పురంధీశ్వరిపై సోము ఫైర్!

472

అయోధ్యకు నీరు-మట్టిపై విభేదాలు
విమర్శలున్నందున వద్దన్న పురంధీశ్వరి
ఇంకా బాబు అజెండా ఏంటని ఆమెపై  సోము ఫైర్
కేంద్రమంత్రి మురళీధరన్, సునీల్ ప్రేక్షకపాత్ర
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆమె పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. పైగా ఒక రాష్ట్రానికి ఇన్చార్జి. కేంద్ర మాజీ మంత్రి. అయినా సరే. పాపం  పార్టీ కోర్ కమిటీలో రాష్ట్ర అధ్యక్షుడి ఆగ్రహావేశాల ముందు, ఆమె  తలదించుకోవలసి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అజెండాను అమలుచేస్తున్నారన్న అపవాదును మూటకట్టుకోవలసి వచ్చింది. ఇంతకూ.. అయోధ్యకు రాష్ట్రంలోని దేవాలయాల నుంచి నీరు-మట్టి తీసుకువెళ్లాలన్న, అధ్యక్షుడి అభిప్రాయంతో విబేధించడమే ఆమె చేసిన పొరపాటు.  ఆమెనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధీశ్వరి!  ఆమెపై విరుచుకుపడిన నాయకుడు  ఎవరంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు!!  ఇంతకూ ఈ గొడవ ఎందుకంటే.. రాష్ట్రంలోని దేవాలయాల నుంచి పవిత్రజలం-మట్టి అయోధ్యకు తీసుకువెళ్లాలా? వద్దా? అన్న అంశాన్ని నిర్ణయించడంపై!

అయోధ్యలో రామాలయం నిర్మిస్తున్న నేపధ్యంలో, ఆలయ నిర్మాణానికి బీజేపీ నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తన వంతు విరాళంగా పదివేల రూపాయలు ఇచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన కీలక నేతలు కూడా జిల్లాలకు వెళ్లి , పార్టీ ప్రముఖుల సాయంతో స్ధానిక వ్యాపారులు- పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు సేకరించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ కారణంతోనే కీలకమైన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమాలకు,  ఓ 15 రోజుల పాటు విరామం ప్రకటించారు.

అయితే ఒకవైపు అయోధ్యలో ఆలయ నిర్మాణం కోసం నిధులు సేకరిస్తున్న బీజేపీ నాయకత్వం.. మరోవైపు రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల నుంచి పవిత్ర జలం-మట్టిని సేకరించి అయోధ్యకు పంపాలని భావించింది. దానిపై విశాఖ పురంధీశ్వరి నివాసంలో జరిగిన కోర్‌కమిటీలో చర్చించింది. దేవాలయాల నుంచి పవిత్రజలం-మట్టిని సేకరించి అయోధ్యకు తీసుకువెళ్లాలన్న తన అభిప్రాయాన్ని, పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు మినీ కోర్ కమిటీ సమక్షంలో వ్యక్తం చేశారు. దానిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధీశ్వరి వ్యతిరేకించారు. అందుకు రాజకీయ కారణాలను కూడా వివరించారు.

ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అమరావతి నగరానికి నీరు-మట్టి ఇచ్చి మోసం చేశారన్న విమర్శలను పురంధీశ్వరి ప్రస్తావించారు. మళ్లీ ఇప్పుడు అయోధ్య కోసం నీరు-మట్టి ఇస్తే, మరోసారి బీజేపీ విమర్శలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆమె వివరించారు. కాబట్టి ఆ ఆలోచన వల్ల ఉపయోగం లేదన్నట్లు ఆమె మాట్లాడారు.

దానితో ఆగ్రహంతో ఊగిపోయిన వీర్రాజు, ఆమెపై విరుచుకుపడినట్లు సమాచారం. ’’ఇంకా మీరు చంద్రబాబు అజెండాను అమలుచేస్తారా? బాబు అజెండా, ఆయన లైన్ ప్రకారం బీజేపీ వెళ్లాలా? పచ్చ మీడియా చెప్పినట్లు మనం వినాలా? ఎవరో ఏదో అంటే మనం మన పొలిటికల్ లైన్‌ను వదులుకోవాలా?’’ అని విరుచుకుపడ్డారు. దానితో ఆమె పక్కనే ఉన్న కేంద్రమంత్రి మురళీధరన్ వైపు చూడగా, ఆయన కూడా మౌనంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఈ అంశంలో పురంధీశ్వరికి ఎవరూ బాసటగా నిలవకపోవడంతో, ఆమె ఒంటరి కావలసి వచ్చింది.

సహజంగా పార్టీ సమావేశాల్లో అచ్చమైన తెలుగులో, పాము చావకుండా కర్ర విరక్కుండా అన్నట్లు లౌక్యంగా మాట్లాడే పురంధీశ్వరి, అయోధ్యకు నీరు-మట్టి పంపాలన్న అంశంలో మాత్రం గళం విప్పి, భంగపడాల్సి వచ్చింది. అసలు కోర్ కమిటీ సమావేశాల్లో ఆమె ఎప్పుడూ నేరుగా తన అభిప్రాయాలు చెప్పిన సందర్భాలు లేవని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

కాగా అయోధ్యకు దేవాలయాల నుంచి, నీరు-మట్టి తీసుకువెళ్లాలన్న సోము వీర్రాజు నాయకత్వం ఆలోచన మంచిదేనని,  పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.అమరావతి నగరానికి మోదీ ఇచ్చిన మట్టి-నీరుకు, అయోధ్యలో ఆలయ నిర్మాణానికి ఇక్కడ నుంచి తీసుకువెళ్లే పవిత్రజలం-మట్టి వేర్వేరు అంశాలుగా చూడాలని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పురంధీశ్వరి మినీ కోర్ కమిటీలో ఇలాంటి సున్నిత అంశాలకు బదులు, పార్టీ నిర్మాణ అంశాలపై గళం విప్పితే బాగుంటుందన్న సూచన వ్యక్తమవుతోంది.