భగ్గుమన్న ‘భారతీయ’- ‘జనసేన’ విబేధాలు

889

బీజేపీ చిన్నచూపు చూస్తోందన్న పవన్
తిరుపతిలో జనసేన అభ్యర్ధి పోటీకే పట్టు
పవన్ వ్యాఖ్యలతో ‘పొత్తుపోరు’ స్పష్టం
( మార్తి సుబ్రహ్మణ్యం)

జనసేన-బీజేపీ మధ్య గ్యాప్ ఉందంటూ ఇప్పటివరకూ సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారం తాజాగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్య్యాలతో నిజమయింది. తిరుమలలో పవన్ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే… సోము వీర్రాజు నాయకత్వంలోని రాష్ట్ర నాయకత్వం, జనసేనను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నది స్పష్టమయింది. తాజాగా  తిరుపతిలో జరిగిన  జనసేన పీఏసీ సమవేశంలో పాల్గొన్న నేతలు కూడా.. బీజేపీ తమను చిన్నచూపు చూస్తోందని, ఎక్కడా ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజు స్వయంగా పార్టీ చీఫ్ పవన్ కూడా.. రాష్ట్ర బీజేపీ నాయకత్వం తమను చిన్నచూపు చూస్తోందని వ్యాఖ్యానించడం బట్టి.. రెండు పార్టీల మధ్య దూరం ఉన్నట్లు తేలిపోయింది.

నిజానికి జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్‌ను బీజేపీ జాతీయ నాయకత్వం బాగానే గౌరవిస్తోంది. ఒకటి, రెండు సందర్భాల్లో జాతీయ నాయకులతో, అపాయింట్‌మెంట్ విషయంలో కొంత సమాచారలోపం జరిగినప్పటికీ, బీజేపీ చీఫ్ నద్దా సహా ఆ పార్టీ జాతీయ నేతలంతా పవన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ ఎటొచ్చీ ఏపీ బీజేపీ నాయకత్వమే జనసేనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. బహుశా అందుకే పవన్ కూడా తమను బీజేపీ కేంద్ర నాయకత్వం ఒకలా-రాష్ట్ర నాయకత్వం మరోలా చూస్తోందన్న అసంతృప్తి వ్యక్తమయ్యేలా  వ్యాఖ్యానించినట్లు కనిపిస్తోంది. ఇది పవన్ వ్యూహాత్మకంగా చేసిన వ్యాఖ్యగానే అటు బీజేపీ కూడా భావిస్తోంది. జనసేన క్యాడర్‌లో కూడా బీజేపీ తీరుపై తొలి నుంచీ అసంతృప్తి నెలకొంది.  ఈ కారణంతోనే ఇటీవల రామతీర్ధం ఘటనకు నిరసనగా,  బీజేపీ-జసనేన సంయుక్తంగా ఆందోళనకు పిలుపునిచ్చినప్పటికీ, అందులో జనసేన రాష్ట్ర నేతలెవరూ పాల్గొనకపోవడాన్ని జనసేన నేతలు ప్రస్తావిస్తున్నారు.

ఇక తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీపై జనసేన-బీజేపీ మధ్య జరుగుతున్న దోబూచులాటకు జనసేన చీఫ్ పవన్ తన వ్యాఖ్యలతో,  వ్యూహాత్మక ముగింపు ఇవ్వడం ఆసక్తికలిగిస్తోంది. ‘బీజేపీ బరిలోకి అంటూ దిగితే కచ్చితంగా గెలిచేలా ఉండాలి. గ్రేటర్ హైదరాబాద్, దుబ్బాక ఎన్నికల స్థాయిలో యుద్ధానికి దిగితేనే బీజేపీ పోటీ చేయాలి. లేకపోతే జనసేన అభ్యర్ధి  పోటీ చేసినట్టయితే తానే స్వయంగా 7 నియోజకవర్గాల్లో రంగంలోకి దిగుతా’నన్న పవన్ వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. తిరుపతిలో తమ పార్టీ పోటీ  చేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని, పవన్ చేసిన బహిరంగ వ్యాఖ్య, రెండు పార్టీల మధ్య నెలకొన్న దూరాన్ని స్పష్టం చేసింది. ఒకవారంలో ఈ అంశం తేలుతుందని చెప్పిన పవన్, పోటీలో తామే ఉండాలన్న మనోగతాన్ని మీడియా సాక్షిగా బయటపెట్టడం ప్రస్తావనార్హం.

జనసేన తిరుపతిలో నిర్వహించిన తాజా సమావేశంలో సైతం.. బలం లేని బీజేపీ పోటీ వల్ల ప్రయోజనం లేదని, ఆ పార్టీకి నియోకవర్గాల స్థాయిలో బలం కూడా లేనందున, ఆ ఎన్నికలో ఓడిపోతే ఆ అప్రతిష్ఠ తమకూ వస్తుందని జనసేన నేతలు పవన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. పార్టీవర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీ నేతలు మీడియాలో తప్ప ఎక్కడా కనిపించరని, వారికి స్థానికంగా ఎలాంటి పలుకుబడి లేదని వారు పవన్‌కు వివరించారు. పది-ఇరవైమందితో కార్యక్రమాలు చేసి, ఫొటోలు దిగి మీడియా ఎదుట హంగామా చేయడమే తప్ప, బీజేపీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ లేదని స్పష్టం చేశారు. అసలు ఏ కార్యక్రమాల్లోనూ బీజేపీ నాయకులు తమకు సమాచారం ఇవ్వడం లేదని, తాము మీడియాలోనే చూసి కార్యక్రమాలు తెలుసుకుంటున్నామని జనసేన నేతలు పవన్‌కు ఫిర్యాదు చేశారు.

వీటిని పరిగణనలోకి తీసుకున్న పవన్.. బీజేపీ నుంచి జాతీయ నాయకులు ఒకవేళ ప్రచారానికి వస్తే ఎవరు వస్తారు? అని ప్రశ్నించడం ఆసక్తికలిగిస్తోంది. పనిలో పనిగా ఆయన రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్నీ తన వ్యాఖ్యలతో ఇరుకునపెట్టారు. కేంద్రనాయకతావికి ఉన్నంత అవగాహన, ఇక్కడి రాష్ట్ర నాయకత్వానికి లేదన్నది జనసేన నేత లు తనకు చెప్పిన విషయాన్ని పవన్ నేరుగా మీడియాకే వెల్లడించడంతో, రాష్ట్ర నాయకత్వానికిఇ స్థానిక పరిస్థితులపై అవగాహన లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లయింది.

ఇక  మీకు భగవద్గీత పార్టీ కావాలా? బైబిల్ పార్టీ కావాలా అన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కూడా,  పవన్ తన వ్యాఖ్యలతో సంకటంలోకి నెట్టారు. అది సంజయ్ వ్యక్తగత అభిప్రాయమని, తానలా మతాన్ని విడగొట్టి చూడనని స్పష్టం చేయడం ద్వారా, బండి సంజయ్ వ్యాఖ్యలు తప్పని చెప్పకనే చెప్పడం ప్రస్తావనార్హం. పైగా తనకు ముస్లిం-క్రైస్తవులు కూడా ముఖ్యమేనని స్పష్టం చేసి, మరో షాక్ ఇచ్చారు. బీజేపీ నిర్వహించే రథయాత్రలో తాను పాల్గొంటే, వచ్చే భావోద్వేగాలు వేరుగా ఉంటాయన్న పవన్ అందులో పాల్గొనడం లేదని పరోక్షంగా స్పష్టం చేసి, బీజేపీని నిరాశకు గురిచేశారు. పైగా తనకు.. క్రైస్తవులు, ముస్లింలలో కూడా అభిమానులున్నారు. ఆదోనిలో నాకు ఎంతోమంది ముస్లిం అభిమానులున్నారని చెప్పడం ప్రస్తావనార్హం.

ప్రధానంగా.. రాష్ట్రంలో హిందుత్వ కార్డుతో రాజకీయ ప్రయోజనం పొందాలని భావిస్తున్న బీజేపీకి, జనసేన చీఫ్ పవన్ ఊహించని షాక్ ఇవ్వడం కమలదళాలను ఖంగుతినిపించింది. హిందుమతం అంటే బీజేపీ మాత్రమే  కాదని, అలాంటి భావన నుంచి బయటపడాలని మీడియాకు సూచించడం గమనార్హం. మొత్తంగా.. తనకు క్రైస్తవులు, ముస్లింలు కూడా ప్రధానమేనని, తాను బీజేపీ మాదిరిగా వైసీపీని బైబిల్ పార్టీ అనలేనని, హిందు మతం అంటే బీజేపీ ఒక్కటే కాదన్న వ్యాఖ్యలతో జనసేనాధిపతి పవన్ ‘కమలవనం’లో కలకలం సృష్టించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది.