మేము మరణిస్తే… మా వారసులొస్తారు…!

486

నిన్న రాత్రి సింఘా సరిహద్దు నుండి బయల్దేరి 3గంటల ప్రయాణానంతరం రాత్రి 9గంటలకు హర్యానా, ఢిల్లీ సరిహద్దు ప్రాంతం  పల్వాల్ మరో పోరాట క్షేత్రానికి TSUTF ప్రతినిధులం చేరాము. అప్పుడు ఉష్ణోగ్రత 7డిగ్రీలు.
గొప్ప ఆతిధ్యం:ఆ చలిలో కూడా మాతో పాటున్న  90 మందికి ఆప్యాయంగా ఆహారం అందించారు. ఆ తరువాత ఒక కిలోమీటర్ దూరం నడసి వెళ్ళాం. అక్కడ ప్రస్తుతం ఖాళీగా ఉన్న తలుపులు లేని పాత భవనం వసతి కోసం మాకు చూపించారు. ఆందోళన కారులు మొత్తం ట్రక్కుల లోనే నిద్రించారు. అర్ధరాత్రి అయ్యేసరికి చలికి వణుకు మొదలైంది.53 రోజులుగా వారు ఇదే చలిలో ప్రకృతితో,పాలకులతో పోరాడుతున్నారనే విషయం మదిలో మెదలడంతో హృదయం కలుక్కుమంది.వారి కష్టాలకు కారణమైన కేంద్ర ప్రభుత్వ చట్టాలు, చర్యలు గుర్తుకు రావడంతో జ్వలించిన వేడికి చలి మానుండి పారిపోయింది.

ఉదయం 5గం. చలిగాలులు వీస్తూనే ఉన్నాయి. ఎప్పుడొచ్చారో… కట్టెల పొయ్యి మీద వేడి నీళ్లు సిద్దం చేసి మీ దిన చర్య ప్రారంభించవచ్చు అని అక్కడి రైతు కార్యకర్తలు మమ్మల్ని నిద్ర లేపారు.7గం. నుండి 9 గం.ల వరకు అనేక మందిని విడివిడిగా, సమూహంగా కలిసాం. భాష మాకు ఆటంకం కాలేదు. మొదటి సారి కలుసుకున్న పసిపిల్లల్లా మాట్లాడుకున్నాం

వాటి సారాంశం:

1)ఇంతటి చలిలో,కొత్త ప్రదేశం లో మీరెలా రోజులు తరబడి పోరాడుతున్నారు?
– మా కోసం, మా పిల్లల భవిష్యత్తు, దేశం కోసం పోరాడుతున్నాం అనే ఆశయం మమ్మల్ని వాటిని అధిగమించేలా చేసింది.

2)మీకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయా?
– లేవు. ప్రపంచ వ్యాప్తంగా మా పోరాటానికి మద్దతు ఉంది. పంజాబ్, హర్యానా, UP, MP, రాజస్థాన్ నుండి అనేక దేశాలకు వెళ్లిన మా బిడ్డలు మాతృ భూమిని, మమ్మల్ని మరచిపోలేదు. వాళ్ళ మిత్రుల్ని సైతం మా పోరాటం కదిలించింది. వాళ్ళ తో పాటు మా రాష్ట్రాల ప్రజలు వస్తు రూపంలోనూ,అవసరమైన డబ్బు పంపిస్తున్నారు.మేము(రైతు,కూలీలము) మీలాంటి సహృదయుల ఆలోచనల్లో ఎప్పుడూ ఉంటాం గనుక మీ సహకారాన్ని పొందగలుగుతున్నాము.

3)మీరు ఒంటరిగా ఉన్నామనుకుంటున్నారా?
– లేదు. మోదీ ప్రభుత్వం,వారి వెనుకున్న కార్పొరేట్లుకు  మమ్మల్ని ఒంటరిని చేసి ఓడించాలని ఉంది.కానీ భారతీయ సమాజం, దాని మూలాలు వ్యవసాయం తో ముడివడి ఉన్నందున వారంతా మాతో మానసికంగా, భౌతికంగా ఉన్నారు.

4)ముఖేష్ అంబానీ, గౌతమ్ ఆదానీల ఉత్పత్తులు, వస్తువులు, సేవలు బహిష్కరించడం వల్ల ఏమిటి ప్రయోజనం?
– ఇంతకాలం మన దేశంలో వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాటయ్యింది.దేశాన్ని కొల్లగొడుతున్నారు. వారికి ఇక ఎదురులేదను కున్నారు. మాతో పెట్టుకున్నారు(కొరివితో తలగోక్కున్నారు మరి)అంబానీ, ఆదానీలు లేకున్నా సమాజం బ్రతక గలుగుతుంది అని చెప్పదలుచుకున్నాం. ఫలితం మీరు చూస్తున్నారు(జియో నుండి వేరే నెట్వర్క్ కు మారడం, వారి ఆహార పదార్థాలు కొనక పోవడం, పెట్రోల్ బంకులు బంద్….రైతుల కన్నెర్ర తో కొంత జంకారు)కానీ మేము లేకుండా ఉన్న దేశాన్ని ఊహించగలరా?

5)కరోనాతో సహ జీవనమా?
– మేము ప్రజల మన్నన పొందిన వారం.ప్రకృతి కనికరిస్తుంది. కరోనాకు ఇక్కడ చోటు లేదు.(మాస్కులు లేవు, శానిటై జర్ల వాడుక లేదు. భౌతిక దూరం అసలే సాధ్యం కాదు). లక్షల మంది పోరాటంలో ఉన్నా, రోజూ వేలాది మంది ప్రజలు వచ్చి పోతున్నా కరోనా కేసులు నమోదవడం లేదు.

6)మీ కోరిక ఏమిటి?
– మోదీ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే.ఉత్తర భారతం వేగంగా కదులుతుంది. ఉద్యమాలు ఊపందుకున్నాయి(మేము అక్కడ ఉండగానే MP, UP నుండి AIKS, CITU నుండి  రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో శిబిరం వద్దకు వచ్చారు).దక్షిణాది కూడా వేగంగా  మాతో జత కలవాలి

7)పోరాట కేంద్రాల్లో జరుగుతున్న ఆట, పాటలు గురించి?
– మేము పాలకులతో పెద్ద యుద్ధమే చేస్తున్నాము. కదన రంగంలో ఉన్న యోధులను కర్తవ్యోన్ముఖులను చేయడం, ఉత్సాహ పరచడం కోసం కవులు,రచయితలు,కళాకారులు వస్తున్నారు.జాతీయ పతాకం జెండాతో వారు మా రైతాంగ అజెండాను ముందుకు తీసుకెళ్తున్నారు.వారికి వందనాలు

8)ప్రభుత్వం ఎంత కాలనికి దిగిరాకపోతే,చట్టాలను రద్దు చేయక పోతే మీరేం చేస్తారు?
(గాఢమైన నిశ్శబ్దం… కొంత సేపు… తిరిగి అదే పట్టుదల.. దృఢ సంకల్పంతో…ఇలా అన్నారు)
–  “ఒకవేళ ఈ పోరాటం లో మేము చనిపోతే మా బిడ్డలు వస్తారు. మా స్థానం లో నిలబడి పోరాటాన్ని  కొనసాగిస్తారు. అది ఎంత కాలమైనా”
బరువెక్కిన గుండెలు… పిల్లలకు పాఠాలు చెప్పడం తెలిసిన మాకు నేడు తమ అనుభవాలతో మాకు, మాలాంటి వారెందరికో ఎన్నో గుణపాఠాలు చెప్తున్నారు.
“అన్నదాతలారా!
నీరవ నిశీధిలోనైనా, వడగళ్ల వాన లోనూ, ప్రచండ భానుడి ప్రతాపం, గడ్డ కట్టే చలి మీ మనో నిబ్బరాన్ని  ఏనాడూ పోగొట్టింది లేదు. మీకు వందనాలు మీ మా పోరాటం విజయవంతం కావాలని, ప్రేక్షకులుగా ఉన్న వారు కదలాలని…. రైతాంగ పోరాటం వర్ధిల్లాలని కోరుకుంటూ బరువెక్కిన గుండెలతో…వెనుదిరిగాము.
( ఇది రైతాంగ పోరాట 2వ వేదిక-పల్వాల్ సరిహద్దు నుండి  బి.నరసింహారావు అనే రైతు పంపించిన  ప్రత్యక్ష కథనం)

                                                                 –                                                   – సురేష్