ప్రతిపక్షాలను ఇరుకున పెట్టిన జగన్ ఢిల్లీ పర్యటన.

420

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ.. ప్రతిపక్షాల్లో వణుకు మొదలవుతుంది. టీడీపీ సహా, బీజేపీ, జనసేన కూడా ఢిల్లీలో సీఎం జగన్ పర్యటనను ఆసక్తిగా గమనిస్తుంటాయి. గత నెల 15న ఢిల్లీ వెళ్లిన జగన్.. కర్నూలుకి హైకోర్టు తరలింపు అంశాన్ని హైలెట్ చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలో కూడా ఇదే అంశం ఉందని గుర్తు చేసి మరీ ఆ పార్టీని ఇరుకున పెట్టారు. అమరావతికి జై అంటూ రెచ్చిపోతున్న ఏపీ బీజేపీ నేతలకు నిద్రలేకుండా చేశారు.అదే సమయంలో ఆ పార్టీతో అంటకాగుతున్న పాచిపోయిన లడ్డూలంటూ కామెంట్ చేసిన పవన్ కల్యాణ్ ని కూడా ఇరుకున పెట్టారు. హోదా, ప్రతిపత్తి.. ఈ రెండు అంశాలను విడతల వారీగా వాడుకుంటున్న టీడీపీకైతే అది రక్తకన్నీరే. ఇదంతా ఎపిసోడ్-1 లో జరిగింది.

ఇప్పుడు ఎపిసోడ్-2 తో మరో బాంబు పేల్చారు జగన్. చంద్రబాబు భూస్థాపితం చేసిన ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచారు.ప్రత్యేక హోదా విషయాన్ని దాదాపుగా ఏపీ ప్రజలు మరచిపోయారు. అంతలా చంద్రబాబు వారి మైండ్ సెట్ మార్చేశారు. అయితే ఎన్నికల వేళ.. ప్రత్యేక హోదా సాధించాలంటే ఎంపీల బలం ఉండాలని చెప్పిన జగన్ ని నమ్మి జనం ఓట్లేశారు.వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. ప్రత్యేక హోదా డిమాండ్ పై ఎలాంటి ముందడుగు పడిందనేది సహజంగానే ప్రజలనుంచి వచ్చే ప్రశ్న. దీనిపై ఇప్పటికే పలుమార్లు పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు నిరసన తెలియజేశారు కూడా.

తాజాగా ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. లోటు బడ్జెట్ కష్టాల్లో ఉన్న ఏపీని ఆదుకోడానికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గం అని సూటిగా చెప్పారు జగన్. ఆ మేరకు హోం మంత్రి అమిత్ షా ముందు తన ప్రధాన డిమాండ్లు వినిపించారు.అక్కడ ఢిల్లీలో అమిత్ షా – జగన్ భేటీలో ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు రాగానే ఇక్కడ ఏపీలో ప్రతిపక్షాల గుండెళ్లో రైళ్లు పరిగెట్టాయి. వాస్తవానికి ప్రణాళికా సంఘం అడ్డు చెబుతుందని అంటున్నారే కానీ.. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు అని కేంద్రం ఎప్పుడూ స్పష్టంగా ప్రకటించలేదు.
ప్యాకేజీతో సంతృప్తి చెందిన చంద్రబాబు, ప్రజల దృష్టిలో పలుచన అయ్యారు. అటు బీజేపీ నేతలు ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ ఏపీ ప్రజలకు శత్రువులయ్యారు. ఇక జనసేనాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.బాబు స్పెషల్ ప్యాకేజీ తీసుకుంటే.. పవన్ సబ్-ప్యాకేజీ తీసుకొని నోరు మూసుకున్నారనే ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. ప్రజలు ప్రత్యేక హోదా కోరుకోవడం లేదని అందుకే తాను దాని గురించి మాట్లాడనంటూ వితండవాదం చేశారు పవన్.

ఇలాంటి వారందరికీ జగన్ టూర్ తో చెమటలు పట్టాయి. మళ్లీ ప్రత్యేక హోదా అనే అంశం తైరపైకి వస్తే.. దాని గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. హోదాకు ప్రతిపక్షాలు అనుకూలమా, ప్రతికూలమా చెప్పాల్సిన పరిస్థితి. అంటే ఆ మూడు పార్టీలు కచ్చితంగా ఇరుకున పడినట్టే. ఢిల్లీ టూర్ తో ముగ్గురి నోళ్లను జగన్ మూయించినట్టే.

-టీఎస్ రవికుమార్