ఏపీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ!

551

కమలనాధులకు అర్ధం కాని వైసీపీ వ్యూహం
టీడీపీకి బ్రేకులు వేసే ఎత్తుగడేనా?
                             ( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో దేవాలయాలపై దాడుల నేపథ్యంలో…  హిందుత్వ కార్డును బలంగా సంధిస్తున్న తమపై  ఎదురుదాడి చేస్తున్న వైసీపీ..  ఢిల్లీ స్థాయిలో మాత్రం అదే తమ పార్టీతో చెట్టపట్టాల్ వేసుకోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక, బీజేపీ శ్రేణులు తికమకపడుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి ఏపీ మంత్రులు బీజేపీపై నేరుగా ఎదురుదాడి చేస్తుండంతో,  వైసీపీ తమకు మిత్రపక్షమా? శత్రుపక్షమా? లేక కొత్తగా ఎత్తుకున్న హిందుత్వ నినాదంతో దూసుకుపోతున్న టీడీపీ దూకుడుకు బ్రేకులు వేసి, యుద్ధాన్ని వైసీపీ-బీజేపీకి పరిమితం చేసే రాజకీయ వ్యూహమా? అన్నది అర్ధం కాక,  కమలదళాలు  అయోమయంలో  కూరుకుపోయాయి.

దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక టీడీపీతో పాటు, బీజేపీ కూడా ఉందన్న డీజీపీ గౌతం సవాంగ్ ప్రకటనతో బీజేపీ,  జగన్ సర్కారుపై స్వరం పెంచింది. డీజీపీని తొలగించాలన్న డిమాండ్‌తో పాటు, ప్రభుత్వమే  దాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించేంత వరకూ వెళ్లింది. పాస్టర్లకు ఇస్తున్న 5 వేల వేతనం మతమార్పిళ్ల కోసమేనా అని ప్రశ్నించడంతో, హిందూభావజాలాన్ని ఆ వర్గంలోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది.

అయితే, ఊహించని విధంగా వైసీపీ రంగంలోకి దిగి తమను ఎదురుదాడితో ఉక్కిరిబిక్కిరి చేయడం, కమలదళాలను ఖంగుతినిపించింది.  గతంలో మంత్రి కొడాలి నాని బీజేపీని వైరస్ కంటే ప్రమాదకరమైన పార్టీ అని అభివర్ణించినా, సోము వీర్రాజు  నాయకత్వంలోని పార్టీ స్పందించలేదు. ఇప్పుడు తాజాగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ నేరుగా బీజేపీ హిందుత్వ విధానాలనే ప్రశ్నించడం చర్చనీయాంశమయింది. బాబు హయాంలో ఆలయాలను తొలగించినప్పుడు బీజేపీ మంత్రి క్యాబినెట్‌లో ఉన్న విషయాన్ని గుర్తు చేసిన మంత్రులు, బీజేపీని రాజకీయంగా ఇరుకుపెట్టారు. ఇది హిందుత్వ నినాదంతో వెళుతున్న బీజేపీకి సైద్ధాంతిక సంకటమేనని ఆ పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి.

అంతర్వేది ఘటనపై తాము సీబీఐ విచారణకు జీఓ ఇచ్చి మూడు నెలలయితే, సోము వీర్రాజు కేంద్రంపై ఒత్తిడి చేసి, ఎందుకు సీబీఐ విచారణ చేయించలేదని నిలదీసి,  బీజేపీని ఆత్మరక్షణలో నెట్టారు. తన ఉనికి కోసమే బీజేపీ మత సామరస్యానికి విఘాతం సృష్టించి, మతాల మధ్య వైషమ్యం రగిలిస్తోందని ఆరోపించారు. బీజేపీ నేతలు వరద సాయం కింద కేంద్రం నుంచి నయాపైసా తీసుకురాలేదని విరుచుకుపడ్డారు. ‘బాబు మాదిరిగా జగన్ సర్కారు బెదిరింపులకు భయపడేది కాదు. రాష్ట్రంలో మత విద్వేషాలు రగిల్చేవారి అంతుచూస్తాం.  మీరు చెబుతున్నట్లు కేంద్రానికి ఫిర్యాదు చేసుకోండి. ఎవరికీ భయపడేది లేదు’ అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై విరుచుకుపడటం ప్రస్తావనార్హం. ఒక మంత్రి తమను ఈ స్థాయిలో కేంద్రానికి ఫిర్యాదు చేసుకోమని బహిరంగంగా సవాల్ చేయడమే బీజేపీ శ్రేణులను ఆశ్చర్యపరుస్తోంది.

తాజాగా వైసీపీ నుంచి మొదలయిన ఎదురుదాడి, బీజేపీ శ్రేణులను గందరగోళపరుస్తోంది. సీఎం జగన్ ఆదేశాలు, అనుమతి లేనిదే మంత్రులు బీజేపీపై ఎదరుదాడి చేసే ధైర్యం చేయరని బీజేపీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.  ఆ ప్రకారంగా… తమపై ఎదురుదాడికి అనుమతించిన జగన్, కేంద్రంలోని అదే తమ పార్టీ ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించడాన్ని,  ఏవిధంగా అర్ధం చేసుకోవాలో తెలియక అయోమయానికి గురువుతున్నారు. దీనివల్ల వైసీపీ తమకు మిత్రపక్షమో, శత్రుపక్షమో తెలియని రాజకీయ గందరగోళ  పరిస్థితి ఏర్పడిందని నేతలు వాపోతున్నారు.

‘ఇక్కడ మాపై ఎదురుదాడి చేస్తూ, అక్కడ ఢిల్లీలో మోదీ-అమిత్‌షా దగ్గర విధేయత ప్రదర్శిస్తున్న జగన్ వ్యూహం,  మా క్యాడర్‌కు అర్ధం కావడం లేదు. జగన్ మొదటి నుంచీ లోకల్‌గా మా పార్టీని ఖాతరు చేయడం లేదు. ఆయనకు మా పార్టీకి చెందిన ఇద్దరు ముగ్గురు లీడర్లు సహకరిస్తున్నారని అందరికీ తెలుసు. జగన్ అన్నీ  ఢిల్లీ వాళ్లతోనే మాట్లాడుకుంటున్నారు. ఇక ఇక్కడ మాకు ఏం విలువ ఉంటుంది? గతంలో చంద్రబాబు కూడా అదే పాలసీ పాటించారు. ఇప్పుడు దానినే జగన్ అనుసరిస్తున్నట్లున్నారు. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా, ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఇప్పటిదాకా స్పందించలేదు. సునీల్ దియోథర్, సోము వీర్రాజును వైసీపీ అసలు ఖాతరు చేయడం లేదు. హరిబాబు, పురంధీశ్వరి, కన్నా, సుజనా, సీఎం రమేష్ వంటి నేతలేమో అసలు మాట్లాడటం లేదు. వారిని వ్యూహం ప్రకారం కట్టడి చేశారు. కేంద్రం ఆశీస్సులు జగన్‌కు లేదన్న విషయాన్ని కేంద్ర నాయకత్వం కూడా బహిరంగంగా ప్రకటించకపోవడంతో,  మా క్యాడర్ సహజంగానే గందరగోళంలో పడింద’ని బీజేపీ రాష్ట్ర నేత ఒకరు వ్యాఖ్యానించారు.

రాజకీయ వ్యూహమా?

అయితే, వైసీపీ-బీజేపీ మధ్య కొత్తగా మొదలైన  ఈ మాటల యుద్ధం..  పక్కా రాజకీయ వ్యూహమేనన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కొత్తగా హిందుత్వ కార్డును ఎత్తుకుని, ఆ దిశలో దూసుకుపోతున్న టీడీపీ స్పీడుకు బ్రేకులు వేయడంలో భాగంగానే  ఈ వ్యూహం అమలవుతోందన్న  అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ‘తన పార్టీని మూడోస్థానానికి  నెట్టివేసి ఆ స్థానాన్ని ఆక్రమించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకే, టీడీపీ హిందుత్వ కార్డును ప్రయోగిస్తోంది. సహజంగా క్యాడర్ పార్టీ, క్షేత్రస్థాయిలో బలమైన రాజకీయ పార్టీ అయిన ఆ పార్టీ వాదనే జనంలోకి వెళుతుంది. అది వైసీపీ-బీజేపీ రెండు పార్టీలకూ నష్టమే. అందువల్ల టీడీపీ స్పీడుకు బ్రేకులు వేసి, రాష్ట్రంలో రాజకీయ యుద్ధాన్ని వైసీపీ-బీజేపీకి మాత్రమే పరిమితం చేసే రాజకీయ వ్యూహంతోనే మంత్రులు కేవలం బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది పరోక్షంగా  బీజేపీని  ప్రమోట్ చేయడమే. జగన్ అనుమతి లేకపోతే మంత్రులు బీజేపీని విమర్శించేందుకు సాహసించరు. అలా ఎదురుదాడి చేస్తున్నారంటే, అందుకు జగన్ అనుమతి ఉందన్న విషయం స్పష్టమవుతోంది’ అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.