సర్కారు సేవకులా? ఉద్యోగుల ప్రతినిధులా?

465

తరలింపుపై తల్లడిల్లుతున్న సచివాలయ ఉద్యోగులు
మరి ఉద్యోగ సంఘాల లీడర్లకు ఏదీ ఉక్రోషం?
ఎన్జీఓ నేతలు మాట్లాడరెందుకు?
రాజధాని తరలింపుపై సచివాలయ ఉద్యోగుల ప్రశ్నలకు బదులేదీ?
ఇంతకూ ఉద్యోగ సంఘాల నేతలు ఎవరి ప్రతినిధులు?
వెంకట్రామిరెడ్డిపై అసమ్మతి సెగ
ఉద్యోగులలో పెరుగుతున్న తిరుగుబాటు

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సచివాలయంలో మాత్రం వారిదే హవా. సీఎం పేషీ నుంచి, మంత్రుల చాంబర్లలో ఎక్కడ చూసినా వాళ్లే. ఖద్దరు చొక్కాలో కొందరయితే, కాస్ట్లీ షర్టులతో మరికొందరు. వాళ్లొస్తే చాలు.. ఎంత పెద్ద మంత్రయినా వెంటనే అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందే. వారిని లెక్కచేయకపోతే తర్వాత ఏమవుతుందో వారికి తెలుసు. ఇంతకూ వాళ్లెవరనుకుంటున్నారా? సీఎం నుంచి మంత్రుల వరకూ కలవరపెట్టేంత గొప్పవాళ్లెవరుకుంటున్నారా? వాళ్లేనండి… సచివాలయ, ఎన్జీఓ నేతలు.
ప్రభుత్వానికి కళ్లు,చెవులు ఉద్యోగులయితే.. మెదడుతోపాటు, నడిపించే కాళ్లు,చేతులే ఉద్యోగ సంఘాల నేతలు. ముఖ్యంగా దశాబ్దాల నుంచే తెలుగునాట ఎన్జీఓలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఎన్టీఆర్ పుణ్యాన ఉద్యోగులు ప్రభుత్వాన్ని దించేస్తారన్న భయం ప్రారంభమయింది. నిజానికి ప్రభుత్వాన్ని గద్దెదించేది ప్రజలు. కానీ.. ఉద్యోగులకు ఆ బిరుదు వచ్చింది. దానితో తెలుగునాట ఎన్జీఓ నేతల హవా చెప్పలేనంత ఎత్తుకు ఎదిగింది. ఎన్జీఓలతో పెట్టుకుంటే తమ ప్రభుత్వం పడిపోతుందన్న భయం పాలకుల్లో మొదలయింది. తన హయాంలో ఉద్యోగులతో ఎక్కువ పనిచేయించినందుకు, వారితో వ్యతిరేకత తెచ్చుకున్న ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ చంద్రబాబు నాయుడు లాంటి వాడే.. అధికారం కోసం తన పద్ధతి మార్చుకోవాల్సి వచ్చింది. అదే పక్క రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ అయితే, అసలు వారిని ఖాతరు చేయరు. ఉద్యోగులు తమ విధి తాము చేయాలే తప్ప, ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోకూడదని హెచ్చరించినంత పనిచేశారు. రెవిన్యూ ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 53 రోజులు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తేనే కేసీఆర్ ఖాతరు చేయలేదు. అంటే.. రౌతును బట్టి గుర్రం నడక ఉంటుందని స్పష్టమవుతుంది.
ఏపీలో ఎన్జీఓ, సచివాలయ ఉద్యోగ నేతలకు మొదటి నుంచి పాలకుల వద్ద, మొదటి నుంచీ మంచి గిరాకీ ఉంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వెలగపూడి సచివాలయంలోని సీఎం, మంత్రుల పేషీల్లో ఎక్కువగా వారే దర్శనమిచ్చేవారు. ట్రాన్స్‌ఫర్ల సీజన్లలో అయితే సార్లు మహా బిజీ. కమర్షియల్ టాక్స్, ఎక్సైజ్, రెవిన్యూ శాఖలపై సార్లకు ‘బాగా పట్టు ఎక్కువ’. ఉమ్మడి రాజధాని హయాంలోనూ డిటో. కాంగ్రెస్ హయాంలో అయితే చెప్పాల్సిన పనేలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఓ ఎన్జీఓ నేతయితే, వారి డైరక్షన్ ప్రకారమే సమైక్యాంధ్ర ఉద్యమాలు నిర్వహించేవారు. దారి ఖర్చులు, చేతిఖర్చుల గురించి మనం మాట్లాడుకోకూడదు. ప్రముఖుల వద్ద చేతిలోడైరీ, వచ్చిన పనిని బట్టి జనం కనిపించేవారు. చివరకు ఎన్జీఓ సంఘ నేత అశోక్‌బాబుకు టిడిపి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేంత ప్రేమానుబంధం అప్పటి యూనియన్‌లో కనిపించింది. అయితే.. ఉద్యోగులలో చాలా పట్టుందని భావించి, ఆయన ఏది చెబితే ఉద్యోగులు అదే శిలాశాసనం మాదిరిగా భావిస్తారని భ్రమించి టిడిపి అశోక్‌బాబుకు ఎమ్మెల్సీ ఇచ్చింది. అయితే ఓట్ల పండుగ రోజు, ఉద్యోగులంతా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓట్లు వేశారనుకోండి. అది వేరే విషయం.
నిజానికి చాలామంది ఎన్జీఓ నేతలు వివిధ పార్టీలకు అంకితమయి, తర్వాత ఏదో ఒక పదవుల్లో చేరినవారు ఉన్నారు. ఎవరు పాలకులయితే వారితో అనుబంధం పెంచుకోవడం, ఆ సందర్భాల్లో విపక్షాలపై విరుచుకుపడుతుండటం కూడా మనం చూస్తున్నదే. ఇప్పుడైతే కొందరు ఉద్యోగ సంఘ నేతలు అధికారపార్టీ ప్రతినిధులు కూడా ఈర్ష్యపడే స్థాయిలో విపక్షాలను విమర్శిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. అసలు ఉద్యోగ సంఘ అధ్యక్ష ఎన్నికల్లో చరిత్రలోతొలిసారిగా ప్రభుత్వమే జోక్యం చేసుకుని, తనకు కావలసిన వారిని ఎంపిక చేసుకునేలా వ్యవహరించటం కొత్తగా చూస్తున్న సంప్రదాయం. పోలీసు అధికారుల సంఘం కూడా దాదాపుగా అలాగే వ్యవహరిస్తుంటుంది. వైసీపీ విపక్షంలోఉన్నప్పుడు బదిలీలపై అనేక ఆరోపణలు చేసింది. డిజిపి, ఏడిజిలను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేసింది. అప్పుడు దాన్ని నాటి సంఘం తమ బాసుల మెప్పు కోసం మీడియా ముందుకు వచ్చి వైసీపీ నేతలపై ఆగ్రహించారు. సీన్ కట్ చేస్తే, నాటి విపక్షమే ఇప్పుడు అధికారపక్షమవగా, నాటి అధికారపక్షం విపక్షమయింది. ఇటీవల కాలంలో పోలీసు అధికారులపై టిడిపి నేతలు చేస్తున్న విమర్శలను కూడా ఆ సంఘ నేతలు యధావిథిగా బాసుల పట్ల భక్తితో ఖండించారు.
రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు జగన్ సర్కారు చేస్తున్న ప్రయత్నాలపై సచివాలయ ఉద్యోగులు గందరగోళంలో ఉన్నారు. హైదరాబాద్ నుంచి బెజవాడకు వచ్చి, ఇంకా పూర్తిగా కుదురుకోని తమ కుటుంబాలతో ప్రభుత్వాలు ఫట్‌బాల్ ఆడుకుంటున్నాయని మొత్తుకుంటున్నారు. రాష్ట్రం విడిపోయి, ఆరేళ్లయినా, ఇంకా పూరిస్థాయిలోఉద్యోగులెవరూ ఏపీకి వచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు కేంద్రంతో చర్చించి, వారి కోసం రోజూ ఎంప్లాయిస్ ట్రైన్ వేయించడంతో హైదరాబాద్ వచ్చి వెళ్లేందుకు వెసులుబాటు ఏర్పడింది. ఫిట్‌మెంట్ కూడా ఊహించనంత ఇచ్చారు. అలాగే శనివారం సెలవు ఇవ్వడంతో, శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ వెళ్లి కుటుంబసభ్యులతో గడిపే అవకాశం ఉండేది. ఇప్పటికీ కొన్ని వందలమంది ఉద్యోగులు హైదరాబాద్‌లో కుటుంబానికి దూరంగా ఉంటూ.. ఇబ్రహీంపట్నం, గొల్లపూడి వంటి ప్రాంతాల్లో బ్యాచిలర్లుగా బతుకుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు అమరావతి పరిసర ప్రాంతాల్లో బ్యాంకు లోన్లు తీసుకుని ఇళ్లు, స్థలాలు కొనుకున్నారు. వారి పిల్లల చదువులు హైదరాబాద్ నుంచి విజయవాడ,గుంటూరుకు ఇటీవలే మారుతున్నాయి. మరికొందరు మాత్రం వారిని హైదరాబాద్‌లోనే ఉంచి చదివిస్తున్నారు. ఏపీ సచివాలయానికి హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగుల వాస్తవ పరిస్థితి ఇదీ!
మీకు గుర్తుందా?.. ఐదేళ్ల కిత్రం రాష్ట్ర విభజన జరిగి, వెలగపూడికి సచివాలయం మారిన తర్వాత, ఏపికి వెళ్లిన ఉద్యోగుల భావోద్వేగం మీకు గుర్తుందా? దశాబ్దాల నుంచి హైదరాబాద్‌తో విడదీయలేనంతగా పెనవేసుకున్న వారి బంధం తెగిపోయి, స్వరాష్ట్రానికి వెళ్లిపోతున్న ఆ సమయంలో అన్నదమ్ముల్లా కలసి పనిచేసిన ఆంధ్రా-తెలంగాణ ఉద్యోగులలో కనిపించిన కన్నీరు మీకు గుర్తుందా? ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనాలు చేసుకుని, ఒకరి కన్నీరు మరొకరు తుడుచుకున్న ఆ ఆత్మీయబంధం గుర్తుందా? మహిళా ఉద్యోగులకయితే.. తెలంగాణ మహిళా ఉద్యోగినులు చీర,సారె పెట్టి మరీ సాగనంపిన ఆత్మీయ దృశ్యాలు గుర్తున్నాయా? ఏపీకి వెళుతున్న తమ సహచర ఉద్యోగులు ఎక్కే బస్సు వద్దకు వచ్చి, అది కనుచూపు దాటేంతవరకూ చే తులూపి వీడ్కోలు పలికిన ఆ సుంద ర,సుమధుర దృశ్యాలు గుర్తున్నాయా?.. అవును. ఉమ్మడి రాష్ట్ర సచివాలయంలో ఏళ్లపాటు కొలువు దీరి, విభజన తర్వాత ఇంకా పదేళ్ల సమయం ఉన్నప్పటికీ, చంద్రబాబు ఇచ్చిన పిలుపు వెలగపూడికి వచ్చారు. అలా.. బాబు పిలిస్తే హైదరాబాద్ నుంచి అమరావతికి. జగన్మోహన్‌రెడ్డి చెబితే అమరావతి నుంచి విశాఖకు. రేపు ఏ సుబ్బారావో సీఎం అయితే విశాఖ నుంచి కర్నూలుకు. హైదరాబాద్‌ను వీడి బెజవాడకు వచ్చిన ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు అమగ్యగోచరం.

హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి కొద్దిగా కుదురుకుంటున్న ఉద్యోగులను, మళ్లీ విశాఖకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో, ఇంకో అలజడి. శుక్రవారం సాయంత్రం విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళితే ఎప్పుడు చేరాలి? మళ్లీ సోమవారం విశాఖకు ఎప్పుడు బయలుదేరితే ఎప్పుడు చేరాలి? మరి అక్కడ ఇంటి రేట్ల సంగతేమిటి? మరి ఇప్పుడు కొన్న ఇళ్లకు చెల్లించే ఈఎంఐల గతేమిటి? బె జవాడ, గుంటూరులో చదువుకుంటున్న పిల్లల పరిస్థితి ఏమిటి? అసలు రాజధాని తరలింపుపై ఏ ఒక్క కమిటీ అయినా మా అభిప్రాయాలేమిటని అడిగిందా? రేపు మళ్లీ ఇంకో ప్రభుత్వం వచ్చి కొత్తరాజధాని కర్నూలు అంటే అక్కడికీ వెళ్లాల్సిందేనా? ఇవీ..సచివాలయం ఉద్యోగులు గత కొద్దిరోజుల నుంచి సంధిస్తున్న ప్రశ్నలు. మీడియా ముందుకొచ్చి సంధించినఈ ప్రశ్నలు నేతలనుతాకి, జనంలోకి వెళ్లడం సర్కారుకు షాక్ కలిగించింది.మరి వారికి జవాబు ఇవ్వాల్సిన ఉద్యోగ సంఘాల నేతలు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారంటే.. జవాబే లేదు. ఒకరేమో ప్రభుత్వ విధానాలు అమలుచేయాల్సిన బాధ్యత

ఉద్యోగులదే. అప్పుడు పదేళ్ల సమయం ఉన్నా చంద్రబాబు రమ్మంటే హైదరాబాద్ నుంచి బెజవాడ వచ్చాం. ఇప్పుడు జగన్ విశాఖకు వెళ్లమంటే వెళ్లాల్సిందే అంటారు. ఇంకో నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉద్యోగులకు అన్యాయం జరిగిందని, తమకు ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్న ఆలోచన లేదంటారు. మరో నాయకమ్మన్యుడేమో విపక్షాలు ఉద్యోగులపై బురద చల్లుతున్నాయని, రాజధాని తరలింపుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటారు. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా సచివాలయాన్ని ఎలా తరలిస్తారని, తమ కుటుంబాల పరిస్థితి ఏం కావాలని ఉద్యోగులు సంధించిన ప్రశ్నలకు మాత్రం నేతాశ్రీల వద్ద ఇప్పటికీ జవాబు లేదు. తాజాగా సచివాలయంలో నిర్వహించిన ఉద్యోగుల సమావేశంలో కూడా ఓ నేత ఇలాగే సెలవిచ్చారు. అయితే ‘ప్రభుత్వానికి దగ్గరవాడు కదా అని వెంకట్రామిరెడ్డిని ఎప్పుడూలేని విధంగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆయన గంగ చంద్రముఖిలా మారినట్లు వ్యవహరిస్తున్నారు. ఇకనయినా మీ రాజకీయ అవతారాన్ని పక్కనబెట్టి, ఉద్యోగసంఘ నేతలా వ్యవహరించండ’ని ఉద్యోగులు వెంకట్రామిరెడ్డికి బహిరంగలేఖ రాయడం బట్టి.. సచివాలయ ఉద్యోగులు పాలకులకు ఎంత నమ్మకంగా పనిచేస్తున్నారో స్పష్టమవుతోంది.
రాజధాని తరలింపుపై ఇప్పటివరకూ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పడం తప్ప…. ఉద్యోగులకు నష్టం వాటిల్లే చర్యలు తీసుకుంటే సహించేది లేదని, ఒకవేళ తమకు అన్యాయం జరిగితే పరిపాలన స్తంభింపచేస్తామని ఇప్పటివరకూ ఒక్క ఉద్యోగ సంఘ నేతగానీ, ఎన్జీఓ నేత గానీ మాటమాత్రంగా కూడా హెచ్చరించకపోవడంబట్టి.. ఉద్యోగ సంఘనేతలు ఎంత సమర్ధవంతంగా పనిచేస్తున్నారో స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఓవైపు తమ సహచర ఉద్యోగులు, ముఖ్యంగా మహిళలు.. రాజధాని తరలింపుపై గందరగోళంలో ఉంటే, వారికి భరోసా ఇచ్చి బాసటగా నిలవాల్సిన నేతాశ్రీలు మాత్రం , సర్కారు సేవకుల్లా వ్యహరించటమే విమర్శలకు దారితీస్తోంది. అంతా సర్కారు సేవకులే. కానీ… అందులో సర్కారు ‘అసలు’ సేవలకులు వేరయా!