అయోధ్య రామమందిర నిర్మాణానికి ఎంపీ సుజనా కుటుంబం రూ.2.2 కోట్ల విరాళం

225

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి తన తండ్రి యలమంచిలి జనార్ధనరావుగారి పేరు మీద తమ కుటుంబం తరపున 2 కోట్ల 2 లక్షల 32 వేల రూపాయలు విరాళం ప్రకటించారు. రామమందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణలో భాగంగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం విజయవాడలోని వెన్యూ కళ్యాణమండపంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ రామ మందిర నిర్మాణంలో భాగస్వాములం కావడం గర్వకారణమన్నారు. శ్రీరాముడిలాగా విలువలకు కట్టుబడి కష్టపడితే జీవితంలో మంచి స్థాయికి ఎదగవచ్చన్నారు. బిజెపి జాతీయ కార్యదర్శి వై..సత్యకుమార్ మాట్లాడుతూ 5 వందల సంవత్సరాల భారతీయుల కల సాకారం కాబోతోందన్నారు. ఇది ప్రపంచంలోని అన్ని దేశాల్లో భారతీయులు గర్వించే క్షణాలని, అందరూ ఎంతో ఉత్సాహంగా మందిర నిర్మాణానికి విరాళాలిచ్చేందుకు ముందుకు వస్తున్నారన్నారు. తన వంతు విరాళంగా రూ.5 లక్షల 116 ప్రకటించారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రూ.5 లక్షలు, సిసిఎల్ గ్రూప్ రూ.6 కోట్ల 39 లక్షలు, సిద్ధార్థ అకాడమీ తరపున రూ.15 లక్షలు విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో ఆరెస్సెస్ ప్రాంత సంచాలక్ భరత్ జీ, విహెచ్ పి జాతీయ సహ కార్యవహ్ రాఘవులు తదితరులు పాల్గొన్నారు.