల్లో చివరికి జయము కలుగును. ఏ కార్యమునైనను కష్టపడి నిర్వహింపగలరు. వ్యాపారములో అనుకూలత తక్కువ. వీరి మనసులోని ఉద్దేశ్యములను త్వరగా వెల్లడి చేయలేరు. చారిత్రక సంఘటనలు, వీరోచితమైన కథలు, పురాణములంటే వీరికి అభిమానము.

వీరికి సుమారు 20 సంవత్సరాలు లేదా పాతికేళ్లలో అదృష్టము కలిసి వస్తుంది. 38 సంవత్సరము నుంచి బాగా అభివృద్ధికరంగా ఉంటుంది. తేలికగా జీర్ణించే పదార్థాలను వాడుతుండాలి. మాంసాహారము ఆరోగ్యానికి అంతగా సరిపడదు.

అగష్టు నెలలో జన్మించిన వారి లక్షణాలు:
అగష్టు నెలలో జన్మించిన జాతకులు పరిపుష్టమైన అవయవములతో నిండు కుండవలె తొణకక బెణకక ఉంటారు. శక్తి, ఉత్సాహము, ధైర్య సాహసములను కలిగి ఉంటారు. ఎలాంటి పనినైనా నిర్భయముగా చేస్తారు. వీరికి గర్వము, దర్పము, డాంబికము ఎక్కువగా ఉండును. ఉదారత, మానవత్వం, దృఢ నిశ్చయం వీరి సహజ లక్షణములు. స్వతంత్రించి జీవించేందుకు ఇష్టపడతారు.

తమ బాధ్యతలను గుర్తించి సక్రమంగా నిర్వహించగలే సత్తా కలవారు. వీరికి పెత్తనము చెలాయించే స్వభావము ఉంటుంది. దయాదాక్షిణ్యములు కలిగి ఉంటారు. అన్ని విషయాలలోనూ ప్రజ్ఞ సంపాదించగల దిట్టలు. పట్టుదల కలిగి ఉండే వీరు… సమయం వచ్చినప్పుడు శత్రువులైనానూ క్షమించగలరు.

వీరు ఉదార స్వభావము, ధార్మిక బుద్ధి గలవారు. నిగ్రహ శక్తి వీరికి ఎక్కువ. పనులను నిర్వహించడంలో పట్టుదలతో అనుకున్న గడువులోపే పూర్తి చేస్తారు. నిర్మొహమాటముగా, నిర్భయంగా మాట్లాడే ఈ జాతకులు పేరు ప్రతిష్టలకు ప్రాధాన్యత ఇస్తారు. తలకు మించిన పనులతో ఎప్పుడూ బిజీ బిజీగా కనిపించే వీరు ఆ పనులు లేనప్పుడు మందముగాను, విచారముగా కనిపిస్తారు. గొప్పవారితో పరిచయములు, విదేశ ప్రయాణాలుంటాయి.

ఈ నెలలో జన్మించిన జాతకులకు 11 నుంచి 17వ సంవత్సరము వరకు విద్యారంగమందు అభివృద్ధి ఉంటుంది. 24 ఏళ్ల తర్వాత వివాహం అవుతుంది. 37వ సంవత్సరము నుంచి అదృష్ట యోగ దశ ప్రారంభమగును.

 సెప్టెంబర్ నెలలో జన్మించిన వారి లక్షణాలు:
సెప్టెంబర్ నెలలో జన్మించిన జాతకులు కృషిని నమ్ముకుంటారు. వీరు మంచి వక్తలుగా గుర్తింపబడతారు. ఇక సొంత విషయాలలో సొంత ఆలోచనలనే నమ్ముతారు. వీరికి శరీర శుభ్రత తక్కువ, ఆలస్యముగా పనులు చేస్తారు. అయితే వీరిలో చురుకుదనం చాలా ఎక్కువ. దీంతో వీరి జీవితంలో మంచి అభివృద్ది ఉంటుంది.

ఉపకారబుద్ధితో సంఘసేవతో అంకితమై ఉంటారు. ఖర్చుచేయుటలో లోభత్వం చూపుదురు. అయితే మంచి విషయముల గురించి ప్రస్తావిస్తారు. ఆలోచనలను, పనులను వెంటనే కార్యరూపంలో ఉంచుతారు. వారి గృహములను అందంగా, ఆకర్షణీయంగా అలంకరించుకుంటారు.

మంచి అలవాట్లను కలిగి ఉంటారు. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు దగ్గరికి రాకుండా జాగ్రత్త పడాలి. సున్నితమైన మనస్తత్వం కావడం వల్ల వీరిని ఎన్నో విషయాలు మానసిక ఇబ్బందుకుల గురి చేస్తాయి. ఇతరుల ప్రవర్తన వల్ల పరిస్థితుల వల్ల మానసికంగా గాయపడతారు.

ఇక వీరికి బుధవారం, శనివారం కలిసి వస్తాయి. ఆకుపచ్చ, తెలుపు రంగు దుస్తులు మంచిది. గ్రీన్ కలర్ స్టోన్, డైమాండ్ ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది.

                                                             – చింతా గోపీ శర్మ సిద్ధాంతి 
లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం (భువనేశ్వరిపీఠం)
పెద్దాపురం, సెల్:- 9866193557