గుండె గుండెలో రాముని గుడి..

313

అయోధ్య రామమందిర నిర్మాణానికి నిధిని సేకరించే నిమిత్తం శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు నిధి సేకరణ అభియాన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్నిచోట్ల ఈ నిధి సేకరణ అభియాన్ ప్రారంభమైంది. అలాగే మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా నిధి సేకరణ అభియాన్ ప్రారంభమైంది. రాష్ట్రంలో పలు చోట్ల పెద్ద ఎత్తున శోభాయాత్రలు నిర్వహించి వివిధ హిందూ సంఘాల కార్యకర్తలు ఈ అభియాన్ ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను కార్యకర్తలు కలిసి నిధిని సేకరిస్తున్నారు. ఈ క్రమంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన, సహకారం లభిస్తూ ఉండడం విశేషం. ఈ సందర్భంగా ఎన్నో అద్భుతమైన అనుభవాలను కార్యకర్తలు పొందుతున్నారు. పెద్దపెద్ద వ్యాపారులు, రాజకీయవేత్తలు శ్రీ రామచంద్రునిపై భక్తితో పెద్ద ఎత్తున నిధిని సమర్పిస్తున్న సంఘటనలు ఒక ఎత్తయితే అత్యంత నిరు పేదలు, యాచకులు కూడా రామమందిర నిర్మాణంలో తమ భాగస్వామ్యం కూడా ఉండాలని ప్రబలమైన ఆకాంక్షను వ్యక్తీకరిస్తూ తమ శక్తికి మించి నిధిని సమర్పిస్తున్న ఘటనలు కోకొల్లలు. ఎంతోమంది మహమ్మదీయ, క్రైస్తవ సోదరులు కూడా ఈ పవిత్ర, పుణ్య కార్యంలో పాలు పంచుకోవడానికి ముందుకొస్తూ ఉండడం విశేషం.రాష్ట్రంలో ఇంకా అనేక చోట్ల పెద్ద ఎత్తున శోభా యాత్రలు జరిగాయి. నిధి సేకరణ కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది.

-VSK ANDHRAPRADESH