మతి లేని మత రాజకీయాలు!

328

జగన్-బాబు-సోము దారిసరైనదేనా?
అధికారులపై ముద్ర సరైనదేనా?
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఏపీలో మతం కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు రొచ్చుగుంట కన్నా హేయంగా మారడం కలవరం కలిగించేవే. ఒకరిని మించి మరొకరు, ఒక పార్టీని మించి మరొక పార్టీ ఆడుతున్న మత రాజకీయ క్రీడ, ప్రజల్లో పార్టీలపై ఏహ భావం పెంచేదే. చివరకు ఈ వికృత మత రాజకీయ క్రీడలో అధికారులను కూడా విడిచిపెట్టకుండా,వారినీ ఈ రొంపిలోకి లాగడం అత్యంత హేయం.

రాష్ట్రంలో గత కొన్ని నెలల నుంచి  దేవాలయాలపై నిర్నిరోధంగా జరుగుతున్న దాడులు ముదరుపాకాన పడ్డాయి. రామతీర్థంలో శ్రీరాముడి శిరసు ఖండించటంతో ఆరంభమయిన రాజకీయ వేడికి,  జగన్ సర్కారు ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే స్పష్టం చేస్తున్నాయి.  ఏడాది నుంచీ రాజధాని కోసం రైతులు-రాజకీయ పక్షాలు, ఇళ్ల స్థలాల్లో జరుగుతున్న అవినీతిపై విపక్షాలు పోరాడుతున్నా కించిత్తు చలించని జగన్.. చివరాఖరకు రామతీర్థం ఘటనపై చర్యల కొరడా ఝళిపించాల్సివచ్చింది. అనుభవమయితే గానీ తత్వం బోధపడదంటే ఇదే.

ఇదే పని ఆలయాలపై దాడి జరిగిన తొలి ఘటనలోనే స్పందించి, నిందితులపై ఉక్కుపాదం మోపి ఉంటే, ఇప్పుడు రామతీర్ధంపై సిట్ వేయాల్సి వచ్చేదే కాదు. పాలకులకు అనుభవమయినా ఉండాలి.లేదా అనువజ్ఞులయినా పక్కన ఉండాలి. తాజా ఘటనతో.. ఎవరినీ లెక్కచేయని జగన్.. ఒక్క  హిందూ కార్డుకు మాత్రమే భయపడుతున్నారన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మరి ఈ సంకేతాలు భవిష్యత్తులో, ఎవరికి లబ్థి కలిగిస్తాయో చూడాలి. వచ్చిన అవకాశాన్ని సానుకూలంగా మలచుకోవడంలో నిష్ణాతుడయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఇప్పటికే హిందుత్వరేసులో దానిపై సర్వహక్కులూ ఉన్న బీజేపీని వెనక్కినెట్టి, ముందుకు దూసుకువెళ్లే పనిలో ఉన్నారు. తన హయాంలో రోడ్లవెడల్పు కోసం,  డజన్లకొద్దీ దేవాలయాలు కూల్చిన బాబును మరి హిందువులు విశ్వసిస్తారో లేదో చూడాలి.

బీజేపీ, దాని మార్గదర్శి అయిన సంఘపరివార్ కూడా ఈర్ష్యపడే రీతిలో, బాబు  సంధిస్తున్న హిందుత్వ అస్త్రంతోనే జగన్ సర్కారు.. సిట్, టీడీపీ హయాంలో కూల్చిన దేవాలయాల శంకుస్థాపన వంటి నిర్ణయాలు శరవేగంగా తీసుకోవలసి వచ్చింది. సెక్యులరిస్టుగా చెప్పుకునేందుకే ఇష్టపడే బాబు, చివరకు సీఎం-హోంమంత్రి-డీజీపీ-విజయనగరం ఎస్పీలను క్రైస్తవులంటూ బాహాటంగా విమర్శించేందుకు ఎలాంటి మొహమాటపడలేదంటే, బాబుకు రాజకీయ తత్వం బోధపడినట్లు కనిపిస్తోంది.ఎటొచ్చీ సొంతగా ఎదిగే బలంలేకపోయినా, తెలంగాణలో మాదిరిగా హిందూకార్డుతో ఉనికి చాటేందుకు ప్రయత్నిస్తున్న కమలదళాలకే బాబు పరుగులతో ఇబ్బంది. ఎలాగూ వైసీపీకి ఇప్పటి రచ్చతో హిందువులు ఓటేసే అవకాశం తక్కువ. కానీ దానికి క్రైస్తవులు-రె డ్ల ఓటు బ్యాంకు స్థిరంగానే ఉంది. కాబట్టి ఆ పార్టీకి వచ్చిన నష్టమేమీ ఉండదు. కొత్తగా మతం పచ్చుకున్న వాడు ఒళ్లంతా నామాలు పెట్టుకున్నటు,్ల టీడీపీ హిందుత్వ నినాదంతోనష్టపోయేది బీజేపీనే. క్యాడర్ బలం ఉన్న టీడీపీ ముందు, అంతంతమాత్రమే బలం ఉన్న బీజేపీ రాజకీయంగా తట్టుకోవడం కష్టమే. టీడీపీ వంటి బలమైన పార్టీ కొత్తగా హిందుత్వ కార్డును ఎత్తుకున్నందుకు గర్వపడాలో, లేక తాము అభిమానించే బీజేపీ, ఈ రేసులో వెనుకబడుతున్నందుకు గాభరా పడాలో తెలియని అయోమయ పరిస్థితి హిందూ సంస్థలది!

హిందుత్వపై పేటెంటీ ఉన్న బీజేపీ,  ఏపీలోలేవనెత్తుతున్న క్రైస్తవ ప్రశ్నలు.. ఈశాన్య రాష్ర్టాల్లో అదే క్రైస్తవ సంతుష్ఠీకర విధానాలు, ఇప్పుడు ఆ పార్టీకి గొంతులో వెలక్కాయలా మారింది. ఈశాన్య రాష్ర్టాల్లో క్రైస్తవులను సర్కారు ఖర్చుతో, జెరూసలేంయాత్రకు పంపిస్తున్న వైనం ఇప్పుడు సోషల్‌మీడియాలో ఓ హట్ టాపిక్. అక్కడ క్రైస్తవ సంతుష్ఠీకర విధానాలకు జైకొడుతున్న అదే బీజేపీ… ఏపీలో మాత్రం క్రైస్తవపాలన-బైబిల్‌పార్టీ అని వైసీపీపైముద్ర వేయడమే వింత. అదే దాని సంకటానికి కారణం.

బీజేపీ సీనియర్ ఎంపీ సుబ్రమణ్యస్వామి-తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన రెండు విరుద్ధ ప్రకటనలు కూడా, కమలదళాలకు సైద్ధాంతిక సంకటమే. జగన్‌ను అచ్చమైన హిందువని సుబ్రమణ్యస్వామి క్లీన్‌చిట్ ఇస్తే, ఏపీలో క్రైస్తవ పాలన సాగుతున్నందన, మీకు బైబిల్ పార్టీ కావాలా? భగవద్గీత పార్టీ కావాలా? అని సంజయ్ సంధించిన ప్రశ్న ఇప్పుడు ఆ పార్టీకే తలబొప్పి కడుతోంది.

  సోము వీర్రాజు నాయకత్వంలోని  బీజేపీ వెలి వేసిన సీనియర్ నేత ఓ.వి.రమణ..  మీడియాముఖంగా సూటిగా ఇదే ప్రశ్న సంధించారు. గోవాలో బీఫ్‌లకు అనుమతి, నాగాలాండ్‌లో జెరూసలేం యాత్రల సంగతేమిటని ఆయన నిలదీస్తే, ఇప్పటిదాకా బీజేపీ గళధారుల నుంచి జవాబు లేదు. కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీదీ అదే ప్రశ్నాస్త్రం. చిత్తశుద్ధి లేని శివపూజ మాదిరిగానే, చిత్తశుద్ధి లేని రాజకీయం  చేస్తే ఎవరికయినా ఇలాంటి ఇరకాటం తప్పదు.దేవాలయాలపై దాడుల నేపథ్యంలో జగన్ సర్కారును హిందువుల ముందు దోషిగానిలబెట్టేందుకు జరుగుతున్న మతవాద రొచ్చు రాజకీయాల్లో అధికారులను లాగడం బాధాకరం. సీఎం-హోంమంత్రి-డీజీపీ ఎస్పీలంతా క్రైస్తవులేనన్న టీడీపీ అధినేత బాబు వ్యాఖ్యలు,  ఏమాత్రం సమర్ధనీయం కావు. ప్రత్యేకించి డీజీపీ-విజయనగరం ఎస్పీ కూడా క్రైస్తవులేనన్న బాబు వ్యాఖ్యలే విచిత్రం. ఆయన సీఎంగా ఉన్నప్పుడు బెజవాడ పోలీసు  మిషన ర్,విజిలెన్స్ డీజీగా సవాంగ్‌ను ఏరికోరి నియమించింది చంద్రబాబే. మరి అప్పుడు ఆయన మతం-సమర్ధత  బాబుకు గుర్తుకు రాలేదా? తన హయాంలో పనిచేస్తేనే పరిశుద్ధులు, ఇతరుల వద్ద పనిచేస్తే పనికారాని వారా? ఇక విజయనగరం ఎస్పీ కూడా బాబు సీఎంగా ఉన్నప్పుడు పనిచేసినవారే. బాబు జమానాలో అయినా, జగన్ హయాంలోనయినా పనిచేస్తున్నది అదే పోలీసులన్న విషయం ప్రధాన ప్రతిపక్షం మర్చిపోవడమే ఆశ్చర్యం.

 టీడీపీ హయాంలో వైసీపీ కమ్మ ముద్ర వేసిన సీనియర్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, వైఎస్ సహా చాలామంది కాంగ్రెస్ సీఎంల వద్ద పనిచేశారు. మరి వైఎస్ వద్ద పనిచేసిన అదే ఏబీవీ.. తనయుడు జగన్ దృష్టిలో పనికిరాని అధికారిగా భావిస్తే ఎలా? సహజంగా కీలకమైన పదవుల్లో పాలకులు, నమ్మకస్తులనే నియమించుకుంటారు. అది ఎక్కడయినా జరిగేదే.

అయితే.. ఇప్పుడు బాబు తీరుపై గత్తర చేస్తున్న వైసీపీ కూడా, పరిశుద్ధాత్మమేమీ కాదు. బాబు పాలనలో డీజీపీ, నిఘాదళపతి,సలహాదారులంతా కమ్మ వారేనని ఇదే వైసీపీ పెద్దగొంతుతో ఎలుగెత్తిన వైనం విస్మరించి.. ఇప్పుడు తానేదో సచ్చీలత, అమాయకత్వం,ఆవేదన ప్రదర్శించడమే ఆశ్చర్యం. అప్పుడు వైసీపీ మాటల ఈటెలు టీడీపీని ఎలా బాధించాయో, ఇప్పుడు టీడీపీ ఈటెల్లాంటి మాటలు, వైసీపీనీ అంతే బాధిస్తుంటాయి. కాబట్టి ఈ విషయంలో నైతిక విలువలు- విజ్ఞత లాంటి పెద్ద పదాలకు ఆస్కారమే లేదు.

సహజంగా ఐఏఎస్-ఐపిఎస్ అధికారులకు కుల-మత పిచ్చి  తక్కువ. ఏ పాలకుడి దగ్గరయినా విధేయతతో పనిచేయాల్సిందే. కాకపోతే కొందరు పోస్టింగుల కోసం, అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారంతే. టీడీపీ హయాంలో ప్రకాశం జిల్లాలో హిందు-క్రైస్తవుల స్థానికంగా ఓ ఘర్షణ రేగింది. కానీ అప్పటి ఎస్పీ విచారణ జరిపి, క్రైస్తవులపైనే కేసునమోదు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ టీవీజీ కృష్ణారెడ్డిపై ఎస్సీఎస్టీ కేసు పెట్టినప్పుడు కూడా, అదే పొలీసు పెద్ద అది మంచిదికాదని ఎస్పీకి హితవు పలకడంతో, కృష్ణారెడ్డి  ఆ కేసు నుంచి తప్పించబడ్డారు. కానీ, ఈ రెండు సందర్భాల్లో  హితవు పలికిన ఆ పోలీసు పెద్ద, రెడ్డి-క్రైస్తవుడు కాకపోవడం విశేషం.

ఇలాంటి సందర్భాల్లో ఏ పోలీసు అధికారులయినా ప్రొఫెషనల్‌గానే వ్యవహరిస్తారు.  అంతర్వేది రథం దహనం సందర్భంగా దానిపై మైనారిటీకి చెందిన ఎస్పీ విచారణ జరిపారు. కాబట్టి అప్పటికే ఆ పోస్టులో ఉన్న మైనారిటీకి చెందిన ఎస్పీని విచారణ చేయవద్దంటే ఎలా? ఏపీలో పాతుకుపోయిన కులపిచ్చి, గత కొద్దికాలం నుంచి మతపిచ్చిగా మారే ప్రమాదం కనిపిస్తుందనడనడానికి ఇదో ఉదాహరణ.
కానీ, రాష్ట్రంలో నిర్నిరోధంగా దేవాలయాలపై దాడులు జరుగుతున్న క్రమంలో, రామతీర్థం ఘటనను సీఐడికి అప్పగించడం కొత్త వివాదానికి దారితీసింది. సహజంగా ఏదైనా తీవ్రమైన సంఘటన జరిగినప్పుడు, సీఐడీ విచారణ వేయడం సాధారణం. కానీ, రాష్ట్రంలో మతం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నందున, ఈ సమయంలో దానిని సీఐడీకి అప్పించడం తెలివైన పనికాదు. క్రికెట్ గ్రౌండ్‌లో ఫుల్‌బాల్ ఆడకూడదు కదా? రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించడమే విజ్ఞత!సీఐడీ చీఫ్ చేసిన క్రైస్తవ అనుకూల వ్యాఖ్యల వీడియో, సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కనీసం సర్కారుకు అదయినా మేల్కొలుపు కాలేకపోయింది. దానితో సీఐడీ విచారణపై సహజంగానే అనుమానాలు,విమర్శలకు తావిచ్చాయి. తర్వాత నాలిక్కరుకున్న సర్కారు మళ్లీ సిట్‌కు ఇవ్వాల్సి వచ్చింది. బాబు హయాంలో కూలిన దేవాలయాల పునర్నిర్మాణాలకు  స్వయంగా సీఎం జగనే శంకుస్థాపన చేశారు.ఇదే పని అధికారంలోకి వచ్చిన వెంటనే చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.ఇప్పుడయినా ఆ పనిచేయడం మంచిదే. అయితే  విపక్షాలకు అది నష్ట నివారణ, దిద్దుబాటు, ఎదురుదాడి రాజకీయ అస్త్రం  కోణంగానే కనిపిస్తుంది. అడుసుతొక్కనేల? కాలు కడగనేల? పాలకులకు ఇలాంటప్పుడే  దూరదృష్టి అవసరం. అదే చంద్రబాబయితే మరో మతానికి చెందిన అధికారిని నియమించడం ద్వారా, బాధిత వర్గాలను సంతృప్తి పరిచేవారు. తుని ఘటన నాన్ కాపు-నాన్ ఎస్సీ అయిన అధికారికి అప్పగించడంద్వారా, విమర్శల నుంచి తప్పించుకున్నారు.  ఇలాంటి ఘటనలు,  అధికారుల మనస్తాపానికి గురవుతున్నాయన్నది పోలీసుల ఆవేదన.

ఇక్కడ సాధారణంగా అందరి మదినీ ఓ ప్రశ్న తొలుస్తోంది. ఏ ప్రభుత్వమయినా తనకు తాను, అప్రతిష్టపాలు చేసుకుంటుందా? శాంతిభద్రతలు దెబ్బతీసే పరిస్థితి కొని తెచ్చుకుంటుందా? అన్నవే ఆ ప్రశ్నలు. నిజమే. సున్నితమైన మత సమస్యలను సీఎం జగన్ ఏరికోరి తెచ్చుకుంటారా? జగనే కాదు. ఏ పాలకుడయినా తన పతనాన్ని తానే కొనితెచ్చుకోరు కదా? పోనీ పాలకులు తమవారేనన్న ధీమాతో, అదృశ్య శక్తులు చేస్తున్న కుట్రలుగా భావించాలా? లేక పాలకపక్షమే ఆరోపిస్తున్నట్లు ప్రతిపక్ష హస్తమే ఇందులో ఉంటే, చర్యలకొరడా ఝళిపించకుండా ఇప్పటిదాకా మీనమేషాలు ఎందుకు లెక్కబెడుతున్నట్లు? మొత్తంగా ఏపీ రాజకీయాలు అలౌకికానంద, అనైతిక పతనావస్థదిశగా సాగుతున్నాయి.

3 COMMENTS