పీఠాథిపతులు ధార్మిక పరిషత్‌పై పెదవి విప్పరేం?

654

పాలకులపై ఒత్తిడి తీసుకురాని ఆ ఇద్దరు  ‘రాజగురువులు’
అధికారుల పెత్తనం పోతుందనే అడ్డంకులు? 
తెలుగు రాష్ట్రాల్లో తెరవు లేని ధార్మిక పరిషత్
( మార్తి సుబ్రహ్మణ్యం)

రాష్ట్ర విభజనకు ముందు వరకూ కొనసాగిన ధార్మిక పరిషత్‌ను పునరుద్ధరించాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు చేసిన డిమాండ్,  ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలోని హిందూ సంస్థల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఏపీ-తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులకు రాజగురువులుగా ఉన్న ఇద్దరు పీఠాథిపతులు, ధార్మిక పరిషత్‌పై పెదవి విప్పకపోవడంపై, హిందూ సంస్థల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పాలకుల నుంచి అన్ని రకాల సౌకర్యాలు, రాచమర్యాదలు అందుకుంటున్న సదరు  పీఠాథిపతులు, ధార్మిక పరిషత్ కోసం పాలకులపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు దేవాలయ వ్యవస్థపై  తమ పెత్తనం పోతుందన్న భయంతోనే ఐఏఎస్‌లు ధార్మిక పరిషత్తుకు మూకాలడ్డుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ధార్మిక పరిషత్‌కు ఊపిరిపోశారు. రాష్ట్ర విభజన జరిగేంత వరకూ పరిషత్ ఉనికిలో ఉండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది ఆటోమేటిక్‌గా రద్దయిపోయింది. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దానిని కొనసాగించలేదు. అయితే, ఏపీ దేవాదాయ శాఖ చట్టాన్ని యధాతథంగా అడాప్టు చేసుకున్న తెలంగాణ రాష్ట్రం, ఆ చట్టంలో భాగమైన దార్మిక పరిషత్‌ను మాత్రం ఇప్పటిదాకా ఏర్పాటుచేయకపోవడంపై,  హిందూ-ధార్మిక  సంస్థల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2014 ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. నిర్మల్‌లో జరిగిన బహిరంగసభలో ధార్మికపరిషత్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత  దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న  ఇంద్రకరణ్‌రెడ్డి కూడా,  ధార్మిక పరిషత్తుకు సంబంధించిన ఫైల్ సీఎంఓకు పంపించామని ప్రకటించారు. కొద్దికాలం క్రితమే అర్చకులకు వేతనాలు పెంచిన సందర్భంలో,  వారంతా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అప్పుడు కూడా ఆయన త్వరలో ధార్మిక పరిషత్ ఏర్పామటుచేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకూ అవేమీ కార్యరూపం దాల్చలేదు. అటు ఏపీలో మాజీ సీఎం చంద్రబాబునాయుడు కూడా తన హయాంలో  ధార్మిక పరిషత్ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వలేదు.

దివంగత వైఎస్ సీఎంగా ఉండగా, దేవాదాయ, దర్మాదాయ చట్టం 1987లో మార్పులు తీసుకువచ్చారు. ఆ తర్వాత 33/2007 అమలులోకి వచ్చింది. రోశయ్య సీఎంగా ఉండగా 2009 డిసెంబర్‌లో తొలిసారి ధార్మిక పరిషత్ ఏర్పాటయింది. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉండగా, 2014 ఫిబ్రవరిలో రెండోసారి ఏర్పాటయింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో, రెండు తెలుగు రాష్ట్రాలు ధార్మికపరిషత్తును తిరిగి పునరుద్ధరించలేదు. దీనిపై తెలంగాణ అసెంబ్లీలో అప్పటిమంత్రి ఇందకరణ్‌రెడ్డి సభలో చేసిన ప్రకటన, ఇప్పటివరకూ అమలుకు నోచుకోలేదు. మళ్లీ ఇప్పుడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు,  ఏపీలో దివంగత వైఎస్ తీసుకువచ్చిన ధార్మికపరిషత్తును తిరిగి పునరుద్ధరించాలంటూ సీఎం జగన్‌కు లేఖ రాశారు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల హిందూ- ధార్మిక సంస్థలలో చర్చ మొద లయింది.

నిజానికి దేవాదాయ ధర్మాదాయ చట్టం 152 ప్రకారం,  ధార్మిక పరిషత్ ఏర్పాటుచేయాల్సి ఉంది. దానికి అనుగుణంగానే 2009లో ఒకసారి, 2014లో మరొకసారి పరిషత్ ఏర్పాటయింది. ఈ పరిషత్ వల్ల ఆలయాల పరిపాలన, అభివృద్ధి, ఉద్యోగుల  సంక్షేమంపై అనధికారులతో కూడిన కమిటీనే అన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. దీనికి దేవాదాయ శాఖ మంత్రి చైర్మన్‌గా, మరో 30 మందిని సభ్యులుగా ఉంటారు. వీరిలో  ప్రభుత్వం నుంచి నలుగురు అధికారులతోపాటు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు కూడా సభ్యులుగా ఉంటారు. ఒక్కముక్కలో చెప్పాలంటే, ధార్మిక పరిషత్ ఏర్పాటయితే దేవాలయాలపై ప్రభుత్వ జోక్యం- పెత్తనం గణనీయంగా తగ్గిపోతుంది.

అయితే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ధార్మిక పరిషత్తును ఏర్పాటుచేయకపోవడానికి, అధికారులే కారణమన్న విమర్శలు హిందూ సంస్థల నుంచి వినిపిస్తున్నాయి. పరిషత్తు ఏర్పాటయితే, దేవాలయ వ్యవస్థపై తమ పెత్తనం పోతుందన్న భయంతోనే అధికారులు, పాత వ్యవస్థను పునరుద్ధరించకుండా అడ్డుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం ఐఏఎస్‌ల రాజకీయం వల్లనే గత ఏడేళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ధార్మిక పిరషత్ ఏర్పాటు కావడం లేదని దేవాలయ పరిరక్షణ సమితి ఆరోపిస్తోంది.

‘ధార్మిక పరిషత్తు ఏర్పాటయిన తర్వాత కమిషనరు, జెసి, ఈఓల పెత్తనం నామమాత్రమవుతుంది. అర్చకులు, ఉద్యోగులు అధికారుల దయాధర్మాలపై ఆధారపడనవసరం ఉండదు. అందుకే అధికారులు సాకులతో పరిషత్తుకు మోకాలడుతున్నారు. వైఎస్ తీసుకువచ్చిన ఈ వ్యవస్థను ఆయన కుమారుడైన జగన్ కూడా, ఏపీలో పునరుద్ధరించకపోవడమే విచారకరం. దీనిపై పీఠాథిపతులు పెదవి విప్పాల్సిన సమయం వచ్చింది. రాజగురువులు పాలకులపై ఒత్తిడి తీసుకురావాలి. పీఠాధిపతులు తమ స్వప్రయోజనాలు చూసుకుంటున్నారన్న విమర్శలున్నందున, దాన్ని తొలగించుకునేందుకు ధార్మిక పరిషత్తు పునరద్ధరణే మార్గం. పాలకులకు దగ్గరగా ఉండే పీఠాథిపతులు పీఠాల ఆస్తులు పెంచుకోవడం మాని, ఇలాంటి ధర్మకార్యాలకు తమ పలుకుబడి వినియోగిస్తే బాగుంటుంద’ని దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ ద్రోణంరాజు రవికుమార్ వ్యాఖ్యానించారు. ఏపీలో విశాఖ పీఠాథిపతి స్వరూపానంద, తెలంగాణలో చినజీయర్‌స్వామి సీఎంలకు రాజగురువులుగా ఉన్నప్పటికీ, ధార్మికపరిషత్ పునరుద్ధరణపై వారిద్దరూ ఎందుకు మాట్లాడటం లేదని, ఆ మేరకు తమ శిష్యులయిన ఇద్దరు సీఎంలను ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు.

పీఠాథిపతులు ఎవరి ఆధీనంలో, ఎవరి స్వాధీనంలో పనిచేస్తున్నారో అర్ధం కావడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘ స్వయంగా రథయాత్ర-పాదయాత్ర అంటున్న స్వాములు అక్కడికి వెళ్లిన తర్వాత, ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు. కనీసం పాలకులపై ధర్మాగ్రహం కూడా వ్యక్తం చేయడం లేదు. నిజాలను బహిరంగపరచలేకపోతున్నారు. బయటకు చెప్పడం లేదు. మరి వీరి యాత్రల వల్ల భక్తులు-ఆలయాలకు కొత్తగా ఇచ్చే భరోసా ఏమిటి? అని రవికుమార్ ప్రశ్నించారు.