ఇండియన్ ఆర్మీ ఘనత

592

ప్రపంచములోనే పేరెన్నిక గన్నది మన మిలిటరీ. మన మిలిటరీకి ఉన్న ప్రత్యేకతలు గొప్పతనము తెలుసుకొనే ప్రయత్నము  చేద్దాము. ప్రతి సంవత్సరము జనవరి 15 న మన ప్రభుత్వము “ఇండియన్ ఆర్మీ డే”గా జరుపుతారు. ఎందుకంటే 1949 జనవరి 15 న అప్పటి లెఫ్టినెంట్ జనరల్ కె.ఎమ్ కరియప్ప బ్రిటిష్ జనరల్ సర్ ప్రాన్సిస్ బుచర్ నుండి పదవి బాధ్యతలు స్వీకరించి స్వతంత్ర భారత దేశపు కమాండర్ ఇన్ చీఫ్ అయినాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరము జనవరి 15 ను ఇండియన్ ఆర్మీ డే గా జరుపుకుంటున్నాము. ఈ సందర్భముగా మన ఆర్మీ ప్రత్యేకతలు, గొప్పతనాన్ని గురించి తెలుసుకుందాము.

 1. 1776లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వారి ఏలుబడిలో భారతదేశములో ఇండియన్ ఆర్మీ ని స్థాపించారు.
 2. 1773లో నే ఇండియన్ ఆర్మీలోని” ప్రెసిడెంట్స్ బాడీ గార్డ్స్ “రెజిమెంట్ ప్రారంభించబడింది. ఇది అతి పురాతన రెజిమెంట్. ఇందులోని సైనికులు శిక్షణ పొందిన పేరాట్రూపర్స్ ఇంకో ఆసక్తికరమైన విషయము ఏమిటి అంటే భారతీయ సైన్యములో అశ్విక దళము కూడా ఉంది. ప్రపంచములో ప్రస్తుతము ఉన్న 3 అశ్విక దళాలలో ఇది ఒకటి.
 3. రాయల్ ఇండియన్ ఆర్మీకి చెందిన కమల్ రామ్ అనే సిపాయి 19 ఏళ్లకే అప్పటి ప్రతిష్ఠాత్మకమైన విక్టోరియా క్రాస్ ను  రెండవ ప్రపంచ యుద్ధములో ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు పొందాడు.
 4. ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ లో పురాతనమైన పార్లమెంటరీ ఫోర్స్ “అస్సాం రైఫిల్స్ “దీనిని 1835 లో ప్రారంభించారు.
 5. ప్రపంచములోనే అతి పెద్ద  మిలిటరీ లొంగుబాటు సాధించిన ఘనత ఇండియన్ ఆర్మీకి ఉన్నది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి సందర్భముగా జరిగిన యుద్ధములో 93,000 వేల  పాకిస్తానీ సైనికులు వాళ్ల సైనికాధిపతి జనరల్ నియాజి ఇండియన్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ జనరల్ దల్జీత్ సింగ్ అరోరా ముందు లొంగిపోయారు.
 6. రెండవ ప్రపంచ యుద్ధ సమయములో జర్మనీ నియంత హిట్లర్, ఇండియన్ ఆర్మీలోని  గూర్ఖా రెజిమెంట్ ను స్వాధీనము చేసుకుంటే బాగా లాభము ఉంటుంది అన్న కోరికను వెలిబుచ్చాడుట. ఎందుకంటే హిట్లర్ ఉద్దేశ్యములో జర్మన్ సైన్యాన్ని ఎదుర్కొని ఎదురు నిలచే  శక్తి ప్రపంచము లో ఒక్క గూర్ఖా రెజిమెంట్ కె ఉంది. గూర్ఖా రెజిమెంట్ గనుక తన పక్షాన ఉంటె మొత్తము యూరోప్ ను జయించవచ్చు అని హిట్లర్ ఉద్దేశ్యము.
 7. అమెరికా, ఇంగ్లాండ్, రష్యా వంటి అభివృద్ధి చెందిన దేశాల సైనికులకు యుద్ధవిద్యలలో శిక్షణ డెహ్రాడున్ లోని భారతీయ మిలిటరీ అకాడమీలో ఇస్తారు. అంతేకాకుండా కౌంటర్ ఇన్సర్జన్సీ మరియు జంగిల్  వార్ ఫేర్ లలో మిజోరాం లో గల శిక్షణ కేంద్రములో శిక్షణ ఇస్తారు. ఈ విధముగా ప్రపంచ దేశాలలోని సైనికులకు శిక్షణ ఇచ్చే ఘనత ఇండియన్ ఆర్మీ దే.
 8. ఇప్పటివరకు ఇండియన్ ఆర్మీకి ఏ దేశముపైన దాడి చేసిన సందర్భాలు లేవు అంతేకాకుండా ఇండియన్ ఆర్మీ ఏ నాడు దేశములో మిలిటరీ  విప్లవాలు చేయలేదు రాజకీయాలకు ఏమాత్రము తావు లేనిది ఇండియన్ ఆర్మీ.
 9. ఇండియన్ ఆర్మీలో చేర్చుకోవటానికి ఏరకమైన మతము, కులం, ప్రాంతము, భాష వంటివి అడ్డుకావు పూర్తిగా శరీర పటిష్టత సంపూర్ణ ఆరోగ్యము మాత్రమే  పరిగణలోకి తీసుకుంటారు .కఠీన పరీక్షల అనంతరమే ఆర్మీలోకి చేర్చుకుంటారు.
 10. లఢక్ లోయలో హిమాలయ ప్రాంతాన  ద్రాస్, సురేన్ నదుల మధ్య నిర్మించిన ప్రపంచములోని ఎత్తైన బైలీ వంతెన నిర్మించిన ఘనత ఇండియన్ ఆర్మీది ఈ నిర్మాణము ప్రపంచములోని ఇంజనీరింగ్ నైపుణ్యాలలో ఒకటిగా చెపుతారు .దీనిని 1982 లో భారతీయ సైన్యము నిర్మించారు.
 11.  ఇండియా  పాకిస్తాన్ ల మధ్య “లొంగెవాలా” ప్రాంతములో  జరిగిన యుద్ధములో జరిగిన యదార్ధ సంఘటన ఆధారముగా “బోర్డర్” అనే బాలీవుడ్ సినిమా నిర్మింపబడి సూపర్ హిట్ అయ్యింది ఆ యుద్ధములో భారతీయ సైనికులు 120 మంది  వారివద్ద ఉన్న తక్కువ ఆయుధాలతో) M 40రైఫిల్ మౌంటెడ్ రికాయిలర్స్ జీప్ మాత్రమే (2000 మంది పాకిస్తానీ సైనికులు, 45 యుద్ధ ట్యాన్ కులు, ఒక మొబైల్ ఇన్ ఫ్యాన్ట్రి వస్తే వారిని మన భూభాగములో ప్రవేశించకుండా మర్నాడు ఉదయము భారతీయ  వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు వచ్చేవరకు పాకిస్తానీ సేనలను నిరోధించారు. యుద్ధము చేయటానికి సంఖ్య, ఆయుధ సంపత్తి ముఖ్యము కాదు అని భారతీయ సైనికులు నిరూపించారు.

ఇవి భారతీయ సైన్యము ఘనతను తెలియజేసే కొన్ని అంశాలు మాత్రమే అంతర్జాతీయముగా వేరే దేశాల మధ్య యుద్ధము వచ్చినా లేదా ఏదైనా ఒక దేశములో అంతర్ యుద్ధము ప్రారంభమైయినా ఐక్యరాజ్య సమితి తరుఫున “పీస్ కీపింగ్ ఫోర్స్”కు సారథ్యము వహించేది భారతీయ సైనికులే . ఎందుచేతనంటే ప్రపంచములోని ఎట్టి వాతావరణ పరిస్థితులలోనైనా యుద్ధము చేయగలిగిన నేర్పు ఇండియన్ ఆర్మీ కి గలదు.