భక్తి చానెల్‌కు ఏమిటీ దరిద్రం?

610

సినిమా వాసనలేమిటీ స్వామీ
చాగంటి, గరికపాటి, సామవేదం చైర్మన్లుగా పనికిరారా?

(మార్తి సుబ్రహ్మణ్యం)

భ్రష్టుపట్టిన తిరుమల తిరుపతి దేవాలయ వ్యవస్థను గాడిలో పెట్టడం ఆ వెంకటేశ్వరస్వామి తరం కూడా అయ్యేలా లేదు. ఇప్పటికే జంబో కమిటీతో నింపేసిన టిటిడిలో.. భగవంతుడికి-భక్తుడికి అనుసంధానంగా ఒక్క  ముఖం కూడా  ఉన్నట్లు లేదు.  పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలతో కిటకిటలాడుతున్న టిటిడిలో ఒక శేఖర్‌రెడ్డి,  ఎస్వీఛానెల్‌కు ఒక  పృధ్వీరాజ్ లాంటి ఆణిముత్యాలు అదనపు ఆకర్షణ. శేఖర్‌రెడ్డి అనే భక్తాగ్రేసరుడు వంద కోట్లు విరాళమిచ్చి టిటిడి మెంబరుషిప్ కొనుగోలు చేశారని, పైగా ఆయన లోకేష్ బినామీ అని ఎన్నికల ముందు వైసీపేయులు చేసిన యాగీ అంతా ఇంతా కాదు. మరి అదే శేఖర్‌రెడ్డిని మళ్లీ అదే పాలకమండలి కూటమిలో చేర్చారు. స్వామి వారి పింక్ డైమండ్ కూడా మాయమయి, అది అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్లోని నేలమాళిగల్లో ఉందని విజయసాయిరెడ్డి ఆరోపించారు.తీరా వైసీపీనే అధికారంలోకి వచ్చిన తర్వాత పింక్ డైమండేది స్వామీ అంటే అబ్బే.. పింక్ లేదు.. ఎల్లో లేదు.. అంతా తూచ్చని టిటిడి ధర్మప్రభువులైన ధర్మారెడ్డిగారు సెలవిచ్చారనుకోండి. మరి ఎన్నికల ముందు పింక్ డైమండు పోయిందని నానా యాగా చేసి, నా ఇజ్జత్ తీసినందుకు పరువునష్టం దావా వేస్తానని ఎదురుదాడి చేసి, ఆ ఘనటను మళ్లీ గుర్తు చేయాల్సిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతగాని, చేష్టలుడిగి, చేవలేని వాడిగా.. కనీసం, ఆ పరువునష్టం కేసులో కనీసం ఇంప్లీడు కూడా కాకుండా, బహుశా ఆయన ప్లీడరు ‘ఆ తలనొప్పి మనకెందుకు. అదొక చేతి చమురు బాగోతమ’ని అనడంతో  మౌనంగా ఉన్నారనుకోండి. అది వేరే విషయం.ఆ పింక్ డైమండ్ కాకి ఎత్తుకెళ్లిందా ‘స్వామీ’
ఇప్పుడు తిరుమలలో సీన్ కట్ చేస్తే.. ఎస్వీబీసీ చైర్మన్ అనే భక్తి చానెల్ పోస్టు ఖాళీ అయింది. ఎందుకంటే ఆ పదవిలో ఉన్న పృధ్వీరాజ్ అనే కామెడీ యాక్టరు, అందులో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినితో నడిపిన ఫోను సంభాషణ రస రమ్యంగా సాగి, రాష్ట్రంలోని అన్ని ధియేటర్లలో సూపర్‌హిట్టయింది. ఫలితంగా.. పృధ్వీరాజ్ అనే కామెడీ యాక్టరు తెలియని వారికీ తెలిసిపోయారు. స్వామి వారి సన్నిధిలో ఉంటూ ‘స్వాతి’ సకుటుంబ సపరివార పత్రికలో శృంగారపేజీ మాదిరిగా కొండమీద  రెచ్చిపోవడం తప్పు కదా? అని పృధ్వీని మందలించటంతో, పాపం ఆయన చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సారీ చెప్పారనుకోండి. అంతకుముందు వరకూ.. అమరావతిలోనే రాజధాని ఉండాలని, ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులని తిట్టిపోసిన పృధ్వీని, నానా మాటలూ అన్న పోసాని ఎపిసోడ్ వరకే జనాలకు గుర్తు. కమ్మవారిని, రైతులను అవమానించిన పృధ్వీ సారీ చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు. ఒకవేళ అది పార్టీ విధానం అనుకుంటే తన దారేమిటన్నది తర్వాత చెబుతానని హెచ్చరించారు.  ఇది కూడా చదవండి.. . ఇది కూడా చదవండి… ‘పోసాని పాటి దమ్ము తెలుగు హీరోలకేదీ? అయితే పోసాని హెచ్చరికలను ఖాతరు చేయని పృధ్వీ తాను సారీ చెప్పే సమస్యే లేదని, ఇది రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా చెబుతున్నానని పోసానిని పూచిక పుల్లలాగా తీసిపారేశారు. ఇది కూడా చదవండి.. ‘అవును.. వాళ్లు పెయిడ్ ఆర్టిస్టులే.. అయితే ఏంటి? ..  ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేసిన సమయంలో,  పోసానికి సారీ చెప్పారనుకోండి. అది వేరే విషయం.  అలాంటి పృధ్వీ ఇప్పుడు టివి చూసే ప్రతి ఒక్క ఇంటికీ ఫ్రీగా పరిచయమయ్యారు. ఇప్పుడెలాగూ ఖాళీగానే ఉన్నారు కాబట్టి.. పృధ్వీ రాసలీలలో చెప్పినట్లు.. మార్చి వరకూ మందు తాగడం  వాయిదా వేయాల్సిన పనిలేదు.
మరి ఖాళీగా ఉన్న ఆ భక్తి చానెల్ చైర్మన్ పదవిని ఎవరికి ఇస్తారంటే.. ఒక సినిమా డైరక్టర్ శ్రీనివాసరెడ్డి, ఒక జర్నలిస్టు కమ్ సినిమా నటి (తాజా అవతారం లెండి) స్వప్న లేదా ఇంకో సుబ్బారావు, ఆయన కాకపోతే మరో పుల్లారావు పేర్లు పరిశీలనలో ఉన్నాయట.  ఈ జాబితాలో ఇటీవలే తెలుగు భాషను లలితంగా మాట్లాడి, సంచలనం సృష్టించిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి లేకపోవడం ఒకింత ఊరట. అసలు సినిమా వాళ్లకు, భక్తి చానెల్‌కు లింకేమిటో అర్ధం కాదు. శంకరాచార్యుడికి-పీర్ల పండడగకు సంబంధం  మాదిరిగా ఉంది కదూ ఇది? గతంలో రాఘవేంద్రరావు లాంటి సినిమా వాళ్లను తిరుమల మీదకు వదిలిన పుణ్యంలో చంద్రబాబు నాయుడుకూ వాటా ఉంది మరి! పారిశ్రామికవేత్తలు, మద్యం వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, సినిమా నటులను తిరుమలపైకి వదిలిన పాపంలో అందరు ముఖ్యమంత్రులకూ వాటాలున్నాయి.
మరి ఆ భక్తి చానెల్‌కు ఈ బాపతు ముఖాలు తప్ప, ఆధ్మాత్మిక భావనలున్న మనుషులు పనికిరారన్న నియమం ఏమైనా ఉందా అన్నది అందరి సందేహం. తెలుగునాట తమ ఆధ్మాత్మిక ప్రవచనాలతో దేవుడిని ప్రతి ఇంటికీ చేరుస్తున్న ప్రవచనకారులు ఆ పదవికి అనర్హులా? ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అని నోట్లో కారాకిళ్లీ, సిగరెట్, ఇంకోచేత్తో మందుగ్లాసుతో డైలాగు చెప్పే పృధ్వీరాజ్ బాపతు వారే అర్హులా? సర్కారీ చానెల్‌లో పనిచేసి, పాలకుల మనసెరిగిన జర్నలిస్టుల పాటి విజ్ఞానం చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు, సామవేదం షణ్ముఖశర్మ వంటి ప్రవచనకారులకు లేదా? వారు  భక్తి చానెల్‌కు అనర్హులా? నిజానికి ఇలాంటి ప్రవచనకారులు భక్తిచానెల్‌లో ఉంటే ఆ చానెల్‌కు అదో ఆధ్మాత్మికబలం. ఆకర్షణ!  పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు చదువుకున్న వారికంటే పబ్లిసిటీ కోసం పాకులాడే ఈ ముఖాలే భక్తి చానెల్‌కు నప్పుతారేమో మరి? దానికంటే… జబర్దస్త్‌లో ఇప్పటికే రాణిస్తున్న రోజాను చైర్మన్‌గా పెడితే పోదూ?! ఎలాగూ చిత్తూరు జిల్లానే కాబట్టి, ఓ ఎమ్మెల్యేకు మరొక ఉపాథి కల్పించినట్టవుతుంది కదా?!