బాలికలను బలవంతంగా ఇస్లాంలోకి..

544

పాకిస్థాన్ లో మతపరంగా మైనారిటీలైన హిందూ, క్రిస్టియన్ మరియు సిక్కు మతాలకు చెందిన 1,000 మంది బాలికలు ప్రతి సంవత్సరం బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చబడుతున్నారని మానవ హక్కుల కార్యకర్తలను ఉటంకిస్తూ, అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. కరోనావైరస్ సందర్భంగా లాక్డౌన్ సమయంలో బాలికలు పాఠశాలలకు వెళ్ళకుండా ఉండడం, కుటుంబాలు పేదరికం, అప్పుల ఊబిలో ఉండడం అనేవి ఆడపిల్లల అక్రమ రవాణాదారులకి మరింత ఉత్సాహాన్నిచ్చి వారు ఇంటర్నెట్ లో మరింత చురుకుగా వ్యవహరించి ఆడపిల్లల అక్రమ రవాణాను వేగవంతం చేయడానికి దోహదపడింది.

యు.ఎస్. స్టేట్ డిపార్ట్ మెంట్ ఈ నెలలో పాకిస్తాన్ ను మత స్వేచ్ఛ ఉల్లంఘన విషయంలో “ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన దేశం” గా ప్రకటించింది. ఆ హోదాని పాకిస్థాన్ ప్రభుత్వం తిరస్కరించింది. మైనారిటీ హిందూ, క్రిస్టియన్ మరియు సిక్కు వర్గాలలోని తక్కువ వయస్సు గల బాలికలు “బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చేందుకు కిడ్నాప్ చేయబడ్డారు, వాళ్ళని బలవంతంగా వివాహం చేసుకున్నారు మరియు వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు.” అని యు.ఎస్ కు చెందిన అంతర్జాతీయంగా మత స్వేచ్ఛను పరిశీలించే కమిషన్ వెల్లడించింది.

మతం మారిన బాలికలలో ఎక్కువ మంది దక్షిణ సింధ్ ప్రావిన్స్ నుండి వచ్చిన హిందువులు. ఇటీవల, ఈ ఇస్లామిక్ రాజ్యం (పాకిస్థాన్) నుండి క్రైస్తవ బాలికల అక్రమ రవాణాకు సంబందించిన రెండు కొత్త కేసులు కూడా వెల్లడయ్యాయి.

“బాలికలను సాధారణంగా వధువుల కోసం చూస్తున్న పురుషుల యొక్క పరిచయస్తులు, బంధువులు లేదా వరుడు కిడ్నాప్ చేస్తారు. కొన్నిసార్లు వారు శక్తివంతమైన భూస్వాములకు చెల్లించాల్సిన బాకీ క్రింద కూడా జమ చేయబడతారు. పాకిస్తాన్ యొక్క స్వతంత్ర మానవ హక్కుల కమిషన్ నివేదిక ప్రకారం, మతం మార్చిన వెంటనే ఆ బాలికలను అపహరించిన వారే పెళ్లి చేసుకోవడం గానీ, లేదా ఎవరైనా వృద్ధులకు కట్టబెట్టడం గానీ చేస్తారు.

పాకిస్థాన్ లో చిన్నపిల్లలతో లైంగిక అనుభవాన్ని కోరుకునే (“పెడోఫిలియా (paedophilia)) వృద్ధులకు బాలికలను సప్లై చెయ్యడానికి బాలికల అక్రమ రవాణాదారులకు ముస్లిమేతర బాలికలే ప్రథమ లక్ష్యమని జిబ్రాన్ నాసిర్ అనే కార్యకర్త తెలిపినట్లుగా అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. ఎందుకంటే వారిని రవాణా చెయ్యడం బాలికల అక్రమ రవాణాదారులకు ఏమాత్రం హానికరం కాదు, చాలా సులభం కూడా.

“పాకిస్థాన్ లో ముస్లిమేతర కన్యలను ఇస్లాంలోకి మార్చనివ్వకుండా చెయ్యడం ఓ పెద్ద సవాలు. పాకిస్థాన్ లోని మొత్తం 220 మిలియన్ల జనాభాలో మైనారిటీలు కేవలం 3.6 శాతం మాత్రమే. వారు తరచూ వివక్షకు గురవుతూ ఉంటారు. బలవంతపు మత మార్పిడులపై గొంతెత్తే వారిని, దైవదూషణ పేరుతో నిర్బంధిస్తారు” అని కూడా ఆ నివేదిక పేర్కొంది.

దక్షిణ సింధ్ ప్రావిన్స్ లోని పెద్ద పెద్ద భూస్వాములుండే కాష్మోర్ ప్రాంతంలో, 13 ఏళ్ల సోనియా కుమారిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాతి రోజు పోలీసులు ఆమె తల్లిదండ్రులకు ఆ ఆమ్మాయి హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి మారినట్లు చెప్పారు. ఆమె తిరిగి రావాలని ఆమె తల్లి విజ్ఞప్తి చేస్తున్న వీడియో వైరలయింది. “దేవుని కొరకు, ఖురాన్, మీరు దేన్నయినా నమ్మండి, దయచేసి నా కుమార్తెను తిరిగి ఇవ్వండి, ఆమెను మా ఇంటి నుండి బలవంతంగా తీసుకువెళ్లారు.” అని ఆమె ఆ వీడియోలో విజ్ఞప్తి చేసింది. కానీ శక్తివంతమైన భూస్వాముల నుండి వచ్చే పరిణామాలకు భయపడి పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక హిందూ కార్యకర్త చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయి చేత బలవంతంగా వ్రాయించిన లేఖ ఒకటి ఆ కుటుంబానికి అందింది. తాను ఇష్టపూర్వకంగానే మతం మార్చుకున్నానని, అప్పటికే ఇద్దరు పిల్లలున్న 36 ఏళ్ల వివాహితుడ్ని తాను వివాహం చేసుకున్నానని ఆ 13 ఏళ్ళ బాలిక ఆ లేఖలో పేర్కొంది.

-VSK ANDHRAPRADESH