చెన్నై సూపర్ కింగ్స్ నుంచి హర్భజన్ సింగ్ ఔట్

943

ఐపీఎల్ 2021 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ నుంచి భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తప్పుకున్నాడు. యూఏఈ వేదికగా గత ఏడాది జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌కి వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్న హర్భజన్ సింగ్.. ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై తరఫున తాను ఆడటం లేదని తాజాగా స్పష్టం చేశాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ముంబయి ఇండియన్స్ టీమ్‌కి ఆడిన హర్భజన్ సింగ్.. 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌కి మారాడు. అప్పట్లో రూ.2 కోట్లకి చెన్నై ఫ్రాంఛైజీ భజ్జీని కొనుగోలు చేసింది.

ఐపీఎల్ 2018, 2019 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 24 మ్యాచ్‌లాడిన హర్భజన్ సింగ్ 23 వికెట్లు పడగొట్టాడు. మరీ ముఖ్యంగా.. ఐపీఎల్ 2019లో 11 మ్యాచ్‌లాడి 16 వికెట్లు తీయడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కి చేరడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. టీమిండియాకి ఇప్పటికే దూరమైన భజ్జీ.. దేశవాళీ క్రికెట్‌లోనూ మ్యాచ్‌లు ఆడటం లేదు. దాంతో కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న ఈ 40 ఏళ్ల స్పిన్నర్‌ని ఐపీఎల్ 2021 సీజన్ కోసం రిటైన్ చేసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ కూడా సిద్ధంగా లేనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

‘‘చెన్నై సూపర్ కింగ్స్‌తో నా కాంట్రాక్ట్ ముగిసింది. చెన్నై టీమ్‌కి ఆడటం గొప్ప అనుభూతి.. అందమైన జ్ఞాపకాలు, మంచి ఫ్రెండ్స్‌ని టీమ్‌ అందించింది. రెండేళ్ల పాటు నా వెంట నిలిచిన చెన్నై టీమ్ మేనేజ్‌మెంట్, స్టాఫ్, ఫ్యాన్స్‌కి ధన్యవాదాలు. ఆల్‌ ద బెస్ట్’’ అని హర్భజన్ సింగ్ వెల్లడించాడు. భజ్జీతో పాటు స్పిన్నర్ పీయూస్ చావ్లా, ఓపెనర్ మురళీ విజయ్‌ని కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ వదులుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2021 సీజన్‌కి సంబంధించిన వేలం ఫిబ్రవరి రెండో వారంలో జరిగే సూచనలు కనిపిస్తుండగా.. టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్లు, వేలంలోకి విడిచిపెట్టే ఆటగాళ్ల జాబితాని విడుదల చేయాల్సి ఉంది.