కమ్మవారికి కొత్త నేత కావలెను!

798

అమెరికా నుంచి అమలాపురం వరకూ అదే అభిప్రాయం
అందరిచూపూ ఎన్టీఆర్ వైపే
( మార్తి సుబ్రహ్మణ్యం)

కీలకమైన అన్ని రంగాలను శాసిస్తూ, శ్వాసిస్తున్న కమ్మ సామాజికవర్గం ఇప్పుడు తమకు భరోసా ఇచ్చే  కొత్త నేతను కోరుకుంటోంది. రాజకీయాలలో పాతుకుపోయి, ఆ రంగంలో కొనసాగుతున్న కమ్మ వర్గం టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుతో లాభం లేదన్న నిర్ణయానికి వచ్చింది. లోకేష్‌కు బాబు అంత శక్తి యుక్తులు లేనందున, ఆయన పార్టీ నడిపించలేరన్నది వారి మనోభావన. అమెరికా నుంచి అమలాపురం వరకూ… న్యూజిలాండ్ నుంచి నిజామాబాద్ వరకూ కమ్మ వర్గంలో సోషల్‌మీడియా వేదికగా జరుగుతున్న చర్చ ఇది!  టీడీపీకి.. కమ్మ వర్గాన్ని ధైర్యంతో నడిపించే కొత్త నేత కావాలని, నాయుడుపై నమ్మకం పోయిందన్నది,  కమ్మవర్గాలకు చెందిన సోషల్‌మీడియా గ్రూపులలో జరుగుతున్న ఆసక్తికర చర్చ. మరి ప్రత్యామ్నాయం ఎవరంటే… అందరిదీ ఒకే మాట. జూనియర్ ఎన్టీఆర్!  మరి ఎన్టీఆర్ సినిమాలు వదులుకునేంత సాహసం చేస్తారా? వచ్చినా తాత మాదిరిగా కొత్త పార్టీ పెట్టేంత ధైర్యం చేస్తారా?.. ఇది కూడా దానికి అనుబంధంగా కమ్మ వర్గ సోషల్‌మీడియా గ్రూపులలో జరుగుతున్న మరో ఆసక్తికరమైన చర్చ.

రాని అవకాశాలను సైతం అందిపుచ్చుకుని, అద్భుతాలు సృష్టించి అనన్యసామాన్యమైన వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించడంలో నిష్ణాతురాలైన జాతిగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కమ్మ వర్గం.. ఇప్పుడు తమను నడిపించి, దన్నుగా ఉండే కొత్త నేత కోసం అన్వేషిస్తోంది. విదేశీ, స్వదేశంలో వాట్సాప్-ఫేస్‌బుక్‌లు నిర్వహించే కమ్మ వర్గ సోషల్‌మీడియాలో , గత కొంతకాలం నుంచీ  జరుగుతున్న చర్చల ప్రకారం.. టీడీపీని సమర్ధవంతంగా నడిపించి, మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చే శక్తి చంద్రబాబుకు గానీ, ఆయన కొడుకు లోకేష్‌కు గానీ లేదన్నది కమ్మ వర్గం నిర్వహిస్తున్న సోషల్‌మీడియా గ్రూపులలో జరుగుతున్న ప్రధాన చర్చ. ఈ విషయంలో ఒక్క శాతం కూడా లోకేష్ వైపు ఎవరూ మొగ్గు చూపిస్తుండకపోవడం ప్రస్తావనార్హం. గోల్డ్‌స్పూన్‌తో పుట్టిన లోకేష్ సమస్యలు, కార్యకర్తల కష్టాలు అవగాహన చేసుకోలేరన్నది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది.

ఇక చంద్రబాబు మేధస్సు, వ్యూహాలు నేటి తరానికి సరిపోవని, ఆయన వయసు కూడా పెరుగుతుండటం, ఇంకా పాతతరం రాజకీయాలే కొనసాగిస్తున్నందున ఇక ఆయనను నమ్ముకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్నది,  వారి మనోగతంగా అర్ధమవుతోంది. తాజాగా దేశంలో మారిన రాజకీయ పరిణామాలు, ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీస్తున్న కొత్త రాజకీయ కక్ష సాధింపు రాజకీయాలకు భయపడుతున్న కమ్మ పారిశ్రామిక వేత్తలు, భవిష్యత్తులో టీడీపీకి నిధులు సమీకరించేందుకూ వెనుకాడే పరిస్థితి రావచ్చన్నది వారి సోషల్‌మీడియా గ్రూపులలో జరుగుతున్న మరొక ఆసక్తికరమైన చర్చ.  ఆ భయంతోనే చాలామంది బీజేపీ పంచన చేరుతున్నారన్న మాట కూడా బయటపడింది.

ప్రధానంగా ఉపయోగం ఉంటే తప్ప ఎవరికైనా నిధులివ్వని మనస్తత్వం ఉన్న కమ్మ వర్గం,  ఈ విషయంలో టీడీపీని కూడా ఆ విషయంలో,  మినహాయింపు ఇవ్వకపోవచ్చన్నది మరికొందరి అభిప్రాయం. చంద్రబాబు వ్యాపార ధోరణి వల్లే కార్యకర్తల పార్టీ అయిన టీడీపీ, తర్వాత పూర్తి కమర్షియల్‌గా మారిందని, ఇప్పటి పార్టీ- తమ  దుస్థితికి అదే ప్రధాన కారణమన్నది వారి  ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు పెద్ద పీట వేసిన ఫలితంగా, ఎన్టీఆర్ హయాం నుంచీ పార్టీలో కొనసాగుతున్న కమ్మ వర్గం పార్టీకి దూరమయిందన్నది మరో విశ్లేషణ.

బాబు వ్యవహారశైలి వల్లే  ఏపీలో ఇప్పుడు కమ్మజాతి అనాధగా, మిగిలిన వర్గాలకు శత్రువుగా మారాల్సి వచ్చిందన్న అసంతృప్తి వారి వ్యాఖ్యల్లో వ్యక్తమవుతోంది. కింది స్థాయిలో పనిచేసే తమ వారిని వదిలేసి, చుట్టూ చేరిన అదే తమ వర్గ వ్యాపారస్తులకు పెద్ద పీట వేసిన బాబును, మరొకసారి నమ్మే పరిస్థితి ఉండదంటున్నారు. పారిశ్రామికవేత్తలకు ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రి పదవులిస్తే వారే చివరకు వెళ్లిపోయినందున.. ఇక బాబు మేధస్సు, విజనరీ, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం ఏమయిందన్న ప్రశ్నలు ఆ గ్రూపులలో సంధిస్తున్నారు.

మొత్తంగా చంద్రబాబునాయుడుతో ఇక లాభం లేదన్న నిశ్చితాభిప్రాయంతో ఉన్న యావత్ కమ్మ వర్గం..   జూనియర్ ఎన్టీఆర్‌గా ప్రత్యామ్నాయ నేతగా  భావిస్తున్నట్లు, వారి సోషల్ మీడియా గ్రూపుల  మనోగతంగా స్పష్టమవుతోంది. కాకపోతే టీడీపీ ఎన్టీఆర్‌కు అన్యాయం చేసినందున, ఇప్పటి క్లిష్ట పరిస్థితిలో ఆయన సొంత పార్టీ పెట్టాలని కొందరు సూచిస్తున్నారు. కేంద్రమాజీ మంత్రి సుజనా
చౌదరి, తుమ్మల నాగేశ్వరరావు వంటి ఒకరిద్దరి పేర్లు చర్చకు వచ్చినా వాటి సంఖ్య అతి తక్కువేనంటున్నారు.  చంద్రబాబు నాయుడే ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అందిస్తే బాగుంటున్నది మరికొందరి అభిప్రాయంగా కనిపిస్తోంది. జగన్‌ను ఢీకొనే శక్తి, గ్లామర్, వాక్చాతుర్యం ఎన్టీఆర్‌కు మాత్రమే ఉందన్నది వారందరి అంచనా.  అయితే ఈ రకంగా ఎన్టీఆర్‌ను ప్రత్యామ్నాయ నేతగా సూచించిన వారంతా.. సినిమా రంగంలో బాగా సంపాదిస్తూ, ఇమేజ్ తెచ్చుకుంటున్న ఎన్టీఆర్, తన తాత మాదిరిగా వాటిని వదులుకుని రాజకీయాల్లోకి వస్తారా? అన్న  సామూహిక అభిప్రాయం వ్యక్తం చేయడం కూడా  ప్రస్తావనార్హం.  ఎన్టీఆర్‌కు పిల్లనిచ్చిన మామ నార్నె శ్రీనివాస్  ప్రస్తుతం వైసీపీలో పనిచేస్తుండటం గమనార్హం.

కమ్మవర్గానికి, టీడీపీకి సమర్ధవంతుడైన కొత్త నేత కావాలన్న చర్చ, తమ వర్గంలో వివిధ స్థాయిలో నడుస్తున్న మాట నిజమేనని..  చంద్రబాబునాయుడు యూత్‌కాంగ్రెస్ నేతగా ఉన్నప్పటి నుంచీ ఆయనతో కలసి పనిచేసిన, కొమ్మినేని సాయి వికాస్ అంగీకరించారు. ఇప్పుడు పార్టీని సమర్ధవంతంగా నడిపించే శక్తి, కమ్మజాతి బాబును చూసి ధైర్యం తెచ్చుకునే  పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతా ప్రత్యామ్నాయంగా ఎన్టీఆర్‌ను కోరుకుంటున్నప్పటికీ, ఆయన సినిమాల్లో ఆదాయం వదులుకుని వస్తారా అన్నదే సందేహమని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే కమ్మ జాతితోపాటు, సీనియర్ ఎన్టీఆర్‌ను నమ్మిన బడుగు బలహీన వర్గాలు కూడా ఆయన వెంట వస్తాయని విశ్లేషించారు.

కొత్తనేతపై చర్చ నిజమే: వికాస్

‘చంద్రబాబు పెద్ద మేధావేమీ కాదు. జగన్ మాదిరిగా పోరాడి అధికారం సాధించిన వాడు కాదు. పరిస్థితులు అలా కలసివచ్చాయి. తన వద్ద చేరిన వాళ్లు అధికారం పోయిన తర్వాత వెళ్లిపోతారని గ్రహించలేని వాడు ఏం మేధావి? అవినీతిపరులు ఓడిపోతారని తెలిసినా మార్చకుండా వారికే టికెట్లు ఇచ్చిన వాడు నాయకుడు ఎలా అవుతాడు?’ అని వికాస్ ప్రశ్నించారు.
‘ కార్యకర్తల పార్టీ అయిన టీడీపీని పూర్తి కమర్షియల్ చేసి, డబ్బున్నవాళ్లకు కట్టబెట్టారు. నిజానికి బాబు చుట్టూ చేరి పనులు చేసుకున్న కొందరు కమ్మవారే, ఆయనతో బాగు పడ్డారు. ఇప్పుడు వాళ్లంతా ఎక్కడున్నారు? అలాంటి వారికి  తప్ప,  సగటు కమ్మ వారికి ఆయన వల్ల నష్టమే ఎక్కువ జరిగింది. ఏపీలో టీడీపీ బ్రాండ్ పడటం వల్లే కమ్మవారు కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు వాళ్లను ఆదుకునే దిక్కులేదు.  తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీని ఆయనే భూస్థాపితం చేశారు. పరిస్థితులను ఎదుర్కోలేని వాడు నేత ఎలా అవుతాడు? ఇప్పుడు జగన్‌ను తట్టుకునే శక్తి ఆయనకు లేదు. ఇక రాదు కూడా. బాబు ఎవరిలోనూ విశ్వాసం కల్పించలేకపోతున్నారు. ఆయన ఇంకా తన నైజం మార్చుకోలేదు. మా వాళ్లు లాభం లేనిదే పైసా ఇవ్వరు. రేపు ఎన్నికల్లో కూడా బాబును చూసి,  మా వర్గం పారిశ్రామికవేత్తలు నిధులిస్తారని నేను అనుకోను. బహుశా ఇలాంటి కారణాల వల్లే కమ్మ వర్గం కొత్త నేతను కోరుకుంటోంది. అది అవసరం కూడా’ అని వికాస్ విశ్లేషించారు.