పార్టీ అంటే..ఆ ముగ్గురేనా?

216

మాకు సమాచారం ఇవ్వరా?
బీజేపీ నాయకత్వం తీరుపై సీఎం రమేష్-సుజనా ఫైర్
    ( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ బీజేపీ నాయకత్వ పనితీరుపై ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పార్టీ కేవలం ముగ్గురికే పరిమితమయిందని, తమకు సమాచారం ఇవ్వకుండా తీసుకుంటున్న  ఏకపక్ష నిర్ణయాలపై బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము పార్టీ ఎంపీలమా? కాదా అని నిలదీశారు. ఇదే పద్ధతి కొనసాగితే, ఈ అంశాన్ని ఎక్కడికి తీసుకువెళ్లాలో అక్కడికి తీసుకువెళతామని కుండబద్దలు కొట్టారు. తిరుపతి ఉప ఎన్నికలో అభ్యర్ధుల ఎంపికను ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా  వీడియో కాన్ఫరెన్స్‌లో జరిగిన కోర్ కమిటీ భేటీలో వారిద్దరూ… ఏపీ బీజేపీ సహ ఇన్చార్జి సునీల్ దియోథర్- అధ్యక్షుడు సోము వీర్రాజుపై నేరుగా విరుచుపడినట్లు సమాచారం. ఓ దశలో సోము వీర్రాజు-ఎంపీల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన బీజేపీ కోర్ కమిటీ భేటీలో, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్ పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలను.. సునీల్ దియోధర్ సమక్షంలోనే నిలదీశారు. పార్టీ ఎంపీలమయిన తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, మినీ కోర్ కమిటీకి తమను ఎందుకు ఆహ్వానించడం లేదని వారిద్దరూ నిలదీయడంతో, సునీల్ దియోధర్ మౌనం వహించాల్సి వచ్చింది. పార్టీ నాయకత్వ వైఖరిలో స్పష్టత లేదన్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రకటనలు ఇస్తున్నారని, ఒకరోజు ఇచ్చిన ప్రకటనలకు మరుసటి రోజు వచ్చే ప్రకటనలకు పొంతన ఉండటం లేదన్నారు.

ఎంపీలమయిన తమకు సైతం ప్రాధాన్యం లేకపోవడంపై వారిద్దరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ ముగ్గురికే పరిమితమయింది. ఇదేం పద్ధతి? అని  నిర్మొహమాటంగా  వ్యాఖ్యానించారు. ఇదే పరిస్థితి కొనసాగితే, ఈ అంశాలు ఎక్కడ- ఏ  వేదికపై  ప్రస్తావించాలో అక్కడే ప్రస్తావిస్తామని దాదాపు హెచ్చరించినంత పనిచేశారు.  పార్టీ పురోగతిలో స్పీడు తగ్గిందని ప్రజలు భావిస్తున్నందున, ఆ అభిప్రాయం తొలగించి మరింత ఉథృతంగా వెళ్లాలని  సీఎం రమేష్ వ్యాఖ్యానించారు.

ప్రధానంగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో, ఏం జరుగుతుందో తమకు తెలియడం లేదని ఇద్దరు ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్ధుల ఎంపికపై తమకు ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదని, వాటి సమావేశాల వివరాలు కూడా తమకు సమాచారం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకు జోక్యం చేసుకున్న నునీల్.. అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు మాత్రమే తీసుకున్నామని, ఇంకా అభ్యర్ధుల ఎంపిక- చర్చల ప్రకియ ప్రారంభించలేదని చెప్పారు. అందుకు   ఇద్దరు ఎంపీలు  అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే అభ్యర్ధులతో ఇంటర్య్యూలు కూడా చేసిన విషయాన్ని ప్రస్తావించడంతో,  సునీల్ ఏమీ మాట్లాడకుండా  మౌనంగా ఉండిపోయారు.

ఈ దశలో జోక్యం చేసుకున్న అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇన్చార్జి సునీల్‌కు బాసటగా నిలిచారు. మీరంతా ఇన్చార్జి లక్ష్యంగా విమర్శిస్తున్నారని, ఏదయినా ఒక పద్ధతి ప్రకారం వ్యవహరిస్తామని ఎంపీలకు బదులిచ్చారు. అందరినీ సంప్రదించి, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే, ఏ అంశాల్లో తమ అభిప్రాయం తీసుకుని ప్రకటించారని ఎంపీలు ప్రశ్నించారు.

సీనియర్లు మీడియాకు వెళ్లే పరిస్థితి లేకుండా చేశారని, అన్నీ సోమువీర్రాజు- సునీల్- విష్ణువర్దన్‌రెడ్డే మాట్లాడుతున్నారని ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు.  పార్టీ ఆ ముగ్గురిదే అన్న భావన కార్యకర్తల్లో నెలకొన్నందున, ఆ అభిప్రాయం  తొలగించాల్సిన అవసరం ఉందని ఎంపీలు సూచించారు. మినీకోర్ కమిటీలో ఎంపీలకు ఎందుకు స్థానం కల్పించలేదో అర్ధం కావడం లేదని వాపోయారు. కాగా కీలకమైన మినీ కోర్‌కమిటీలో ఏపీకి చెందిన యుపి ఎంపి జీవీఎల్ నరసింహారావు ఒక్కరికే స్థానం లభించగా, కోర్ కమిటీలో మాత్రం ఏపీ ఎంపీలయిన సుజనా చౌదరి, సీఎం రమేష్, టిజి వెంకటేష్ ఉన్నారు.