సర్కారుపై ‘క్రైస్తవ’ కుట్ర?

659

పాస్టర్ ప్రవీణ్ అరెస్టుతో బహిరంగం
ఆలయాలపై దాడి వెనుక పార్టీల కోణం లేదా?
ఆర్‌ఎస్‌ఎస్ అభిప్రాయం అదేనా?
కొందరు పాస్టర్ల పనేనని సంఘ్ అనుమానం
ప్రవీణ్ అరెస్టుతో నిజమైన సంఘ్ అంచనా
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ సీఎం జగన్ సర్కారుపై ‘క్రైస్తవ కోణం’లో కుట్ర జరుగుతోందన్న అనుమానాలు కాకినాడ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి అరెస్టుతో బలపడుతున్నాయి. హిందూ దేవతల విగ్రహాలు తానే అనేక సార్లు ధ్వంసం చేశానంటూ ప్రవీణ్ నిర్భయంగా ప్రకటించుకున్నాడు. దానిని  యూట్యూబ్ చానెల్‌లో సగర్వంగా ప్రకటించుకున్న ప్రవీణ్‌ను, గుంటూరుకు చెందిన సింగం లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేయడంతో, ఆలయాలపై జరుగుతున్న దాడుల వెనుక రాజకీయ పార్టీల ప్రమేయం లేదని తేలిపోయింది. అదే సమయంలో  క్రైస్తవమతాన్ని అడ్డుపెట్టుకుని కొందరు పాస్టర్లు చేస్తున్న దుశ్చర్యగా, చాలాకాలం నుంచి భావిస్తోన్న ఆర్‌ఎస్‌ఎస్ అనుమానం కూడా ప్రవీణ్ అరెస్టుతో నిజమయినట్టయింది.

తాను లెక్కలేనన్ని సార్లు దేవతా విగ్రహాలు విధ్వంసం  చేశానని నిర్భయంగా ప్రకటించుకున్న పాస్టర్ ప్రవీణ్ అరెస్టుతో అనేక సంచలన, తెరవెనుక నడుస్తున్న కథలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో గత కొన్ని నెలల నుంచీ శరపరంపరగా, దేవాలయాలపై జరుగుతున్న దాడులపై హిందూ సంస్థలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. దీనిపై సీరియస్‌గా దృష్టిపెట్టిన ఆరెస్సెస్ చేసిన పరిశీలనలో, అనేక అంశాలు దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ప్రకారంగా, దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక రాజకీయ పార్టీల ప్రమేయం లేకపోయినా, వాటిని అవి తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నాయని భావిస్తోంది.

కొందరు పాస్టర్లు అత్యుత్సాహంతో, అధికారంలో తమ ప్రభుత్వమే ఉందన్న బేఖాతరిజంతో ఈ దాడులకు దిగుతున్నట్లు.. సంఘ్ చాలాకాలం క్రితమే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది..  అయితే వారిపై చ ర్యలు తీసుకునేందుకు  జగన్ ప్రభుత్వం భయపడుతోందని, ఓటు బ్యాంకు కోణంలో కఠిన చర్యలకు మొహమాటపడుతోందని సంఘ్ భావిస్తోంది. తాజాగా పాస్టర్ ప్రవీణ్ అరెస్టుతో సంఘ్ అనుమానం- అంచనా నిజమయినట్టయింది. కాగా   వివాదాస్పదమయిన ప్రవీణ్  వీడియోను, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన కొందరు డీజీపీకి వారం క్రితమే పోస్ట్ చేసినట్లు సమాచారం.

ఇక క్రైస్తవంలో మత ప్రచారకులుగా ఉన్న ప్రముఖుల మధ్య జరుగుతున్న ఆధిపత్య-రాజకీయ పోరు కూడా, తాజా పరిణామాలకు మరో కారణంగా క్రైస్తవులు చెబుతున్నారు. ఇందులో జగన్ అనుకూల-వ్యతిరేక మత ప్రచారకులుగా ఉన్న వారు, ఎప్పటినుంచో క్రైస్తవులపై తమ పట్టు సాధించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో సువార్త మహాసభలు నిర్వహించే ఓ అరడజను మత ప్రచారకులకు, క్రైస్తవులలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. వీరిలో కొందరు గత టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించగా, మరికొందరు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. కానీ మెజారిటీ శాతం పాస్టర్లపై, వైసీపీ అనుకూల మత ప్రచారకుల ప్రభావమే పనిచేసింది.ఎన్నికల్లో విజయం తర్వాత జగన్, చాలామంది క్రైస్తవ మత పెద్దలకు అపాయింట్‌మెంట్లు ఇవ్వకపోవడంపై కొందరిలో అసంతృప్తి మొదలయింది. ఎన్నికల ముందు దళిత క్రైస్తవుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మహాసేన నేత రాజేష్, వైసీపీ కోసం దళిత క్రైస్తవులను కూడగట్టి జగన్‌కు విస్తృత స్థాయి ప్రచారం చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో,  వీడియోల ద్వారా దాడి చేశారు. కొద్దినెలల తర్వాత అదే రాజేష్, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా గళం విప్పడం ప్రారంభించారు. ఒక కేసులో ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి, జైల్లో పెట్టడంతో రాజేష్  అప్పటినుంచీ వైసీపీ సర్కారు మీద విరుచుకుపడుతున్నారు.

కాగా రాష్ట్రంలో  దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక, జగన్‌కు వ్యతిరేకంగా ఉన్న మత ప్రచారకుల వర్గానికి చెందిన వారి హస్తం ఉందన్న అనుమానాలు,  చర్చ కొత్తగా తెరపైకి వస్తున్నాయి. ఆలయాలపై దాడులు చేస్తే అది నేరుగా జగన్ ప్రభుత్వానికే అప్రతిష్ట తెస్తుందన్న వ్యూహంతోనే, ఒక పథకం ప్రకారం దాడులు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అరెస్టయిన ప్రవీణ్ ఏ  పార్టీకి సంబంధం లేకపోయినా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి, దగ్గరగా ఉంటారన్న ప్రచారం క్రైస్తవ వర్గాల్లో ఉంది. ఆయనకు వైసీపీతో ఎలాంటి  సంబంధాలు లేవని, గతంలో సర్పవరంతో సహా అనేక కేసులు కూడా నమోదయి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పలువురు మహిళలు కూడా ఆయనపై ఫిర్యాదు చేయడం, బెయిలుపై బయటకు వచ్చిన విషయాన్ని క్రైస్తవ పెద్దలు గుర్తు చేస్తున్నారు.

తాజాగా పాస్టర్ ప్రవీణ్ చర్యలు బయటపడటంతో, కొందరు పాస్టర్లు ఒక పథకం ప్రకారం ఆలయాలపై విధ్వంసాలకు దిగి, శాంతిభద్రత సమస్య సృష్టిస్తున్నారని స్పష్టమయింది. ఫలితంగా ఇవన్నీ  జగన్ ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నాయన్న భావన ఇతర వర్గాల్లో కలిగించేందుకు, క్రైస్తవులే పనిగట్టుకుని చేస్తున్నారన్న అనుమానం పెంచేందుకు కారణమయింది. మొత్తంగా క్రైస్తవ కోణంలో ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రగానే స్పష్టమవుతోంది. జగన్ అధికారంలో ఉన్నందున, ఆలయాలపై ఎక్కడ దాడులు జరిగినా దానికి క్రైస్తవులే కారణమన్న భావన.. హిందువులలో కల్పించడమే ఈ కుట్ర వెనుక లక్ష్యంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు, మత పెద్దల నుంచి వ్యక్తమవుతున్నాయి.

‘జగన్ అధికారంలో ఉన్నందున వ్యక్తిగతంగా ఆయనను, మతం పేరిట క్రైస్తవాన్ని ఉమ్మడిగా  అప్రతిష్ఠపాలు చేసేందుకు కొందరు చేస్తున్న కుట్రలను సమాజం గుర్తించాలి. ఏ సీఎం అయినా తన ప్రభుత్వాన్ని తానే అప్రతిష్టపాలు చేసుకుంటారా? మరో మతానికి వ్యతిరేకంగా వ్యవహరించి వారిని దూరం చేసుకుంటారా? ప్రభుత్వంలో ఉన్న పార్టీ పెద్దలకు అన్ని మతాలు, కులాలు కావాలి కదా?  క్రైస్తవం సమాజంలో శాంతిని కోరుకుంటుంది. ఏపీలో అన్ని మతాలు అన్నదమ్ముల్లా కలసి జీవిస్తున్నాయి. అలాంటి క్రైస్తవానికి చెడ్డపేరు తెచ్చేందుకు కొందరు చేస్తున్న కుట్రలను హిందు-క్రైస్తవులు గమనించాలి. ఆలయాలపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల’ని ఆలిండియా దళిత క్రిస్టియన్ ఫోరం చైర్మన్ పెరిక వరప్రసాద్ వ్యాఖ్యానించారు.