‘స్థానిక’ బరిలో బీజేపీ రాష్ట్ర నేతలు

486

ప్రధాని చెప్పినట్లు అంతా పోటీ చేయాల్సిందే
జిల్లా అధ్యక్షుల సూచనకు సంఘ్ సుముఖం
గోదావరి  జిల్లాకు ‘సోము’ పంపిన జాబితాపై కొత్త ట్విస్ట్
మోదీ ఆదేశాలు ఏపీతోనే మొదలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో అధికారం సాధించాలన్న లక్ష్యంతో అడుగులేస్తున్న బీజేపీ.. అందులో భాగంగా తొలుత క్షేత్రస్థాయిలో,  నేతలను తయారుచేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఆ ప్రకారంగా రానున్న స్థానిక సంస్థలతోపాటు, భవిష్యత్తులో జరిగే మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర-జిల్లా కమిటీలలోని  నాయకులంతా తప్పనిసరిగా పోటీచేయాలన్న,  జిల్లా పార్టీ అధ్యక్షుల ప్రతిపాదనకు ఆర్‌ఎస్‌ఎస్ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆ మేరకు సంఘటనా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్‌కి తమ సూచనలు పంపినట్లు సమాచారం. ఆ ప్రకారంగా… ప్రతి ఒక్క రాష్ట్ర కమిటీ సభ్యుడు, కిందిస్థాయి ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనన్న ప్రధాని మోదీ ఆదేశాలను, తొలుత ఏపీనే అమలు చేయనుంది.

ఏపీలో పార్టీకి నేతలెక్కువ-కార్యకర్తలు తక్కువ కావడంతో, క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన నాయకత్వం లేకుండా పోయిందన్న ఆవేదన, కొన్నేళ్ల నుంచి బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఉన్న నాయకులంతా నియోజకవర్గ-జిల్లా- రాష్ట్ర-జాతీయ స్థాయి నేతలే కావడం, కార్యకర్తల సంఖ్య మాత్రం పరిమితంగా ఉంది. ఫలితంగా  పార్టీ నిర్వహించే ఆందోళన కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు పదుల సంఖ్యలో పేలవంగా ముగుస్తున్నాయి.  దీనితో ఏ ఎన్నికలొచ్చినా, పోటీ చేసే వారి కోసం అన్వేషించాల్సిన దుస్థితి కొనసాగుతోంది. గత ఎన్నికల్లో బ్రతిమిలాడి అభ్యర్ధులను నిలపాల్సిన పరిస్థితి ఏర్పడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.  అయినా కొన్ని నియోజకవర్గాల్లో తప్ప, రాష్ట్రంలోని మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులను నిలబెట్టడమే గొప్ప అని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

రాష్ట్రంలో తాజాగా మారిన రాజకీయ పరిస్థితులో  పార్టీ.. క్షేత్రస్థాయిలో బలం పెంచుకోకుండా, ఇంకా కేవలం మీడియాకే పరిమితం కావడం, పెత్తనం చేసే నేతల సంఖ్య ఎక్కువయిపోవడాన్ని గ్రహించిన జిల్లా అధ్యక్షులంతా, తాజాగా సంఘ్‌కు ఒక ప్రతిపాదన పంపారు. సోము వీర్రాజు నాయకత్వం,  తమ జిల్లాకు  పంపిస్తున్న జిల్లా ప్రధాన కార్యదర్శుల జాబితాలోని నేతలతోపాటు, తమ జిల్లాకు చెందిన రాష్ట్ర కార్యవర్గసభ్యులను రానున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయించాలని సంఘ్‌కు ప్రతిపాదన పంపారు.  ఆ ప్రకారంగా రాష్ట్ర కమిటీ లో పనిచేసే ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నుంచి కార్యవర్గ సభ్యులవరకూ.. ప్రతి ఎన్నికల్లో పోటీకి దిగేలా చూస్తే, స్థానికంగా పార్టీకి గట్టి నాయకత్వం లభిస్తుందని ఆర్‌ఎస్‌ఎస్‌కు సూచించారు. దీనివల్ల నేతలు ఎక్కడికక్కడ పనిచేసే వాతావరణం ఏర్పడుతుందని, జిల్లా అధ్యక్షులు  తమ ప్రతిపాదనలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఏదైనా పెద్ద కార్యక్రమానికి పిలుపునిస్తే, నేతలంతా కట్టకట్టుకుని అక్కడికి వెళుతుంటే, ఇక స్థానికంగా నాయకత్వం ఎక్కడ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ‘అదే ఎక్కడికక్కడ నాయకులను తయారుచేస్తే, రాష్ట్రవ్యాప్తంగా అందరం కట్టకట్టుకుని అక్కడికి వెళ్లాల్సిన పని ఉండదు కదా? ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికకు రాష్ట్రం నలుమూలల నుంచి 200 మంది కార్యకర్తలు ప్రచారానికి వెళుతున్నారు. అదే అక్కడే స్థానికంగా నాయకులను తయారుచేసి ఉంటే, వారే కార్యకర్తలను తయారుచేసుకునేవారు. అప్పుడు ఇప్పటిమాదిరిగా ఇతర ప్రాంతాల నుంచి ప్రచారానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇదే అంశంపై పంపిన ప్రతిపాదనలకు సంఘ్ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇది శుభపరిణామమ’ని ఓ జిల్లా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.

పైగా దీనితో రాష్ట్ర-జిల్లా కమిటీల్లో పలువురు నేతల సిఫార్సులతో వచ్చిన నేతల సత్తా ఏమిటి? స్థానికంగా వారికి ఎంత పలుకుబడి ఉందో  ఎన్నికల్లో తెలిసిపోతుందని జిల్లా అధ్యక్షులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర కమిటీలో, ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా ఉన్న వారి సంఖ్యనే ఎక్కువని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి, సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేందుకు తాము చేసిన ప్రతిపాదనలను, సంఘ్ ఆమోదించడం సంతోషంగా ఉందని జిల్లా అధ్యక్షులు చెబుతున్నారు. రాష్ట్ర కమిటీలో ఉన్న ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి వంటి అగ్రనేతలంతా ఎన్నికల్లో పోటీ చేస్తే, ప్రజలంతా పార్టీ వైపు ఆసక్తిగా చూస్తారని, అధికార యంత్రాంగం కూడా బీజేపీ అగ్రనేతలు పోటీ చేస్తున్నందున, జాగ్రత్తగా పనిచేస్తారని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

కాగా, గోదావరి జిల్లాల కమిటీలో కొందరి పేర్లు సూచిస్తూ, సోము వీర్రాజు నాయకత్వం ఇటీవల ఒక జాబితా పంపింది. అయితే.. దానిని పరిగణనలోకి తీసుకోని జిల్లా నాయకత్వం… వారందరినీ, రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులుగా ప్రకటించాలని, రాష్ట్ర నాయకత్వానికి తిరుగు సిఫార్సు చేయడం ఆసక్తికరంగా మారింది. ‘రాష్ట్ర నాయకత్వం దృష్టిలో వారంతా సమర్ధులయినందున, వారిని సర్పంచులుగా పోటీ చేయించి, ఆయా గ్రామాల్లో పార్టీకి పునాదులు వేయాలని’ గోదావరి జిల్లాల నాయకత్వం, తాజాగా రాష్ట్ర నాయకత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. రాష్ట్ర నాయకత్వం కొద్దిరోజుల క్రితం పంపిన ప్రధాన కార్యదర్శుల జాబితాను, చాలామంది జిల్లా అధ్యక్షులు ఆమోదించకుండా, పక్కనపెట్టడం కూడా పార్టీలో చర్చనీయాంశమయింది. రాయలసీమలోని జిల్లా అధ్యక్షులు కొందరు,  రాష్ట్ర నాయకత్వం పంపిన ‘ప్రధాన కార్యదర్శుల జాబితాను’ పక్కనబెట్టడం వివాదంగా మారింది. నిజానికి, రాష్ట్ర-జిల్లా కమిటీ నేతలంతా ఎన్నికల్లో పోటీచేయాలన్న జిల్లా అధ్యక్షుల ప్రతిపాదనకు, గోదావరి జిల్లాకు రాష్ట్ర నాయకత్వం పంపిన సిఫార్సు లేఖనే ప్రేరణ అని  పార్టీ సీనియర్లు చెబుతున్నారు.

రాష్ట్ర-జిల్లా కమిటీలో ఉన్న నేతలంతా ఎన్నికల్లో పోటీ చేయాలనే విధానం,  పార్టీ బలోపేతానికి పనికివస్తుందని బీజేపీ రాష్ట్ర నేత కామర్సు చిరంజీవి వ్యాఖ్యానించారు. ‘జిల్లా-రాష్ట్ర కమిటీలోని నేతలను వారి స్వగ్రామం, పట్టణం నుంచి పోటీ చేయించే ఆలోచన చాలా మంచిది. వారు కూడా నాయకత్వం ఇచ్చిన పదవులు-బాధ్యతలకు న్యాయం చేయాల్సి ఉంటుంది. ఈవిధంగా అగ్రనేతలు సహా మిగిలిన నేతలంతా ఎన్నికల్లో పోటీకి దిగితే,  కార్యకర్తల్లో ఉత్సాహంతోపాటు, గ్రామ స్థాయిలో కొత్త కార్యకర్తలు తయారవుతార’ని చిరంజీవి విశ్లేషించారు. సోషల్‌మీడియాలో ఆయన చేసిన సూచనలకు పెద్ద ఎత్తున స్పందన రావడం విశేషం.