జగన్‌లో మార్పు మంచిదే!

909

అధికార- పార్టీ వర్గాల్లో హర్షం
                         ( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ సీఎం జగన్ వైఖరిలో వస్తున్న మార్పులపై పార్టీ-అధికార వర్గాల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి రోజులకు, ఇప్పటికీ ఆయనలో పాలన-పార్టీపరమైన వస్తున్న మార్పులు, స్వాగతించదగ్గవేనన్న వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా గత ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించిన అధికారుల విషయంలో, జగన్ అనుసరిస్తున్న పట్టువిడుపులు ఆయన పరిణతి చెందుతున్న వైనాన్ని స్పష్టం చేస్తోందంటున్నారు.

జగన్ సీఎం అయిన తర్వాత, గత ప్రభుత్వంలో బాబు వద్ద పనిచేసిన కొందరు ఐఏఎస్-ఐపిఎస్ అధికారుల పోస్టింగుల విషయంలో కఠిన వైఖరి ప్రదర్శించారు. వారిని టీడీపీ అనుకూలురుగా భావించారు. అందుకే కొందరు అధికారులు తమ రాష్ట్రానికి వెనక్కి వెళ్లేందుకు కూడా అనుమతించకుండా కఠిన వైఖరి అవలంబించారు. ప్రధానంగా బాబు సీఎంగా ఉండగా,  ఆయన పేషీలో చక్రం తిప్పిన సతీష్‌చంద్ర, ఇంటలిజన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించారు. వారికి చాలాకాలం పాటు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.

కాలగమనంలో పరిపాలనపై అవగాహన పెంచుకునే క్రమంలో పట్టువిడుపులు ప్రదర్శించాలని భావిస్తున్నట్లు, ఆ తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు స్పష్టం చేశాయి. సతీష్‌చంద్ర కొన్ని సార్లు జగన్‌ను కలిసిన తర్వాత, మెత్తబడిన సీఎం ఆయనకు కీలకమైన ఉన్నతవిద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిజానికి సతీష్‌చంద్ర-ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రాయబారాలు నిర్వహించారని,  వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అనేకసార్లు బహిరంగంగా ఆరోపించారు. దానికి తగినట్లుగానే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వారిద్దరికీ చాలాకాలం పాటు పోస్టింగ్ ఇవ్వలేదు. ఏబీ వెంకటేశ్వరరరావుపైనయితే ఏకంగా సస్పెన్షన్ వేటు వేసి, టీడీపీ అనుకూల అధికారులకు ఒక హెచ్చరిక సంకేతం పంపించారు. ఆతర్వాత జగన్‌ను కలిసిన సతీష్‌చంద్రకు ఉన్నత విద్యాశాఖలో పోస్టింగ్ ఇచ్చారు. ఏబీ వెంకటేశ్వరరావు మాత్రం సీఎంను కలిసిన దాఖలాలు కనిపించలేదు.

అదేవిధంగా బాబు పేషీలో చక్రం తిప్పిన మరో సీనియర్ ఐఏఎస్ అధికారి సాయిప్రసాద్‌కు సైతం నాలుగు నెలలల పాటు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. తర్వాత ఆయనకూ కీలకమైన సోలార్ కార్పొరేషన్‌తోపాటు ఇప్పుడు ట్రాన్స్‌కో బాధ్యతలు కూడా కట్టబెట్టారు. ఇక బాబు జమానాలో సీఎంఓలో కార్యదర్శిగా పనిచేసిన గిరిజాశంకర్‌కు, అత్యంత కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చారు. టీడీపీ హయాంలో వైసీపీ నుంచి ఆరోపణలు ఎదుర్కొన్న.. నాటి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్‌కు కీలకమైన ఆరోగ్యశాఖ కమిషనర్, ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన వినయ్‌చంద్‌కు కీలకమైన విశాఖ కలెక్టర్ పోస్టులు ఇచ్చిన విషయాన్ని అధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

బాబు సీఎంగా ఉండగా ప్లానింగ్ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన పరీదా ఆయనకు నమ్మకమైన అధికారిగా ప్రచారం ఉండేది. ఆ తర్వాత రిటైరయిన పరీదా సమాచార చట్టం చీఫ్ కమిషనర్, కమిషనర్, రేరాలో పదవి ఆశించినా ఫలితం దక్కలేదు. చంద్రబాబు ఉన్నారన్న ధీమాతోనే తాను తెలంగాణ నుంచి ఏపీకి క్యాడర్ మార్చుకున్నప్పటికీ, ఆయన తనకు న్యాయం చేయలేదని అప్పట్లో పరీదా వ్యాఖ్యానించేవారన్న ప్రచారం కూడా వినిపించింది. కానీ జగన్ మాత్రం అనూహ్యంగా ఆయనకు,  తాజాగా పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు చైర్మన్ పదవి ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

వీటికిమించి.. బాబు హయాంలో,  గౌతం సావంగ్‌కు బదులు, ఏరికోరి ఠాకూర్‌ను డీజీపీగా నియమించారు. జగన్ సీఎం అయిన తర్వాత ఠాకూర్‌కు ప్రాధాన్యం లేని పోస్టింగు ఇచ్చారు. కానీ హటాత్తుగా ఆయనకు అత్యంత కీలకమైన ఆర్టీసీ ఎండి పదవి ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంలో సీఎస్ కొంత చొర తీసుకున్నారని   ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఏడాదిన్నర క్రితం తాను దూరంగా పెట్టిన అదే ఠాకూర్‌కు ఇప్పుడు జగన్ ఆర్టీసీ ఎండీ ఇవ్వడం చూస్తే, పాలనలో జగన్ పాఠాలు నేర్చుకుంటున్నారన్న విషయాన్ని అర్దం చేసుకోవలసి ఉందని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఒక్క ఏబీ వెంకటేశ్వరరావు విషయంలోనే కఠినంగా వ్యవహరిస్తున్న జగన్, గత ప్రభుత్వానికి దగ్గర ఉన్న మిగిలిన అధికారులకు మాత్రం మంచి పోస్టింగులే ఇస్తున్నారని గుర్తు చేస్తున్నారు.

అయితే, పోస్టింగు రాని అధికారులు నేరుగా జగన్‌ను కలసి, అభ్యర్ధిస్తే వారికి పోస్టింగులు ఇస్తున్నారంటున్న అధికార వర్గాలు, అసలు ఆయనను కలవడమే కష్టమని చెబుతున్నారు. ‘సీఎం గారిని కలిసి రిక్వెస్టు చేసుకున్న వారికి,  ఆయన పెద్ద మనసు చేసుకుని పోస్టింగులు ఇస్తున్నారు. కానీ చిక్కల్లా ఆయనను కలవడమే. సీఎం గారి అపాయింట్‌మెంట్ దొరకడమే కష్టం. అది దొరికితే వారికి ఖాయంగా పోస్టింగు వచ్చినట్లే’నని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. సీఎంకు నచ్చచెప్పగలిగే అధికారులు ఉంటే, ఆయన కూడా వారి వివరణ వింటున్నారు. ఇప్పటివరకూ పోస్టింగులు తీసుకున్న వారే దానికి నిదర్శనమని వివరించారు.

ఈ పరిణామాలన్నీ సీఎం జగన్‌లో వస్తున్న మార్పులు, ఆలోచనా ధోరణికి నిదర్శనాలేనని సీనియర్ అధికారులు విశ్లేషిస్తున్నారు. ‘ఎవరికయినా మార్పు అనివార్యం. పాలనలో అనుభవాలే అన్నీ నేర్పిస్తుంటాయి. ఎవరికీ ఏదీ పుట్టుకతో రావు కదా? పట్టువిడుపులు అవసరం. అందుకు సీఎం గారు మినహాయింపేమీ కాదు. సీఎంలో వచ్చిన మార్పు ఆహ్వానించదగ్గదే. అధికారులకు ఎక్కడో ఒక చోట పోస్టింగులు ఇవ్వాల్సిందే కదా?’ అని ఓ ఐఏఎస్ అధికారి వివరించారు.

అయితే విచిత్రంగా.. బాబు సీఎంగా ఉండగా, మంత్రులు-పార్టీ నేతలు చెప్పినా ఖాతరు చేయని అదే అధికారులు, ఇప్పుడు అత్యంత విధేయతతో పనిచేస్తున్నారన్న వ్యాఖ్యలు సచివాలయ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో బాబు చెప్పినా, దానిని కుదరదని లౌక్యంగా చెప్పిన అదే అధికారులు, ఇప్పుడు మాత్రం పైనుంచి వచ్చిన ఆదేశాలను ఆగమేఘాల మీద అమలుచేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అటు పార్టీపైనా జగన్ ఇలాంటి దిద్దుబాటు ధోరణి ప్రదర్శిస్తుండటం చర్చనీయాంశమయింది. జిల్లాల్లో అగ్రనేతల మధ్య జరిగే కుమ్ములాటలు రోడ్డెక్కిన సందర్భాల్లో వారిని పిలిపించి, అక్షింతలు వేసి పంపిస్తున్నారని పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. అటు తమ చర్యలతో పార్టీకి చెడ్డపేరు తీసుకువస్తున్న కొందరు ఎమ్మెల్యేలకూ నేరుగా హెచ్చరికలు పంపిస్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గాల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో, ఎమ్మెల్యేలు కక్కలేక మింగలేని పరిస్థితి ఏర్పడింది.