విగ్రహధ్వంసన !!

0
2

మన భారత దేశ చరిత్రలో మన దైవ విగ్రహాల మీద, దేవాలయాల మీద అనేక మార్లు దండయాత్రలు జరిగాయి, వేలాది ఆలయాలు నేల కూల్చబడ్డాయి, దైవ విగ్రహాలు ముక్కలు చెయ్యబడ్డాయి. ఎన్నో ఆలయాలు శిథిలం కావించబడ్డాయి. దైవ విగ్రహాల తలలు, కాళ్ళు, చేతులు ముక్కలుగా నరక బడ్డాయి. వాటిని సందర్శించినప్పుడు, ఆ సంఘటనల గురించి చదివి నప్పుడు, విన్నప్పుడు మన రక్తం సలసల మరిగేది, బాధతో హృదయం ద్రవించేది. ఎవ్వరికీ ఎప్పుడూ ఏ హానీ చెయ్యని, సర్వ శ్రీ రామ జయ రామ జయజయ రామ!

మన భారత దేశ చరిత్రలో మన దైవ విగ్రహాల మీద, దేవాలయాల మీద అనేక మార్లు దండయాత్రలు జరిగాయి, వేలాది ఆలయాలు నేల కూల్చబడ్డాయి, దైవ విగ్రహాలు ముక్కలు చెయ్యబడ్డాయి. ఎన్నో ఆలయాలు శిథిలం కావించబడ్డాయి. దైవ విగ్రహాల తలలు, కాళ్ళు, చేతులు ముక్కలుగా నరక బడ్డాయి. వాటిని సందర్శించినప్పుడు, ఆ సంఘటనల గురించి చదివి నప్పుడు, విన్నప్పుడు మన రక్తం సలసల మరిగేది, బాధతో హృదయం ద్రవించేది. ఎవ్వరికీ ఎప్పుడూ ఏ హానీ చెయ్యని, సర్వ మానవ శ్రేయస్సును కాంక్షించే, “వసుధైక కుటుంబ” భావనతో జీవించే మా హైందవుల మీద ఈ దాడులేమిటి? అని మనస్సు ఆక్రోశించేది. మేమే కనక ఆ కాలంలో ఉంటే ఆ దుర్మార్గులను కత్తికో కండగా నరికే వాళ్ళము అనే మాటలను విని, వారి ఆర్తి మన హృదయాలలో ఆర్తిగా జ్వలిస్తుండగా ఆ కాలంలో మన దైవాలను, ఆలయాలను, మన ధర్మాన్ని రక్షించినవారికి, రక్షించటంలో అసువులు బాసి తరించిన వారికి భక్తితో నివాళులర్పించాము.

ఎందరో భక్తులు మన దైవ విగ్రహాల రక్షణలో, దేవాలయాల పరి రక్షణలో ప్రాణాలను త్యాగం చేశారు. ఎందరో మన దైవ విగ్రహాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, తరువాత పునః ప్రతిష్ఠించి, మన దైవాలను మనకందించి, ఆరాధించటం ప్రారంభించారు. శ్రీమతి రాణి అహల్యాబాయి లాంటివారు కాశీ విశ్వనాథాలయం వంటి ఎన్నో దివ్య క్షేత్రాలను పునరుద్ధరించారు. ఎంతమంది దుర్మార్గులైన విమతస్థులు మన మతానికి, మన ధర్మానికి, మన దైవాలకు ద్రోహం చేస్తున్నా, మనం – మన పూర్వీకులు ఎంతో నిష్ఠతో మన దైవ విగ్రహాలను, దేవాలయాలను పరిరక్షిస్తూ, పునరుద్ధరిస్తూ వస్తున్నారు.
ఇదంతా తురుష్కుల దండయాత్రలప్పుడు, వారు మన దేశమును పరిపాలించే టప్పుడు జరిగాయి. రత్నగర్భగా పేరు గాంచి, జ్ఞానముతో, సంపదలతో, భోగభాగ్యాలతో, గొప్ప సంస్కృతితో విలసిల్లే మన సంస్కృతిని నశింపజెయ్యాలనీ, మన రత్నరాశులను కొల్లగొట్టాలనీ, మన జ్ఞానరాశికి మూలమైన తాళపత్ర గ్రంథాలను నశింపజెయ్యటానికి, మన దైవం మీద మనకున్న భక్తి శ్రద్ధలను సన్నగిల్ల జెయ్యటానికి ఆ దాడులు, ఘాతుకాలు, కిరాతకాలు జరిగాయి.

కానీ నేటి ఈ ఆధునిక యుగంలో, మన భారత దేశానికి పరాయి పాలన నుంచి విముక్తి లభించి, స్వాతంత్య్ర లభించాక, మనమే మనను పాలించుకుంటున్నప్పుడు ఇటువంటి అమానుష కృత్యాలు జరగటమేమిటి? దానిని మన ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించి, ద్రోహులను శిక్షించక పోవటమేమిటి? హిందూ దేశంలో, హిందువుల పాలనలో, హిందూ ధర్మానికి, హిందూ మతానికి, హిందూ దైవాలకు రక్షణ లేకపోవటమేమిటి ? ఈ మధ్య కాలంలోనే విపరీతంగా దాడులు జరగటమేమిటి? ఎవరు చేస్తున్నారో తెలుసుకుని శిక్షించలేకపోవటమేమిటి ? తప్పు చేసినవారెవరో తెలిసి కూడా వారిని వదలటం, అమాయకులను శిక్షించటం కూడా కొన్ని సార్లు జరుగుతోంది. ఇదెంత పాప కృత్యమో కదా !

ఈ మధ్యనే మన దేశంలోని విజయవాడలో, పిఠాపురం మొదలైన వివిధ ప్రాంతాల్లో అనేక దైవ విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి, ఆలయాలు నేల కూల్చబడ్డాయి. ఆ సమయంలో భక్తులైన, ఆస్తికులైన హైందవుల హృదయాలు బాధతో విలవిలలాడాయి. మనమందరమూ ఎంతో బాధ పడ్డాము. ప్రభుత్వం ఆ దుర్మార్గులను శిక్షించి, మన ఆలయాలను, దైవ విగ్రహాలను రక్షించాలని, మన ధర్మానికి న్యాయం చెయ్యాలనీ, చేస్తారనీ ఆశించాము. మన వాళ్ళు కొందరు వెళ్ళి చూసి, అయ్యో అన్నారే కానీ దుష్టులను శిక్షించటానికి ఏ చర్యా చేపట్టలేదు.

ఇప్పుడు మనందరికీ ఆరాధ్య దైవము, ఆదర్శ మూర్తి, ఆదర్శ ప్రభువు, శ్రీమద్రామాయణ స్వరూపుడు, సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు అయిన, రామతీర్థములో వెలసి, మనందరి చేత ఆరాధింపబడుతున్న, విజయనగరంలో రామ తీర్థంలో కొలువైయున్న శ్రీరామ చంద్ర మూర్తి విగ్రహాన్ని విగత శిరునిగా చేసి, మన దైవాన్ని, మన మతాన్ని, మన నమ్మకాలను ఖండిస్తున్న దుష్ట శక్తులను, దౌర్జన్యాన్ని అడ్డుకోలేకపోతే, ఆపలేకపోతే మనము హైందవులమవుతామా ? భారతీయులమవుతామా ? మానవులమవుతామా ?

బ్రిటిష్ వాళ్ళ పాలన వల్లే మన హైందవులలో చాలా మంది మనము హైందవులమనీ, మనది సనాతన ధర్మమనీ మర్చేపోయారు. అనాది కాలం నుంచి, సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఉన్న, యావన్మానవాళికీ జ్ఞానమునిచ్చిన మన వేదములు, శాస్త్రములు, పురాణేతిహాసాది అనంత జ్ఞాన రాశిని – కనీసం ఇంతటి జ్ఞాన రాశికి, మహోన్నతమైన సభ్యత, సంస్కారములు, సంస్కృతి, నాగరికతలకు వారసులమని మర్చేపోయారు. మనకు ఎన్ని శాస్త్రములున్నాయో వాటి పేర్లైనా తెలీకుండా బ్రతికేస్తున్నాము. విదేశీయుల, విమతస్థుల ఎడతెగని దాడుల వలన, బ్రిటిష్ వారి పాలనలో మగ్గటం వలన ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయములను నిర్వహించినది,

అనంతమైన శాస్త్రాలకు, లక్షల గ్రంథ రాశికి నెలవు మన భారత దేశమనీ మర్చేపోయారు మన భారతీయులు. మనము సర్వ తంత్రం స్వతంత్రంగా బ్రతికే జ్ఞాన స్వరూపులమనీ మర్చేపోయారు. బానిసత్వపు బ్రతుకులకు అలవాటైపోయి, స్వాతంత్య్రం వచ్చి డెభ్బై ఏళ్ళు దాటినా, బానిసత్వపు మనస్తత్వం పోక పరాయి దేశాలను అనుకరిస్తూ, మన ధర్మాలను, మన దైవాన్ని విస్మరిస్తున్నారు. మెకాలే మన దేశంలో ఏర్పరచిన విద్యావిధానంతో తప్పుడు చరిత్ర చదువుతూ అదే సత్యమనుకుంటూ మన గురుకుల సంప్రదాయ విద్యావిధానంలోని గొప్పదనాన్ని కనీసం ఊహించలేక పోతున్నారు.
ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని వృద్ధి పరచే జీవన విధానాన్ని విస్మరించి, దేవతార్చనలను, నైవేద్యములను పెట్టటం విసర్జించి, పీట మీద కూర్చుని, ఆరిటాకులలో దేవతలకు నివేదించిన ప్రసాదం తినకుండా, టేబుల్ మానర్స్ అంటూ, టేబుల్ మీద పెట్టుకు తింటూ, అంటూ శొంట్లను కలిపేస్తూ, అనారోగ్యాలకు బానిసలవుతున్నారు. “పరోపకారార్థమిదం శరీరమని” బ్రతికే మనం అధికార దాహంతో, స్వార్ధంతో మన మతానికి, మన ధర్మానికి, మన దేవతలకు ద్రోహం చేసేవారిని ప్రతిఘటించే ధైర్యం లేక, మనవారిలోనే కొందరు మన వారినే విమర్శిస్తుంటే చేతకానివారిలా మనస్సులో బాధ పడుతుంటే ఏం లాభం ??
దేవుడు సర్వ శక్తిమంతుడంటారుగా ! ఆలయాలను, విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే, ఆయన రక్షించుకోలేడా ? అంటూ కువిమర్శలు చేస్తారు. దైవం దృష్టిలో సర్వము సమానమే ! మంచి, చెడు సర్వము సృష్టిలో భాగమే ! కానీ “పరోపకారః పుణ్యాయ, పాపాయ పరపీడనమ్” అన్నారు. “స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహః” అని పరమాత్మే చెప్పారు. దైవం మనకు వివేకాన్నిచ్చాడు, మనకు మన ధర్మాలను, మన బాధ్యతలను, వాటిని స్వతంత్రంగా ఆలోచించి, వివేకంతో పని చెయ్యగల శక్తిని ఇచ్చాడు.

కనుక మన దైవాలను, మన ఆలయాలను, మన ధర్మాన్ని మనమే తప్పక రక్షించుకోవాలి. మన ధర్మాన్ని మనం రక్షించుకోవటానికి, దుర్మార్గాన్ని నశింపజెయ్యటానికి మనమంతా ఏకమై, సంఘటితమై, మన ధర్మరక్షణను సంకల్పం చేసి, వ్యక్తిగతంగా, సామూహికంగా దైవ ప్రార్ధనలు చెయ్యాలి. రుద్రాభిషేకాలు చెయ్యాలి. ఇష్టదేవతా నామ, మంత్ర జపం చెయ్యాలి. “శ్రీరామ జయ రామ జయజయ రామ” అనీ, “శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే !

సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే” !! అనీ లక్షల మార్లు జపించాలి. దుశ్చర్యలకు పాల్పడినవారిని ప్రభుత్వం చేత శిక్షింపచెయ్యటానికి కూడా మనమందరమూ ఏకమవాలి, దుర్మార్గాన్ని, అధర్మాన్ని ప్రతిఘటించాలి. ధర్మ గ్లాని జరిగినప్పుడు ధర్మాత్ములకు ధర్మాగ్రహం కలిగి తీరాలి, అది కార్యరూపం దాల్చాలి. జగద్గురువుల ఆదేశాలతో, ఆశీస్సులతో, సంకల్పంతో, వారి నేతృత్వంలో, ధర్మపీఠాధిపతుల, ధర్మ సంరక్షకుల నేతృత్వంలో మనమందరం సంఘటితమవాలి. “సంఘే శక్తిః కలౌ యుగే”. సామూహికంగా దైవ ప్రార్ధనలు చేసి ఆత్మ శక్తిని పెంపొందించుకుని, దైవానుగ్రహం పొంది, మన దేవతా మూర్తులను మనమే రక్షించుకోవాలి. ఆత్మ విమర్శ లేకుండా బ్రతికే, నీతినియమాలు లేనివారు అధికారులైతే దేశానికి, ధర్మానికి, ప్రజలకు భద్రత ఏముంటుంది ? దేశభక్తి కల నాయకులకు మద్దతునివ్వాలి.

పూర్వ కాలంలో ఇంచుమించుగా రాజులందరూ ధర్మాత్ములై ఉండేవారు. అందరూ సహజంగా పౌరుషవంతులై, పరాక్రమశాలురై, ధర్మ శీలురై, దైవభక్తి, ధర్మ నిష్ఠ కలిగి, రాజ్యపాలన దక్షులై, యోగ్యులైన మంత్రుల, కులగురువుల, సలహాలతో ప్రజారంజకంగా రాజ్యపాలన చేసేవారు. ఆ కాలంలో ప్రజలు తమ సంపాదనలో ఆరవ వంతును టాక్స్ గా కట్టే వారు. అలాగే మహర్షులు తమ తపోబలంలో ఆరవ వంతును రాజులకు ధారపోసేవారు. రాజులు క్షాత్ర తేజంతో, తపోబలంతో రాజ్యపాలన చేసేవారు. పొరపాటున ఏ రాజైనా ధర్మం తప్పి చరిస్తే, వారిని ప్రజలే రాజ్యపదవి నుంచి తొలగించేవారు, అది కుదరని పరిస్థితులలో మహర్షులే వచ్చి, దుర్మార్గుడైన రాజును తొలగించి, లేదా అవసరమైతే సంహరించి, ధర్మాత్ముడిని రాజుగా చేసి, ధర్మం నిలబేట్టేవారు.

నేటి కాలంలో ప్రజాపాలన అని పేరే తప్ప నిజమైన ధర్మపాలన లేదు. పాలకులలో ధర్మనిష్ఠ, దేశభక్తి, దేశరక్షణ దక్షత, నిస్వార్థ ప్రవర్తన అవసరము. దేశానికి కానీ, ధర్మానికి కానీ, మన దైవాలకు కానీ ద్రోహం జరుగుతుంటే, అన్నింటినీ పక్కన పెట్టి, అందరూ సంఘటితమై ఎదిరించి, విజయాన్ని సాధించ వలసిన బాధ్యత ప్రతి హిందువుది, ప్రతి భారతీయునిది. ఇది అందరూ గుర్తించి ప్రవర్తింతురు గాక ! మన ఇంట్లో కనుక పొరపాటున నిప్పంటుకుంటే ఏం చేస్తాము ? ఇంట్లో ఉన్న అందరమూ మన అన్ని పనులను పక్కన పెట్టేసి, ఆ క్షణాన్నే అందరం కలిసి నీళ్ళు పోసీ, వేరే ప్రయత్నాలు చేసీ ముందు మంటలనార్పుతాము కదా ! అలాగే ఇప్పుడు మనమందరం సంఘటితమై అన్ని విధాలా ప్రయత్నించి, మన ధర్మాన్ని మనం రక్షించుకోవటానికి ఏకమవాలి. విజయం సాధించాలి. ఇంక భవిష్యత్తులో ఎప్పుడూ మన ధర్మం మీద, ఆలయాల మీద, దైవ విగ్రహాల మీద ఏ దాడులు జరుగకుండు గాక ! మానవులందరిలోను ధర్మతేజము వర్ధిల్లు గాక ! స్వధర్మ పాలన వృద్ధి చెందు గాక ! దైవ భక్తి, ధర్మ నిష్ఠ దృఢపడు గాక !

– డా.విశాలాక్షి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here