సంధ్యావందనం–విభిన్న దృష్టి కోణం.

మనకు విధించిన సంధ్యావందన విధి గురించి మరొక శాస్త్రీయ దృష్టి కోణం నుండి పరిశీలిస్తే ఆ ఉపాసించే ముముక్షువు సాధించే శారీరక మానసిక లాభాలు ఎన్నెన్నో ఉన్నవి. వాటిలో కొన్ని నేడు చర్చించుకుందాం. సంధ్యావందన విధి భూతశుద్ధి, ప్రాణాయామం, మార్జనము, మంత్రాచమనము, పాప పురుష విమోచనము, అర్ఘ్యప్రదానము, పరిషేచనము, గాయత్రి ఆవాహనం, ముద్రల ప్రదర్శనము, గాయత్రి మంత్రజపము, సూర్యోపస్తానము, దిగ్దేవతా నమస్కారము, దేవతా స్మరణము, అభివాదము ముఖ్య క్రియలగా చెప్పబడ్డాయి. ఇందులో ఒకొక్క విధికి ఒకొక్క ప్రయోజనం ఉన్నా, కొందరు పెద్దలు అర్ఘ్య ప్రదానము, గాయత్రి మంత్రజపము దీనిలో ప్రధానమైన అంగములుగా వివరిస్తారు.

ముందుగా మనం కూర్చోబోయే ప్రదేశాన్ని శుద్ధి చేసుకుని ప్రాణాయామంతో మొదలవుతుంది సంధ్యావందనం. అసలు ప్రాణాయామం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నేటి కాలంలో కేవలం ముక్కును మూడు వేళ్ళతో పట్టుకోవడం అనే మొక్కుబడిగా తయారయింది కానీ ప్రాణాయామం వలన మనకొచ్చె మానసిక ప్రశాంతత, ఉల్లాసం గురించి చెప్పడం అంటే ఒక తిరుపతి లడ్డూ ఎంత తియ్యగా వుంటుందో,  అమ్రుతోపమానంగా వుంటుందో పదాల్లో చెప్పే సాహసం చెయ్యడమే. ఆ అనుభవం ఎవరికి వారు స్వయంగా అనుభవించి తెలుసుకోవాలి కానీ వాటి వలన వచ్చే శారీరక, మానసిక లాభాలు – ప్రశాంతత, శరీరం నిస్తేజం నుండి ఉత్తేజం వైపు పయనం, నాడుల సమతౌల్యం, డయాబెటిస్, స్ట్రెస్, బీపీ, కోలేస్త్రోల్ నియంత్రణ, ఇలా చెప్పుకుపోతే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సగం శారీరక రోగాలు మానసిక స్ట్రెస్ వలన వచ్చేవే. వాటిని మరల ప్రాణాయామం ద్వారానే తిరిగి తగ్గించుకోగలం అని నేటి వైద్య నిపుణులే చెబుతున్నారు.

మీరు రాజయోగ, లేక పిరమిడ్ మెడిటేషన్, లేక రామచంద్రాజీ మిషన్ లాంటి ధ్యానం నేర్పే వారి వద్ద ధ్యానం నేర్చుకున్నట్టు అయితే వారు చెప్పే పద్ధతులలో కొంత వ్యత్యాసం ఉన్నా ఇంచుమించు అందరూ శ్వాస పై ధ్యాస, లేక హృదయాంతరాలలో  కానీ కనుబొమల మధ్య ఒక జ్యోతిని దర్శించమని చెబుతారు. రోజుకు రెండు సార్లు ధ్యానం చెయ్యమని, సాయంత్రం ధ్యానం లో మీనుండి పాప పురుషుడు విదివడుతున్నట్టు ఊహతో ధ్యానం చెయ్యమని చెబుతారు. ఇతిమిద్ధంగా చూస్తె ఈ పద్ధతులన్నీ కూడా సంధ్యావంధనంలో ముఖ్య ఘట్టాలైన ప్రాణాయామం, మంత్రజపం చెబుతారు. సంధ్యావందనంలో మరెన్నో పూర్వ క్రియలు చెప్పి ఆ సాధకునికి మంత్రజపానికి సన్నద్ధం చేస్తుంది. ఎలాగంటే ఒక జిం లో ముందు బరువులు ఎట్టేముందు కొంతసేపు పరిగెత్తించి వార్మ్ అప్ చేయించినట్టు. ఇక్కడ కూడా ముందుగా చేసిన క్రియల ద్వారా మనం ధ్యానానికి సన్నద్ధం అవుతాం. ధ్యానం చేసేటప్పుడు వేళ్ళ కణుపుల మీద లెక్క పెట్టడం ద్వారా ఆయా నాడుల మీద accupressure పెడతాం. శారీరకంగా ఆ pressure వలన మనలోని శరీర భాగాలకు రక్త ప్రసరణ, కొన్ని నాడుల ఉత్తేజం చెయ్యడం, తద్వారా శారీరక ఆరోగ్యం దీనిలో ముఖ్యోద్దేశం.

మన మనస్సు ఒక అద్దం లాంటిది. పరమాత్ముని తేజస్సు యోగులలో ఆ అద్దం శుభ్రంగా ఉండడం వలన reflect అయ్యి తామే ఆ దైవిక శక్తిలా ప్రకటితం అవుతారు. మనబోటి వాళ్ళు ఎన్నో జన్మలనుండి ఎంతో మలినాలను ఆ అద్దానికి అంటించుకుని వచ్చాం. అందుకే మనం ఆ దైవిక తేజస్సును బయటకు వ్యక్త పరచలేకపోతున్నాం. గాయత్రీమంత్రజపం ద్వారా మంత్ర శక్తి వలన కొంత సంచితాన్ని చెరిపేసుకుంటూ, ఇప్పుడు మనం రోజులో పగలు, రాత్రి అంటించుకుంటున్న కొత్త మలినాలను శుభ్రపరచుకుంటూ ఉంటాం. మనం నిత్యం ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఇంప్రెషన్స్ లా మన మనస్సు పొరలలో దాక్కుని ఉంటాయి. కొన్ని కళ రూపంగా బయటకు పోగా, కొన్ని అలాగే ఉండిపోయి పోగుపడుతూ ఉంటాయి. తద్వారా మన ప్రవర్తన మారుతుంది. ఈ శుద్ధీకరణ ద్వారా ఎప్పటికప్పుడు అటువంటి ఆలోచనలను చదివి అవతల పారేసి స్ట్రెస్ తగ్గించుకుంటూ, అనవసరపు ఆలోచనలను త్రుంచి వెయ్యగలం. దీని ద్వారా మానసికంగా ప్రశాంతత సాధించి, యుక్తాయుక్త వివేచన కలుగుతుంది. ఒక గాయత్రి మంత్రం ఒక్కసారి జపించడానికి పావు నిముషం అంత సమయం పడుతుంది. కనీసం 108 చెయ్యమంటారు. పరమాచార్య వారు వారంతాలలో 1008 చెయ్యమని చెప్పారు.  అంత సమయం నిశ్చలంగా జపం చెయ్యడం వలన మనకొచ్చే లాభాలు జపించి చూడండి. కొన్ని మెడిటేషన్ పద్ధతులలో మీ వయస్సు అన్ని నిముషాలు ధ్యానం చెయ్యమంటారు. సంధ్యావందనం ఒక క్రమ పద్ధతి ద్వారా మనకు ఎన్నో లాభాలు చేకూర్చిపెడుతుంది.

ఇప్పటివరకు చెయ్యలేకపోయాం అని బాధపడవలసిన అవసరం లేదు. ఇప్పటికైనా మొదలు పెట్టి ఇతోధికంగా జపం చేసుకుని మనల్ని మనం ఉద్ధరించుకుందాం. సంధ్యావందనం చెయ్యని వాడు ఎన్ని యాగాలు, హోమాలు చేసినా నిష్పలమే. సంధ్యావందనానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు మన పెద్దలు. వారేమి వేర్రివారై చెప్పలేదు. ఎన్నో లాభాలను ఆర్జించే ఒక కర్మ కింద మనకు అందించారు. వాటిని పాటించి బాగుపడదాం.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami