రాజధానిపై ఎన్టీఆర్, మహేష్, నాగార్జున దారెటు?

578

అమరావతిపై నోరు మెదపని ఆ ముగ్గురు
సొంత సామాజికవర్గంలోనే సెగ

(మార్తి సుబ్రహ్మణ్యం)

నందమూరి తారాకరామారావు జన్మస్థలం కృష్ణా జిల్లా నిమ్మకూరు.
అక్కినేని నాగేశ్వరరావుది కృష్ణా జిల్లా గుడివాడ.
ఘట్టమనేని కృష్ణది గుంటూరు జిల్లా బుర్రిపాలెం.
ఈ ముగ్గురిదీ ఒకే సామాజికవర్గం.
ఇప్పుడు వీళ్ల జన్మస్థలాలు, పుట్టుపూర్వోత్తరాల గురించి కొత్తగా ఎందుకు చెబుతున్నారు? అందరికీ తెలిసిన విషయాలను మళ్లీ ఎందుకు ప్రస్తావిస్తున్నారు? అసలు వాళ్లు ఇప్పుడు అర్జంటుగా ఎందుకు గుర్తుకొచ్చారు?.. అన్నదే కదా అందరి డౌటనుమానం? అవునండీ.. వాళ్లు ముగ్గురు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పుట్టి, చెన్నైలో పెరిగి సినీవినీలాకాశాన్ని ఏలినవారు. తమ నటన, ప్రతిభతో వారి పుట్టిన ప్రాంతాలకు కీర్తి తెచ్చిన వారు. అగ్రహీరోలుగా భాసిల్లుతూ, నిమిషం తీరిక లేకుండా జీవించిన ఆ ముగ్గురూ.. తమ రాష్ట్రం నుంచి చెన్నైకు వచ్చిన అభిమానులు, తమ ఊరు, జిల్లావారితో కలసి మాట్లాడేవారు. తమ ఇళ్లకు వచ్చిన వారికి భోజనాలు పెట్టి పంపించి, ప్రాంతాభిమానం ప్రదర్శించిన మహానటులు. అందులో ఎన్టీఆర్, అక్కినేని దివంగతులయ్యారు.మరి వారి సంతానం, వారసులు వారి లక్షణాలు పుణికిపుచ్చుకోవాలి కదా? ఆ ప్రాంత ప్రజల డబ్బుతోనే కోట్లకు పడగలెత్తినప్పుడు కనీస ప్రాంతాభిమానం ప్రదర్శించాలి కదా? అలా కాకుండా.. భూములు, సినిమాహాళ్లు, ఆస్తులు కొనడంలోనే వారు ఆసక్తి ప్రదర్శిస్తుంటే మరి ఆ జిల్లాల వారికి ఎలా ఉంటుంది? సొంత ప్రాంత జనం ఒక అంశం కోసం రోడ్డెక్కితే దానికి సంఘీభావం ప్రకటించకుండా సినిమా షూటింగులలో బిజీ అయిపోతే అక్కడి వారికి ఎలా ఉంటుంది?… ఇదిగో.. ఇలానే ఉంటుంది!
కృష్ణా-గుంటూరు జిల్లాలను ఏపీ రాజధానిగా ప్రకటించిన నాటి టిడిపి ప్రభుత్వం, ఆ మేరకు అమరావతిని రాజధాని మార్చి అక్కడ కొన్ని భవనాలు నిర్మించింది. అవి ఇంకా నిర్మాణదశలోనే ఉన్నాయి. ఏడు నెలల క్రితం ఏపీలో ప్రభుత్వం మారి, కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది.ఫలితంగా ఆ సర్కారు ప్రాధాన్యత మారి, రాజధానిగా ఉన్న అమరావతిని విశాఖకు మార్చే ప్రయత్నాలు గుంటూరు-కృష్ణా ప్రజలు, రైతులను ఆగ్రహపరిచాయి. ముఖ్యంగా రాజధాని సమీపంలోని 29 గ్రామాలు నెలరోజుల నుంచి నిరసనలతో రోడ్డెక్కుతున్నాయి. వారి నిరసనలకు టిడిపి,బిజెపి, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మద్దతుగా నిలిచాయి. వైకాపా మినహా అన్ని పార్టీలతో జేఏసీ ఏర్పడింది. టిడిపి అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా రంగంలోకి దిగి, అమరావతి పరిరక్షణ కోసం రోడ్డెక్కారు. పోరాటానికి నిధులు సేకరిస్తూ జోలె పడుతున్నారు. బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడైతే మోదీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశారో, అక్కడే మౌనదీక్ష నిర్వహించారు. రైతుల వద్దకు వెళ్లి మేమున్నాం.. ఆందోళన చెందవద్దని భరోసా ఇస్తున్నారు. కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరి కూడా రైతుల వద్దకు వచ్చి, రాజధాని అంగుళం కూడా అక్కడ నుంచి కదలదని హామీ ఇచ్చారు. ఈలోగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న రాజధాని మహిళపై పోలీసు లాఠీలు విరిగాయి. గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. దీనిపై హైకోర్టు, జాతీయ మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమరావతిలో రాజధాని కోసం ఆందోళన కొనసాగుతోంది. ఇదంతా రోజూ పత్రికలు చదివేవారు, టివి చానెళ్లు చూసేవారికి తెలిసిన విషయమే. కానీ, తమ ప్రాంతంలో రైతుల వేదన పతాకస్థాయికి చేరి, చివరకు వారిని జైళ్లకూ పంపించేంతగా ఉద్యమం పరాకాష్టకు చేరితే… ఆ రెండు జిల్లాలకు చెందిన ముగ్గురు అగ్ర హీరోలు ఇప్పటివరకూ స్పందించకపోవడమే రైతులకు ఆవేదన కలిగిస్తోంది.
రాజధాని ఉన్న మెజారిటీ ప్రాంతమంతా గుంటూరు జిల్లా పరిథిలోనిదే. పక్కనే తెనాలి కూడా ఉంది. మరి తెనాలికే చెందిన సూపర్‌స్టార్ మహేష్ ఇప్పటివరకూ తమ ఆందోళన గురించి మాట్లాడలేదు. కనీసం మద్దతుగా కనీసం పత్రికా ప్రకటన కూడా ఇవ్వకపోవడం రైతులు, ఆ జిల్లా వారిలో ఆగ్రహానికి కారణమవుతోంది. పైగా మహేష్ బావ, గల్లా జయదేవ్ గుంటూరు టిడిపి ఎంపీగా ఉన్నారు. మహేష్ బాబాయ్ ఆదిశేషగిరిరావు కూడా టిడిపిలోనే ఉన్నారు. వీటికిమించి తండ్రి కృష్ణను ఒకసారి ఏలూరు ఎంపీగా ప్రజలు గెలిపించారు. పోనీ మహేష్ అంటే చెన్నైలో పుట్టారనుకున్నా, కృష్ణ గుంటూరు జిల్లాల్లోనే పుట్టి పెరిగారు కాబట్టి, కనీసం ఆయన కూడా తమ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించకపోవడం ఏమిటని అక్కడి రైతులు ప్రశ్నిస్తున్నారు. గుంటూరు జిల్లాకే చెందిన నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి.. రాజధాని రైతులను పెయిడ్ ఆర్టిస్టులన్న ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీరాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాణకు డిమాండ్ చేశారు. కనీసం ఈ హీరోలకు ఆపాటి దమ్ము కూడా లేకపోవడం విమర్శలకు దారితీసింది. ఇది కూడా చదవండి.. ‘ పోసాని పాటి దమ్ము తెలుగు హీరోలకేదీ?
ఇక కృష్ణా జిల్లాలో పుట్టి, గుంటూరులో చదివి, అక్కడే ఉద్యోగ జీవితం ప్రారంభించి, ఏపీకి సీఎం అయిన నందమూరి తారకరామారావు కుటుంబంలో అగ్రహీరోగా వర్ధిల్లుతున్న.. జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజధానిపై మౌనంగా ఉండటం వారిని ఆశ్చర్యపరుస్తోంది. గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొని, తెలుగుజాతి పౌరుషం గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలే ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పడానికి లేదని వాదిస్తున్నారు. తన తాత పేరుతో ఉనికి సంపాదించుకున్న ఎన్టీఆర్‌కు, ఇప్పుడు తన ప్రాంతం సమస్యల్లో ఉంటే ప్రాంతాభిమానం ఏమయిందని ప్రశ్నిస్తున్నారు. బహుశా తనకు పిల్లనిచ్చిన మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీలో ఉండటం, తన మిత్రులైన మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా వైసీపీకి సన్నిహితుడు కావడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ లౌక్యంగా మౌనవ్రతం పాటిస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు. తాత వర్థంతి, జయంతి రోజు పత్రికల్లో నిలువెత్తు ప్రకటనలు ఇచ్చే జూనియర్ ఎన్టీఆర్.. తమ ఉద్యమానికి కనీసం పత్రికాప్రకటన రూపంలో కూడా మద్దతునివ్వకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
కృష్ణా జిల్లాలోనే పుట్టిన అక్కినేని నాగేశ్వరరావు వారసుడు నాగార్జున కూడా, ఇప్పటిదాకా రాజధానిపై పెదవి విప్పకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఏపీలో బాగా ఆస్తులు కూడబెట్టుకున్న అక్కినేని కుటుంబానికి రాష్ట్రంపై బాధ్యత లేదా అని సొంత సామాజికవర్గం వారే నిలదీస్తున్నారు. ఏపీ సీఎం జగన్‌కు సన్నిహితుడయినందువల్లే ఆయన పెదవి విప్పడం లేదంటున్నారు. విచిత్రంగా ఒకే సామాజికవర్గానికి చెందిన ఈ ముగ్గురు, అదే సామాజికవర్గం నుంచి విమర్శలు ఎదుర్కోవడమే విశేషం. ఎక్కడో విదేశాల్లో ఉన్న ఎన్నారైలు కూడా రాజధానికి మద్దతుగా ఆయా దేశాల్లో నిరసన ప్రకటిస్తుంటే.. తమ జిల్లాల్లో పుట్టి పెరిగి, తమవల్ల ఈ స్థాయికి ఎదిగిన అగ్ర హీరోలు మాత్రం మౌనంగా ఉండటమే ఆ రెండు జిల్లాల వారికి ఆగ్రహం కలిగిస్తోంది.దీనితో అగ్రహీరోల సినిమాలు చూడవద్దని అమరావతి జేఏసీ నేతలు పిలుపునివ్వాల్సి వచ్చింది. ఇది కూడా చదవండి.. ‘ సిని‘మా’కు తప్పని రాజధాని సెగ ’ అన్నట్లు.. ఈ ముగ్గురు హీరోలు తెలంగాణ యువ మంత్రి, తెరాస ఉత్తరాధికారి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితులు మరి!