‘సాగర’ సమరానికి కమలం సిద్ధం!

813

90 శక్తి కేంద్రాలు ఏర్పాటు
స్థానిక పరిస్థితులపై సొంత నిఘా
( మార్తి సుబ్రహ్మణ్యం)

దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సృష్టించిన అద్భుతాలను నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనూ కొనసాగించేందుకు తెలంగాణ బీజేపీ నాయకత్వం  పక్కా వ్యూహాన్ని రచించింది. అందులో భాగంగా, పార్టీ బలం-బలహీనత, ,ప్రత్యర్ధుల బలాబలహీనతలు, కులాలు-వ్యక్తుల ప్రాధాన్యంపై సర్వే చేసేందుకు సొంత పార్టీ వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలని నిర్ణయించింది. దానికంటే ముందు పోలింగ్‌బూత్‌లను పటిష్టపరిచేందుకు 90  శక్తి కేంద్రాలను  ఏర్పాటుచేస్తున్నట్లు  సమాచారం.

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం  సాధించేందుకు బీజేపీ పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగా జయాపజయాలు, ప్రత్యర్ది పార్టీల బలం-బలహీనతలపై స్థానికంగా ఆరా తీసేందుకు సొంత పార్డీ బృందాలను రంగంలోకి దించుతోంది. పార్టీ ప్రచారానికి 7 మండలాలు, 2 మున్సిపాలిటీల నుంచి కార్యకర్తలను తీసుకురానున్నారు. వారంతా ఎన్నిక ముగిసేంతవరకూ ఆయా పోలింగ్‌బూత్‌ల పరిథిలోనే పనిచేయనున్నారు. దానితోపాటు 70 మంది ఓటర్లకు ఒకరిని ‘పన్నా ప్రముఖ్’గా నియమించనుంది. ఒక్కో పోలింగ్ బూత్‌కు 25 మందితో పార్టీ  కమిటీని వేయనుంది. ఆవిధంగా 3 పోలింగ్ కేంద్రాలను  కలిపి, ఒక శక్తికేంద్రంగా రూపొందిస్తారు. ఆ ప్రకారంగా నియోజకవర్గంలో మొత్తం సుమారు 90 శక్తి కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

వారితోనే పోలింగ్‌బూత్‌లను వెరిఫికేషన్ చేయించనున్నారు. ఎన్నికలో విజయాన్ని నిర్దేశించే కులాల ప్రభావాన్ని కూడా స్వయంగా తెలుసుకునేందుకు, పార్టీ నిఘా దళాలు పనిచేసేలా ప్రణాళిక రూపొందించారు. వార్డు స్థాయిలో ఏయే కులాల ప్రాబల్యం ఎంత ఉంది? అక్కడ ఏ వ్యక్తుల ప్రభావం పనిచేస్తుంది? ఏయే అంశాలు స్థానికంగా ప్రభావం చూపిస్తాయనే అంశాలపై ఆ నిఘా వర్గాలు సర్వే నిర్వహించి, వాటిని పార్టీకి నివేదిస్తాయి. ఆ ప్రకారంగా స్థానికంగా ఎలాంటి వ్యూహం అనుసరించాలో పార్టీ నిర్ణయిస్తుంది.  ఉప ఎన్నికకు పార్టీ ఇన్చార్జి అయిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు,  ఇప్పటికే నాగార్జునసాగర్‌లో కింది స్థాయి నుంచి పార్టీ శ్రేణులతో భేటీలు నిర్వహిస్తున్నారు.

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కుల సమీకరణ బాగా ప్రభావం చూపిస్తుందని స్థానిక పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రకారంగా నియోజకవర్గంలో లంబాడా వర్గానికి చెందిన వారి ఓట్ల సంఖ్యనే ఎక్కువ. గత ఎన్నికల గణాంకాల ప్రకారం.. లంబాడాలు 39 వేలు,  యాదవులు 32 వేలు, రెడ్లు 26 వేలు,  ఎస్సీలు 22 వేల మంది ఉండగా అందులో మాలలు 13 వేలమంది, 8500 మంది ముదిరాజులు, 5 వేల మంది గంగపుత్రులు, మున్నూరు కాపులు 5 వేల మంది,  కమ్మ 3 వేల మంది, గౌడ 5వేల మంది ఓటర్లు ఉన్నట్లు ఒక అంచనా.

ఎన్నికలో విజయం కోసం ఆయా కులాలకు చెందిన నాయకులను, వారి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రచారానికి దించాలని బీజేపీ నిర్ణయించింది. ‘సాగర్‌లో విజయం కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంది. ప్రచారానికి కేంద్రమంత్రులు, రాష్ట్ర నేతలు వస్తారు. సాగర్ నుంచే టీఆర్‌ఎస్ ప్రభుత్వ పతనం మొదలవుతుంది. మేం క్షేత్రస్థాయి నుంచి పని మొదలుపెడతున్నాం. సాగర్‌లో బీజేపీకి బలం లేదనుకున్న వారి కళ్లు తెరిపించబోతున్నాం’ అని నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఇన్చార్జి సంకినేని వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.

కాగా బీజేపీ అభ్యర్ధిగా ఇప్పటివరకూ ఎవరూ ఖరారు కాకపోయినా అంజయ్యయాదవ్, శ్రీధర్‌రెడ్డి టికెట్లు ఆశిస్తున్నారు. కొత్తగా స్థానిక నేత ఇంద్రసేనారెడ్డి పేరు వినిపిస్తోంది. వీరిలో శ్రీధర్‌రెడ్డి వైపే స్థానికంగా కార్యకర్తలు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో రాజకీయంగా రెడ్ల అధిపత్యం ఎక్కువగా ఉన్నందున, కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డికి శ్రీధర్‌రెడ్డి అయితేనే పోటీ ఇవ్వగలరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డిని ఓడించడం బీజేపీకి అంత సులభం కాదు. ఆ స్థాయి నేతను కాకపోయినా, కనీసం నియోజకర్గ స్థాయిలో బలమైన నాయకుడిని తయారుచేయడంలో బీజేపీ విఫలమయింది. కాకపోతే దుబ్బాక-గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల ఉత్సాహంతో, సాగర్‌లో కూడా ప్రజలు తమ పార్టీకే పట్టం కడతారని బీజేపీ భావిస్తోంది.

అయితే టీఆర్‌ఎస్ ఒకవేళ యాదవ సామాజిక వర్గానికి చెందిన, దివంగత ఎమ్మెల్యే నోముల కుటుంబాన్ని రంగంలోకి దింపితే, బీజేపీ కూడా అదే సామాజికవర్గానికి చెందిన అంజయ్య యాదవ్‌కు టికెట్ ఇచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అభ్యర్ధిత్వం ఖరారయిన విషయం తెలిసిందే. ఆయన ఈపాటికే నియోజవకర్గంలోని వివిధ వర్గాలు, నేతల ఇళ్లకు వెళ్లి మరీ స్థానిక నేతలతో కలసి సమావేశాలు నిర్వహిస్తున్నారు.