అన్నదాన ప్రభువు శ్రీ కాశీనాయన

584

గురుమధ్యే స్థితం విశ్వం
విశ్వమధ్యే స్థితోర్గురుః|
గురుర్విశ్వం నచాన్యోస్తి
తస్మై శ్రీ గురవే నమః||
||గురు గీత||

సర్వ జగత్తు శ్రీ గురు పరబ్రహ్మ మధ్యయందుండును. సమస్త జగమునూ గురు స్వరూపమే. మరియొక వస్తువు లేదు. సకలాత్మక పరబ్రహ్మ స్వరూపమగు గురుదేవునికి నమస్కరిస్తున్నాను.

భారతదేశము పుణ్యభూమి. ఎందరో మహానుభావులు జన్మించి, ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టిన మహోన్నతమైన పవిత్రభూమి. భగవత్ తత్వానికి తలమానికమైతే, సద్గురు తత్వానికి పరాకాష్ఠ ఈ భారత భూమి.

తమ సంకల్పం చేత పంచభూతాలను ఆజ్ఞాపించగల మహనీయులు ఎందరో ఈ భరత భూమిపై నడయాడారు.అలాంటి మహనీయులలో నెల్లూరు జిల్లా,సీతారామపురం మండలం,బెడుసుపల్లి గ్రామములో జన్మించిన సద్గురు కాశిరెడ్డి నాయన గారు ఒకరు.

కడప జిల్లా ముదిరెడ్డిపల్లె గ్రామంలో వర్షాలు లేక పశువుల మేతకు గడ్డి కూడా లేక అల్లాడే సమయంలో కాశినాయన ఆ ప్రాంతాన్ని చేరుకున్నారు. ఆ సమయానికి అక్కడ పేద రైతులు వర్షాలు లేక ఎండి పోయి ఉన్న వరి పైరు కోసి పశువులకు మేతగా వేస్తుండడం చూసి నాయన గారు ఏమిటిది? అని అడిగారు. వర్షాలు లేక కనీసం పశువుల కడుపు అయినా నిండుతుంది కదా అని అలా చేస్తున్నామని రైతులు నాయన గారితో తమ గోడును చెప్పుకున్నారు. దీనుల పాలిట కల్పవృక్షము, దయాళువు అయిన కాశినాయన గారు వారిని అనుగ్రహించదలచి వెంటనే గంపలను తీసుకుని గంగమ్మ తల్లి దగ్గరకు వారినందరినీ రమ్మని చెప్పారు. పెండ్లి కాని బ్రహ్మచారులగు ఆడ, మగ పిల్లలందరినీ వారధిలా చెరువు క్రింద బావి దగ్గర నుండి గంగమ్మ తల్లి గుడి వరకు నిలబెట్టి నూట ఎనిమిది కడవల నీటితో అభిషేకం చేయించి అమ్మవారికి పొంగళ్లు నివేదన చేసి రండని చెప్పి నాయన గారు లింగమయ్య కొండకు బయల్దేరారు. ఆ రాత్రి బ్రహ్మాండంగా వర్షం కురిసింది.

కుండపోతగా కురిసిన ఆ ఒక్క వర్షానికే సమీపంలోని కుంటలు, చెరువులు అన్ని నిండుకున్నాయి. నాయన గారు తెల్లవారక ముందే లేచి తన శిష్యుడయిన బుగ్గయ్య స్వామితో “ముదిరెడ్డిపల్లి జనం వస్తారు. మనకు పూజలు పునస్కారాలు అంటారు. కావున మేము ఇచట ఉండకూడదు” అని చెప్పి అక్కడ నుండి బయలుదేరి వేరే గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులంతా ఉదయం లింగమయ్య కొండ చేరుకొని నాయన గారు లేకపోయినా నాయన గారికి తమ మనసులో కృతజ్ఞతలు తెలుపుకుని తిరుగు పయనమయ్యారు.

సనాతన భారతీయ హైందవ సంస్కృతికి గోపురం, గోకులం, గురుకులాలు పట్టుగొమ్మలు. ఆ వ్యవస్థలను నాయన గారు తమ ఆశ్రమాలలో యధాతధంగా ఆచరించి చూపారు.

గోకులం : నాయన గారి ఆశ్రమాలలో అనేక గోశాలలు నిర్వహింపబడుతూ గోమాతల పోషణ చక్కగా నిర్వహించబడుతూ ఉన్నాయి.

గోపురం : వేయి నూతన దేవాలయాలు నిర్మిస్తే కలిగే ప్రయోజనం కన్నా, ఒక్క జీర్ణ ఆలయాన్ని ఉద్ధరిస్తే కలిగే ప్రయోజనం, ఫలితం ఎక్కువ అని పెద్దలు చెప్పినట్లే ఎన్నో పురాతన ఆలయాల్ని కాశి నాయన గారు జీర్ణోద్ధరణ చేశారు. వారి శిష్యులు నేటికీ చేస్తూనే వున్నారు.

గోకులం : ఉచిత విద్యతో పాటు, ఉచితంగా విద్యా సామాగ్రి అందిస్తూ మధ్యాహ్న భోజన సదుపాయంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కాశినాయన పాఠశాల భావి భారత పౌరులను అందిస్తూ ఉంది.

కాశినాయన గారు నెల్లూరు జిల్లా,సీతారామపురం మండలం,బెడుసుపల్లి గ్రామము నందు శ్రీ మున్నెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మ పుణ్యదంపతులకు జన్మించారు. కాశినాయనకు నాలుగు సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు తండ్రి సుబ్బారెడ్డి గారు అకాల మృత్యువాత పడినారు. కొద్ది రోజులకు తల్లి కాశమ్మ కూడా మరణించెను. కాశినాయన తన అవ్వ తాతల దగ్గర పెరిగి పెద్దవాడయ్యారు.తమ కుటుంబమును చేరదీసి ఆదరించిన మేనమామలకు కృతజ్ఞతతో వారి పొలములో చక్కని వ్యవసాయ ఫలమును అందించుచూ ఎంతో నైపుణ్యంతో మొండి గిత్తలను కూడా అదిలించక బెదిరించక వాటిని ఎంతో ప్రేమతో నిమురుతూ వాటితో దుక్కి దున్ని గొర్రుపెట్టి విత్తనము వేసి తమ పవిత్రమైన హృదయంతో వ్యవసాయము ఎంతో అభివృద్ధి చేసి మేనమామ యొక్క ఆదరాభిమానాలకు పాత్రులైనారు. భవిష్యత్తులో జగద్గురువులై ఎన్నో జీవితాలను పండించే వారికి ఇదొక లెక్కా?

 

కాశినాయన ఆశ్రమం, జ్యోతి

గ్రామంలోని మిగతా రైతులు కొంత మంది దీనికి అసూయపడి తమ పొలం పనులకు రమ్మని, ఎక్కువ ప్రతిఫలమైననూ ఇస్తామని చెప్పినా నాయన గారు అట్లా అడిగిన వారిని సున్నితంగా తిరస్కరించేవారు. ఆ సమయంలో అచ్చట దగ్గరగా ఉన్న లింగాలదొన, ఘటిక సిద్దేశ్వరం ప్రాంతముల నుండి నలుగురు మోసే గడ్డిని తానొక్కడే తెచ్చేవారు. గడ్డి తెచ్చేటప్పుడు కొండ దిగి రాగానే లింగాల దొనలోని వేపచెట్టు దగ్గర గడ్డిమోపు దించి సేద తీర్చుకునేవారు. వేపచెట్టు క్రిందనే నాయనగారికి ఏదో ఒక మానసిక పరివర్తన ఆధ్యాత్మిక స్థితి కలిగేది. నాయన గారి సూచన మేరకు ప్రస్తుతం అక్కడ చక్కటి అరుగును ఏర్పరిచారు.

ప్రకాశం జిల్లా వెలిగండ్ల గ్రామానికి చెందిన శ్రీ అతిరాచ గురవయ్య గారి వద్ద నాయన గారు శిష్యరికం చేశారు.

కాశినాయన గురుచరిత్రలో దత్తాత్రేయుల వారు ప్రదర్శించిన విధంగా విచిత్రమైన భాష, రకరకాల కట్టు,మాంసాహార భక్షణ, వీరభావ ప్రదర్శన, అదే సమయంలో వాటన్నింటికీ అతీతంగా ఉండటం చేసేవారు. పై ప్రవర్తనను బట్టి వారిని దత్తాత్రేయుని అంశగా భావించారు కొంతమంది భక్తులు.

కాశినాయన గారు అనేక ఆశ్రమాలను స్థాపించారు

నవనారసింహ స్వామి దేవాలయం, హనుమద్ గిరి, గరుడాద్రి, యోగానంద, చత్రవట,పాపులమ్మ మఠము, అత్తాకోడళ్ళ సత్రము, ఘటిక సిద్దేశ్వరం ఆశ్రమము, లింగమయ్య కొండ, కలుగొట్ల, గని భానుమండల లక్ష్మీ నారాయణ దేవాలయం, పల్లేశ్వరం, సీతారామపురం ఇంకా ఎన్నెనో ఆశ్రమాలను నెలకొల్పి, బావులను త్రవ్వించి, కోనేరుల పూడిక తీస్తూ బోర్లను వేయిస్తూ, అనేక తోటలను నాటిస్తూ, అర్హులైన వారి సమాధులకు నీడ కల్పిస్తూ, క్షణం తీరిక లేకుండా నిద్రాహారాలు లేకుండా ఎన్నో మహత్తర కార్యక్రమాలను కొనసాగించారు. నాయన గారి ఆశ్రమాల్లో నిరంతర అన్నదాన యజ్ఞం ఒక ప్రత్యేకత.
ఓం శ్రీమ్ సద్గురుం తం నమామి.

                  – రచన : ధన్వి శ్రీనివాస్