వైసీపీ నుంచి బీజేపీలో చేరికలేవీ?

193

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఆకర్షిస్తున్న సంజయ్
ఏపీలో టీడీపీ, మాజీలకే పరిమితం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో పార్టీని బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ,  ఆ విషయంలో  తెలంగాణ రాష్ట్ర పార్టీ నాయకత్వానికి  భిన్నంగా వెళుతుండటంపై పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. బండి సంజయ్ నాయకత్వంలోని తెలంగాణ బీజేపీ, అధికార టీఆర్‌ఎస్ నేతలను తన పార్టీలో చేర్చుకుని, ఆ పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. కానీ ఏపీలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన ప్రతిపక్ష టీడీపీ, చాలాకాలం నుంచి రాజకీయాల్లో లేని ప్రముఖులను పార్టీలో చేర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు, ఏపీ బీజేపీ వర్గాలను విస్మయపరుస్తున్నాయి.

ఇటీవలి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో, టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి నేతలను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు సంజయ్ తన పార్టీలోకి తీసుకువచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా భారీ స్థాయిలో బీజేపీలో చేరికలు జరిగాయి. అయితే, అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నాయకులు కూడా భారీ స్థాయిలో బీజేపీలో చేరడమే విశేషం. బండి సంజయ్ దూకుడుగా వెళుతున్న నేపథ్యంలో, తెలంగాణ రాజకీయాలన్నీ ‘టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ’గా మారాయి. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కూడా బీజేపీ అనూహ్య స్థానాలు సాధించడంతో, సంజయ్ నాయకత్వంపై మిగిలిన పార్టీ నేతల్లో నమ్మకం పెరిగింది. దాని ఫలితంగానే, టీఆర్‌ఎస్ అసంతృప్తులు, కాంగ్రెస్ నేతలు  బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నట్లు స్పష్టమవుతోంది.

అదే ఏపీలో మాత్రం బీజేపీ నాయకత్వం, తెలంగాణ బీజేపీ తరహాలో.. అధికార వైసీపీ నేతలను కాకుండా, టీడీపీలో  స్తబ్దుగా ఉన్న వారితోపాటు..అసలు ఏ పార్టీలో లేకుండా, తటస్థంగా ఉన్న మాజీ నాయకులను మాత్రమే చేర్చుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ అధికార వైసీపీ నుంచి ఒక్క  నాయకుడు కూడా తమ పార్టీలో చేరని విషయాన్ని బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. తాజాగా కాపునాడు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు భేటీ అయి, ఆయనను పార్టీలో ఆహ్వానించారు.

ముద్రగడ చాలా ఏళ్ల నుంచి రాజకీయ పార్టీలకు దూరంగా, కాపు రిజర్వేషన్ సాధన కోసం పనిచేస్తున్నారు. గతంలో బీజేపీ చీఫ్‌గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణతో కూడా  ముద్రగడ  భేటీ అయ్యారు. ఆ సమయంలో ముద్రగడ పార్టీలో చేరతారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. కాపులకు బీసీ రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇస్తేనే తాను బీజేపీలో చేరతానని ముద్రగడ గతంలో షరతు విధించారు. ఇప్పుడు పార్టీ చీఫ్ సోము,  మళ్లీ ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయన కలిసిన వెంటనే పాత ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి.

కాగా టీడీపీ మాజీ చీఫ్ కళా వెంకట్రావు నివాసానికి వెళ్లిన సోము వీర్రాజు ప్రయత్నాలు పెద్దగా ఫలించినట్లు లేదు. సోము తనకు తెలియకుండానే తన ఇంటికి వచ్చారని, తాను టీడీపీని వీడేదిలేదని కళా వెంకట్రావు తర్వాత మీడియాకు చెప్పారు. దానితో పార్టీ పరువు పోయిందన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఇటీవలి కాలంలో  బీజేపీలో చేర్చుకుంటున్న టీడీపీ నేతలలో, చాలామంది ఎప్పటినుంచో స్థానికంగా పట్టు కోల్పోయిన వారితోపాటు, వయసు మీద మళ్లిన వారే ఎక్కువమంది ఉండటం గమనార్హం. అలాంటి వారిని చేర్చుకోవడం వల్ల సంఖ్య పెరుగుతుందే తప్ప, పార్టీకి అదనంగా వచ్చే లాభం ఏమీ ఉండదని బీజేపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. వారి వల్ల పార్టీకి భారమేనని స్పష్టం చేస్తున్నారు.

ప్రజల్లో పట్టు కోల్పోయి, వయసు మీరిన నేతలను చేర్చుకోవడంలో చూపిస్తున్న శ్రద్ధ, అధికార వైసీపీ నేతలను చేర్చుకోవడంలో ఎందుకు చూపించడం లేదన్న ప్రశ్న పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.  వయసుమీరిన గద్దె బాబూరావును చేర్చుకున్న తమ నాయకత్వం, చాలాకాలం నుంచి స్థానికంగా పట్టు కోల్పోయిన మాజీ మంత్రి పడాల అరుణను చేర్చుకుంటే, పార్టీకి వచ్చే అదనపు రాజకీయ ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో సంజయ్ మాదిరిగా  అధికారంలో ఉన్న పార్టీ నేతలను చేర్చుకుంటేనే, ప్రజలలో పార్టీపై విశ్వాసం, అధికారంలోకి వస్తుందన్న ధీమా పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. సంజయ్ చేస్తున్న పోరాటాల వల్ల, తెలంగాణలో బీజేపీ ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న ధీమా అన్ని వర్గాల్లో పెరిగిందని చెబుతున్నారు. తెలంగాణ బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ లక్ష్యంగా పనిచేయకుండా, టీఆర్‌ఎస్ లక్ష్యంగా పోరాడుతున్నందుకే ఇప్పుడు అక్కడ బీజేపీ బలపడిందని విశ్లేషిస్తున్నారు.

ఏపీలో బీజేపీ పోరాటాలన్నీ పత్రికా ప్రకటనలు, అతి తక్కువమందితో ధర్నాలకు పరిమితమవుతున్నాయన్న అసంతృప్తి ఆ పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. అంతర్వేది, రామతీర్థం సంఘటనల్లో టీడీపీ కంటే తమ పార్టీ ఆలస్యంగా ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రజల్లో నమ్మకం, బలం కోల్పోయిన ప్రతిపక్ష టీడీపీ బలహీనపడితే, తర్వాత ఆ స్థానం ఆక్రమించాలన్న ఆశ తప్ప, తెలంగాణలో మాదిరిగా తమంతట తాముగా ఎదిగే ప్రయత్నం చేయడం లేదన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అధికార వైసీపీ నుంచి నేతలను ఆకర్షిస్తేనే, సోము సత్తా ఏమిటన్నది తెలుస్తుందని, ఆ విషయంలో తెలంగాణ పార్టీ చీఫ్ సంజయ్ తన సామర్థ్యం నిరూపించుకున్న విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు.