‘స్థానికం’లో సత్తా చూపండి

519

టిడిపి నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం 175నియోజకవర్గాల టిడిపి ఇన్ ఛార్జ్ లు, మండల పార్టీ బాధ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘గాంధీజి కలలుగన్న గ్రామస్వరాజ్యానికి ఈ పంచాయితీ ఎన్నికలు నాంది కావాలి. పంచాయితీ ఎన్నికల్లో వైసిపి రౌడీరాజ్యానికి ముక్కుతాడు వేయాలి. వైసిపి పతనానికి పంచాయితీ ఎన్నికలే నాంది కావాలి.

వైసిపి ఉన్మాద పాలనకు అడ్డుకట్ట వేసే అవకాశం ఈ ఎన్నికలు. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలకు బుద్దిచెప్పే అవకాశం ఈ ఎన్నికలు. రైతులు, పేదలు, మహిళలు, యువత, బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కార వేదిక ఈ పంచాయితీ ఎన్నికలు.

అన్ని పంచాయితీలలో అభ్యర్ధులు పోటీలో ఉండేలా చూడాలి. బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా చూడాలి. గత మార్చిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి హింసా విధ్వంసాలతో బలవంతపు ఏకగ్రీవాలు జరిగిన చోట్ల అందరూ మరింత అప్రమత్తంగా ఉండాలి. నిన్నటినుంచే పంచాయితీ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఎక్కడ ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తినా అన్నింటినీ మొబైల్ ఫోన్లలో రికార్డింగ్ చేసి అధికారులకు, టిడిపి కేంద్ర కార్యాలయానికి పంపాలి. వైసిపి నాయకులు కొందరు పోలీసులతో కుమ్మక్కై గతంలో పెట్టిన అక్రమ కేసులు, దౌర్జన్యాలను దృష్టిలో ఉంచుకుని, ఆయా అభ్యర్ధులు, నాయకుల ఇళ్లలో సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.

ప్రజల్లో వైసిపిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయంతో ఉన్నారు. అందుకే ఎన్నికలు జరగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. తమ అవినీతి కుంభకోణాలు, వైఫల్యాలు, హింసా విధ్వంసాలపై ప్రజల్లో వ్యతిరేకత చూసే పంచాయితీ ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తున్నారు.

రాష్ట్రానికి పట్టిన శనిగా జగన్ రెడ్డి మారాడు. ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ప్రాజెక్టుల నిర్మాణ పనులన్నీ ఆపేశాడు, పరిశ్రమలను బెదిరించి తరిమేశాడు.

ఇళ్లస్థలాల్లో రూ6,500 కోట్ల అవినీతి కుంభకోణాలు, రంగుల కుంభకోణం రూ 2,600కోట్లు, అంబులెన్స్ ల స్కామ్ లు, ఇసుక, సిమెంటు, మద్యం, మైనింగ్ దోపిడిపై అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. జె ట్యాక్స్ వసూళ్ల కోసం నాసిరకం మద్యం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారు. ఇసుక దోపిడితో 40లక్షల భవన నిర్మాణ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీశారు.  జగన్ రెడ్డి సిఎం అయ్యాక రాష్ట్రంలో 2వేలమంది రైతులు, రైతుకూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. పంటలకు కనీస మద్దతు ధరలేదు, 7వరుస విపత్తులలో పంట నష్ట పరిహారం రైతులకు ఎగ్గొట్టారు. గత 20నెలల్లో బిసి,ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటిలపై జరిగినన్ని దాడులు, దౌర్జన్యాలు 67ఏళ్ల రాష్ట్ర చరిత్రలో జరగలేదు. ఇన్ని హత్యలు, హత్యాయత్నాలు, ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలు. దళితులపై దమనకాండకు పాల్పడ్డారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు అన్నీఇన్నీ కావు అన్నారు.

వందలాది దేవాలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాల ధ్వంసం చేస్తున్నా చోద్యం చూస్తున్నారు.

నిన్న తిరుపతిలో టిడిపి ధర్మపరిరక్షణ యాత్రను అడ్డుకుని తప్పుడు కేసులు పెట్టారు. వైసిపి దుర్మార్గాలను నిరసిస్తూ ఈ రోజు అన్ని మండల కేంద్రాల్లో ధర్మపరిరక్షణ దీక్షలు జరిగాయి. రేపటినుంచి గ్రామస్థాయిలో ధర్మపరిరక్షణ యాత్ర చేపడుతున్నాం. ధర్మాన్ని మనం కాపాడాలి,  ధర్మమే మనల్ని కాపాడుతుంది.

ధర్మ పరిక్షణ యాత్రలో గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం చేయాలి. వైసిపి దుర్మార్గాలపై ధ్వజమెత్తాలి.  వైసిపి నాయకుల ఓటమితోనే రాక్షస పాలనకు అంతం.

గ్రామ స్వరాజ్యం తెలుగుదేశం సిద్దాంతం. స్థానిక స్వపరిపాలనకు టిడిపి పెద్దపీట వేసింది. గ్రామీణాభివృద్దికి విశేష కృషి చేశాం. రెవిన్యూతో సహా అన్నిఅధికారాలు గ్రామాలకు ఇచ్చాం. గ్రామ సచివాలయ విధానానికి 1995లోనే నాంది పలికాం. గ్రామ పంచాయితీల అధికారాల కోసం పాటుబడ్డాం.

టిడిపి హయాంలో అన్నిగ్రామాల్లో 100% ఇళ్లకు విద్యుత్ ఇచ్చాం. 100% ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మించాం. ఎల్ ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేశాం. గిరిజన ఆవాసాలతో సహా అన్ని గ్రామాలకు ఇంటర్ నెట్ కనెక్టివిటి ఇచ్చేందుకు కృషి చేశాం. ట్రైసైకిళ్ల ద్వారా చెత్తసేకరణ, షెడ్స్ నిర్మాణం జరిపి, చెత్తనుంచి ఎరువు తయారీ(వేస్ట్ టు కంపోస్ట్) కేంద్రాలు నెలకొల్పాం. 8లక్షల పంటకుంటలు తవ్వాం, వేలసంఖ్యలో చెక్ డ్యామ్ లు నిర్మించాం, సేంద్రియ వ్యవసాయం(జడ్ బిఎన్ ఎఫ్ )ను ప్రోత్సహించాం అన్నారు.

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు నెలకొల్పాం. ఎన్టీఆర్ వైద్యసేవ, సిఎంఆర్ ఎఫ్ ద్వారా పేదలకు ఎంతో మేళ్లు చేశాం. టెలి మెడిసిన్ విధానం తెచ్చాం. రూ 4,800కోట్లతో పాఠశాలల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చేశాం, డిజిటల్ క్లాస్ రూమ్స్, వర్ట్యువల్ క్లాస్ రూమ్స్ అభివృద్ది చేశాం.

టిడిపి హయాంలో రూ22వేల కోట్లతో ‘‘జలధార’’ పథకం తెచ్చాం. ‘‘స్వచ్ఛధార’’ పథకం ద్వారా జర్మన్ టెక్నాలజితో అన్ని గ్రామాల్లో ట్యాంకులు శుభ్రం చేయించాం. మొబైల్ వ్యాన్లు, శిక్షణ పొందిన సిబ్బందిని వినియోగించి ట్యాంకుల్లో పేరుకుపోయిన బ్యాక్టీరియా, కల్మషాలను పూర్తిగా తొలగించడం జరిగింది అన్నారు.

సురక్షిత తాగునీరు కూడా ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం ఇది. వైసిపి వాళ్లు చేసే వెధవ పనులు అన్నింటికి టిడిపి కుట్రలే కారణమని నిందలు వేస్తున్నారు. పరిపాలనలో విఫలమై టిడిపిపై నిందలు వేస్తున్నారు.  తాగునీటి కాలుష్యానికి టిడిపి కారణమని, దేవుళ్ల విగ్రహాల ధ్వంసానికి టిడిపి కారణమని, పోలవరం ఇతర ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడానికి టిడిపి కారణమని ఆరోపణలు చేయడం ద్వారా తమ చేతగానితనం కప్పిపెట్టుకోవాలని చూస్తున్నారు.

గ్రామ పంచాయితీల్లో అభివృద్ది టిడిపి ద్వారానే సాధ్యం

టిడిపి 5ఏళ్ల పాలనలో రూ 40వేల కోట్లతో గ్రామాల్లో అనేక అభివృద్ది పనులు చేపట్టాం. 13వేల గ్రామాల్లో 26వేల కిమీ సిమెంట్ రోడ్లు వేశాం..6వేల అంగన్ వాడి  భవనాలు, 3వేల పంచాయితీ భవనాలు నిర్మించాం. పాఠశాలల భవనాల నిర్మాణం, స్మశానాలు, క్రీడా స్థలాల అభివృద్ది, చెత్తనుంచి ఎరువు తయారీ కేంద్రాలు నెలకొల్పాం. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాం. నరేగా నిధుల సద్వినియోగంలో దేశంలోనే ముందున్నాం. మనం చేసిన అభివృద్ది పనులతో మన గ్రామాలకు దేశంలోనే అనేక అవార్డులు, రివార్డులు వచ్చాయి. అన్నారు.

టిడిపి చేసిన అభివృద్ది తప్ప, వైసిపి అధికారంలోకి వచ్చాక  ఒక్క రోడ్డు వేయలేదు, ఒక్క భవనం కట్టలేదు. టిడిపి కట్టిన ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులు వేసి రూ 2,600కోట్ల ప్రజాధనం స్వాహా చేశారు.  టిడిపి చేసిన అభివృద్ది పనులను నాశనం చేయడానికే కంకణం కట్టుకున్నారు.  పంచాయితీ ఎన్నికల సందర్భంగా వీటన్నింటిపై అన్నిగ్రామాల్లో ప్రచారం చేయాలి. వైసిపి దుర్మార్గాలు, టిడిపి అభివృద్ది పనులపై ప్రజలను చైతన్యం పెంచాలి అన్నారు.     కోర్టులు, ఎన్నికల సంఘం, కేంద్రం, రాజ్యాంగ సంస్థలన్నీ రాష్ట్రంలో వైసిపి దమనకాండపై నిశితంగా దృష్టి పెట్టాయి. గత ఏడాది మార్చి స్థానిక ఎన్నికల్లో జరిగినట్లుగా దాడులు, దౌర్జన్యాలకు అవకాశం లేదు అన్నారు.

9మంది కళంకిత అధికారులను, గత ఎన్నికల్లో హింసా విధ్వంసాలకు సహకరించిన అధికారులను విధులనుంచి తొలగిస్తూ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ప్రతి పంచాయితీలలో నామినేషన్లు పడేలా చూడాలి. బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా చూడాలి.

నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే వైసిపి ఓటమి ఖాయం. వైసిపి హింసా విధ్వంసాలకు, దాడులు, దౌర్జన్యాలకు ప్రజలే బుద్ది చెబుతారని’’ చంద్రబాబు పేర్కొన్నారు.

టిడిపి నాయకుల ప్రసంగాలు:

సమావేశంలో  ఏపి టిడిపి అధ్యక్షుడు  అచ్చెన్నాయుడు,  బిసి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే బెందాలం అశోక్, మాజీ మంత్రులు జవహర్, రఘునాధ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, జయ నాగేశ్వర రెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కిమిడి నాగార్జున, అరవిందబాబు, ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు.