ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తుంది

515

రాష్ట్రంలో మా కార్యక్రమాలను అడ్డుకుంటూ, అరెస్టులు చేస్తూ ఎందుకు ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ప్రశ్నించారు. ఆలయాలపై దాడుల విషయంలో డీజీపీ వ్యాఖ్యలను నిరశిస్తూ, భాజపా చేపట్టిన ఆందోళనకు వెళ్లనీయకుండా కార్యకర్తలను, నాయకులను పోలీసులు వారి సృగృహాల్లో నిర్భంధించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజును తాడేపల్లిలోని ఆయన గృహంలో పోలీసులు నిర్బంధించారు. ఈ సందర్బంగా సోమువీర్రాజు ప్రభుత్వ, పోలీసుల దమననీతిపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అమలు కావడం లేదని, అప్రకటిత అత్యవసర పరిస్తితిని అమలుచేస్తుందని ఆరోపించారు. ఎమర్జన్సీ లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమాలను అడ్డుకుంటూ, కార్యకర్తలు, నాయకులను నిర్బంధిస్తూ, అప్రజాస్వామిక విధానాలు అనుసరిస్తుందన్నారు. చలో అంతర్వేదికి పిలుపునిస్తే రాష్ట్రవ్యాప్తంగా మండలస్దాయి వరకు భాజపా కార్యకర్తలను అరెస్టులుచేశారన్నారు. సామాజిక మాధ్యమాను ఆధారంగా చేసుకుని షేర్‌లు చేస్తే నాన్‌బెయిలబుల్ కేసులు పెడుతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. రామమందిరానికి వెళ్తామంటే నిర్బంధించడం, వేలమందిని అరెస్టులు చేయడం దేనికోసమని ప్రశ్నించారు. భాజపాను ఎందుకు నిరోధిస్తున్నారని, కార్యక్రమాలను ఎందుకు అడ్డుకుంటున్నారో, అరెస్టులు ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

పోలీసుల రెండునాల్కల ధోరణి

ఆలయాల ధ్వంసం కేసులపై రాజకీయా పార్టీ కుట్ర అంశంపై డీజీపీ పూటకో మాట మారుస్తూ గందరగోళానికి తెరతీశారన్నారు. ఆలయాల ధ్వంసం అంశాలపై పార్టీల కుట్ర ఉందని ముఖ్యమంత్రి తర్వాత లేదని డీజీపీ ప్రకటించారన్నారు. రెండు రోజుల తర్వాత భాజపా ప్రమేయం ఉందని డీజీపీ ప్రకటించడంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. సత్యానికి, వాస్తవానికి దూరంగా డీజీపీ చేస్తున్న ఆరోపణలపై ఆయన సమక్షంలో చర్చించడానికి భాజపా సిద్దంగా ఉందన్నారు. పోలీసుల రిపోర్టులో రాజమండ్రిలో విగ్రహధ్వంసం సంఘటనలో భాజపా కార్యకర్తల ప్రమేయం లేదని చెప్పి ఏడాది క్రితం తిత్లీ తుపానులో ధ్వంసమైన సరస్వతిదేవి విగ్రహాన్ని సోషల్ మీడియాలో పెటి4్టన పోస్టులు చూపించి విగ్రహాలు ధ్వంసం చేసినట్లు ఆరోపిస్తూ కేసులు పెట్టడాన్ని తప్పుపట్టారు. పడిపోయిన ఆలయాలపై పోస్టులు పెడితే, ఆలయాలు ధ్వంసం చేసినట్లు కేసులు పెట్టడం ఏం చట్టం కిందకు వస్తుందని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వంతో తేల్చుకోడానికి ఆందోళనకు పిలుపును ఇచ్చామన్నారు. విమానాశ్రయాల్లో రాజ్యసభ సభ్యుల్ని, మాజీ మంత్రులను, ఎమ్మెల్సీలను, పార్టీ నాయకులను అరెస్టు చేయడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటుగా అభివర్ణించారు. ఆలయాలపై దాడులు జరిగితే భాజపా సహించదని సోమువీర్రాజు స్పష్టం చేశారు. హిందూ ధర్మానికి ఆటంకం జరిగితే ప్రజాందోళనతో అడ్డుకుంటామని, భాజపా ఎవరికీ భయపడదని హెచ్చరించారు. ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరశిస్తూ వచ్చే నెల 4 వ తేదీ నుంచి రాష్ట్రంలో రధయాత్ర చేస్తామని అన్నారు.

హిందువుల పట్ల చులకన కాదా?

హిందువులను చులకన చేస్తూ జరుగుతున్న మత మార్పిడులపై 201617 నుంచి కొనసాగుతున్న దృశ్యమాధ్యమంపై ప్రభుత్వం సంజాయిషీ ఇవ్వాలని, ఇప్పుడు నిందితులను ఎందుకు అరెస్టు చేశారో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. హిందువులను చులకన చేస్తూ భాజపా చూస్తూ ఊరుకోదని అన్నారు. హిందువులు మతతత్వవాదులు కారని, సంఘంలో అందరినీ గౌరవిస్తారన్నారు. భాజపాపై దాడిచేస్తే హిందువులపై దాడిచేసినట్లే అన్నారు.

అక్రమ అరెస్టులు

డీజపీపీ కార్యాలయం వద్దకు వెళ్లిన ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్‌ను పోలీసులు అరెస్టుచేశారు. ఆయనతో పాటు గుంటూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, నర్సరాపుపేట పార్ల మెంటు జిల్లా అధ్యక్షులు కె.సైతారావులను అరెస్టుచేశారు. గుంటూరు నగరంలో భాజపా పూర్వ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణను, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణంలను వారి గృహాల్లో పోలీసులు గురువారం ఉదయం నుంచి నిర్బంధించారు. రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్, ప్రధాన కార్యదర్శులు, వేటుకూరి సూర్యనారాయణరాజు, విష్ణువర్దనరెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, పాతూరి నాగభూషణం, పోలీసుల కన్నుగప్పి సోమువీర్రాజును నిర్భంధించిన తాడేపల్లికి వెళ్లి ఆయనకు మద్దతు తెలిపారు. భాజపా విజయవాడ, మచిలిపట్నం, గుంటూరు పార్లమెంటు జిల్లాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలను అరెస్టు చేసి తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు రూరల్, తుళ్లూరు పొలీసు స్టేషన్లకు తరలించారు.

ఎపీలో నియంతృత్వపాలన

ఎపి లో నియంతత్వ పాలన కొనసాగుతుందని రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్ విమర్శించారు. ప్రతిపక్ష నేతలను అడ్డుకునే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పార్టీలో ముఖ్యనేతల సమావేశానికి వస్తే ఎయిర్ పోర్ట్ లోనే తనను పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు. రోజుకోమాట మాట్లాడుతున్న డిజిపి, ఆలయాల ధ్వంసం సంఘటనల్లో భాజపా కార్యకర్తలు ప్రమేయం ఉంటే ఎందుకు నిరూపించ లేదని ప్రశ్నించారు. డిజిపి ప్రకటన పై పార్లమెంటు లో ప్రివిలేజ్ మోషన్ వేస్తామని హెచ్చరించారు.

మాటల మార్పిడిపై సమాధానం చెప్పాలి

డీజీపీ రెండు రకాల వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిందేనని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దనరెడ్డి డిమాండ్ చేశారు. సోము వీర్రాజు ఇంటి వద్ద పోలీసులను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. డీజీపీ వివరణ ఇవ్వకుండా వివరణ ఇవ్వక పోతే బీజేపీ ఆందోళన చేస్తుందని అన్నారు. ఆలయాల ధ్వంసం కేసు పరిష్కారం మా చేతకాదని అంగీకరిస్తే…..సీబీఐ దర్యాప్తు పై స్పందిస్తామన్నారు.

పోలీసుల తీరుపై ఖండన

బుధవారం అర్ధరాత్రి నుంచి సోమువీర్రాజును పోలీసులు గృహనిర్భందంలో ఉంచారు. గురువారం మధ్యామ్నం ఆయన బయటకు రాగానే సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు తీరు పై వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేేమి తప్పు చేశానని నా ఇంటికి వచ్చారని? అర్ధరాత్రి ఇష్టం వచ్చినట్లు వచ్చి తలుపులు కొడతారా? అని అపార్ట్మెంట్ లో అద్దెకు ఉంటున్న నేను ఉండాలా ఖాళీ చేయాలా? చుట్టూ ఉన్న వారు ఇంతమంది పోలీసులును చూసి ఏమనుకుంటారని ? ప్రశ్నించారు. పోలీసు వాహనాలను గేటుకు అడ్డంగా పెట్టడానికి నేనేమన్నా డిజిపి కార్యాలయం ముట్టడిస్తానని చెప్పానా అని ప్రశ్నించారు. పోలీసులు ప్రవర్తన, వైఖరిని ఖండిస్తూ…ముందు వారు ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని సూచించారు.