నేటి ప్రశ్న

597

శెట్టి సింగారించుకొనేలోగా పట్నంపాడైంది.
(సంపూర్ణ వివరణతో)

శెట్టి అనేమాట శ్రేష్ఠి అనే పదంనుండి వచ్చింది.శ్రేష్ఠి అంటే ఉత్తముడు. దేనిలో ఉత్తముడంటే వర్తక వ్యాపారాలలో బ్యాంక్ (ఆర్థిక సంఘం) వ్యవహారాలలో దేవాలయ నిర్వహణ మొదలైనవాటిలో.

ఒకప్పుడు అనగా శాతవాహనులకాలంనుండి వర్తకులంతా వర్తకసంఘాలు (Guilds) గా ఏర్పడి ఆ సంఘానికో అధ్యక్షుడిని ఎన్నుకోనేవారు. అతనినే శ్రేష్ఠి అనేవారు. ఈ సంఘాల సమావేశాలకు దేవాలయం కేంద్రస్థానంగా వుండేది.

వర్తకులందరు తమ ఈ సంఘం ద్వారా అవసరాలను తీర్చుకొనేవారు. ఉదా॥ ఈ గిల్డులలో డబ్బు దాచుకోవడం, గిల్డునుండి అప్పు తీసుకోవడం చేసేవారు. ఇంకా ఈ సంఘాల ద్వారా గ్రామావసరాలు తీర్చేవారు. ముఖ్యంగా దేవాలయాభివృద్ధి పనులు చేసేవారు.

గిల్డ్ లో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహారాలు జరిగేవి.

ఇలా శ్రేష్ఠి > శెట్టి పదోత్పత్తి జరిగింది.
శెట్టిపదం కేవలం వైశ్యులకు మాత్రమే పరిమితమైందేమి కాదు.
గిల్డ్ వ్యవస్థ అన్ని కులాలలోనూ తరువాతి కాలంలో ఏర్పడటం జరిగింది. అలా ఏర్పడిన ఇతర కులాలవారి గిల్డ్ అధ్యక్షుని శ్రేష్ఠి అనేవారు. వీరిని బలిజశెట్టి, గాండ్లశెట్టి, ఈడిగశెట్టి అని పిలిచేవారు.

ఇప్పటికి బలిజ, గౌడ (ఈడిగ ), గాండ్ల ( తెలికుల) మొదలైన కులాలవారు కొందరు తమపేరు చివర శెట్టి పెట్టుకోవడం వుంది. చిత్తూరు జిల్లాలో ఈ సాంప్రదాయం అధికంగా వుంది.

ఇక వైశ్యులలో కూడా వైజాతీయులనే శాఖ ఒకటుంది. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించే ఫ్రౌడదేవరాయలకాలంలో వైశ్యులకు వైజాతీయులకు తగాదాలోచ్చాయి. మేము గొప్ప మేమే గొప్పని తగాదాపడ్డారు.ఫ్రౌడదేవరాయలు కోలాచల మల్లినాథసూరి అనే విప్రపండితుడికి ఈ తగాదా విచారించి తీర్పునివ్వమని ఆదేశించాడు.
ఇలాంటి తగాదానే కాంచీపురంలో రాగా అప్పటి రాజులు ఈ తగాదాను తీర్చి ఆ విషయాన్ని ఓ శాసనరూపంలో ప్రకటించారు. మల్లినాథుడు ఆ శిలాశాసనాన్ని తెప్పించి శాస్త్రాలు తిరగేసి దాని ప్రకారం వారి సాంఘికహోదా నిర్ణయించాడు.

వైశ్య స్త్రీకి వైశ్య పురుషునికి జన్మించినవారు వైశ్యులని, వైశ్య పురుషుడికి ఇతర స్త్రీకి జన్మించినవారు వైజాతీయులని ఆ తీర్పుసారాంశం.ఇంక పరిగణలోకి స్వచ్ఛ శ్రేష్టి అనే వాడి రూపు రేఖల వర్ణనలో సగటు నల్ల వర్ణముతో ముందు ఎత్తుపళ్ళతో బొంగురు గొంతు బాణ పొట్ట 3 పెట్టాల మొలతాడుగా శస్త్ర ప్రమాణలను కూడ గ్రహించుట జరిగిoది. అందువల్లనే ఒక జాతీయం పుట్టింది “నల్ల బాపనోళ్లను తెల్ల కోమాటోళ్లను అస్సలు నమ్మరాదు “.

ఇక శెట్టి సింగారించుకొనేలోగా పట్నం పాడైందనే సామెతను ఓ సారి గమనిద్దాం.శెట్టి సింగారించుకొని యుద్ధానికి వెల్లెలోగా పట్నం ధ్యంసమైందని ఈ సామెతకు అర్థం.

నిజానికి ఈ శెట్టికి, సింగారించుకోటానికి, పట్నం పాడుకావటానికి ఏం సంబంధం లేదు. ఇక్కడ సింగారించుకొనేది జెట్టి. జెట్టి అంటే యోధుడు, శూరడనే అర్థాలున్నాయి.

ఆ రోజులలో యోధులకు సైనికులకు సక్రమైనవి సులభంగా ధరించేందుకు వీలైన యూనిఫాం ఉండేదికాదు. లంగోట, గోచి, బిగించాలి.ఆ పైన చీర (పంచె) సింగారించుకోవాలి. పటాకత్తో, గండకత్తెరో, కరవాలమో ఆకురాయి మీద నూరి పదునుపెట్టుకోవాలి. వీరతిలకం పెట్టుకొని, హారుతులు తీసుకొని, దేవాలయానికి వెళ్ళి పూజలు చేసి బలిబలి అంటూ యుద్ధానికి వెళ్ళేవాడు.

ఈ లోపుగా అంటే జెట్టి వచ్చేలోపుగా వచ్చిన దండో, థగ్గులో, శత్రువులో, దోపిడి దొంగలో పని కానిచ్చేసేవారు.

జెట్టి జానపదుల ఉచ్ఛారణలో శెట్టైపోయింది. ఎలాగంటే నక్కకు నాగలోకానికి ఏం సంబంధమనే సామెత విన్నాం కదా ! నక్కకు నాగలోకానికి సంబంధం కాదది. నక్కకు నాకలోకానికి వున్న సంబంధమని చెప్పాలి. నాకలోకమంటే స్వర్గలోకం.నక్కొక్కటి నాకలోకానికి పోవాలనుకొందట.

అలానే ఇదీను.

కనుక ఇక నుండి జెట్టి సింగారించుకొనేలోగా పట్నంపాడైందని
నక్కకు నాకలోకానికి ఏం సంబంధమనే చెప్పుకొందాం.

జి.బి.విశ్వనాథ,
9441245857,
అనంతపురం.