స్థానికం’పై బాబు చేసిన తప్పే…జగన్ చేస్తున్నారా?

0
202

సమరానికి ఇదే సమయమంటున్న  వైసీపీ సీనియర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

పుష్కలమైన వనరులు, చేతిలో అధికార యంత్రాంగం, ప్రతి కుటుంబానికీ చేరిన సంక్షేమ పథకాలు ఉంచుకుని కూడా.. స్థానిక సంస్థల ఎన్నికలకు తమ పార్టీ నాయకత్వం ఎందుకు భయపడుతోందో తమకు అర్ధం కావడం లేదన్న ఆశ్చర్యం వైసీపీ సీనియర్లలో  వ్యక్తమవుతోంది. ఈ విషయంలో గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన పొరపాటునే తమ అధినేత జగన్ కూడా చేస్తున్నారని వైసీపీ సీనియర్లు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఫలితాలను, ప్రభుత్వ పనితీరుకు పరీక్షగా భావిస్తే.. ఆ ఫలితాల ప్రకారం,  వ్యూహం మార్చుకునే అవకాశాన్ని జగన్ సర్కారు పోగొట్టుకుంటోందన్న అభిప్రాయం పార్టీ సీనియర్లలో వ్యక్తమవుతోంది.

అసలు ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆర్ధికంగా-రాజకీయంగా బలహీనంగా ఉన్న సమయంలో, దానిని  దెబ్బతీసే అవకాశాన్ని పార్టీ నాయకత్వం ఎందుకు వదులుకుంటుందో అర్ధం కావడం లేదన్న ఆశ్చర్యం, అటు వైసీపీ నియోజకవర్గ స్థాయి నేతల్లోనూ వ్యక్తమవుతోంది.  నిమ్మగడ్డ రమేష్ ఎస్‌ఈసీగా ఉన్నంత కాలం, స్థానిక ఎన్నికలు జరగకూడదన్న ‘అనవసర ప్రతిష్ఠ’కు వెళుతున్నట్లు కనిపిస్తోంది తప్ప, క్షేత్ర స్థాయిలో టీడీపీ బలహీనతను తమ నాయకత్వం సద్వినియోగం చేసుకునేందుకు, ప్రాధాన్యం ఇస్తున్నట్లు లేదన్న వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

నిమ్మగడ్డను దృష్టిలో ఉంచుకుని,  స్థానిక సంస్థల నిర్వహణ అంశంపై అనవసర ప్రతిష్ఠకు వెళ్లడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్న అభిప్రాయం, పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన తర్వాత, నియోజకవర్గ స్ధాయిలో టీడీపీ నేతలు సగానికిపైగా తమ పార్టీలోకి చేరగా, మిగిలిన వారు స్తబ్దుగా ఉన్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో అధికారం చెలాయించిన అగ్రనేతలంతా, ఓడిపోయిన తర్వాత హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటుండగా, ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
చాలా నియోజకవర్గాల్లో  స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల ఒత్తిళ్ల మేరకు, టీడీపీ నియోజకవర్గ స్థాయి నేతలు ఉన్న వ్యాపారాలు కూడా వదిలేసుకున్నారు. ఇంకొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలతో సర్దుకుపోయి, వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీటికి మించి.. టీడీపీలో పెత్తనం చేసి, గత ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది అప్పులపాలయి, పార్టీ కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితిలో లేరు. సంపాదించిన వారు ఖర్చు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఒకప్పడు టీడీపీలో వెలిగిపోయిన ఓ ప్రముఖుడు ఉండితోపాటు, భీమవరంలో కూడా వీలైనన్ని అప్పులు చేసి, అవి త తీర్చలేక హైదరాబాద్‌కు పరిమతమయ్యారు.

ఈవిధంగా నియోజకవర్గాల్లో పార్టీని నడిపించిన చాలామంది టీడీపీ ప్రముఖులు, ఆర్ధికంగా దెబ్బతిన్నారు. వీరికి స్థానిక సంస్థలకు మళ్లీ డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియని అయోమయ పరిస్థితి. ఫలితంగా మెజారిటీ నియోజకవర్గాల్లో..  సర్పంచ్, కౌన్సిలర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అభ్యర్ధులు దొరకని దుస్థితి నెలకొన్న విషయాన్ని వైసీపీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ఈ సమయంలో స్థానిక సంస్థలు నిర్వహిస్తే,  వైసీపీ గెలుపు నల్లేరుపై నడకే అవుతుందని స్పష్టం చేస్తున్నారు.

ఒకవేళ నిమ్మగడ్డ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరిగినా ఏమవుతుందన్న ప్రశ్నలు వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. తమ  ప్రభుత్వం ఇంకా మూడేళ్లు ఉంటుంది కాబట్టి, అధికారులు ఎస్‌ఈసీకి ఎందుకు భయపడతారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.  పైగా ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ కార్యకమ్రాల వల్ల ఒక్కో కుటుంబానికి, సగటున  లక్ష రూపాయలు వివిధ స్కీముల ద్వారా అందుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

‘స్థానికంగా వాలంటీర్లు తమ పరిథిలోని కుటుంబాలపై పూర్తి అవగాహన, పట్టు సాధించారు. మున్సిపాలిటీ, గ్రామాల్లో ఇంకా ఇళ్లు చాలామందికి రాలేదు.  ఈ పరిస్థితిలో మరొక పార్టీకి ఓటు వేస్తే ఆ పథకాలు రావని లబ్థిదారులు సహజంగానే భయపడతారు. ఎవరైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధి కోణంలో, అధికారంలో ఉన్న పార్టీకే ఓటు వేసేందుకు ఇష్టపడతారు. వీటికిమించి గ్రామస్థాయిలో టీడీపీకి పనిచేసేందుకు ఆ క్యాడర్ ధైర్యం చేయడం లేదు. గ్రామస్థాయి నాయకులు కేసులతో ఇప్పటికే  కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మాకు గ్రౌండ్‌లెవల్‌లో ఇంత సానుకూల పరిస్థితి ఉన్నప్పుడు, ఎన్నికలకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో అర్ధం కావడం లేద’ని ఓ సీనియర్ నాయకుడు విశ్లేషించారు. ఇదే నిమ్మగడ్డ ఎస్‌ఈసీగా ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్ధల్లో,  మెజారిటీ శాతం వైసీపీ పక్షానే ఏకగ్రీవాలయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

పైగా ఎన్నికలు జరిగితే, ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయో తెలుసుకుని, వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం కూడా ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? లేదా? అన్న విషయంతోపాటు, స్థానికంగా పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది? స్థానిక ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? అన్న క్షేత్రస్ధాయి వాస్తవాలు పరీక్షించేందుకు ఎన్నికలు ఉపకరిస్తాయని విశ్లేషిస్తున్నారు. ఈ కోణంలో విశ్లేషించకుండా, కేవలం నిమ్మగడ్డ ఎస్‌ఈసీగా ఉన్నారన్న ఒకే ఒక్క కారణంతో అనవసర ప్రతిష్ఠకు వెళ్లడం మంచిదికాదంటున్నారు.
ఈ విషయంలో తమ పార్టీ చీఫ్ జగన్, గతంలో చంద్రబాబు చేసిన పొరపాటునే చేస్తున్నారన్న వ్యాఖ్యలు మరికొందరు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు..  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరిగింది.  కొందరు సీనియర్ మంత్రులు, వైసీపీ ప్రభంజనం ఉన్నందున ఇప్పట్లో ఎన్నికలు జరపడం మంచిదికాదని బాబుకు సూచించారు. ఒకవేళ పార్టీ ఓడిపోతే ఆ ప్రభావం అసెంబ్లీ ఫలితాలపై చూపిస్తుందని భయపెట్టారు. అయితే, పార్టీ సీనియర్లు మాత్రం ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ లోపాలు తెలుసుకుని, వాటిని సరిదిద్దుకునే వీలుంటుందని వాదించారు. ఫలితాల ప్రకారం సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన చేసుకునే అవకాశం కూడా ఉంటుందని సూచించినా, బాబు మంత్రుల వైపే తలొగ్గారు.

ఫలితంగా, అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతినాల్సి వచ్చిందని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేకపోవడం, టీడీపీకి సానుకూలత లేని విషయాన్ని తమ నాయకత్వం పరిగణనలోకి తీసుకోకపోవడ ం ఆశ్చర్యంగా ఉందంటున్నారు.