రాధాకృష్ణ..తప్పులో కాలేశారా?

1026

నోరు విప్పిన షర్మిల
( మార్తి సుబ్రహ్మణ్యం)

నిప్పు లేనిదే పొగరాదు. కానీ అసలు పొగ లేనిదే నిప్పు సృష్టించడమే ఆధునిక జర్నలిజంలో కనిపిస్తున్న అవలక్షణం. అందుకు ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ రాసిన షర్మిల సొంత పార్టీ- దానిపై ఆమె ఖండన వ్యవహారమే నిదర్శనం. తన అన్న జగన్ తనను పట్టించుకోనందుకు ఆగ్రహించిన చెల్లి షర్మిల.. తెలంగాణలో సొంత రాజకీయ పార్టీ స్థాపించడం ద్వారా, జగనన్నపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నది రాధాకృష్ణ వారాంతపు వ్యాస సారాంశం. తాను రాసిన కథనాన్ని సంచలనం రేపేందుకు, కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతల అభిప్రాయాన్ని, తన పత్రికలో ప్రముఖంగా వచ్చేలా కృషి చేసిన రాధాకృష్ణ కష్టం, పెద్దగా ఫలించినట్లు లేదు. మాజీలు తప్ప, తెలంగాణ ప్రముఖులెవరూ దానిని పట్టించుకున్నట్లు లేదని స్పందించిన వారి పేర్లు చూస్తేనే స్పష్టమవుతుంది. అదే షర్మిల తన అన్నపై పగ సాధించేందుకు ఏపీలోనే పార్టీ పెడుతున్నారని జోస్యం చెప్పిఉంటే, ఆర్కే కష్టానికి తగిన ఫలితం, వచ్చే ఉత్కంఠ వేరేలా ఉండేది, ఆర్కే మిస్సయింది అదే! ఆయన తప్పులో కాలేసింది అక్కడే!!

తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టి, తన అన్న జగన్‌పై ప్రతీకారం తీర్చుకోబోతున్నారన్న ఆర్కే కథనం ఆరోజు వరకూ ఆసక్తికరమే. విచిత్రంగా ఆంధ్రజ్యోతి రాసే ప్రతి కథనంపై వీరావేశం ప్రదర్శించే వైసీపీ సోషల్ మీడియా వీరాభిమానులు, అసలు ఆ కథనాన్ని పట్టించుకోకపోవడమే విచిత్రం. అంటే దానికి వైసీపీ ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో అర్ధమవుతుంది. అటు జగన్ మీద ఈగవాలినా సహించలేని ఏపీ బూతుల మంత్రి, అంబటి రాంబాబు వంటి వీరాభిమానులు కూడా దానిని పట్టించుకోకపోవడం మరో ఆశ్చర్యం. సలహాదారులతోపాటు, సాక్షి కూడా ఆ కథనాన్ని పట్టించుకోలేదంటే.. ఆ కథనంలో సరుకు ఎంత ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఆర్కే కథనంలో పేర్కొన్నట్లు… నిజంగా జగనన్న సంధించిన బాణానికి, అన్నపై అంత పగ ఉంటే, ఆమె అంత ఆగ్రహోదగ్రురాలయితే… ‘సొంత పార్టీ’ ఆలోచన సొంత రాష్ట్రం నుంచే చేస్తారు గానీ, పట్టు లేని పరాయి రాష్ట్రంలో కొత్త పార్టీ ఎలా పెడతారన్న కనీస స్పృహ, మెడపై తల ఉన్న ఎవరికయినా వస్తుంది. వైఎస్ కుమార్తెగా ప్రజల్లొ జగన్‌కు ఎంత ఆదరణ ఉందో, కుమార్తెగా షర్మిలకూ అంతే ఆదరణ ఉంది. అలాంటప్పుడు ఏపీలోనే సొంత పార్టీ పెట్టి,  వైసీపీని చీల్చడం ద్వారా, తన ప్రతీకారం తీర్చుకోవచ్చు కదా?  పైగా , జగన్ జైలులో ఉన్నప్పుడు ఆమె చేసిన 3 వేల కిలోమీటర్ల పాదయాత్రలో షర్మిల చేసిన అద్భుత ప్రసంగాలు గుర్తు చేసుకుంటే, అన్నకు వ్యతిరేకంగా పరాయి రాష్ట్రంలో పార్టీ పెట్టేంత, రాజకీయ అవగాహనా రాహిత్యనేత అని ఎవరూ అనుకోరు.

అయినా ఇప్పుడు జనం వైఎస్, ఎన్టీఆర్ వంటి ఆకర్షణ గల నేతలను మర్చిపోయి చాలాకాలమయింది. జగన్ కూడా తన తండ్రి పేరు పార్టీ పెట్టి, ఎన్నికల్లో పోటీచేసేంత వరకే ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తన సొంత ప్రతిభ-వ్యూహాలతోనే, అధికారంలోకి వచ్చిన వాస్తవాన్ని విస్మరించకూడదు. సూటిగా చెప్పాలంటే.. చంద్రబాబు-జగన్‌కు ఎన్టీఆర్-వైఎస్ పేర్లు ఒక్కసారి మాత్రమే ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత వారిద్దరూ తమ పనితీరుతో, ‘ఆ ఇద్దరినీ’ విజయవంతంగా మర్చిపోయేలా చేసుకున్నారు. ఆ పరిస్థితిలో షర్మిల ఇంకా వైఎస్ కార్డుతో, సొంత పార్టీ పెడతారన్న ఆలోచనే హాస్యాస్పదం.

పైగా.. తెలంగాణలో ఇప్పుడు  రాజకీయ శూన్యత లేదు. దుబ్బాక-గ్రేటర్ ఎన్నికల్లో దెబ్బతిన్నప్పటికీ, టీఆర్‌ఎస్ ఇప్పటికీ తిరుగులేని పార్టీనే. బండి సంజయ్ బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత, అది పంచకల్యాణి గుర్రాన్ని కూడా ఈర్ష్యపడే స్థాయిలో వేగంగా దూసుకుపోతోంది. సంజయ్‌కు ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ హోదా వచ్చేసింది. ఆయన ఎక్కడి వెళ్లినా చుట్టూ వందల మంది చేరిపోతున్నారు.

ద్యాసాగర్జీ,కిషన్‌రెడ్డి,లక్ష్మణ్ వంటి పెద్ద నేతలకు సాధ్యం కాని ఇమేజ్‌ను సంజయ్ సంపాదించుకున్నారు. ఇక కాంగ్రెస్ ఇంకా పూర్తిగా చతికిలపడలేదు. నాయకత్వ బలహీనమే తప్ప, పార్టీ బలహీనపడలేదన్నది విస్మరించకూడదు. దాని ఓటు బ్యాంకు దానికి ఉండనే ఉంది.  నేతలు వెళ్లినా,  క్యాడర్ బలం ఉన్న టీడీపీనే తెలంగాణనే నడిపించే నాధుడు లేక దిక్కులేకుండా పడి ఉంది.  ఈ కోణంలో చూస్తే, తెలంగాణలో మరొక కొత్త పార్టీకి అవకాశం లేదు.

మరి అలాంటి పరిస్థితిలో ఆంధ్రా మూలాలు ఉన్న షర్మిల తెలంగాణలో పార్టీ పెడితే,  దానిని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? కోదండరాం పెట్టిన తెలంగాణ పార్టీలనే ఆదరించని జనం, ఏపీ మూలాలున్న షర్మిల పెట్టే పార్టీని స్వాగతిస్తారా? ఇక ఆర్కే పేర్కొన్నట్లు, ‘వైఎస్ అభిమానులు-రెడ్ల కులం కోణంలో’చూసినా.. గ్రామాలను  శాసించే రెడ్డి ప్రముఖులు, టీఆర్‌ఎస్-కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. సహజంగా రెడ్లకు అధికారం ముఖ్యం. అధికారంలో ఉన్న పార్టీలోనయినా ఉంటారు. లేదా అధికారంలోకి వస్తుందని నమ్మకం ఉన్న పార్టీలోనయినా ఉంటారు తప్ప, గ్యారంటీ లేని, రిస్కు ఉన్న పార్టీల వైపు కన్నెత్తి చూడరన్న కనీస ప్రశ్నలు కూడా, రాధాకృష్ణ అంత సీనియర్ పాత్రికేయుడికి తట్టకపోవడమే వింత. ‘రాధాకృష్ణ మనసులో కోరిక నెరేవేరాలంటే’.. షర్మిల ఏపీలో పార్టీ పెడితే లాభం తప్ప, తెలంగాణ లో పెడితే ఏం ఉపయోగమో అర్ధం కాదు.

పైగా వైఎస్ కుటుంబ సన్నిహితులు, ప్రధానంగా కడపకు చెందిన వైసీపీ నేతలు చాలాకాలం నుంచీ ఒక విషయాన్ని ప్రైవేటు సంభాషణల్లో తరచూ పేర్కొన్నట్లు.. జగన్ కుమార్తెను, షర్మిల కుమారుడికిచ్చేందుకు ఎప్పుడో మాట కుదిరిందన్న ప్రచారం జరుగుతోంది. అది నిజమయినా, కాకపోయినా.. జగన్ తన కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తారన్నది బహిరంగ సత్యం. బహుశా తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల తాడేపల్లి నివాసానికి తరచూ రాకపోవడమే, రాధాకృష్ణ కథనానికి ప్రేరణ కలిగించి ఉండవచ్చు. అన్న అధికారంలోకి వచ్చినప్పటికీ,  పార్టీ కోసం కష్టపడిన చెల్లెలుకు రాజ్యసభ సీటు ఇవ్వకపోవడం కూడా,  బహుశా రాధాకృష్ణ కథనానికి మరో వస్తువు అయి ఉండాలి. ఇవన్నీ కాకపోతే.. అన్నకు షర్మిల దూరంగా ఉంటున్నందున, ఆ కుటుంబంలో కలతలు వచ్చిన ఫలితంగానే ‘జగనన్న సంధించిన బాణం ’,పార్టీ పెట్టాలన్న ఆలోచన చేసి ఉండవచ్చని ‘చీకట్లో వేసిన బాణం’గానయినా భావించాలి.

ఏదేమైనా.. తాను వైఎస్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఆంధ్రజ్యోతి రాసిన కథనాన్ని ఖండించిన షర్మిల, తాను పార్టీ పెట్టేది లేదని మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం వల్ల, రాథాకృష్ణ తన వాదాన్ని సజీవంగా ఉంచగలిగారు. అంటే.. షర్మిల తాను పెట్టడం లేదని ఎందుకు ఖండించలేదన్న మరో కొత్త లా పాయింటును లేవనెత్తే,  మరొక కొత్త అవకాశం షర్మిల,  ఆర్కేకు ఇచ్చిందన్నమాట!