ప్రజల ఫిర్యాదులే బీజేపీ మేనిఫెస్టో

444

ప్రతి వీధిలోనూ ఒక కంప్లైట్ బాక్స్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 25 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జి
నాలుగు డివిజన్లుగా ఖమ్మం, వరంగల్  కార్పొరేషన్లలో పనివిభజన
తెలంగాణ బీజేపీ ఎన్నికల వ్యూహం ఖరారు
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణలో రానున్న ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలతోపాటు, శాసనమండలి ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ వ్యూహం ఖరారయింది. ఆ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ సంఘటనా ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌జీతో కలసి పక్కా ప్రణాళిక రూపొందించారు. తాజాగా జరిగిన రాష్ట్ర కమిటీ భేటీలో ఆ మేరకు,  ఎన్నికల వ్యూహాన్ని బీజేపీ ఖరారు చేసింది. ఆ ప్రకారంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 15 వరకూ, వివిధ కార్యక్రమాలు రూపొందించినట్లు బీజేపీ వర్గాల సమాచారం.

ప్రధానంగా  ప్రజల నుంచి ఫిర్యాదుల ఆధారంగానే,  ఎన్నికల మేనిఫెస్టోను ఖరారు చేయనుంది. దానికోసం ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల పరిథిలో వీధికి ఒక ఫిర్యాదు బాక్సు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. వాటి ఆధారంగానే మేనిఫెస్టో తయారుకానుంది. అదేవిధంగా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి, అక్కడి స్థానిక పరిస్థితులు అధ్యయనం చేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనుంది. అక్కడి నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌తో కొత్త ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించింది.  టీచర్-గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం, ప్రతి 25 మంది ఓటర్లకు ఒకరిని ఇన్చార్జిగా నియమించనుంది. ఎన్నికలు ముగిసేంత వరకూ ఆ ఇన్చార్జిలంతా 25 మంది ఓటర్లతో సంబంథాలు కొనసాగిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం పార్టీకి చెందిన డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, ఏబీవీపీ, యువమోర్చా సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయించింది.

ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రచారం కోసం,  ఖమ్మం జిల్లాకు చెందిన వారినే వివిధ స్థాయిలో పనిచేయించాలని, మున్సిపల్ డివిజన్లకు మాత్రం రాష్ట్ర స్థాయి నేతలను ఇన్చార్జిగా నియమించాలని భావిస్తోంది. ఇక ఖమ్మం-వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయానికి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫార్ములానే అమలుచేయనుంది. గ్రేటర్ హైదరాబాద్‌ను 6 జిల్లాలుగా చేసిన  విధంగానే, ఖమ్మం కార్పొరేషన్‌నూ 4 డివిజన్లుగా విభజించి అక్కడ ఇన్చార్జిలను నియమించనుంది.

ఫిబ్రవరి 15 వరకూ పూర్తి చేసిన బూత్‌కమిటీలను పర్యవేక్షించేందుకు, భారీ స్థాయిలో కార్యకర్తలను నియమించనుంది. ప్రతి ఇంటికీ పార్టీ కరపత్రం, మేనిఫెస్టో అందేలా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటుచేసింది. ముఖ్యంగా కేసీఆర్ నగరానికి ఇచ్చిన హామీల అమలు, టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, కేసీఆర్ పాలనలో కార్పొరేషన్లలో పెరిగిన పన్నులు, పేరుకుపోయిన సమస్యలనే ప్రచారాయుధాలుగా మార్చనుంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండు కార్పొరేషన్లపై ప్రత్యేక కసరత్తు ప్రారంభించారు. ఇప్పటినుంచే ఖమ్మం, వరంగల్‌లో కార్యక్రమాలు ఉధృతం చేయటం ద్వారా.. ఎన్నికల నాటికి వేడి పెంచాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.

1 COMMENT