‘భక్తియోగం’ వలన మానవుడు దైవానుగ్రహానికి పాత్రుడౌతాడు. మానవుడు ఐహికంగా సాధించవలసిన విషయాలలో దైవానుగ్రహం యొక్క పాత్ర లేక దైవం యొక్క పాత్ర స్వల్పమే. కానీ మనిషి జీవితం మొత్తాన్ని సమగ్రంగా చూసినపుడు భగవంతుని కృప యొక్క విశిష్టత మనకు బోధపడుతుంది. మనిషి స్వభావాన్ని బట్టి, మనోబలాన్ని బట్టి అతనికి ‘విధి అనుకూలత’ సంభవిస్తుంది. ఒకొక్కసారి ఈ విధి వల్లనైతేనేమి, మానవుని సంకల్పదోషం వల్లనైతేనేమి మానవునికి హాని కలిగే సందర్భంలో దైవానుగ్రహం మానవుడిని రక్షిస్తుంది. అది కూడా అందుకు అతను పాత్రుడైన పక్షంలో మాత్రమే. ఆ పాత్రతకు మార్గం భక్తియోగమే.
మానవుడు ఆ భగవంతునికి భక్తుడు కాని పక్షంలో తన జీవితానికి భద్రతను డబ్బులోనో, అధికారంలోనో చూసుకుంటాడు. నిజానికి ఇటువంటివారు కూడా గుళ్ళూగోపురాలూ తిరుగుతూ దేవుడిని నిత్యం పూజిస్తూ ఉంటారు. కానీ ఇదంతా భౌతిక చర్యే కానీ వారికి ఏవిధమైన భక్తీ ఉండదు. భక్తి అనేది భౌతికమైనది కాదు. అది మానవుడి అంతరంగానికి సంబంధించిన విషయం. అది మనసులో, హృదయంలో ఉండాలి.
భక్తి అంటే మూర్తి ఆరాధన కాదు. అది ధర్మం ఎడల అనుతాపం, ధర్మం ఎడల అపరిమితమైన విశ్వాసం. భగవంతుడు ధర్మ స్వరూపుడు కావున ధర్మం యెడల అనుతాపం భగవంతుని ఎడల భక్తిగానే పరిగణింపబడుతుంది. భక్తి అంటే పూజలు, పునస్కారాలు కాదు. అది ‘సర్వత్ర సమదర్శనం’. మనకు ఏ విధంగా మేలు జరగాలని కోరుకుంటామో అలాగే ఇతరులకు కూడా జరగాలని కోరుకోవడం. ఇటువంటి వారినే ఆ భగవంతుడు తన భక్తులుగా పరిగణిస్తాడు.
యే త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే |
సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం || (అ.12-శ్లో.3)
సన్నియమ్యేన్దిరియగ్రామం సర్వత్ర సమబుద్దయః |
తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః || (అ.12-శ్లో.4)
ఇంద్రియాలన్నింటినీ బాగా వశపరచుకుని సర్వత్రా సమభావం కలిగి, సమస్త భుతాలకూ మేలు చేయడంలోనే సంతోషం పొందుతూ, నాశరహితమూ, అనిర్వచనీయమూ, అవ్యక్తమూ, సర్వవ్యాప్తమూ, ఊహాతీతమూ, నిర్వికారమూ, నిశ్చలమూ, నిత్యమూ అయిన ఆత్మస్వరూపాన్ని ఉపాసించేవాళ్ళు నన్నే పొందుతారు.
సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని |
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః || (అ.6-శ్లో.29)
యోగసిద్ధి పొందినవాడు సమస్త భుతాల పట్ల సమభావం కలిగి సర్వ భుతాలలో తన ఆత్మనూ, తన ఆత్మలో సర్వభూతాలనూ సందర్శిస్తాడు.
యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి |
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి || (అ.6-శ్లో.30)
అన్ని భుతాలలో నన్నూ,నాలో అన్ని భూతాలనూ చూసేవాడికి నేను లేకుండా పోను; నాకు వాడు లేకుండా పోడు.
సర్వ భూతస్థితం యో మాం భజత్యేకత్వ మాస్థితః |
సర్వథా వర్తమానోపి స యోగీ మయి వర్తతే || (అ.6-శ్లో.31)
సమస్త భుతాలలో వున్న నన్ను భేదభావం లేకుండా సేవించే యోగి ఎలా జీవిస్తున్నప్పటికీ నాలోనే ఉంటాడు.
ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున! |
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః || (అ.6-శ్లో.32)
అర్జునా! సమస్త జీవుల సుఖదుఃఖాలను తనవిగా తలచేవాడు యోగులలో శ్రేష్ఠుడని నా అభిప్రాయం.
నిజమైన భక్తుడు తన జీవితానికి భద్రతను, హామీని దైవానుగ్రహంలో చూసుకుంటాడు. తన స్వధర్మం అమితమైన ధనార్జనతో కూడుకున్నది కాక పోయినా తన భారాన్ని ఆ భగవంతుడి మీద మోపి తన కర్తవ్యనిర్వహణకు పూనుకుంటాడు. మరే విధమైన ఐహిక సంబంధమైన హామీని కోరడు. ఇటువంటి భక్తులకొరకే గీతలో భగవంతుడు ‘యోగక్షేమం వహామ్యహం’ అనే వాగ్దానాన్ని చేశాడు.
అనన్యాశ్చింతయం తో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం || (అ.9-శ్లో.22)
ఏకాగ్రచిత్తంతో నిరంతరం నన్నే స్మరిస్తూ సేవించే వాళ్ళ యోగక్షేమాలు నేనే చూస్తాను.
అంటే తన భక్తుల యోగక్షేమాలను తనే చూసుకుంటానని భగవానుడు మాట ఇచ్చాడు. కనుక మానవుడు తన స్వధర్మాచరణలో ఏ విధమైన ఐహికమైనటువంటి భద్రత, హామీ గోచరించకపోయినా కూడా వెరవకుండా భగవంతుడే తన యోగక్షేమాలు చూసుకుంటాడని నమ్మి తన స్వధర్మాన్ని నిర్వర్తించాలి.
త్యక్త్వా కర్మఫలాసఙ్గం నిత్యతృప్తో నిరాశ్రయః |
కర్మ ణ్యభిప్రవృత్తో పి నైవ కిఞ్చత్కరోతి సః || (అ.4-శ్లో.20)
కర్మఫలాపేక్ష విడిచిపెట్టి నిత్యమూ సంతృప్తితో దేనిమీదా ఆధారపడకుండా, కర్మలు చేసేవాడు, ఏమీ చేయనివాడే అవుతాడు.
అలా కానియెడల మానవుడు తన జీవితానికి భద్రత మరియు హామీ కొరకు తన కర్తవ్యాన్ని విడిచిపెట్టి అన్నింటికన్నా ముందుగా ధనాన్నో, అధికారాన్నో, లేక పేరుప్రతిష్ఠలనో సాధించుకొని, వాటిమీదనే ఆధారపడే విధంగా తయారై స్వధర్మాన్ని వీడతాడు. కర్మబంధాలలో చిక్కుకుంటాడు.
కనుక భక్తుడికి ఏ విధమైన ఐహికమైన ఆలంబన, హామీ లేక భద్రత అవసరంలేదు. అన్నీ ఆ భగవంతుడే. ఆ విధంగా భగవంతుడి మీద భారం వేసి తన స్వధర్మాన్ని నిర్వర్తించే మానవునికి ఎటువంటి హానీ సంభవించదు. అంటే మానవునికి తన స్వధర్మాన్ని నిర్వర్తించే ధైర్యం భక్తివలననే, శరణాగతి వలననే కలుగుతుంది. అందుకే గీతలో గీతాకారుడు తన భక్తులకు తనమీద అపరిమితమైన విశ్వాసం కలిగేటట్లుగా ‘కౌంతేయా! ప్రతిజానీహి, నమే భక్తం ప్రణశ్యతి’ అని కూడా అన్నాడు. అంటే ‘ఓ అర్జునా! నా భక్తుడెన్నటికీ చెడిపోడని ఘంటాపథంగా శపథము పలికి ఘోషింపుమా!’ అని అర్థం.
అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ |
సాధురేవ స మంతవ్యః సమ్య గ్వ్యవసితో హి సః || (అ.9-శ్లో.30)
ఎంతటి పాపి అయినప్పటికీ ఏకాగ్రచిత్తంతో నన్ను సేవించేవాణ్ణి సాధువుగానే భావించాలి. ఎందువల్లనంటే అతని సంకల్పం మంచిది.
క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం విగచ్ఛతి |
కౌంతేయా! ఫ్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి || (అ.9-శ్లో.31)
అలాంటి వాడు అచిరకాలంలోనే ధర్మాత్ముడై, శాశ్వతశాంతి పొందుతాడు. కౌంతేయా! నా భక్తుడెప్పుడూ చెడిపోడని ఘంటాపథంగా శపథం చేసి మరీ చెప్పు.
అంటే మనం ఇక నిశ్చింతగా సత్యాచరణ చేయవచ్చు. దేనికీ భయపడవలసిన పనిలేదు. భవిష్యత్తు గురించి భయపడవలసిన పనిలేదు. విధి పరంగా ఏమైనా విపత్తులు సంభవిస్తాయేమో అని భయపడవలసిన పనిలేదు. మరేదైనా భౌతికమైన హాని మన ఎడల జరుగుతుందేమో అని భయపడవలసిన పనిలేదు. అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు. మనం మాత్రం మన స్వధర్మాన్ని మాత్రమే ఆచరించాలి.
ఇప్పుడొక చిన్న కథతో ఈ భక్తియోగాన్ని ముగిద్దాం. ఒకప్పుడొక శివభక్తుడు వరద నీటిలో చిక్కుకుని ఆ పరమేశ్వరుడే తనను రక్షించుననే విశ్వాసంతో ఎదురుచూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒకరి తరువాత ఒకరుగా ముగ్గురు పడవవారు వచ్చి సాయమందివ్వబోగా, ఆ సదాశివుడే స్వయంగా తనను రక్షించునని వారి సహాయం తనకు వలదని ముగ్గురినీ పంపివేసెను. తుదకు మరెవ్వరి సాయమూ లభింపక ఆ శివభక్తుడు వరదనీట మునిగి మరణించి, అటుపిమట శివ సాన్నిధ్యానికి పోయి ఆపత్సమయంలో తనకెందుకు సహాయపడలేదని ఆ శివుని ప్రశ్నించెను. అందుకు శివుడు తన భక్తునితో “నేను నీకు మూడు సార్లు సాయమందించబోయాను, కానీ నీవు మూడు సార్లూ తిరస్కరించావు” అని పలికెను.
దీనిని బట్టి ఏది భౌతికమైన ఆలంబన, ఏది భగవంతుడిచ్చే ఆలంబన అనేది మన విచక్షణతోటి మనమే స్వయంగా నిర్ణయించుకోవాలి.
(భౌతికమైన ఆలంబనలో స్వధర్మాచరణ నుండి, సత్యాచరణ నుండి పక్కకు జరగాల్సి వస్తుంది. భగవంతుడిచ్చే ఆలంబనలో అలా జరగవలసిన అవసరం ఉండదు. స్వధర్మాచరణ పరిధిలోనే మనకు ఆ భద్రత లభిస్తుంది.
నీ స్వధర్మాచరణలో కూడా-నీకు నడమంత్రపు సిరి లభించదేమో కానీ-నీకు ఎంత అవసరమో అంత ధనాన్ని ఆ భగవంతుడు తగిన విధంగా నీకు సమకూరుస్తాడు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే నీవు ధనమో, అధికారమో మరొకటో లక్ష్యంగా పనిచేయకు. నీకు సంతృప్తి కలిగేటట్లుగా, నీకు సరిపడే న్యాయమైన మొత్తంలో ధనాన్ని ఆ భగవంతుడే తగిన మార్గంలో నీకు అందచేస్తాడు. కనుక నీవు నీ స్వధర్మాన్ని ఏకాగ్రతతో, ఆత్మవిశ్వాసంతో ఆచరించు. అలా అని ధనాన్ని ఉద్దేశ్యపూర్వకంగా వ్యతిరేకించవలసిన పనిలేదు. నీ స్వధర్మమైనపుడు నీవు ధనార్జనతో కూడుకున్న పనినైనా చేపట్టవచ్చు.)
-శంఖారావం