నలుగుతున్న నాలుగో సింహం!

192

గతంలో వైసీపీ నేత ఆమంచిదీ ఇదే తీరు
ఎస్పీ స్థాయి అధికారులకే తప్పని బెదిరింపులు
లేటుగా  పెదవి విప్పిని పోలీసు సంఘం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో నాలుగో సింహం ఒత్తిళ్ల మధ్య నలిగిపోతోంది. అటు అధికార వైసీపీ బెదిరింపులు, ఇటు ప్రతిపక్ష టీడీపీ నేతల హెచ్చరికలతో పోలీసులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు.  నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్‌కు,   వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బహిరంగంగా చేసిన హెచ్చరికలు పోలీసు వర్గాలలో ఉద్యోగ అభద్రతకు అద్దం పడుతున్నాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు కేంద్రం ప్రకటించిన ‘అంత్రిక్ సురక్ష సేవా పతకం-2020’ని  భాస్కర్ భూషణ్ తాజాగా డీజీపీ నుంచి అందుకోవడం విశేషం.

నెల్లూరు జిల్లా ఎస్పీని ఎమ్మెల్యే బెదిరించిన వైనం..  రాష్ట్రంలో స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేకుండా పోతోందన్న  పోలీసు అధికారుల భావనను మరింత పెంచినట్టయింది.  పోలీసు అధికారులపై అధికార పార్టీ నేతలు మాటల దాడులు చేస్తున్నా,  అటు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం కానీ, ఇటు ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ గానీ ఖండించి ఆత్మస్థైర్యం ఇవ్వకపోవడం,  వారిని మానసికంగా మరింత కుంగదీస్తోంది.ఐతే పోలీస్ సంఘం మాత్రం దీనిపై ఆలస్యంగా స్పందించటం ఆశ్చర్యకరం.

‘రెండు మూడు రోజుల్లో మిమ్మల్ని బదిలీ చేస్తామని’ బహిరంగ పరోక్ష  హెచ్చరిక చేసిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి బెదిరింపులు,  ఇప్పుడు ఐపిఎస్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. నియోజకవర్గ స్థాయిలో ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీలను బెదిరించినట్లు.. చివరకు  ఐపిఎస్‌లను కూడా బెదిరించే వాతావరణం ఏర్పడటం, అధికారులకు ఇబ్బందికరంగా పరిణమించింది. నల్లపురెడ్డి గతంలో కరోనా సమయంలో నిబంధనలకు విరుద్ధంగా జనాలను సమీకరించినందుకు,  ఇదే ఎస్పీ ఆయనపై కేసు నమోదు చేశారు. అందుకు నిరసనగా నల్లపురెడ్డి,  పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించిన వైనం సంచలనం సృష్టించింది.

ఇప్పుడు నేరుగా మీడియా సమక్షంలోనే జిల్లా ఎస్పీనుద్దేశించి, నల్లపురెడ్డి చేసిన హెచ్చరిక ఐపిఎస్ వర్గాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినట్టయింది. ‘ఇది మంచి పరిణామం కాదు. ఇలాంటి హెచ్చరికల వాతావరణంలో అధికారులతో పనిచేయించడం కష్టం. ఇప్పటివరకూ ఇలాంటి బెదిరింపులు కేవలం ఎస్‌ఐ నుంచి డీఎస్పీల వరకే ఉన్నట్లు మా దృష్టికి వచ్చేవి. ఇప్పుడు మాకే అలాంటి అనుభవం ఎదురయితే ఎవరికి చెప్పాలి? ఈ దుస్సంప్రదాయానికి ప్రభుత్వమే తెరదించాల’ని ఓ సీనియర్ ఐపిఎస్ అధికారి వ్యాఖ్యానించారు.

కాగా, కొద్దిరోజుల క్రితం పోలీసులపై ఎదురుకేసులు పెట్టమని ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపును  ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని చంద్రబాబు దెబ్బతీస్తున్నారని విరుచుకుపడింది. అయితే , నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్‌ని ఎమ్మెల్యే బెదిరించడాన్ని పోలీసు అధికారుల సంఘం లేటుగా ఖండించడంపై,  పోలీసు వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. తమ శాఖకు చెందిన ఉన్నతాధికారిని రాజకీయ నేత బెదిరిస్తే,వెంటనే ఖండించకుండా మౌనంగా ఉండటమే వారి విస్మయానికి కారణం. గతంలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్,   ఓ పోలీసును ఫోన్‌లో బూతులు తిట్టి బెదిరించినా అధికారుల సంఘం ఖండించకపోవడాన్ని పలువురు అధికారులు గుర్తు చేస్తున్నారు.

చివరకు ఐపిఎస్ అధికారి అయిన భాస్కర్ భూషణ్‌ను ఎమ్మెల్యే హెచ్చరించడాన్ని,  ఐపిఎస్ అసోసియేషన్ కూడా ఖండించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. మరోవైపు తన సస్పెన్షన్-పోస్టింగ్ ఇవ్వని వైనంపై చర్చించేందుకు.. ఐపిఎస్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేయాలని డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాసినా, దానిపై ఇప్పటికీ స్పందించని వైనాన్ని అధికారులు ప్రస్తావిస్తున్నారు.  కనీసం ఐపిఎస్‌లపై రాజకీయనేతల బెదిరింపుల నేపథ్యంలోనయినా, వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు సమావేశం ఏర్పాటుచేయాలని పలువురు అధికారులు సూచిస్తున్నారు.

అయితే పోలీస్ అధికారులలో పెరిగిన అసంపూర్తిని గమనించిన సంఘం ఆలస్యముగా ఖండించటం గమనార్హం ..