రాష్ట్ర పార్టీలకు ‘ఢిల్లీ నిధులు’ బంద్

204

ఎవరి సమీకరణ వారిదే
ఎన్నికల నాటికి నిధులు సమకూర్చుకోవాల్సిందే
బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదేశం
                          ( మార్తి సుబ్రహ్మణ్యం)

అధికారంలో లేని రాష్ట్రాలకు ఇప్పటి వరకూ వివిధ కార్యక్రమాల కోసం నిధులిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం,  ఇకపై ఆ విధానానికి స్వస్తి చెప్పింది. ఎన్నికలకు కేంద్ర నాయకత్వం నుంచి వచ్చే నిధులు కూడా ఇకపై నిలిపివేసి, ఆ బాధ్యత కూడా రాష్ట్ర నాయకత్వాల భుజస్కంధాలపైనే పెట్టింది. ఆ ప్రకారంగా ఇక నుంచి అన్ని రకాల కార్యక్రమాలకు, ఆయా రాష్ట్రాల పార్టీ నాయకత్వాలే సొంతగా నిధులు సమకూర్చుకోవాలని జాతీయ నాయకత్వం స్పష్టం చేసింది. వచ్చే జమిలి ఎన్నికల నాటికి,  ఆయా రాష్ట్రాల పరిస్థితి ప్రకారం ఎంతెంత నిధులు సమీకరించాలో కూడా సూచిస్తూ ఆదేశాలు పంపింది.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. దేశంలో తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలకు ఇప్పటివరకూ చేస్తున్న నిధుల సహాయాన్ని నిలిపివేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఇప్పటివరకూ అధికారంలో లేని రాష్ట్రాలకు.. పార్టీ కార్యాలయాల అద్దె, సిబ్బంది వేతనాలకు జాతీయ నాయకత్వమే నిధులు అందిస్తోంది. ఇక ఆయా రాష్ట్రాల్లో జరిగే వివిధ ఎన్నికల సాయం దానికి అదనం. ఇతర ఖర్చులేమైనా ఉంటే ముందు దాన్ని రాష్ట్ర పార్టీ నాయకత్వాలే చెల్లించి, తర్వాత వాటిని జాతీయ నాయకత్వం నుంచి రీఇంబర్స్ చేసుకునే సంప్రదాయమే ఇప్పటివరకూ ఉంది. ఇకపై ఈ విధానానికి పార్టీ నాయకత్వం తెరదించింది.

ఆ మేరకు కొద్దిరోజుల క్రితం.. బీజేపీ అధికారంలో లేని అన్ని  రాష్ట్ర నాయకత్వాలకు  ఒక సందేశం పంపింది. ఆ ప్రకారంగా.. రాష్ట్రాల నాయకత్వమే పార్టీ ఆఫీసు, సిబ్బంది ఖర్చులకు సొంతంగా నిధులు సమీకరించుకోవాలని ఆదేశించింది. అదేవిధంగా రానున్న జమిలి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఆయా రాష్ట్రాల స్థితిగతుల ప్రకారం నిధులు సమకూర్చుకోవాలని కూడా సూచించింది. ఆ మేరకు ఏయే రాష్ట్రాలు ఎంతెంత నిధులు సమకూర్చుకోవాలని కూడా పేర్కొంది. దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో సెంట్రల్ కమిటీ నుంచి, నిధులు వచ్చే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నిధుల సమీకరణలో వ్యత్యాసాలు చర్చకు వస్తున్నాయి. ఏపీలో పారిశ్రామికవేత్తలు ఉన్నప్పటికీ వారంతా హైదరాబాద్ కేంద్రంగా జీవిస్తున్నారు.  రాష్ట్రంలో ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఆక్వా, ప్రకాశం-కడపలో మైనింగ్, విశాఖలో పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి చెందింది. ఆ ప్రకారంగా పార్టీ నాయకత్వం, ఆయా రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలపైనే  ఆధారపడవలసి ఉంది. అయితే ఆయా రంగాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు ఇప్పటికే వైసీపీ-టీడీపీలలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొనసాగుతున్నారు. విరాళాల అంశంలో వారు ఎంతవరకూ సహకరిస్తారో చూడాలి. స్వతహాగా బీజేపీకి చెందిన నాయకులు కూడా ఆర్ధికంగా అంత శక్తివంతులు కాదు. ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ, రాష్ట్ర నాయకులకు కేంద్ర నామినేటెడ్ పదవులివ్వలేదు. పైగా ఏపీలో 80 శాతం పార్టీ నేతలు- కార్యకర్తలు ఎగువ మధ్య తరగతికి చెందిన వారే. ఎమ్మెల్సీ, జడ్పీటీసీలుగా ఉన్న ప్రతినిధులు కూడా,  ఎగువ మధ్య తరగతి వర్గానికి చెందిన వారే. కేవలం కొద్దిమంది మాత్రమే పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు.అందువల్ల వారి నుంచి పార్టీ నాయకత్వం నిధులు ఆశించే అవకాశం లేదు.

నిధులు సమీకరించే శక్తి-సత్తా ఉన్న ఎంపీలయిన సుజనా చౌదరి, సీఎం రమేష్‌కు రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో వారిద్దరూ నిర్లిప్తంగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల ముందు టీడీపీ విజయం సాధించేందుకు, అంతకుముందు వైఎస్ సర్కారు  పోరాడినప్పుడూ ఆ పార్టీకి సుజనా చౌదరే ఆర్థికంగా కొండంత అండగా నిలిచారు. ఇప్పుడు బీజేపీలో ఉన్న సుజనా చౌదరికి చెందిన ఫంక్షన్‌హాల్‌ను, విజయవాడలో  బీజేపీ పార్టీ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇక మరో ఎంపీ టిజి వెంకటేష్ తన జిల్లాలో జరిగే కార్యక్రమాల వరకూ ఆర్ధికంగా దన్నుగా నిలుస్తున్నారు. ఇప్పటివరకూ ఏపీలో జరుగుతున్న  కార్యక్రమాలకు,  ఇతర పార్టీల నుంచి చేరిన వారు మాత్రమే ఖర్చు పెడుతున్నారు తప్ప, పాత నేతలెవరూ ఆ విషయంలో ముందుకురావడం లేదన్న వ్యాఖ్యలు చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి.  ఈ దృష్ట్యా ఏపీలో నిధుల సమీకరణ అంత సులభం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాగా నిధుల సమీకరణపై జాతీయ నాయకత్వం నుంచి ఆదేశాలు వచ్చిన మాట నిజమేనని, అయితే అవి ఎన్నికలకు ముందస్తు  నిధుల కోసం అన్నది అబద్ధమని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘ పార్టీ ఆఫీసు, కార్యక్రమాలకు అయ్యే ఏడాది బడ్జెట్ ఖర్చును రాష్ట్ర నాయకత్వమే సమకూర్చుకోవాలని ఆదేశించిందే తప్ప, మీరు అడిగినట్లు జమిలి ఎన్నికల కోసం కాదు. అలాగని మాకేమీ నిధుల టార్గెట్లు కూడా పెట్టలేదు’ అని ఆ నాయకుడు వివరించారు.

అదే తెలంగాణలో పరిస్థితి అందుకు విరుద్ధం. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మరో ముగ్గురు ఎంపీలతోపాటు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, టీడీపీ-కాంగ్రెస్ నుంచి చేరిన పారిశ్రామికవేత్తలు పార్టీలోనే ఉన్నందున, తెలంగాణ బీజేపీ నాయకత్వానికి నిధుల సమస్య పెద్దగా కనిపించడం లేదు. పైగా హైదరాబాద్ ఇండస్ట్రియల్-ఐటి-రియల్‌ఎస్టేట్ హబ్‌గా ఉన్నందున, విరాళాలకు పెద్దగా సమస్యలు ఉండబోవు. దుబ్బాక-గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందున, పారిశ్రామికవేత్తలు విరాళాలకు వెనుకంజ వేయకపోవచ్చన్నది బీజేపీ వర్గాల అంచనా. వీటికిమించి.. కొన్ని ఏళ్ల నుంచి హైదరాబాద్ లోని వివిధ వ్యాపారవర్గాలు, ముఖ్యంగా ఉత్తరాదికి చెందిన వ్యాపారులు బీజేపీకి, ఆర్ధికంగా దన్నుగా నిలుస్తూనే ఉన్న విషయాన్ని విస్మరించకూడదు. ఈ కారణాల దృష్ట్యా తెలంగాణ బీజేపీ నాయకత్వానికి నిధులు లేనట్టే.