నారా అమ్ములపొదిలో నందమూరి కార్డు

391

ఇకపై భువనేశ్వరి క్రియాశీలపాత్ర?
వర్కవుటయిన భువనేశ్వరి పర్యటన
గాజుల విరాళంపై సర్వత్రా చర్చ
వైసీపీ నేతల మూకుమ్మడి ఎదురుదాడి

( మార్తి సుబ్రహ్మణ్యం)

టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అమ్ములపొది నుంచి సంధించిన ‘నందమూరి కుటుంబ అస్త్రం’ బాగానే వర్కవుటయినట్లు కనిపిస్తోంది. రాజధాని రైతులు చేస్తున్న పోరాటానికి ఇప్పటివరకూ చంద్రబాబు నాయుడు, ఇతర నేతలు మాత్రమే సంఘీభావం ప్రకటించి, ప్రత్యక్ష ఆందోళనలోపాల్గొనగా..తాజాగా చంద్రబాబు నాయుడు భార్య, టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుమార్తె భువనేశ్వరి పాల్గొనడం చర్చనీయాంశమయింది. ఫలితంగా ఆమె భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లోనూ క్రియాశీలపాత్ర పోషించనున్నారా? అన్న ప్రశ్నలకు తెరలేచింది.
నందమూరి ఫ్యామిలీని కలిపిన లక్ష్మీపార్వతి
ఎన్టీఆర్ హయాంలో పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలకపాత్ర పోషించారు. మంత్రి,ఎంపి పదవులు అనుభవించినప్పటికీ ఆయన పాత్ర ప్రకాశంజిల్లాకే పరిమితమయింది. కానీ చంద్రబాబునాయుడు అప్పటికే పార్టీలో నెంబర్‌టూ స్థానంలో ఉన్నారు. అప్పటికి నందమూరి కుటుంబసభ్యులెవరూ నే రుగా టిడిపిలో క్రియాశీల పాత్ర పోషించిన దాఖలాలు లేవు. దివంగత నందమూరి హరికృష్ణ అప్పటికి బావల చాటు బావమరిదిగానే మిగిలిపోయారు. ఒక దశలో ఎన్టీఆర్ తన హిందూపురం పర్యటనలో తన వారసుడు బాలకృష్ణ అని ప్రకటించడం సంచలనం సృష్టించినా, తర్వాత ఆయన తన విధానం మార్చుకున్నారు.
ఎన్టీఆర్ రెండవ వివాహం చేసుకునేముందు వరకూ పార్టీలో ఇద్దరు అల్లుళ్లయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడు మాత్రమే కీలకపాత్ర పోషించారు. ఆ సమయంలో నందమూరి కుటంబం ప్రమేయం సున్నా. కానీ, ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్న తర్వాతనే నందమూరి కుటుంబ జోక్యం ప్రారంభమయింది. లక్ష్మీపార్వతి జోక్యం వల్ల టిడిపి ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని, ఆమె చర్యల వల్ల ఎన్టీఆర్ ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం వచ్చిన ఫలితంగా, పార్టీ ఆమె గొడుగు కింద చేరే పరిస్థితి ఏర్పడిందని అనుమానించిన తర్వాతనే, నందమూరి కుటుంబం పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించటం ప్రారంభించింది. ఒకరకంగా భిన్న ధృవాలుగా ఉన్న నందమూరి ఫ్యామిలీని ఏ ం చేసిన ఘనత లక్ష్మీపార్వతిదే.
బాబును సీఎం చేసిన నందమూరి ఫ్యామిలీ
ఆ సమయంలో పార్టీలో నెంబర్‌టూగా ఉన్న చంద్రబాబునాయుడు తన భార్య భువనేశ్వరి సహకారంతో నందమూరికుటుంబాన్ని ఏకతాటిపైకి తీసుకురాగలిగారు. నందమూరి కుటుంబం చిన్నమ్మగా పిలుచుకునే పురందీశ్వరి చొరవ, హరికృష్ణ-బాలకృష్ణ ఉత్సాహంతో నందమూరి కుటుంబం చంద్రబాబు నాయుడుకు బాసటగా నిలిచింది. ఫలితంగా ఆయన ముఖ్యమంత్రి కాగా, తొలిసారి నందమూరికుటుంబం నుంచి హరికృష్ణ మంత్రివర్గంలో చేరారు. ఆ తర్వాత ఒప్పందంప్రకారం దగ్గుబాటికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడంతో, దగ్గుబాటి దంపతులు నారా-నందమూరి కుటుంబానికి రాజకీయంగా దూరమయ్యారు. లక్ష్మీపార్వతి ఎపిసోడ్‌లో నందమూరి కుటుంబ ప్రమేయం, పాత్రనే చంద్రబాబు నాయుడుకు కలసివచ్చింది. నిజానికి ఆ సమయంలో నందమూరికుమారులు, కుమార్తెలు దన్నుగా లేకపోతే, బాబుకు సీఎం అయ్యే అవకాశాలు దక్కేవి కావన్నది నిర్వివాదం. ఆ తర్వాత బాబు మంత్రివర్గంలో ఉన్న హరికృష్ణ, తన బావ బాబుతో వచ్చిన విబేధాల కారణంగా బయటకు వచ్చి, సొంత పార్టీ స్థాపించారు. బాబు గురించి ఊరూవాడా ప్రచారంచేసినా, ఆయన సహా ఎవరూ డిపాజిటు కూడా దక్కించుకోలేకపోయారు.ఆ తర్వాత హరికృష్ణ తిరిగి టిడిపి గూటికి చేరుకున్న నేపథ్యంలో,ఆయనకు పొలిట్‌బ్యూరో సభత్వం ఇచ్చారు. అయినా ఆయన ఎందుకో అసంతృప్తిగా కనిపించేవారు. తన వద్దకు వచ్చిన నేతల వద్ద బాబు గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేసేవారు. టిడిపి విపక్షంలో ఉన్న సమయంలోనే, ఎన్నికల్లో తొలిసారిగా నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. అటు నందమూరిబాలకృష్ణ కూడా ప్రచారంచేశారు. అటు బాబాయ్, ఇటు అబ్బాయ్ ప్రచారంచేసినా టిడిపి విజయంసాధించలేకపోయింది. అయితే 2004 ఎన్నికల్లో కంటే దాదాపు 50 సీట్లు అదనంగా సాధించగలిగింది.
పార్టీకి దూరమైన జూనియర్ ఎన్టీఆర్
ఆ తర్వాత జరిగిన కుటుంబ సమీకరణలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారు. హరికృష్ణ కూడా సమైక్య ఆంధ్ర ఉద్యమ సమయంలో పార్టీ నాయకత్వంతో చర్చించకుండానే, తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, బాబును ఇబ్బందిపెట్టారు. తన కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్‌కు కాకుండా, బాబు తన కుమారుడు లోకేష్‌ను ప్రోత్సహించడాన్ని జీర్ణించుకోలేకనే హరికృష్ణ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉండేవారు. అయితే, నందమూరి రామకృష్ణ మాత్రం సర్వవేళ లా బాబుకే బాసటగానిలిచారు. అధికార మార్పిడి విషయంలో కుటుంబాన్ని ఏకం చేసేందుకు కృషి చేసిన భువనేశ్వరి, తర్వాత ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకున్న దాఖలాలులేవు. ఆమె హైదరాబాద్‌లో ఉంటూ హెరిటేజ్ వ్యాపారం చూసుకుంటున్నా, అమరావాతిలో ఉన్న తన భర్త సమయానికి భోజనంచేస్తున్నారా లేదా అని వాకబు చేసేవారు. ఆయన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునేవారు.
అటు ఎన్టీఆర్ పెద్ద కుమార్తె పురందీశ్వరి కూడా కాంగ్రెస్‌లోచేరి కేంద్రమంత్రి అయ్యారు. తర్వాత విభజన సమయంలో ఆమె బాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు, ఆరోపణాస్ర్తాలు సంధించారు. తర్వాత బాబు ఏపీ సీఎం అయిన తర్వాత కూడా, బిజెపి నేతగా బాబును విడిచిపెట్టలేదు. అయితే బాబు తన వియ్యంకుడు-కమ్ బావమరిది బాలకృష్ణకు హిందూపురం సీటిచ్చి గెలిపించుకున్నారు. కానీ, ఐదేళ్లలో ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు.అటు బాలయ్య కూడా ఎలాంటి పదవి ఆశించలేదు.
తెరవెనుక నుంచి…తెరపైకి
లక్ష్మీపార్వతి ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ కుటుంబాన్ని ఏకంచేసి, సోదరి పురందీశ్వరి సాయంతో.. తన భర్త చంద్రబాబును సీఎం అయేందుకు కృషి చేసిన భువనేశ్వరి, ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఆమె హెరిటేజ్ కంపెనీ కార్యకలాపాలకే పరిమితమయ్యారు. అయితే, తాజాగా అమరావతి రైతుల ధర్నాలో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించి, వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆమె కొద్దికాలం నుంచి కొడుకు లోకేష్‌తో కలసి టి డిపి ఆర్ధిక వ్యవహారాలు మానిటరింగ్ చేస్తున్నారన్న ప్రచారం వినిపించింది. గండిపేట లోని ఎన్టీఆర్‌స్కూల్ పైనా ఆమె దృష్టి సారించారు. సహజంగా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్టు నిర్వహించే సేవా కార్యక్రమాలు, ఎన్టీఆర్ స్కూలుకు సంబంధించిన వ్యవహారాల్లోనే కనిపిస్తుంటారు. అలాంటి ఆమె హటాత్తుగా రైతుల దీక్షకు స్వయంగా హాజరయిన తర్వాత ఆమెపై అందరి దృష్టి మళ్లింది. ఆర్ధిక క్రమశిక్షణలో తండ్రి ఎన్టీఆర్ లక్షణాలు పుణికిపుచ్చుకున్న భువనేశ్వరి, ఆ దారిలోనే హెరిటేజ్ కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్నారు. అయితే, ఆమె తాజాగా రైతు ఆందోళనకు హాజరయి, తన చేతి గాజులు విరాళంగా ఇవ్వడంపై చర్చమొదలయింది. దానిని కొందరు స్వాగతించగా, వైసీపీ నేతలు సహజంగానే విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
గాజుల విరాళంపై వైసీపీ ప్రశ్నాస్త్రాలు
చేతి గాజుల కంటే.. రైతుల నుంచి లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేయాలని కొందరు, తన సామాజికవర్గానికి, తన కుటుంబానికి చెందిన భూముల విలువ పడిపోతుందనే భయంతోనే ఆమె ఆందోళనలో పాల్గొన్నారని మంత్రులు బొత్స, పుష్పశ్రీవాణి, అంబటి రాంబాబు వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. గతంలో పుష్కరాల్లో అంతమంది చనిపోయిప్పుడు గానీ, ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు గానీ ఆమె ఎందుకు బయటకు రాలేదన్న ప్రశ్నలతో..భువనేశ్వరి రాకపై కొత్త చర్చకు తెరలేపారు.అయితే, జగన్ భార్య భారతిలా భువనేశ్వరిపై ఈడీ కేసులేమీ లేవని, భారతి మాదిరిగా భువనేశ్వరి ముద్దాయి కాదని టిడిపి నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమ, పంచుమర్తి అనూరాధ వంటి నేతలు ఎదురుదాడి చేశారు. భువనేశ్వరి వస్తే వైసీపీ ఎందుకు కలవరపడుతోందని ప్రశ్నించారు.
వైసీపీ దూకుడు వెనుక..
ఈ పరిణామాలు పరిశీలిస్తే.. భువనేశ్వరి రాకతో వైసీపీ రాజకీయపరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు వారి విమర్శల ధోరణి స్పష్టం చేస్తోంది. ఎన్టీఆర్ కుటుంబం నుంచి మరో వ్యక్తి రాజీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని, ఆ మేరకు ఇప్పటి క్లిష్ట పరిస్థితిలో చాణక్యుడైన చంద్రబాబు నాయుడు మహిళల సానుభూతి కోసం, ఆమెను కావాలనే తెరపైకి తీసుకువచ్చారని వైసీపీ భావిస్తోంది. ‘బాబుకు ఎప్పుడు ఏ ఎత్తు వేయాలో, ఎప్పుడు ఎవరిని వాడుకోవాలో, క్లిష్ట పరిస్థితిని సానుకూలం కాకపోయినా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో బాగా తెలుసు. అందులో ఆమె ఇప్పుడు పార్టీలో కూడా తెరవెనుక నుంచి ప్రముఖ పాత్ర పోషిస్తున్నారంటున్నారు. అదెంత వరకూ నిజమో మాకూ తెలియదు. అధికారంలో ఉన్నప్పుడు టిటిడి వ్యవహారమంతా ఆమెనే చూశారని మా అందరికీ తెలుసు. అయితే, ఆమెను తీసుకురావడం వెనుక బాబు మళ్లీ ఎన్టీఆర్ ఫ్యామిలీ కార్డు వాడేందుకు సిద్ధమవుతున్నారని కనిపిస్తూనే ఉంది. అయితే మా వాళ్లు ఆమె చేతి గాజుల విరాళంపై అంత అతిగా స్పందించాల్సిన అవసరంలేదు. వదిలేస్తే సరిపోయేద’ని ఓ వైసీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.