గౌతు లచ్చనను అవమానించడం రాజకీయ దగుల్భాజీతనం

0
37

తెదేపా, వైకాపాల అవినీతి, దురాక్రమణలు, కబ్జాలు కప్పిపుచ్చుకోడానికి స్వాతంత్య్ర సమరయోధులు, మహానుభావుడైన సర్దార్ గౌతు లచ్చనను అవమానించడం రాజకీయ దగుల్భాజీతనంగా భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఆరోపించింది. తెదేపా, వైకాపా నాయకులు అవినీతికి పాల్పడి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుని వివాదాన్ని దారి మళ్లించేందుకు మహానాయకుడైన గౌతులచ్చన్న పేరును ఉచ్చరించడాన్ని తప్పుపట్టింది. భాజపా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడ పటమట 14 వ డివిజన్ పరిధిలోని గౌతలచ్చన్న విగ్రహానికి మోర్చా నాయకులు పాలాభిషేకం చేసి పూలమాలలతో నివాళులు అర్పించారు.

అనంతరం మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్రా వెంకట శివన్నారాయణ మాట్లాడుతూ, శ్రీకాకుళానికి చెందిన వైకాపా, తెదేపా నాయకులు విచ్చలవిడిగా భూములను ఆక్రమించి ప్రత్యారోపణలు చేసుకుంటూ ఆక్రమణల తొలగింపుపై పక్కదోవ పట్టించేలా సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం అంశాన్ని లేవనెత్తారన్నారు. వీరి అవమానకర మాటలకు గౌతు లచ్చన్నను అభిమానించే ప్రజలంతా ఎంతో ఆవేదన చెందుతున్నారన్నారు. మీ స్వార్ధ రాజకీయాల కోసం సమాజ సంస్కర్తలను, దేశభక్తులను వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికారు. గౌతు లచ్చన్నపై చేసిన వ్యాఖ్యలను తక్షణం మంత్రి ఉపసంహరించుకోవాలని లేకుంటే వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇరుపార్టీల అవినీతిపై తక్షణం విచారణ చేసి కేసులు నమోదుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు బబ్బురి శ్రీరామ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లపు రాజు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఉమామహేశ్వర రాజు, భాజపా విజయవాడ పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవల్లి శ్రీధర్, ఒబీసీ నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్, దార్న చంద్రశేఖర్, అవ్వారు బుల్లబ్బాయి, మానేపల్లి మల్లేశ్వరరావు, దేవి హరి ప్రసాద్, జై ప్రకాష్ పాల్గొన్నారు.