ఏపీ గొంతులో ‘గుజరాత్’ వెలక్కాయ!

564

గుజరాత్‌లో ఫిబ్రవరిలో ‘స్థానిక’ ఎన్నికలకు నోటిఫికేషన్
సంకటంలో  సర్కారు, ఉద్యోగ సంఘాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ  రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..  సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ సర్కారుకు, గుజరాత్ ఎన్నికల నోటిఫికేషన్ సంకటంగా మారింది. దీనితో వ్యాక్సిన్ పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలు వద్దంటున్న సర్కారు, వ్యాక్సిన్ లేకుండా విధులు నిర్వహిస్తే తమ ప్రాణాలకు ప్రమాదమని వాదిస్తున్న ఉద్యోగ సంఘాలు,  ‘సాంకేతిక సంకటం’లో పడ్డాయి. ప్రధాని మోదీ స్వంత రాష్ట్రంలో కూడా, వాక్సిన్ ఇస్తున్న తరుణంలోనే ఎన్నికలు జరుపుతున్నందున, అవే స్థానిక సంస్ధల ఎన్నికలు ఏపీలో నిర్వహిస్తే తప్పేమిటన్న కొత్త ప్రశ్న తెరపైకి వచ్చింది. అలాగని గుజరాత్‌లో వెలువడిన నోటిఫికేషన్‌ను, ప్రభుత్వం గానీ, ఉద్యోగ సంఘాలు గానీ విమర్శించలేని సంకట స్థితి నెలకొనడం ఆసక్తికలిగిస్తోంది.

గుజరాజ్‌తో రెండు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు, ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం నోటిఫికే షన్ జారీ చేసింది. ఫిబ్రవరి 21, 28వ తేదీల్లో అహ్మదాబాద్‌లోని 6 మున్సిపల్ కార్పొరేషన్లు, రాష్ట్రంలోని 81 మున్సిపాలిటీలు, 231 తాలూకా-31 జిల్లా పంచాయతీలకు రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయని, శనివారం గుజరాత్ ఎన్నికల సంఘం, నోటిఫికేషన్ జారీ చేసింది.

గుజరాత్ ఎన్నికల సంఘం అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు పచ్చజెండా ఊపడంతో, ఏపీలో స్థానిక ఎన్నికలను వ్యతిరేకిస్తున్న అధికారపార్టీ-ఉద్యోగ సంఘాల వాదనను త్రోసిపుచ్చుతున్న విపక్షాలకు, నైతికస్థైర్యం వచ్చినట్టయింది. గుజరాత్‌లో కూడా వ్యాక్సిన్ ప్రక్రియ మొదలయింది. వ్యాక్సిన్ ప్రక్రియ రెండోదశకు చేరుకున్న వేళ, ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఏపీ సర్కారు అటు హైకోర్టు, ఇటు ఎస్‌ఈసీకి స్పష్టం చేసింది. ఉద్యోగ సంఘాలు కూడా, వ్యాక్సిన్ తీసుకోకుండా విధులకు హాజరయ్యే సమస్య లేదని వాదిస్తూ కోర్టుకెళ్లాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌లో స్థానిక ఎన్నికల సమరానికి నగారా మోగడంతో, ఏపీ సర్కారు-ఉద్యోగ సంఘాలు చిక్కుల్లో పడినట్టయింది.

ఎన్నికలను సమర్ధిస్తున్న విపక్షాలకు మాత్రం, గుజరాత్ ఎన్నికల నోటిఫికషన్ అస్త్రంగా మారింది. ప్రధాని రాష్ట్రమైన గుజరాత్‌లో ఎన్నికలు నిర్వహిస్తుండగా లేని అభ్యంతరాలు, ఏపీ ప్రభుత్వానికి ఎందుకన్న ప్రశ్నలు సంధించేందుకు ఒక ‘సాంకేతిక అంశం’ విపక్షాల అమ్ములపొదిలో కొత్తగా చేరినట్టయింది. ప్రధానంగా ఈ వ్యవహారం  ఉద్యోగ సంఘాలను చిక్కుల్లో పడేసింది. గుజరాత్ ఎన్నికలను అక్కడి రాష్ట్ర ఉద్యోగ సంఘాలేమీ, వ్యతిరేకిస్తూ ఇప్పటిదాకా మీడియాకెక్కలేదు. బహిరంగంగా అభ్యంతరం కూడా వ్కక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో విధులు నిర్వహించేందుకు గుజరాత్ ఉద్యోగులకు లేని అభ్యంతరాలు,  ఏపీ ఉద్యోగ సంఘాలకు ఎందుకన్న ప్రశ్నలు ఎదురయితే,  వాటికి ఏం సమాధానం చెప్పాలో తెలియని సంకట పరిస్థితి.

ఇటు సర్కారు కూడా.. ప్రధాని రాష్ట్రంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నందున, ఏపీలో తాము వాటిని వ్యతిరేకించే విధానంపై, పునరాలోచనలో పడక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది. మోదీ సొంత రాష్ట్రంలోనే ఎన్నికలు నిర్వహిస్తుంటే, జగన్ ఏపీలో ఎందుకు నిర్వహించడం లేదని బీజేపీ కొత్త విమర్శలు సంధించే అవకాశం కూడా లేకపోలేదు. ఏదేమైనా.. ఈ పరిణామం అటు ఎస్‌ఈసీకి, ఇటు విపక్షాలకు ఊరటనిచ్చే అంశమేనన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.